28, మార్చి 2014, శుక్రవారం

పద్య రచన – 549

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

18 కామెంట్‌లు:

  1. క్షీర సాగరమును చేరి సురాసురు
    ,,,,లమృతమ్ము నొందగ యత్నమూని
    మంథర శైలమున్ మంచి కవ్వము చేసి
    ....వాసుకిన్ ద్రాడుగ బట్టుకొనుచు
    ద్రిప్పుచు నుండగా దీక్షతో నా గిరి
    ....క్రుంగుచుండుట జూచి కూర్మమగుచు
    వీపుపై మోసెను విష్ణువా యద్రిని
    ....సాధన మారీతి జరుగు చుండ
    నహిపతికి బాధ హెచ్చయి హాలహలము
    గ్రక్కె గ్రక్కున నతి భయంకరముగ నది
    సకల ప్రాణాంతకంబయి జగములెల్ల
    వ్యాప్తి చెందుచు నుండగా భయమునొంది

    దేవతలు రాక్షసులు నంత దేవదేవు
    డైన శంకరు బ్రార్థింప నా కృపాబ్ధి
    యభయమిడి స్వాగతించి యా హాలహలము
    నంతయును దన కంఠంబునందు నిలిపె

    ఆ మహా గరళమ్ము నంతయు మ్రింగెనా
    ....కడుపులో నున్న లోకమ్ము లెల్ల
    నాశనమగునంచు నీశుడా తరుణాన
    ....నుమియుచో వెలుపల నుండునట్టి
    భువనమ్ము లెల్లను పూర్తిగా నాశిల్లు
    ....ననుచు దలంచి నిల్పెను స్థిరముగ
    తన కంఠమందు తద్దయు హాలహలమునే
    ....యెంత బాధయును భరించుచుండి
    యటుల ముల్లోకములకు మహావిపత్తు
    తొలగజేసి భద్రమ్ములు కలుగజేసె
    నాదిదేవుడు నతుల దయామయుండు
    శంకరుండు సదా లోకశంకరుండు

    జయ మహాదేవ! శంకరా! జయము జయము
    జయ జగత్త్రయ రక్షకా! జయము జయము
    జయ మనుచు దేవ దానవ చయములెల్ల
    సంస్తుతు లొనర్చి రావేళ సన్నయమున

    మరల క్షీరాంబుధి మథనమ్ము సాగించు
    ....చుండగా నద్దాని నుండి వేగ
    వెల్వడె సురభియు, విధుడు,నైరావత
    ....మును కల్పభూజమ్ము, పుష్కరాక్షి
    యగు మహాలక్ష్మియు, నశ్వరాజంబగు
    ....నుచ్చైశ్రవమ్మును నొప్పు మీర
    అమృత కలశమ్ముతో నంత ధన్వంతరి
    ....ప్రత్యక్షమయ్యె నా పర్వమందు
    హరి జగన్మోహినీ రూప మపుడు దాల్చి
    యమృతకలశమ్ము చేబూని యసురతతుల
    నకట మోహింపజేయుచు, నమర బృంద
    ములకు నమృతమ్ము బంచె నద్భుతము గాగ

    హరి లీలలు హరు లీలలు
    కరము శుభంకరములగు జగమ్ములకెల్లన్
    హరిహరుల నాత్మ దలచుచు
    పరమాదరమలర గూర్తు వందన శతముల్

    రిప్లయితొలగించండి
  2. పండిత నేమాని వారూ,
    క్షీరసాగర మధన వృత్తాంతాన్ని అద్భుతంగా ఖండికారూపంలో వ్రాసి ఆనందింపజేశారు. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  3. చిలుకగ పాలసముద్రముఁ
    గలిసి సురాసురులమృతము కనుగొనుటకునై
    కలకలమురేగె హాలా
    హలము వెలువడగ నటేశునభయము దొరికెన్.

