31, మార్చి 2014, సోమవారం

‘జయ’ ఉగాది కవితలు

‘జయ’ ఉగాది కవితలు

హరి వేంకట సత్యనారాయణ మూర్తి

శ్రీకరమై జయవత్సర
మాకరమై శాంతి కతుల హర్షాత్మకమై
చేకూర్చు గాత, శుభములు
ప్రాకటముగ యశములొసగి బహుసుఖదంబై 1.

జయములు కలుగంగావలె
భయమంతయు తొలగిపోయి ప్రజలందరకున్
జయవత్సరకాలంబున
క్షయమై కల్మషము, సుఖము సమకూరవలెన్ 2.

యతనములు సాగగావలె
క్షితిపయి సత్యంబు నిలుప, సిరులందవలెన్
క్షితిజముల పెంపకంబున
శతశాతము హాయికలిగి జయవర్షమునన్ 3.

నానావిధసత్క్రతువులు
దానాదులు జరుగవలయు ధర్మము గావన్
మానవులు సత్యసమరపు
సైనికులై నిలువవలయు జయవర్షమునన్. 4.

మతభేదము నశియించుట
కతులిత యత్నంబు జరిగి యత్యద్భుతమౌ
వ్రతదీక్ష బూనగావలె
క్షితిపయి జయహాయనాన క్షేమముగలుగన్. 5.

సంపదలకు నిలయంబై
సంపూర్ణవికాసమంది జగమంతటిలో
నింపైన యశములాంధ్రము
సంపాదించంగ వలయు జయకాలమునన్. 6.

వత్సరమంతయు భువిపై
సత్సౌఖ్యము లందవలయు, జయహాయనమం
దుత్సాహవర్ధనంబయి
సత్సంగతి కలుగవలయు జనులందరకున్ 7.

రమణీయాద్భుతభావం
బమరగ జయకాలమందు హర్షాన్వితులై
సముచితవర్తనతో జను
లమలిన యశమందవలయు నాంధ్రావనిలోన్. 8.

శుభకరమై జయవర్షము
ప్రభవాదుల మేటియౌచు బహువిధములుగా
ప్రభవింపజేయు జయములు,
విభవంబులు భారతాన విస్తృతరీతిన్. 9.

భరతావని కీయబ్దము
వరమై సత్ప్రభుత నొసగి వరుసజయాలన్
నిరతము గూర్చుచు ప్రజలకు
సిరిసంపద లొసగవలయు శ్రీమంతంబై. 10.

కాలోచిత సద్వృష్టియు,
మేలౌ సస్యంబులంది మేదినిలోనన్
పాలకులకు జయవత్సర
కాలంబున స్వాంతశుద్ధి కలుగంగవలెన్. 11.

మనములలో సద్భావము
జనులందరిలోన కలిగి సద్వైభవమీ
ఘనతరజయవర్షంబున
ననుపమగతి గలుగవలయు నాంధ్రావనిలోన్. 12.

నవ్యంబౌ రాష్ట్రంబున
సవ్యాలోచనముచేత సత్సౌఖ్యంబుల్
దీవ్యజ్జయవత్సరమున
భవ్యంబుగ నందవలయు ప్రజలందరకున్. 13.

లుప్తంబై యన్యాయము
వ్యాప్తిం జెందంగ సత్య మాంధ్రావనిలో
ప్రాప్తములౌ సచ్ఛుభ సం
దీప్తులు జయవత్సరాన స్థిరభావముతోన్. 14.


ఆరు రుచుల పర్వ మత్యంత సౌఖ్యంబు
కూర్చు గాత భువిని కూర్మిమీర
సకల గతుల జనులు సానంద చిత్తులై
హాయి నందవలయు ననుపమముగ. 15.


మిస్సన్న


స్వాగతమ్ము జయాబ్దమా! ఘన స్వాగతమ్ము శుభప్రదా!
స్వాగతమ్ము భరద్ధరిత్రికి! స్వాగతమ్ము జయప్రదా!
స్వాగతమ్ము యుగాది! ధాత్రికి స్వాగతమ్ము వసంతమా!
స్వాగతమ్ము తెలుంగునేలకు! శాంతి సౌఖ్యము లీయగా!

