23, మార్చి 2014, ఆదివారం

పద్య రచన – 544

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

32 కామెంట్‌లు:

  1. సుందరి సతియంచు మురిసి సూనృత ములుపల్కి నంత
    బంధము లనుపెంచి తాను భర్గుని సతివలె విరియ
    గ్రంధమ్ములు చదివి చదివి కప్పుర గంధియ నంగ
    నందన వనమంట గివము నలువరా ణికినిల యమ్ము

    రిప్లయితొలగించండి
  2. చంద్ర బింబము బోలిన చక్క దనము
    కలువ రేకుల కన్నులు కాంతి మెరయ
    ఆది దేవుని సతివోలె యలరు చున్న
    వేద పఠనము నీకేల వింత గాక

    రిప్లయితొలగించండి
  3. రాజేశ్వరి అక్కయ్యా,
    మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
    ‘కప్పురగంధి’ అని సమాసం చేయరాదు కదా.

    రిప్లయితొలగించండి
  4. ఇంటి పనులన్ని గావించి యింతి యచట
    చదువు చుండెను బొత్తము శ్రద్ధ గాను
    చూడ్కు లామెవి క్రిందకు జూచు చుండి
    బయటి సంగతు లేవియు బట్ట కుండె

    రిప్లయితొలగించండి
  5. ఇనబింబ మల్లదే కనుమరుగాయె నో
    ......విరిబోడి!తిల్కమ్ము నరసి నొసట
    రాకేందు బింబమ్ము రాకుండె మింటికి
    ......చంద్రాస్య! నిన్గని సంశయమున
    కమలాలు గనుమదే గమ్మున ముకుళించె
    ......కమలాక్షి! నినుజూచి కమిలిపోయి
    దరహాస రుచులకు తత్తరపడి పోయి
    ......స్మితముఖీ! మల్లెలు సిగను దాగె

    పసిడి వన్నెల జలతారు పట్టు చీర
    మించి మెరసె నీవది ధరి యించ లలన!
    పొత్త మల్లదే ముదమున పొంగి పోయె
    నీదు కరకమలమ్ముల నిగ్గుదేలి.

    రిప్లయితొలగించండి
  6. చంద మామ మోము చారెడేసికనులు
    ఇనుడు తిలక మాయె యింతి నొసట
    సిగను మల్లె మాల చేతిలో పొత్తము
    పట్టు చీర గట్టె పైడి బొమ్మ

    రిప్లయితొలగించండి
  7. తెలుగు తల్లిని బోలెడు తెఱవ యొకతి
    చదువు చున్నది పొత్తము శ్రద్ధతోడ
    క్లాసు లందున పాఠముల్ కోసమౌన?
    గ్రంథములు పఠియించెడి కాంక్షతోడ?

    రిప్లయితొలగించండి
  8. ముదితల్ జ్ఞానమునంతయున్ పఠనమే మూలమ్ముగా నేర్చుటల్
    విదితంబియ్యవి భారతావనిన,హో! విద్యావతుల్ పద్ధతుల్
    పదిలంబౌ విధి గాచుచున్ వసుధలో వజ్రమ్ములై వెల్గిరా
    సుదతుల్ సుందర మానసుల్ చెలగి వే జోతల్ సదా యందుచున్.

    రిప్లయితొలగించండి
  9. ముదితల్ జ్ఞానమునంతయున్ పఠనమే మూలమ్ముగా నేర్చుటల్
    విదితంబియ్యవి భారతావనిన,హో! విద్యావతుల్ పద్ధతుల్
    పదిలంబౌ విధి గాచుచున్ వసుధలో వజ్రమ్ములై వెల్గిరా
    సుదతుల్ సుందర మానసుల్ చెలగి వే జోతల్ సదా యందుచున్.

    రిప్లయితొలగించండి
  10. అమ్మా! లక్ష్మీ దేవి గారూ! శుహాశీస్సులు.
    మీ పద్యము చాల బాగుగ నున్నది. అభినందనలు.
    ఆఖరి పాదములో సుదతుల్ సుందర మానసుల్ అన్నారు కదా - సుందర మానసల్ అనుట సాధువు. మానస అనుట స్త్రీలింగము కదా.

    రిప్లయితొలగించండి
  11. సుబ్బారావు గారూ,
    చక్కని పద్యాన్ని వ్రాశారు. అభినందనలు.
    *
    మిస్సన్న గారూ,
    ఫేస్‍బుక్‍లో మీ పోస్ట్ చూసి, మీ కవితా మాధుర్యానికి ముగ్ధుడనై ఆ చిత్రాన్ని స్వీకరించాను. మీకు నా ధన్యవాదాలు.
    ‘ముగ్ధమోహనపదబంధములను గలిగి
    నీదు రచనాచమత్కృతి నిగ్గుదేఱె.’
    *
    శైలజ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ‘కనులు/ నినుడు తిలకమాయె నింతి నింతినొసట’ అనండి.
    *
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    లక్ష్మీదేవి గారూ,
    బాగుంది మీ పద్యం. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  12. ముదితల్ జ్ఞానమునంతయున్ పఠనమే మూలమ్ముగా నేర్చుటల్
    విదితంబియ్యవి భారతావనిన,హో! విద్యావతుల్ పద్ధతుల్
    పదిలంబౌ విధి గాచుచున్ వసుధలో వజ్రమ్ములై వెల్గిరా
    సుదతుల్ సుందర మానసల్ చెలగి వే జోతల్ సదా యందుచున్.

