12, నవంబర్ 2012, సోమవారం

పద్య రచన - 158

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

10 కామెంట్‌లు:

  1. నరకాఖ్యుండు వరప్రభావ జనితోన్మాదుండు దర్పోద్ధతిన్
    సురలన్ గెల్చి త్రిలోకకంటకుడునై క్షోణిన్ ప్రవర్తింప సం
    గర రంగంబున సత్యతోడ జని లోకత్రాత కృష్ణుండు భీ
    కర చక్రాహతి నా దురాత్ముని తలన్ ఖండించె చండాకృతిన్

    రిప్లయితొలగించండి
  2. సరి నాకెవ్వరటంచు గర్వమున హింసామార్గమున్ పట్ట; నా
    నరకాధమ్ముని సంహరింతునని బాణమ్ముల్, కరంబందునన్
    హరి దా చక్రము బూని సంగరమునందత్యంత క్రోధమ్ముతో
    ధరకేతెంచెను, చంపెనా నరకునిన్ దామోదరుండచ్చటన్.

    రిప్లయితొలగించండి
  3. సవరణతో

    సరి నాకెవ్వరటంచు గర్వమున హింసామార్గమున్ పట్ట; నా
    నరకాధమ్ముని సంహరింప సతి తోనచ్చోటకేతెంచి యా
    యసురున్ చక్రము బూని సంగరమునందత్యంత క్రోధమ్ముతో
    ధరణీ భారము తగ్గ జంపెనపుడా దామోదరుండచ్చటన్.

    రిప్లయితొలగించండి
  4. ధరణీసుతుడై యొక్కడు
    నరకాసురనామమంది నానాగతులన్
    సురులను పీడించుటచే
    హరి సత్యను గూడి చేరి హతునొనరించెన్.

    వరముల నందితి నాకిక
    సరి లేరని విర్రవీగి సత్పురుషాళిన్
    నిరసించి మదము జూపిన
    నరకాసురు డేగె యముని నగరంబునకున్.

    నరకాసురవధ గాంచిన
    సురసంఘము సంతసించి సుమవర్షంబున్
    కురిపించిరి సంతసమున
    ధరవారలు దీపరాజి తమ గేహములన్

    అరుసంబున నెల్లెడలను
    వరుసలుగా తీర్చిదిద్ది వైభవమొప్పన్
    వరదీపావళి పర్వము
    జరుపంగా బూనినారు సద్భక్తినికన్

    మరువక బాలురు, వృద్ధులు
    పరమానందంబుతోడ ప్రతివత్సరమీ
    సరదాల పర్వరాజము
    నిరుపమముగ జేతురిలను నిర్మలమతులై.

    రిప్లయితొలగించండి

  5. దీ పాలెన్నియొ వెలుగును
    దీ పావళి నాడు మిగుల దే దీ ప్యముగా
    రూ పాయలగును మెండుగ
    పాపాత్మున్నరకు డొడలు బాయుట వలనన్

    రిప్లయితొలగించండి
  6. పాపాలభైరవుండై
    మాపాలంబడి నరకుడు మమ్ముల నణచెన్
    గోపాలాగావుమయా
    యీపాపినిజంపివెల్గునీయగఁగోరన్

    ధరభారంబదిదొలగన్
    నరకాసురవథకరింగినాతియుగూడన్
    మురహరి గూల్చిన వేళన్
    ధరణిన్ దీపావళియనితన్మయమవరే

    రిప్లయితొలగించండి
  7. నరకా సురుడను తమమును
    తెరలించగ కృష్ణు డంత దీప్తులు వెలసెన్
    కరుణించి మమ్ము కృష్ణా !
    చిరకాలము వెల్గు నింపి చేయుము శుభముల్

    రిప్లయితొలగించండి
  8. గరుడారూఢుడు హరియే
    నరకాసురు జంపె నాడు నాతియె జతగా
    ధరలో దానికి గురుతుగ
    నరులందరు వెలుగు నింపి నాటిని తలచున్.

    రిప్లయితొలగించండి
  9. సరసను సత్యను చేకొని
    కఱి వేలుపు కదలి వచ్చె కాలాగ్ని వలెన్ !
    వరగర్వుడు నరకుని గని
    పరి మార్చెను వరము వలన పాపిని సత్యే !

    రిప్లయితొలగించండి
  10. కవిమిత్రులకు దీపావళి శుభాకాంక్షలు.
    *
    పండిత నేమాని వారూ,
    మీ పద్యం ప్రకృష్ట పదబంధంతో చక్కని ధారతో మనోహరంగా ఉంది. అభినందనలు.
    *
    లక్ష్మీదేవి గారూ,
    సవరించిన మీ పద్యం చాలా బాగుంది. అభినందనలు.
    ‘నరకాధముని’ అనాలి కదా! ‘మ్ము’ అని ద్విత్వం రాకూడదు. ‘నరకాఖ్యాసురు సంహరింతు....’ అని సవరిద్దాం.
    *
    హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
    ‘దీపావళి’ ఖండికను అద్భుతంగా రచించారు. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    బాగుంది మీ పద్యం. అభినందనలు.
    ‘పాపాత్ముఁడు నరకుఁ డొడలు....’ అందాం.
    *
    సహదేవుడు గారూ,
    మీ రెండు పద్యాలూ బాగున్నవి. అభినందనలు.
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    బాగుంది మీ పద్యం. అభినందనలు.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పద్యం చాలా బాగుంది. అభినందనలు.
    ‘సత్యే’ను ‘హరియే’ అని సవరించండి. నరకుని చంపింది కృష్ణుడే, సత్యభామ కాదు.

    రిప్లయితొలగించండి