కోయిల నింబ మామ్రములు గుప్పున తావుల జల్లు మల్లియల్
హాయిని గూర్చు మారుతపు టల్లన మెల్లన సాగు వీచికల్
సోయగ మొప్పు క్రొన్ననలు చూపుల దోచెడి పుష్ప వర్ణముల్
వేయి శుభమ్ము లిచ్చెడిని వేడ్క వసంత యుగాది వేళలో!

జయమగు గాక ధారుణికి, చల్లగ దప్పిక దీర్చు నీటికిన్!
జయమగు గాక నగ్నికిని, సన్నగ మెల్లగ వీచు గాలికిన్!
జయమగుగాక మింటికిని, సర్వ చరాచర ప్రాణికోటికిన్!
జయమగుగాక సద్ద్విమల సజ్జనకోటుల కీ జయమ్మునన్!


వగరు వాసనలతో పొగరైన నింబపు
...........చినిచిన్ని పువ్వుల చెలగ దెచ్చి
జీడి వాసన లూరు చిట్టి మామిడి పిందె
...........ముక్కల దగిలించి మోదమలర
చెరకు గడను దెచ్చి చెక్కును తొలగించి
...........సన్నని ముక్కల కొన్ని జేర్చి
క్రొత్తగా పండిన కొమరైన తింత్రిణీ
...........ఫలవిశేషము కాస్త పదిలపరచి

క్రొత్త బెల్లపు తీపిని కొంత గలపి
యుప్పు చిలికించి మెదిపిన గొప్ప రుచులు
చేదు తీపియు పులుపును చెంత వగరు
శుభ యుగాదిని పచ్చడి విభవ మలరు!


మారెళ్ళ వామన కుమార్


    రాజ్యాధిపతి యయి రజనీశుడు ఘనము
    మంత్రాంగమును గూడ బలిమి జేయు ;
    సేనాధిపతి రవి, సీమ రక్షణ తోడ,
    అర్ఘ్య మేఘముల నధికపరచు ;
    సస్యేశుడు బుధుడు సాదముల్ బెంచుచు
    నీరసములగూడ నేర్పు జూచు ;
    ధాన్యేశుడు కుజుడు ధాన్యమధికమునిచ్చు
    రాజగు శుక్రుడే రసములకును ;
    నవనాయకులునిప్డు నష్టమెక్కు డొసంగ
    నల్లకల్లోలములధికమగును ;
    వరద,తుఫానులు వరుసగ బాధించు
    చెడువాసనలు పెక్కు చెడుపు జేయు ;

    వచ్చుచున్నది క్లేశపు వాసి గాను
    మత్సరము గూర్చు జయ నామ వత్సరమ్ము
    కూడి తగు జాగరూకత తోడికొనుచు,
    కలసియుందము ! రండి ! సుకర్ములార !


బొడ్డు శంకరయ్య

కమ్మని గొంతుతో మధుర గానము జేయుచు చెట్టుకొమ్మపై
నిమ్ముగ గూరుచుండి కడు హృద్యముగా 'జయ' నామవత్సమున్
సమ్మతితో వినమ్రముగ స్వాగత గీతము లాలపించుచున్
రమ్మని కోరె కోయిలలు రక్షణ జేయగ లోకులెల్లరన్ ! 



జయ నామ వత్సరమ్మున
భయమేల మనకు విజయము ప్రాప్తించునుగా
రయమున సంపద లిచ్చును
స్వయముగ నీ వత్సరమ్ము సకల జనులకున్!

నూతన సంవత్సరమున
యాతనలన్నియును దొలగి ఐశ్వర్యంబుల్
ప్రీతిగ సమకూర గలవు
నీతిని వీడక బ్రతుకుట నేర్వుము మిత్రా!

వత్సరాది మనకు వరములు గుప్పించు
చైత్రమాసమందు సంతసమున
పచ్చడి నిడి మనకు నిచ్చు నారోగ్యమ్ము
నెండకాలమందు నెలమిగాను.


