30, మార్చి 2014, ఆదివారం

సమస్యాపూరణం - 1367 (గతకాలముకంటె)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
గతకాలముకంటె వచ్చుకాలమె మేలౌ.

22 కామెంట్‌లు:

  1. మితి మీరిన దారుణములు
    వెతలం బడద్రోసె మున్ను వేయివిధమ్ముల్
    అతులిత ఫలితము లీయగ
    గతకాలము కంటె వచ్చు కాలమె మేలౌ

    క్షమించాలి వారం పది రోజులుగా జ్వరం వలన సోదరుల మంచి మంచి పూరణనలను మిస్సయ్యాను ఇప్పుడు ఫర్వా లేదు

    రిప్లయితొలగించండి
  2. వెతలెల్ల దీరెను కదా!
    యతులిత సుఖ శాంతులొదవు నయ్యా! నీకున్
    హితభూష శంకరయ్యా!
    గతకాలము కంటె వచ్చు కాలము మేలౌ

    రిప్లయితొలగించండి
  3. గురువులు క్షమించాలి
    మూడవ పాదం ' యతులిత " అని ఉండాలను కుంటాను

    పూజ్య గురువులు పండితుల వారి పద్యము గురువులు శ్రీ శంకరయ్య గారిని ఆశీర్వ దించడం అద్భుతము గానున్నది . మార్వలెస్

    రిప్లయితొలగించండి
  4. రాజేశ్వరి అక్కయ్యా,
    మీకు స్వస్థత చేకూరినందుకు సంతోషం.
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ‘వేయి విధములై/ యతులిత...’ అనండి.
    *
    పండిత నేమాని వారూ,
    పూరణ రూపంలో ఆశీస్సుల నందించారు. సంతోషం, ధన్యవాదాలు.
    గతంలో రెండు మాసాలు వృద్ధాశ్రమంలో ఉన్నరోజులే బాగున్నవి. మళ్ళీ వృద్ధాశ్రమవాసం తప్పేట్టు లేదు. అక్కడే నాకు సుఖశాంతులు లభిస్తాయి. అదే నాకు మేలైనది.

    రిప్లయితొలగించండి
  5. మతి మాలిన చేతలతో
    గతుకుల బడద్రోసిపోయె గతకాలంబే
    చితికిన యతుకుల బ్రతుకుల
    గతకాలము కంటె వచ్చు కాలము మేలౌ

    వెతికిన లేదే శాంతియు
    పతనము వైపే పరుగులు భారతమందున్
    యతలా కుతలము జేసిన
    గతకాలము కంటె వచ్చు కాలము మేలౌ

    రిప్లయితొలగించండి
  6. వెతలందున నిది తలచకు
    గతకాలము మేలు వచ్చు కాలము కంటెన్
    వెతలందున నిది తలచుము
    గతకాలము కంటె వచ్చు కాలము మేలౌ

    రిప్లయితొలగించండి

  7. నిన్నటి సమస్యకు నా పూరణ.....

    అల్లన నడచుచు దిరిగెడి
    నల్లని కన్నయ్య మొలను నాణెముగానే
    అల్లిన బంగరు త్రాడది
    మల్లియ తీవియకుగాచె మామిడికాయల్

    రిప్లయితొలగించండి
  8. గతమును దలపకు మయ్యా
    వెతలెన్నియొ కలిగె నాకు వేవిధములుగాన్
    గతమొక నరకమె యాయెను
    గతకాలము కంటె వచ్చు కాలము మేలౌ

    రిప్లయితొలగించండి
  9. గత ఘనకీర్తిని తలచుము
    యతిథుల చూడుము సతతము నాదరణముగన్
    మతి జొరనీయకు స్వార్థము
    గతకాలము కంటె వచ్చు కాలమె మేలౌ

    రిప్లయితొలగించండి
  10. శైలజ గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    ‘అందున్ + అతలాకుతల’ మన్నపుడు యడాగమం రాదు. అక్కడ ‘భారతదేశం/ బతలాకుతలము’ అనండి.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    ‘తలచుచు + అతిథుల’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘తలచుచు/ నతిథుల...’ అనండి.

    రిప్లయితొలగించండి
  11. సుతులను భ్రాతల జత గొని
    మితి మీరగ నగదు పదవి మ్రింగ దలచితిన్
    గతి ' మాజీ ' యైనదికద !
    గతకాలముకంటె వచ్చుకాలమె మేలౌ.

    రిప్లయితొలగించండి
  12. భాగవతుల కృష్ణారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  13. మితి మీరిన పర్జన్యము
    గతి దప్పిన రాజకీయ గమనము ప్రజలన్
    మతి హీనుల నొనరించిన
    గతకాలము కంటె వచ్చు కాలమె మేలౌ

    రిప్లయితొలగించండి
  14. నాగరాజు రవీందర్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    గండూరి లక్ష్మినారాయణ గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  15. గతమును దలంచి వగచుచు
    సతతము తమ వర్తమాన సారము మఱువన్
    వెతలె మిగులు, కదలండోయ్
    గత కాలము కంటె వచ్చు కాలమె మేలౌ!

    రిప్లయితొలగించండి
  16. గతమది చెడ్డదైన గత కాలము కంటెను వచ్చుకాలమే
    వెతలను దీర్చునంచు మది భీతి విదల్చుక సాగిపోవలెన్
    గతమది మంచిదైన గత కాలపు స్ఫూర్తి వెలుంగు జూపగా
    వెతల జయించి ముందునకు వేడుక మీరగ సాగిపోవలెన్.

    ఏతావాతా చెప్పేదేమంటే .... గోలి హనుమచ్ఛాస్త్రి గారన్నట్లు

    వెతలందు మరువ దగునిది
    'గతకాలము మేలు వచ్చు కాలము కంటెన్'
    వెతలందున తలుపదగును
    'గతకాలము కంటె వచ్చు కాలము మేలౌ'.

    రిప్లయితొలగించండి
  17. సతతము సత్సాదనలో
    శ్రుతిమార్గముననుసరించుశుద్దజ్ఞానుల్
    హితమును గూర్చిన,భళిరా
    గతకాలము కంటె వచ్చు కాలము మేలౌ!!!

    రిప్లయితొలగించండి
  18. సాహదేవుడు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    మిస్సన్న గారూ,
    మీ పూరణ, దానికంటె ముందున్న వివరణాత్మకపద్యం రెండూ బాగున్నవి. అభినందనలు.
    *
    మంద పీతాంబర్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  19. సతమతమౌ బ్రతుకులతో
    వెతలెన్నియొ కలిగినట్టి పేదల బాధల్
    హతమొనరించనిది గతము,
    గత కాలము కంటె వచ్చు కాలమె మేలౌ!

    రిప్లయితొలగించండి
  20. బొడ్డు శంకరయ్య గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  21. అతి పోకడలకు కాలము
    నతమస్తకమయ్యెనేడు; నమ్ముదు మదిలో
    శతవిధముల మెఱుగదియౌ
    గతకాలముకంటె వచ్చుకాలమె మేలౌ.

    రిప్లయితొలగించండి
  22. అతిమౌనమె మేలనుచు
    న్నతివకు పదసేవ జేసి నవ్వుల పాలై
    కుతకుత లాడెడి ప్రభుతకు
    గతకాలముకంటె వచ్చుకాలమె మేలౌ!

    రిప్లయితొలగించండి