    గరళము మ్రింగి శంకరుడు కంఠమునందున నిల్పె చల్లగా
    కరుణనుఁ జూపి లోకములఁ గాచగ లోపలి వాటినెల్ల; మం
    థరమును మున్గకుండ హరి తానొక కూర్మముగా భరించగా
    సురభియు, నశ్వరాజమును, చొక్కగు వెల్లపుటేనుగున్, మహా

    లక్ష్మియు శశాంకుడును, సుధారసముఁ బూని
    కలశమందు ధన్వంతరి కానరాగ
    సంతసమ్ములు మినుముట్టె జగడమాడ
    మొదలిడిరి సురాసురులును మోహిని యరు

    దెంచెనటకు నలుకఁ దీర్చి మాయలఁ బడ
    జేసి సురులకిచ్చె సృష్టి నష్ట
    పఱచు వారి విడిచి; పల్కగ హరిహరు
    ల కథలు సతతమును రమ్యమదియె.




    రిప్లయితొలగించండి
  4. లక్ష్మీదేవి గారూ,
    హ.వేం.స.నా.మూర్తి, పండిత నేమాని వారల బాటపట్టి మీరూ చక్కని ఖండిక వ్రాశారు. అభినందనలు.
    ‘కలశ మంది ధన్వంతరి’ అని ఉండాలనుకుంటాను. టైపాటా?
    అసమాపక క్రియతో పద్యాన్ని ముగించి తరువాతి పద్యంలో వాక్యాన్ని కొనసాగించే సంప్రదాయం ఉంది. మీరేమో ‘మహా| లక్ష్మి, అరు| దెంచె’ అని పదాలనే ఖండించారు.

    రిప్లయితొలగించండి
  5. గురువుగారు, సవరించినాను.


    చిలుకగ పాలసముద్రముఁ
    గలిసి సురాసురులమృతము కనుగొనుటకునై
    కలకలమురేగె హాలా
    హలము వెలువడగ నటేశునభయము దొరికెన్.

    గరళము మ్రింగి శంకరుడు కంఠమునందున నిల్పె చల్లగా
    కరుణనుఁ జూపి లోకములఁ గాచగ లోపలి వాటినెల్ల; మం
    థరమును మున్గకుండ హరి తానొక కూర్మమువోలె నెత్తె; నా
    సురభియు, నశ్వరాజమును, సుందరి లక్ష్మియు, నేన్గు పిమ్మటన్

    చంద్రుడు , సుధనిండిన కలశమ్ముతోడ
    వెజ్జు ధన్వంతరియు కనిపించినంత
    సంతసమ్ములు మినుముట్టె; జగడమాడ
    మొదలిడిరి సురాసురులును, మోహిని యను

    వేషమందున హరి వింతగ మాయనుఁ
    జేసి సురులకిచ్చె సృష్టి నష్ట
    పఱచు వారి విడిచి; పల్కగ హరిహరు
    ల కథలు సతతమును రమ్యమదియె.

    (సుధారసము బూని కలశమందు, అని మొదట రాసినది గురువుగారు!)

    రిప్లయితొలగించండి
  6. కినిసి దుర్వాస సంయమి మనుజు లట్లు
    నమరులకు మరణమొదవు నని శపించ
    భయముతోడను దేవతల్ పచ్చవిల్తు
    ని జనకు కడకు నేగిరి గజిబిజిగను
    సౌరివారికభయమిచ్చి సంతసమున
    చెప్పెఁ బాలసముద్ర మున్ చిలికి యమృత
    మున్ గొనిన వారు మృత్యువు బొందరనుచు
    పరవ శించుచు మందరపర్వతమును,
    వాసుకి సహాయమున్ బొంది వారలు వెస
    వనధి చిలుకగా యత్నించి బరువును గని
    యర్థభా గము నిచ్చెద మంచు జెప్పి
    యసుర సోదరులను గూడ నందు జేర్చి
    మొదలు బెట్టిరి చిలుకుటన్ ముదము తోడ
    సౌరి కూర్మావతారపు ధారియై స
    హాయ మున్ సల్పె వారికి ననువు గాను
    వత్తిడిని తాళలేకను వాసుకి విష
    మున్ విడువగ, భయముతోడ, శివుని గొల్వ
    సురలు, పార్వతీనాధుండు, శుభము గోరి
    సకల లోకములకు, తాను సలిలమువలె
    త్రాగె నావిషమును ప్రజ,తపము దీర్చ

    రిప్లయితొలగించండి
  7. క్షమించాలి. "శౌరి" టైపింగు లో తప్పు జరిగింది

    రిప్లయితొలగించండి
  8. శ్రీ అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ! శుభాశీస్సులు.
    మీ ఖండిక బాగుగ నున్నది. అభినందనలు. కొన్ని సూచనలు.
    ఈ క్రింది పాదములో ప్రాసయతి నియమము పాటింపబడలేదు:
    "మున్ విడువగ భయముతోడ శివుని గొల్వ"
    ఆఖరి పాదము ఇలాగ మార్చితే బాగుంటుంది:
    "త్రాగి తాపమ్ము దీర్చెను ప్రజలకెల్ల" (తపము అనుట కంటె తాపము అనుట సమంజసము కదా!)
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  9. శ్రీమతి లక్ష్మీ దేవి గారూQ శుభాశీస్సులు.
    మీ ఖండిక బాగుగనున్నది. అభినందనలు.
    2వ పద్యములో 2వ పాదములో "వాటినెల్ల"కి బదులుగా :వాని నెల్ల: అనుట సాధువు. వాటిని అనుట వ్యావహారికము. అటులనే "తానొక కూర్మమునై ధరించె" అని 3వ పాదములో కొంత మార్చితే అన్వయము బాగుంటుంది.
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  10. సురలు దనుజులు గూడియు సుందరముగ
    పాల కడలిని చిలుకగ లీల గాను
    వచ్చు హాలాహలముగని గచ్చుమనగ
    గరళ మంతయునుగ్రోలి గళము నందు
    నిలిపి పెనుముప్పు దప్పించె నీలగళుడు

    రిప్లయితొలగించండి

  11. నేమాని పండితార్యుల అడుగుజాడల్లో......

    పాల సంద్రము నుండి వేలుపు లసురులున్
    ......సుధనొంద మంధర కుధరముంచి
    వాసుకి త్రాడుగా వడి ద్రిప్పుచుండగా
    ......క్రుంగగ శైలమ్ము కూర్మ మగుచు
    హరి వీపునను దాల్చ గిరిని మోదముతోడ
    ......మంథన కార్యమ్ము మరల సాగె
    పాపరేనికి నంత బాధ హెచ్చాయెను
    ......గ్రక్కున గరళమున్ గ్రక్కె నతడు

    ప్రళయ దావానలజ్వాల పగిది నపుడు
    భీకరమ్ముగ వ్యాపింప లోకములను
    ఘోర హాలాహలమ్మింక దారి లేక
    దేవదానవు లేగిరి దీనులగుచు...

    వెండి కొండను కొలువున్న వేల్పు కడకు
    శరణు పాహి శ్రీ శంకరా శరణనుచును
    వారి యార్తిని గమనించి భూరి కరుణ
    నభయ మిడె మ్రింగ గలనని హాలహలము.

    పట్టి గరళమ్ము నేరేడు పండు వోలె
    జిహ్వ నుంచెను ముక్కంటి చిత్రముగను
    కంఠమున దాని నిల్పెను కరుణ తోడ
    నుదర మందున్న లోకాల నుద్ధరించ.

    గరళము నుంచ శంకరుడు కంఠము నందున దేవదానవుల్
    హరహర శంకరా యనుచు నయ్యెడ హెచ్చిన దీక్ష సంద్రమున్
    పురిగొని చిల్కగా సురభి, పూర్ణశశాంకుడు, కల్పవృక్షమున్,
    సిరియును, వెల్లటేన్గు, సుధ చేగొని వేల్పులవెజ్జు మించగన్.

    మోహినియై శ్రీహరి తా
    నాహా యని యర్రు చాచు చసురులు పొంగన్
    మోహమ్మున, సుధ నంతయు
    నోహో యన దేవతలకు నుద్ధతి పంచెన్.

    హరు కరుణయు హరి లీలయు
    నరయగ శుభ కరము లెపుడు నఖిల జగతికిన్
    శరణమని వేడ వారిని
    సిరిసంపద లౌను మనకు శ్రీ లుప్పొంగున్.