    గురువుగార్లిరువురకూ ధన్యవాదాలు. వందనములు.

    రిప్లయితొలగించండి
  13. ఆదరణీయ భావ నిచయాన్వితయై యలరారు పెద్ద ము
    త్తైదువ యామె, చేత నిగమాంత రహస్య విశేష యుక్తమై
    మోదము నింపు పుస్తకము భూషణమై వెలుగొందు చుండె నా
    సోదరి ధన్యజీవియయి శోభిలు గాక! శతాయు దీప్తితో

    రిప్లయితొలగించండి
  14. నమస్కారములు
    పొరబాటును సవరించి నందులకు ధన్య వాదములు

    రిప్లయితొలగించండి
  15. పండిత నేమాని వారూ,
    ‘ముత్తైదువ’ను గురించిన మీ పద్యం మనోహరంగా ఉంది. అభినందనలు.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    పొరపాటును ఎత్తిచూపానే కాని సవరణ చేయలేదే! ఈసారి నేను నవ్వుకున్నాను సుమా!

    రిప్లయితొలగించండి
  16. జగతిలో మహిళకు సాటి యొక్కరులేరు
    ..........తనకు తానేయౌను తథ్యమిద్ది,
    నరుని కన్నింటిలో వరుసగా తోడౌచు
    ..........ననుదినంబును హర్ష మందజేయు,
    సృష్టి చేయును, పెంచు నిష్టసౌఖ్యం బిచ్చు
    ..........కారణంబై నిల్చు ఘనత కెపుడు,
    గృహిణియై యన్నింట సహకార మందించు
    ..........బహుకష్టముల కోర్చు నహరహమ్ము
    అతివ చేయలేని దవనిలో నేదేని
    కానరాదన ననుమానమేల?
    ముదిత కేదియేని ముద్దార నేర్పింప
    నేర్చు నందమొప్ప నిష్ఠ బూని. 1.

    చిత్రమందు జూడ చిత్తశుద్ధిగ నీమె
    గ్రంథపఠనజేయు కాంక్షతోడ
    ఉన్నతాశయమున నుపవిష్టయై యుండె
    పొత్తమొకటి చేతబూని యదిగొ. 2.

    గ్రంథనామం బేమొ కానరాకున్నది
    ..........భవ్యమై వెలుగొందు భారతంబొ,
    పరమపూజ్యంబైన భాగవతంబేమొ,
    ..........కాకున్న నెంతేని ఘనతగాంచు
    వాల్మీకి రచితమై కల్మషంబులబాపు
    ..........గ్రంథరాజంబైన రామచరిత
    మదియును గాదేని యత్యుత్తమంబైన
    ..........ధర్మశాస్త్రంబౌను తనమనమున
    హర్షమును నింపి, యెంతేని హాయినొసగు
    నట్టి గ్రంథంబు నీయమ యంది మిగుల
    శ్రద్ధతో జేరి యిచ్చట చదువబూనె
    నంద మొలుకంగ ధన్య యీ యతివ యందు. 3.

    జ్ఞానార్జనంబు చేయుట
    కేనాడును వయసు, లింగ మీభువిలోనన్
    కానేరవు బాధకములు
    మానినులకు విద్య మిగుల మాన్యత గూర్చున్. 4.

    రిప్లయితొలగించండి
  17. హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
    జ్ఞానార్జనకు వయోలింగభేదాలు లేవంటూ మీరు చెప్పిన ఖండికలో స్త్రీమూర్తియొక్క ఔన్నత్యం చక్కగా వివరింపబడింది. మీచేత అద్భుతమైన ఖండికలను సృష్టింపజేస్తున్న అదృష్టం మన బ్లాగుకు దక్కినందుకు ఆనందంగా ఉంది.
    ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  18. పండిత నేమానిగారికి పూజ్య గురుదేవులు శoకరయ్య
    గారికి వందనములు

    తరుణ యౌవన కాంతులు తరగలేదు
    బుగ్గలందు సోయగములు ముదుర లేదు
    భర్త ప్రేమను పొందిన భాగ్యవతివి
    నిండు ముత్తైదువేషమ్ము నెలత నీది
    తొలి వలపు దీయ దనములు తలచి నావొ
    కనులు వ్రాలెను సిగ్గుతో. ప్రణయలేఖ
    పొత్త మందున దొరకెనా పూర్వ స్మృతులు
    లేచి రెండవ ప్రాయమ్ము రేపె నేమొ!!!