ఆకు రాలిన చెట్ల కాలంబనమ్ముగ మోసులెత్తు చిగురు మోదమిచ్చు
కొమ్మల మధ్యన గుబురుగా పెరిగిన విరుల నెత్తావులు మరులు గొలుపు
కోకిలమ్మల పాట వేకువ జామున హృదయమ్ము మీటును హృద్యముగను
ఫల పుష్పములతోడ పాదపములు నిండి యుండగా శోభతో పండుగాయె

వెచ్చ వెచ్చని గాలులు వీచుచుండ
పచ్చ పచ్చని చిగురులు పల్లవించె
వచ్చి చేరెను వాసంత వైభవమ్ము
నిచ్చగించుము సహజంపు పచ్చదనము  


సంపత్ కుమార్ శాస్త్రి

"జయముఘటించుగాత " ఘనశౌర్యవివేకములుండుగాత సం
దియముతొలంగుగాత బలతేజములున్ జెలువొందుగాత దు
ర్నయములడంగుగాత రఘురాముని రాజ్యము నిల్చుగాత ని
ర్భయముగ ధర్మకార్యచయ పావనమై ధరకాంతులీనగాన్.

కమనీయకవితావికాసమ్మువెలయించి
......... జనులు విద్యాప్రౌఢఖనులుగాగ
ధర్మైకనిష్టావిధానాదిరూఢులై
......... యార్షధర్మవ్యాప్తకర్షకులుగ
సిరిసంపదలదూగిసేవానిధానులై
......... బీదజనార్తి నిర్భేదులవఁగ
కారుణ్యగుణబుధాకారులై జంతు జీ
......... వాది తిర్యక్జీవ కాశ్రితులుగ

సకలశాస్త్రాదివిద్యావిశారదులుగ
దివ్యమణిమయభాసదేదీప్యమాన
శోభితంబుగ గూర్చు యశోవిభవము
స్వాగతమ్మిదె జయనామ వత్సరమ్మ.

తేజములుల్లసిల్ల సముదీర్ణ సుభావము పెంపువొంద వి
భ్రాజిత కీర్తి భాసిత శుభంబుల సర్వజనాళి వెల్గ మా
యాజనితార్థభావముల మాయలుదొల్గగ నిత్యసౌఖ్యమై
శ్రీజయనామవత్సరమశేషశుభంబులనిచ్చుగావుతన్.





మంద పీతాంబర్
 
జయమౌ వెలుగుల తెలుగుకు
జయమౌ భారత జననికి జయమౌ ప్రజకున్
జయనామ వత్సరమ్మున
జయమౌ విశ్వానికెల్ల జయమౌ శుభమౌ !!!



గోలి హనుమచ్ఛాస్త్రి

జయ ! రా ! స్వాగతమమ్మా
జయ రావము బల్కుచుండె సరి కోయిలలే
జయహే ! హేజయ ! జయ ! జయ !
జయమగు నిన్ దల్చు వారి సత్కార్యములే. 


అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి

వచ్చు చైత్ర శుద్ధ పాడ్యమి రోజున
నాది పండుగౌ యుగాది మనకు
చెట్టు చేమలన్ని చిగురించి పుష్పించు
పచ్చ పైరులన్ని యిచ్చు ఫలము

తెల్లని పూవులు పూచెను
మల్లియ తీవియకుఁ, గాచె మామిడి కాయల్
పెల్లున కోయిల గళములు
నల్లన వినిపించి యొసగె మెండగు ముదమున్

అన్నివనరు లున్న ఆంధ్రుల రాష్ట్రాన్ని
వేరు జేసి నావు విజయ నీవు
చిన్న రాష్ట్రములను చెన్నుగా నొనరించి
జయము గలుగ జేయు జయ యుగాది

వేపపువ్వులోన బెల్లపు తురుమును
చింతపండు మరియు చెరుకు రసము
అరటి పండు, ఉప్పు,మిరియము, మామిడి
నరసి జేర్చి ఉదయ మందుగొనుడు

దుఃఖ మాశ్చర్య నీరసాదులను మరియు
సంతస, భయ క్రోధములను సంతతంబు
నోర్పు నేర్పుతో దాటుచు నుండవలయు
నని యుగాది పచ్చడి చెప్పు ననవరతము.


శైలజ

జయ జయ జయవత్సరమా!
జయములనీయుము జగతికి జాగృతి తోడన్
జయమనె కోకిల రవములు
జయమంచు పలికె నుగాది జయ జయ జయహే!


గండూరి  లక్ష్మినారాయణ 

"చిత్తములలోన 'జయ'నామ  కొత్త సాలు
సిరుల  వెలుగులు సంతోష పరిమళాలు
నిండుగా నింపి   కోర్కెలు నిశ్చయముగ
తీరుచునని నే మనసార కోరుచుంటి." 


కోవెల సంతోష్ కుమార్
 
క్రొత్త చివురు క్రొత్త సవురు క్రొత్త పరువ
మప్పటప్పటి కిష్టమైనట్టి జగతి
ప్రతి యుదయవేళ నూత్నవర్ష ప్రశస్తి
ప్రతి ప్రియాలాప మానంద పర్వరీతి.
 


ఏల్చూరి మురళీధర రావు
శ్రీకళ్యాణపరంపరల్ గురిసి వాసిం గాంచి వర్ధిల్ల నా
కౌకాశీర్మహితంబుగాఁ గరుణమైఁ గాంతుల్ వెలింగ్రక్కు, మాం
ధ్రీకైవల్యనిధానమై నిరతసధ్రీచీనమార్గంబు లో
కైకాదర్శముగా వెలింగెడిని నీ కైకోలు సేఁతన్ జయా!

జవము సత్త్వంబు గడివోవు జాతి బ్రదుకు
పుస్తకపుఁ గ్రొత్త కూర్పుకై  పొంచియున్న
జనుల కే నవ్యవరదానసాధుమతిని
వచ్చితో! జయాభ్యుదయము లిచ్చి ప్రోవ.         

అకలుషసాధుచింతనము, నైహికభోగవిరక్తి పేర్మి భా
వుకతయు తీర్చిదిద్ది, రసభూమికలందుఁ బ్రవేశమిచ్చి, కా
వ్యకృతికి - ధర్మసంహితకు నద్వయరూపము నేర్పఱించి, జీ
విక నిడి ప్రోవుమెల్లర నవిఘ్నశుభోదయనిత్యవృద్ధులన్!



  

8 కామెంట్‌లు:

  1. కవిమిత్రు లందరకు జయనామ నూతన సంవత్సర శుభాకాంక్షలు...

    రిప్లయితొలగించండి
  2. జయ నామ వత్సరమ్మున
    భయమేల మనకు విజయము ప్రాప్తించునుగా
    రయమున సంపద లిచ్చును
    స్వయముగ నీ వత్సరమ్ము సకల జనులకున్!

    రిప్లయితొలగించండి
  3. గురువులకు, పెద్దలకు, పండితులకు, మిత్ర బృందానికి యుగాది శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  4. మంచి మంచి కవితలతో నలరించిన మిత్రులందరికి శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  5. జయనామ సంవత్సర శుభా కాం క్షలు

    ఇందు మొదటగా గురువులు కంది శంక
    రయ్య ,నేమాని ,గోలివారాది కవిగ
    ణంబుల కిడుచు ననిశము నతుల శతము
    నందు కొనుడని బ్రార్ధింతు నాదరమున

    జయము కలిగించి గావుత ! జయ మనబడు
    వత్సర మెపుడు శంకరా భరణ గణపు
    సోదరీ మణులు మఱియు సోదరులను
    నెల్ల వేళల దప్పక చల్ల గాను

    రిప్లయితొలగించండి
  6. పూజ్య గురుదేవులకు, కవిమిత్రులకు జయనామ సంవత్సర శుభాకాంక్షలు

    రిప్లయితొలగించండి
  7. నూతన సంవత్సర శుభాకాంక్షలు అందజేసిన మిత్రులకు ధన్యవాదాలు.
    *
    మిత్రుల కవితలను వారి అనుమతి తీసుకోకుండానే ‘ఉగాది కవితలు’ శీర్షికతో ప్రకటించాను. అందుకు మన్నించాలి.
    జయ నామ నూత్నసంవత్సరానికి స్వాగతం పలుకుతూ చక్కని పద్యాలనూ, ఖండికలను రచించిన మిత్రులు....
    హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారికి,
    మిస్సన్న గారికి,
    మారెళ్ళ వామన్ కుమార్ గారికి,
    బొడ్డు శంకరయ్య గారికి,
    సంపత్ కుమార్ శాస్త్రి గారికి,
    మంద పీతాంబర్ గారికి,
    గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి,
    శైలజ గారికి,
    గండూరి లక్ష్మినారాయణ గారికి,
    కోవెల సంతోష్ కుమార్ గారికి,
    ఏల్చూరి మురళీధర రావు గారికి
    అభినందనలు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి