13, మార్చి 2014, గురువారం

సమస్యాపూరణం - 1350 (పందికిన్ బుట్టె)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
పందికిన్ బుట్టెఁ జక్కని పాడియావు.

18 కామెంట్‌లు:

 1. అతి దురాత్మకుండగు హిరణ్యకశిపునకు
  భాగవత సత్తముండన బరగు సుతుడు
  పుట్టె ప్రహ్లాదు డనునది యెట్టులనగ
  పందికిన్ బుట్టె చక్కని పాడి యావు

  రిప్లయితొలగించండి
 2. సరస మీరీతి తగదనె సందె వేళ
  కశ్యపుని పత్ని విననట్టి కారణ మున
  దైత్య గణములు బుట్టిరి ధరణి నటులె
  పందికిన్ బుట్టె జక్కని పాడి యావు

  రిప్లయితొలగించండి
 3. బురద నుంచి గాదె కలువ పూవు బుట్టె
  నీచ మన్నది లేదిల నిజము నెరుగ
  పందికిన్ బుట్టెఁ జక్కని పాడియావు
  దైవ లీల తెలియ మన తరము గాదు

  రిప్లయితొలగించండి
 4. పందికిన్ బుట్టె జక్కని పాడి యావు
  చాల చిత్రము మఱి యిది శంక రార్య !
  కోడికిన్ బుట్టె మార్జాల కూన లనిన
  సంది యంబడ నవసర మొంద వలదు

  రిప్లయితొలగించండి
 5. ముళ్ళ పొదలందు వెల్గెను మొగలి ఱేకు
  పంకమందున నుదయించె పంకజమన
  నసుర రాజుకు కలిగె ప్రహ్లాదు డటులె
  పందికిన్ బుట్టెఁ జక్కని పాడియావు.

  రిప్లయితొలగించండి
 6. శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో.....
  సవరణలకు శ్రీ నేమాని గురుదేవులకు ధన్యవాదములతో...
  నేడు యువ నేతను జూచి జనులు
  ===============*================
  ధీన జనులకు జూపగ దిశలను,ఘన
  కీర్తి నొందిన నేతకు కీడు జేయ
  బురద నందు పొరలు నట్టి బుధ్ధి లేని
  పందికిన్ బుట్టె,చక్కని పాడి యావు
  పాల నిచ్చి పెంచుచు నుండె పంకిలమును!
  వాని నీడ మేలనుచు బలుకు చుండె!
  వినుడు జనులార!వింతను,వేడుకలర!

  రిప్లయితొలగించండి
 7. పరమ దుర్మార్గుడైనట్టి నరున కిలను
  సద్గుణాఢ్యుడు జన్మించు సరణి నరసి
  పలుకగా వచ్చు నుపమాన మొలుక నిట్లు
  "పందికిన్ బుట్టె చక్కని పాడియావు"

  రిప్లయితొలగించండి
 8. రక్కసుని వంటివానికి లక్షణముగ
  హితవు గోరెడి సద్గుణ సుతుడు గలిగె
  జనులు దలచుచుందురిటుల ఘనముగాను
  పందికిన్ బుట్టె చక్కని పాడి యావు

  రిప్లయితొలగించండి
 9. సందె వేళలో గోవుల మందలోన
  సందడిని జేసె నొకయావు క్రింద మీద
  ప్రసవ వేదన పడితాకె ప్రక్కనున్న
  పందికిన్;బుట్టె చక్కని పాడియావు !!!

  రిప్లయితొలగించండి
 10. మిత్రులారా! శుభాశీస్సులు.
  ఈనాటి పూరణలు పరిశీలించుదాము. అందరికి అభినందనలు.

  శ్రీమతి రాజేశ్వరి గారు:
  మీ భావము తిరగబడినట్టు లున్నది. మీ పద్యములో అన్వయము చూస్తే: పాడి యావునకుం బుట్టె పంది యొకటి అనవచ్చు.

  శ్రీనాగరాజు రవీందర్ గారు:
  మీ పద్యము బాగుగ నున్నది. ధూర్తుడైన గ్రామాధికారి యొక్క సుపుత్రుని గురించి చెప్పేరు.

  శ్రీ P.S.R.murti garu :
  బురదలో పుట్టే కలువ గురించి చెప్పిన మీ పద్యము బాగుగ నున్నది.

  శ్రీ సుబ్బా రావు గారు:
  మీ పద్యము బాగుగ నున్నది. మార్జాల కూనలు అనుట దుష్ట సమాసము. పిల్లి కూనలు అనవలెను కదా.

  శ్రీ భాగవతుల కృష్ణా రావు గారు: నమస్కారములు.
  మీ పద్యము బాగుగ నున్నది. అసుర రాజుకు అన్నారు కదా. రాజునకు అనుట వ్యాకరణ సమ్మతము.