    రిప్లయితొలగించండి
  12. శ్రీ మిస్సన్న గారూ! శుభాశీస్సులు.
    ఖండికలను వెలువరించుటలో మీకు మీరే సాటి. అభినందనలు.

    శ్రీమతి శైలజ గారు: శుభాశీస్సులు.
    మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు. కొన్ని సవరణలతో ఇలాగ వ్రాయుచున్నాను:

    అమరు లసురులు చిలుక క్షీరాంబునిధిని
    వచ్చు హాలహలము గని భయమునొంద
    గరళ మంతయునున్ ద్రావి గళమునందు
    నిలిపి పెనుముప్పు దప్పించె నీలగళుడు

    రిప్లయితొలగించండి
  13. పూజ్య గురుదేవులు పండిత నేమాని గారికి నమస్సులు. తమరి సవరణలకు సలహాలకు కృతజ్ఞతలు. చివరి నాలుగు పదములు యిలామార్చాను.
    విష/
    మున్ విడువగ, భయముతోడ, భూతపతిని
    సురలు, భక్తితో గొల్వగ, శుభము గోరి
    సకల లోకములకు, తాను సలిలమువలె
    త్రాగి తాపమ్ము దీర్చెను ప్రజలకెల్ల

    రిప్లయితొలగించండి
  14. ధన్యవాదములు గురువుగారు...చిన్న ప్రయత్నము..తప్పులను మన్నించి సవరించ ప్రార్దన..



    మందరగిరి కవ్వముగను
    బంధముగయాదిశేషు బట్టగ గిరి నా
    నందముగహరికమఠమై
    విందుగ మధనమ్ము జేయ వేడుక తోడన్

    పొందుగ సురలును దనుజులు
    నందముగాకడలిచిలుక నానందముతో
    బొందిన హాలాహలమున్
    ముందుగ పుక్కిటనుబట్టె మృత్యుంజయుడే

    మ్రింగెనుగద పరమశివుడు
    పొంగిన గరళమ్ముతాను పుక్కిట నిడుచున్
    హంగుగ గళమున బెట్టిన
    జంగమదేవర నుగనగ జయజయ మనుచున్

    హరిహరులను గొలిచిజనులు
    మరలా మధనమ్ముజేయ మంధర గిరితో
    సురభియు నైరావతమును
    సిరియును కల్పకము శశియు చెన్నుగ వచ్చెన్

    ధరియించెను శశిని శివుడు
    వరియించెను సిరిని శౌరి వాత్యల్యమునన్
    తరలెను సురపతి వెంబడి
    సురభియు నైరావతమును సొగసుగ దివికిన్

    వందనము నీలగళునకు
    మందరగిరిధారి హరికి మధుసూదనకున్
    వందనము సిరికి, శేషుకు
    వందనమాచార్యులకును వందన మెపుడున్








    రిప్లయితొలగించండి
  15. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ తేటగీతిక బాగుంది. అభినందనలు.
    *
    శైలజ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    నేమాని వారి సవరణలను గమనించారు కదా.
    *
    మిస్సన్న గారూ,
    మీ ఖండిక ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
    *
    శైలజ గారూ,
    మీ ఖండిక బాగుంది. అభినందనలు.
    మొదటి పద్యంలో ప్రాస (ద, ధ) తప్పింది. రెండవ పాదంలో గణదోషం.
    ‘మరలా’ అని గ్రామ్యాన్ని ప్రయోగించారు.

    రిప్లయితొలగించండి
  16. గరళ మైనను యటువంటి గద్య మైన
    గొంతు లోననె దాచిన ఘోరములను
    మానవాలికి తప్పించ మంచి జరుగు
    శివుడు నేర్పెడు భాష్యము శిష్టు లార!

    రిప్లయితొలగించండి
  17. నేమాని పండితార్యా! మీరు మరీ చెట్టు నెక్కించేస్తున్నారు. ధన్యవాదాలు.

    గురువుగారూ ధన్యవాదాలు.

    శైలజ గారి పద్యాలు చూస్తుంటే ఆమె ఎంత చక్కగా తన ప్రతిభను మెరుగు పరచు కొంటున్నారో అనిపిస్తోంది.

    రిప్లయితొలగించండి