7, నవంబర్ 2012, బుధవారం

సమస్యాపూరణం - 870 (ఓడ నెక్కి పోదము)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
ఓడ నెక్కి పోదము రావె యోరుగల్లు.
ఈ సమస్యను పంపిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదాలు.

20 కామెంట్‌లు:

 1. ఒక యూహ:

  నాడు రుద్రమ్మ యిట్లనె వీడు టేల?
  విచ్చు కత్తుల ధాటికి వెరువ బోదు
  తెలుగు తేజమ్ము! గొనితెమ్ము తెల్ల గుఱ్ఱ-
  మోడ నెక్కి పోదము రావె యోరుగల్లు.

  (ఓడను , ఎక్కి )

  రిప్లయితొలగించండి
 2. కాకతీయ మహీశుల కళలకిల్లు
  తెలుగు వైభవములు చాల తేజరిల్లు
  సిరుల జల్లు చూడవలెను త్వరగ గాలి
  యోడ నెక్కి పోదము రావె యోరుగల్లు

  రిప్లయితొలగించండి
 3. వినుము మనసైన చినదాన వెఱగు పడక
  కళల విభవమ్ము గాంచగ కాక తీయ
  వలపు తలపుల బంగరు కలల యలల
  ఓడ నెక్కి పోదము రావె యోరు గల్లు !

  రిప్లయితొలగించండి
 4. శ్రీ శంకరయ్య గురువుగారికి ,శ్రీ నేమాని వారికి పాదాభి వందనము జేయుచు
  ధన్యవాదములు దెలుపుచు

  నేను ఆర్ ఇ సి వరంగల్ విద్యార్థిని,నాకు వరంగల్ అన్న చాలా ఇష్టము
  కానీ వరంగల్ లో రౌడీలు విజటింగ్ కార్డ్ ప్రింట్ చేయించిరి వార్తల్లలో జూచితిని,వారి బారిన పడ్డ మధ్యతరగతి వారు పడ్డ కష్టములను ఈ రీతిన .
  తిరిగి విదేశములకు పోవుటకు పైసల్ లేవు కదా యన్న భార్య తో
  ======*=====
  " ఇడుమలోద్దు యోడ నెక్కి పోదము రావె,
  యోరు గల్లు లోన పోరు సలుప
  శక్తి లేదు భామ,చాలు చాలు నికపై
  దేశ ప్రేమ నుంచు దేహమందు

  భార్య పేరు "విమల"
  =========*========
  సొంత యూరు యని "విమల " సొమ్ము దెచ్చి
  యిల్లు గట్టి బడితి నేడు నిడుమ లెల్ల
  నోడ నెక్కి పోదము రావె,యోరు గల్లు
  పైన ప్రేమ స్థిరము గాదె,ప్రాణమందు

  రిప్లయితొలగించండి
 5. ఓరుగల్లు వరుడు బెంగళూరు వధువు ;
  వరు డనెను తొందఱపడుచు వధువు తోడ
  " బస్సు వచ్చె జూడు మదియె ! పదవె యో న
  వోఢ ! యెక్కిపోదము రావె యోరుగల్లు "

  రిప్లయితొలగించండి
 6. వేయి కంబము ల్గ ల యట్టి వీ డు బ ళి ర
  చూడ నద్భుతము గొలుపు చూడ్కుల కును
  మానసంబున నుల్లాస మనెడు గాలి
  యోడ నెక్కి పోద ము రావె యోరుగల్లు .

  రిప్లయితొలగించండి
 7. వరద వచ్చెను పొంగెనీ యేరులన్ని
  ఊరు మొత్తము నిండెగా నీరు చూడ
  నుండ లేమిట ప్రక్కనా యూరి వరకు
  ఓడ నెక్కి, పోదము రావె యోరుగల్లు.

  రిప్లయితొలగించండి
 8. మిస్సన్న గారూ,
  ఓడక, గుఱ్ఱమెక్కి ఓరుగల్లుకు పోవలెనన్న మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
  *
  పండిత నేమాని వారూ,
  గాలి యోడ నెక్కించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  రాజేశ్వరి అక్కయ్యా,
  భావ శబలత వెల్లి విరిసిన మీ పూరణ మనోహరంగా ఉంది. ‘అలల యోడ’ అనడం బాగుంది. అభినందనలు.
  *
  వరప్రసాద్ గారూ,
  మా వరంగల్లు మీరు అనుకుంటున్నంత దుర్మార్గమైనది కాదు. ఇక్కడి జనజీవనం సర్వసాధారణంగానే కొనసాగుతున్నది.
  మీ రెండు పూరణలు బాగున్నవి. సమస్యను విరిచి చక్కని అర్థాన్ని సాధించారు. అభినందనలు.
  ‘ఒద్దు’ ప్రయోగం గ్రామ్యం. ‘ఇడుము లేల’ అందాం.
  *
  నాగరాజు రవీందర్ గారూ,
  మంచి ప్రయత్నం. అభినందనలు.
  కాని ‘ఓడ’లో డ అల్పప్రాణం. నవోఢలో అది మహాప్రాణం అయింది. సమస్యలోని అక్షరాలను అలా మార్చకూడదు కదా!
  *
  సుబ్బారావు గారూ,
  మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
  *
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
  *
  పండిత నేమాని వారు, సుబ్బారావు గారు ‘గాలి యోడ’నెక్కి ఓరుగల్లుకు పోదామన్నారు కాని వరంగల్లులో విమానాశ్రయం లేదు. (సైనికావసరాలకు ఎప్పుడో నైజాం కాలంలో ఏర్పాటైనది నిరుపయోగంగా ఉంది). హైదరాబాద్ వరకు విమానంలో అక్కడినుండి రోడ్డు ద్వారా వరంగల్ రావలసిందే!

  రిప్లయితొలగించండి
 9. జంగిడి రాజేందర్గురువారం, నవంబర్ 08, 2012 8:40:00 AM


  ఓరుగల్లునందు నధిక పోరు జరుగు
  కాకతీయుల శిల్పాల కళలు వెలుగు
  నందమైనట్టి పచ్చని యడవి జూడ
  నోడ నెక్కి పోదము రావె యోరుగల్లు.

  రిప్లయితొలగించండి
 10. జంగిడి రాజేందర్ గారూ,
  మీ ప్రయత్నం ప్రశంసనీయం. క్రమక్రమంగా పద్యరచనలో చేయి తిరుగుతున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 11. అయ్యా! శ్రీ శంకరయ్య గారూ!
  విమానము అంటే మీరు పెద్ద విమానమే అనుకొనినారేమో. హెలికాప్టరులో వెళ్ళుటకు విమానాశ్రయము అక్కరలేదు. చిన్న మైదానములో కూడ దిగ గలదు కదా!. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 12. నేమాని వారూ,
  నిజమే సుమా... నాకా ఆలోచనే రాలేదు... ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 13. మాలిక వ్యాఖ్యల సెక్షన్ నిండా మీ బ్లాగులోని వ్యాఖ్యలతో నిండి పోయింది. నిద్దర లేచిన మొదలుకొని పద్యాలు రాయటమేనా మీకు పని? మీకిది పెద్ద వ్యసనంగా తయారైంది. మీవ్యాఖ్యలు మాలిక వ్యాఖ్యల సేక్షన్ లో రాకుండా మీబ్లాగులో మాత్రం వచ్చేటట్లు చూసుకోండి.

  రిప్లయితొలగించండి
 14. అజ్ఞాత గారూ,
  వ్యాఖ్యలు కేవలం బ్లాగులోనే వస్తూ మాలిక, కూడలి తదితర అగ్రిగేటర్లలో రాకుండా ఉండాలంటే ఏం చెయ్యాలో మీరే చెప్పి పుణ్యం కట్టుకోండి.

  రిప్లయితొలగించండి
 15. శంకరయ్యగారూ,
  అజ్ఞాతలకు స్పందించటం వృధా ప్రయాస. తప్పులు వెదకటమే పనిగా గలవారికి నచ్చేటట్లుగా ఉండటం బ్రహ్మకూ వశం కాదు గదా. సరస్వతీసేవ కూడా వ్యసనం అనుకునే వారికో నమస్కారం పెట్టి ఊరుకోవటమే.

  అయితే అజ్ఞాత సూచన విషయానికి వస్తే నాకు ఒకటే దారి కనబడుతోంది. వ్యాఖ్యలు, పూరణలూ అన్నీ మీకు ఇ-మెయిల్ రూపంలో చేరాలి. లేదా మీరు మోడరేషన్ ఎనేబుల్ చేసి వాటిని స్వీకరించాలి. ఆ తరువాత మీరు సేకరించినదంతా మీరు అలాగే వ్యాఖ్యల రూపంలో ప్రచురించకుండా వేరొక పని చేయాలి. మీ పోష్టుకు సవరణలాగా పోష్టు చివరన వాటిని కలపాలి. అప్పుడు అగ్రిగేటర్ పేజీలు పొర్లిపొంగే ప్రసక్తి యేర్పడదు. అందరమూ మీ‌రు సవరించిన పోష్టులోనే సభ్యుల పూరణాదికాలు చూడవచ్చును.

  కాని ఈ విధానం యెంత మాత్రమూ ఆమోదయోగ్యం కాదు. లైవ్ చర్చకు ఇది తెర వేస్తుంది. కాబట్టి, ప్రస్తుత విధానాన్నే కొనసాగించండి.

  రిప్లయితొలగించండి
 16. "ఏం చెయ్యాలో మీరే చెప్పి పుణ్యం కట్టుకోండి. "

  శంకరయ్యగారు,
  ఆ విషయం మలక్ పేట్ ని అడగండి. ఆయన కి తప్పక తెలిసి ఉంట్టుంది. నాకు బ్లాగుల మీద అంత జ్ణానం లేదు.
  శ్యామలీయంగారు మీరు అంత కోపడవలసిన అవసరంలేదు. ఉదయం ఒక్కసారి మాలిక వ్యాఖ్యల కుడి వైపు సెక్షన్ చూస్తే 90% పైగా శంకరాభరణం, పద్మార్పిత బ్లాగు లో ని వ్యాఖ్యలతో నిండిపోయి ఉన్నాది. శంకరాభరణం బ్లాగులో వారు కవులు. పద్యాలు రాయటం వచ్చిన వాళ్లు, కవిత్వం మీద ఇష్ట్టం ఉన్నవాళ్ళు మాత్రమే మీబ్లాగుకి వస్తారు. వ్యాఖ్యలను చదివి, మీ బ్లాగుకు వచ్చేవారు ఎవరు లేరు. మీ బ్లాగులోని వ్యాఖ్యలవలన మిగతా బ్లాగులలోని వ్యాఖ్యలు చదవటం మిస్ అవుతున్నాము.

  రిప్లయితొలగించండి
 17. ఆహా,

  ఈ అజ్ఞాత కోరిక మరీ గొంతెమ్మ కోరికగా ఉందే!

  మిగిలిన బ్లాగుల వాళ్ళ కామెంట్లు వారి వారి బ్లాగులోనే చదువు కోవచ్చు గా మరి ? వ్యాఖ్యల కాలం లో వెదుకుట ఎందుకు ?

  చీర్స్
  జిలేబి.

  రిప్లయితొలగించండి
 18. మహ బాగా జెప్పారు జిలేబి గారూ! మరొక మాట కూడా. నేటి సాహిత్య ప్రపంచంలో బహుచర్చిత బ్లాగు శంకరాభరణం. దాని గురించి ఎక్కువ వ్యాఖ్యలు రావటం చాలా సహజం. మంచిని మెచ్చుకోవటం కూడా విసుగ్గా ఉంటే ఎలా !

  రిప్లయితొలగించండి
 19. ఉదయం ఒక్కసారి మాలిక వ్యాఖ్యల కుడి వైపు సెక్షన్ చూస్తే 90% పైగా శంకరాభరణం, పద్మార్పిత బ్లాగు లో ని వ్యాఖ్యలతో నిండిపోయి ఉన్నాది. శంకరాభరణం బ్లాగులో వారు కవులు. పద్యాలు రాయటం వచ్చిన వాళ్లు, కవిత్వం మీద ఇష్ట్టం ఉన్నవాళ్ళు మాత్రమే మీబ్లాగుకి వస్తారు. వ్యాఖ్యలను చదివి, మీ బ్లాగుకు వచ్చేవారు ఎవరు లేరు. మీ బ్లాగులోని వ్యాఖ్యలవలన మిగతా బ్లాగులలోని వ్యాఖ్యలు చదవటం మిస్ అవుతున్నాము.
  --------------------------
  "మాలిక" ఎడమ వైపు కూడా మిగతా బ్లాగుల వ్యాఖ్యలు వస్తాయి. వ్యాఖ్యలు చదవటం మిస్ అవ్వక్కర లేదు.

  "కూడలి" "హారం" లో కూడా వ్యాఖ్యలకోసం చూడచ్చు.

  వ్యాఖ్యలు చదివి బ్లాగుకు వచ్చేవారు అన్ని బ్లాగుల లాగానే శంకరాభరణం బ్లాగుకీ ఉన్నారు.

  స్వస్తి

  రిప్లయితొలగించండి
 20. నవంబర్ 08, 2012 6:25 సా

  ఆజ్ఞాతబ్బాయ్, ఏమిటో నీవు మిస్ అయ్యింది?! చొప్పదంటు వార్తలా, సినిమా కబుర్లా? మిస్ అవడం వల్ల ఆకాశం వూడి పడిందా? లేక భూమి బద్ధలయ్యిందా? :))
  మలక్‌పేట్ నుంచి ఆ కామెంట్లు దారిమళ్ళించే కిటుకు నీవే అడిగి శంకరయ్య మాస్టారికి చెప్పొచ్చు కదా. కావాలంటే నా పేరు చెప్పు, ;) మలక్‌పేట్ నా మిత్రుడే.
  ఏదేమైనా, నీ మనోభావాలు దెబ్బతిన్నాయని తెలుస్తోంది. నిన్ను వూరడించేలా... కవులు అజ్ఞాత పేరున ఓ పూరణాస్త్రాలు సంధించెదరు గాక! :)

  రిప్లయితొలగించండి