    రిప్లయితొలగించండి
  19. నాగరాజు రవీందర్ గారూ,
    చిత్రంలో సుందరి రతీదేవి వలె నున్నదని వ్రాసిన మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పద్యం మనోహరంగా ఉంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  20. నాగరాజు రవీందర్ గారూ,
    ‘బమ్మకైన బుట్టు రిమ్మతెగులు’ అన్నట్టు ఆ చిత్రంలోని అమ్మడిలో ఈ వృద్ధాప్యంలో రతీదేవిని చూశాను. చదువుల తల్లిని చూచి మీ సంస్కారాన్ని తెలియజేశారు. సంతోషం!

    రిప్లయితొలగించండి
  21. మిత్రులారా! శుభాశీస్సులు.
    ఈనాటి చిత్రమునకు సరియైన రీతిలో పద్యరచన కావించిన అందరికి అభినందనలు. అంగాంగ వర్ణన ముఖ్యము కాదు - ఔచిత్యమును కూడా పాటించుట సమంజసము. స్త్రీమూర్తులను గురించి చెప్పునపుడు ఏ వయస్సు వారికి ఎట్టి పదములు వాడవలెనో కూడా చూచుట ఆవశ్యకము. లలన, రమణి, భామ,ముగ్ధ, వెలది మొదలైన పదములను సందర్భోచితముగా మాత్రమే వాడదగును. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  22. పడతి పఠన శక్తి పరిమళముజగతి
    అనుసరించ వలెను అతివలంత
    అడుగు వేయవచ్చు అభ్యుదయముతోడ
    జాతి గౌరవించు జయము గలుగు

    రిప్లయితొలగించండి
  23. గురువుగారూ ధన్యవాదములు. నిజానికి నేను ఆ చిత్రాన్ని 'పూర్ణిమ రేమెళ్ల' గారి ముఖపుస్తకం నుంచి గ్రహించాను. మీ పొగడ్తలో సింహభాగం ఆమెకే దక్కుతుంది.

    రిప్లయితొలగించండి
  24. నేమాని పండితార్యా! మీ సూచనను గమనించాను.
    నా పద్యంలో లలన అనే పదం బదులు వనిత అనే పదం వాడవచ్చునేమో అనుకొంటున్నాను. నేను సభ్యత మించిన రీతిలో అంగాంగ వర్ణన చేయ లేదని అనుకొంటున్నాను.

    రిప్లయితొలగించండి
  25. హరి గారూ మీ పద్యాలు చిత్రానికి తగిన రీతిలో మనోజ్ఞంగా ఉన్నాయి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  26. నాగరాజు రవీందర్ గారూ,
    ‘కౌస్తుభవక్షోభవు సతి’ అన్నా రతి, సరస్వతి ఇద్దరికీ వర్తిస్తుంది.
    *
    పానుగంటి వారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    మీరు పద్యంలో అచ్చులు ఎక్కువగా ఉపయొగించారు. గ్రాంధికభాషలో వాక్యం లేదా పద్యం మధ్య అచ్చులను వ్రాయడం మన సంప్రదాయం కాదు. మీ పద్యాన్ని ఇలా వ్రాయవచ్చు.
    పడతి పఠన శక్తి పరిమళముజగతి
    ననుసరించ వలయు నతివలెల్ల
    నడుగు వేయవచ్చు నభ్యుదయముతోడ
    జాతి గౌరవించు జయము గలుగు.
    *
    మిస్సన్న గారూ,
    నా పొగడ్త చిత్రానికి కాదు, అ చిత్రంపై మీ కవిత్వచిత్రణకు.

    రిప్లయితొలగించండి
  27. మిత్రులకు శుభాశీస్సులు.
    నేను సమాదర భావముతోనే అందరి కొరకు చిన్న చిన్న సూచనలు చేసేను. అందరు జాగ్రత్తగా పాటించుతారనే నమ్మకముతో. ఏ ఒక్కరిని విమర్శించాలనే భావన లేదు. శ్రీ నాగరాజు గారు కానీ శ్రీ మిస్సన్న గారు కానీ అన్యథా భావించ వలదు. శ్రీ నాగరాజు గారు వాడిన సమాసము బాగుగనే యున్నది. శ్రీ మిస్సన్న గారు లలనకి బదులు వనిత అనుట సమంజసమే. ముఖే ముఖే సరస్వతి అని ఆర్యోక్తి. ఆ పలుకుల తల్లి ఎవ్వరి చేత ఏలాగున పలికించునో కదా. ఒక దృశ్యమును చూచునప్పుడు అందరికీ ఒకే విధమైన ఆలోచన రాదు కదా. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  28. ఆర్యా! మిస్సన్నగారూ!
    ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  29. నేమాని పండితార్యా మీ సూచనలు సదా మాకు అభిలషణీయము, ఆచరణీయమును. ఆపార్థాలకు తావులేనివియును కూడా. ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  30. కంది శంకరయ్య గారికి ధన్యవాదాలు. నేను పద్యం వ్రాయడం ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. మీసూచనలు పాటిస్తాను.

    రిప్లయితొలగించండి