  శ్రీ వర ప్రసాద్ గారు:
  మీ పద్యములో అన్వయము కష్టముగ నున్నది - ప్రస్ఫుటముగా లేదు.

  Sri H.V.S.N.Murty Garu
  మంచి ఉపమానముగా చెప్పవచ్చును అన్న మీ భావము పద్యము బాగుగ నున్నవి.

  శ్రీమతి శైలజ గారు:
  రాకసునికి పుట్టిన సద్గుణ సంపన్నుని గురించి చెప్పిన మీ పద్యము బాగుగ నున్నది.

  స్వస్తి.

  రిప్లయితొలగించండి
 11. శ్రీ మంద పీతాంబర్ గారు: శుభాశీస్సులు.
  మీ ప్రయత్నము బాగుగ నున్నది. పందికిన్ తాకె అన్నారు; అది సరికాదు. పందిని తాకె అనుట సాధు ప్రయోగము. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 12. పండిత నేమానిగారికి పూజ్య గురుదేవులు శoకరయ్య
  గారికి వందనములు

  వినుడు పాల్కడలి తరచు వేళసిరులు
  వాజి తో బాటు బుట్టెను పాడియావు
  వింతగును జన్యు శాస్త్రజ్ఞవృషభులకును
  పందికిన్ బుట్టె జక్కని పాడి యావు

  రిప్లయితొలగించండి
 13. కుందనపు బొమ్మకున్ బుట్టె కుంటి పిల్ల
  అందగత్తెకు జనియించె నంద హీన
  పందికిన్ బుట్టె జక్కని పాడి యావు
  పొందు చున్నారు కర్మల పూర్తి ఫలము

  రిప్లయితొలగించండి
 14. దొంగతనము కలవడిన దుష్టుడైన
  నీతి మాలిన వానికి నీతి మంతు
  డైన కొమరుడు పుట్టిన నందు రిలన
  "పందికిన్ బుట్టె చక్కని పాడి యావు".

  రిప్లయితొలగించండి
 15. శ్రీ తిమ్మాజీ రావు గారు: శుభాశీస్సులు.
  వింతగ వర్ణించుచు మీరు చెప్పిన పద్యము బాగుగ నున్నది. అభినందనలు.

  శ్రీ అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారు: శుభాశీస్సులు.
  కర్మల ఫలముగ పేర్కొనుచు మీరు చెప్పిన పద్యము బాగుగ నున్నది. అభినందనలు.

  శ్రీ బొడ్డు శంకరయ్య గారు: శుభాశీస్సులు.
  నీతి లేని యొక దుర్మార్గునికి నీతిమంతుడైన మంచి కుమారుడు పుట్టు రీతితో పోల్చిన మీ పద్యము బాగుగ నున్నది.
  అభినందనలు.
  స్వస్తి.

  రిప్లయితొలగించండి
 16. తెలుపు రంగును జూడగా నలుపు బుద్ధి
  పందికిన్ బుట్టె, చక్కని పాడియావు
  నడచి వెడలుచు నుండగా బడగ జేసి
  బురదనే మీద, నవ్వెను గురుగురనుచు.

  రిప్లయితొలగించండి
 17. శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారూ! శుభాశీస్సులు.
  మీ పద్యము హాస్యస్ఫోరకముగా మంచి విరుపుతో నలరారుచున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 18. కవిమిత్రులకు నమస్కృతులు.
  తిరుపతి ప్రయాణం ముగించుకొని రాత్రి ఇల్లు చేరాను. ఈ నాలుగు రోజుల్లో నెట్ సెంటర్‍కు వెళ్ళి బ్లాగును చూచే అవకాశం దొరకలేదు. ఇప్పుడే మిత్రుల పూరణలను చూస్తున్నాను. పండిత నేమాని వారు ఆంధ్రపద్యకవితాభిమానంతో, మనపై వాత్సల్యంతో పూరణల, పద్యాల గుణదోష విచారణ చేసి తగిన సూచన లిచ్చారు. వారికి నా ధన్యవాదాలు.
  చక్కని పూరణలు చెప్పిన కవిమిత్రులు....
  పండిత నేమాని వారికి,
  రాజేశ్వరి అక్కయ్యకు,
  నాగరాజు రవీందర్ గారికి,
  పియెస్సార్ మూర్తి గారికి,
  పోచిరాజు సుబ్బారావు గారికి,
  భాగవతుల కృష్ణారావు గారికి,
  కందుల వరప్రసాద్ గారికి,
  హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారికి,
  శైలజ గారికి,
  మంద పీతాంబర్ గారికి,
  కెంబాయి తిమ్మాజీ రావు గారికి,
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి,
  బొడ్డు శంకరయ్య గారికి,
  గోలి హనుమచ్ఛాస్త్రి గారికి
  అభినందనలు, ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి