24, మార్చి 2014, సోమవారం

పద్య రచన – 545

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

21 కామెంట్‌లు:

  1. ఇండొనేషియాలో

    అచటనె సనాతనమ్మగు నార్షధర్మ
    విధిని పూజ సలుపుచుంద్రు వేరు మతము
    వారలెల్లరు నెంతయు పరవశమ్ము
    తోడ నిచటివారినిఁ జూడ తుళ్ళుచుంద్రు.

    రిప్లయితొలగించండి
  2. కులమత బేధము లేదని
    చెలు లందరు కలసి మెలసి చేయగ పూజల్
    యిలనేలెడు దైవ మొకటని
    పలములు భోజ్యములు దెచ్చిప్రార్ధించె మదిన్

    రిప్లయితొలగించండి

  3. 'సల్మానులమై' వచ్చితిమి సీతా రామా
    సన్మానము గైకొనుము హారతి తోడన్
    ఇచ్చె ఈ భారతమ్ము వేల ఏండ్లు ఏ
    మతమ్మునకైనను హార్దిక సమ్మతమ్మున్ !!


    శుభోదయం
    జిలేబి

    రిప్లయితొలగించండి
  4. పరమత సహనమును వారు ప్రదర్శించి
    పూజచేయు చుండ్రి ముదము తోడ
    నల్ల, యేసు, విష్ణు లందరు సములని
    తెలియ జెప్పినారు ధీరమతిన

    రిప్లయితొలగించండి
  5. దైవ మొక్కడే యనుచును దమము తోడ
    ని తర మతముల వారును నీశు లైన
    సీత మఱియును రాముని జేరి పూజ
    చేయు చుండిరి చక్కగ జిత్ర మందు

    రిప్లయితొలగించండి
  6. పౌరు లంద రెపుడు పరమత సహనమ్ము
    కలిగి యున్న మహిని గలుగు జయము
    ముస్లిమైన గాని పూజించి రాముని
    దైవ మొక్కడనుచు భావ మిడెను

    రిప్లయితొలగించండి
  7. రామునిలో అల్లాగని
    ప్రేమముతోగొలిచి చెలులు వేడుక నొందెన్
    నామము రూపము మారిన
    రాముడు జీససు రహీము, రక్షకుడొకడే

    రిప్లయితొలగించండి
  8. తలుపడు జీవుల భేదము
    కులమత వేఱిమి నభవుడు గుఱుతించడుగా
    తెలుయుము దైవంబొకడే
    కలనైనను భేదమరయక భజించు మదిన్

    రిప్లయితొలగించండి
  9. ఒకటే మాటను దాలిచి
    ఒకటే బాణము రఘుపతికొకటే సతియే
    నొకడే దైవమటంచును
    మీకడ మ్రొక్కిమతమనక మెచ్చిరి రామా!

    రిప్లయితొలగించండి
  10. శ్రీ అన్నపురెడ్డి సత్యనారయణ రెడ్డి గారు! శుభాశీస్సులు,
    మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు.
    1వ పాదము చివరలో గణములను సరిగా వేయలేదు. సవరించండి.
    ఆఖరిలో ధీరమతినకి బదులుగ ధీరమతులు అనవచ్చు.

    శ్రీమతి శైలజ గారు: శుభాశీస్సులు.
    మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు.
    చెలులు వేడుక నొందెన్ అనరాదు కదా. చెలులు వేడుక నొందిరి అనుట సాధువు. కొంచెము మార్చండి.

    శ్రీ పి.ఎస్.ఆర్.మూర్తి గారు: శుభాశీస్సులు.
    మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు. కొన్ని సవరణలు:
    తలుపడు కాదు - తలపడు అనాలి. (తలచు అనునది క్రియాపదము)
    కులమత వేరిమి అనరాదు - దుష్టసమాసము అగును; కులమత భేదము అనుట సాధువు.
    తెలుయుముకి బదులుగా తెలియుము అనాలి.

    శ్రీ సహదేవుడు గారు: శుభాశీస్సులు.
    మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు.
    4వ పాదములో మీరు ప్రాస నియమమును పాటించలేదు. సవరించండి.

    రిప్లయితొలగించండి
  11. పూర్వ జన్మ ఫలాన పొందితిమి భరత
    ......ధాత్రిని జన్మంబు దనుజవైరి!
    వేరువేరు మతాల వివిధ శాఖల ముందు
    ......నీవేలితివి ధాత్రి నీల దేహ!
    దారులు వేరైన చేరును నీదరి
    ......భక్తినే చూతువు పరమపురుష!
    రాముడైన మహారహీమువైనా నీవె
    ......మూల భూతివి గదా ముష్కరారి!

    పర మతస్తులు నిను వేడు టరయ నిజము
    భారతావని సహజమ్ము పరమతముల
    భక్తితో నాదరించుట, భావమందు
    ప్రణవ రూపుని నిల్పుట ప్రార్థనముల.

    రిప్లయితొలగించండి
  12. పూజ్య గురుదేవులు పండిత నేమాని గారికి నమస్సులు. తమరిచ్చిన సలహాకు, సవరణలకు కృతజ్ఞతలు. మొదటి పాదము ఈ క్రింది విధం గా మార్చాను.
    " పరమత సహనమును పావనమని తల్చి".

    రిప్లయితొలగించండి
  13. బంగార మేరీతి సింగార మొలికించు
    ..........నగల యాకృతి నందు జగతిలోన,
    క్షీరమేరీతిగా ధారుణీతలమందు
    ..........బహురూపముల దృప్తి పరచుచుండు,
    మృత్తు తానేరీతి మేదినీస్థలిలోన
    ..........వివిధాకృతులలోన విశదమగును,
    శిలయు నేరీతిగా పలురూపములు పొంది
    ..........పూజింపబడుచుండు పుడమిలోన
    నట్లె విశ్వంబు సృజియించి, యవనివారి
    కఖిల సౌఖ్యంబు లందించి యనవరతము
    రక్ష చేసెడి భగవాను డీక్షితిపయి
    యెన్ని రూపంబు లందునో యెరుగ దరమె. 1.

    రాముడై యొకసారి కామితంబుల దీర్చు,
    ..........కృష్ణుడై ధరవారి తృష్ణ లణచు,
    హనుమ తానేయౌచు నద్భుతం బొనరించు
    ..........వేంకటేశ్వరుడౌచు సంకటములు
    హరియించి భక్తాళి కరుసమందించును,
    ..........లింగరూపంబులో సంగతముగ
    శంకరుండై వెల్గు సజ్జనావనుడౌచు
    ..........నాల్గుమోములు దాల్చి నలువయౌను,
    శక్తిరూపంబులో నుండు, భక్తులైన
    సాధుజనముల పాలిటి సర్వగతుల
    నండయై నిల్చి ధైర్యంబు నందజేసి
    ధర్మ రక్షణ చేసి యీ ధరణి గాచు. 2.

    కరుణామయుండౌచు నిరతసౌఖ్యంబు లీ
    ..........జగతికందించును, సత్త్వమూని
    శిలువనైననుగాని చెదరకుండగ మోయు
    ..........క్రీస్తురూపంబుతో రేలుబవలు,
    తానె యల్లాయౌచు తనను గొల్చెడివారి
    ..........పాతకంబుల ద్రుంచి బహుళగతుల
    బ్రోచువాడై సర్వభోగంబు లందించి
    ..........దయజూచు సర్వదా ధరణి జనుల
    మందిరంబులలోనుండు, మస్జిదులను,
    చర్చి యనియెడి ప్రాంతాన సన్నుతిగన
    వాసముండును భువిలోన వైభవముగ
    నన్నిరూపంబులును దానె యగుచునుండి. 3.

    హరియనుచును, హరయనుచును
    సురుచిరముగ క్రీస్తటంచు సుందరఫణితిన్
    నిరతం బల్లా యనుచును
    స్మరియించెడివారి కొసగు సర్వార్ధంబుల్. 4.

    భావానుగుణ్య రూపం
    బేవేళను బొంది బ్రోచు నిలవారల నా
    దేవాధిదేవు డెల్లెడ
    జీవులలో జేరియుండి శ్రీప్రదుడగుచున్ 5.

    ఎవ్వార లెట్టిరూపము
    నెవ్విధమున గొల్వ బలికి, యింపలరంగా
    నవ్వారికి సుఖసంతతు
    లివ్వంగా బూనుచుండు నీశ్వరుడు దయన్ 6.

    తనమతము గొప్పదంచును
    ఘనతర దర్పంబుతోడ కలుషాత్ముండై
    యనుచితముగ పరనిందలు
    మనుజుం డొనరింపరాదు మదమత్తుండై 7.

    పరమతనిందాసక్తుని
    కరుణాత్ముండయ్యు ప్రభుడు కలుషోదధిలో
    చిరకాలము పడద్రోయును
    నరులీ సత్యంబు తెలిసి నడువగ వలయున్ 8.

    పరమత సహనము జూపెడి
    నరు డిహమున వలసినట్టి నానార్థంబుల్
    స్థిరయశము లంది మీదట
    పరసుఖములు పడయగలడు పరమాత్ముకృపన్. 9.

    ఔరా! ముస్లిము వనితలు
    శ్రీరాముని గొల్వబూని చేరిరి యిచటన్
    వీరల కారఘురాముడు
    కారుణ్యము జూపి దీర్చు కామితము లికన్ 10.

    మహ్మదీయాంగనామణుల్ మహితగుణుని
    రామచంద్రుని పూజించ నీమమొప్ప
    చేరు తీరిది స్పష్టంబు చేయుచుండె
    మానవులలో పరమతాభిమానదీప్తి. 11.


    రిప్లయితొలగించండి
  14. ప్రణామములు గురువుగారు..మీ సూచన ప్రకారం మార్చాను...తప్పయిన మన్నించి సవరించప్రార్ధన....

    రామునిలో అల్లాగని
    ప్రేమము తోచెలులుజేసె విధిగా పూజల్
    నామము రూపము మారిన
    రాముడు జీససు రహీము, రక్షకుడొకడే

    రిప్లయితొలగించండి
  15. మతము అడ్డు యేల మానవతము విరియ
    నంతరాలు తొలగు నవనిలోన
    మతమనడ్డుగోడ మాసిపోవుటిలను
    సామరస్యమందు సాగుజగటి

    రిప్లయితొలగించండి
  16. అమ్మా! శైలజ గారూ! శుభాశీస్సులు.
    బహువచనము వాడినప్పుడు పూజ చేసె అనరాదు. పూజ చేసిరి అనవలెను. మీ పద్యమును ఇలాగ సవరించుచున్నాను:

    రాముని గని యల్లా యని
    ప్రేమముతో బూజ చేసిరి చెలియలు కదా
    నామము రూపము మారిన
    రాముడు జీససు రహీము లా రక్షకుడే

    రిప్లయితొలగించండి
  17. కవిమిత్రులారా,
    రాముని చిత్రాలపై ఉర్దూలో ‘జై శ్రీరామ్’ అని వ్రాసి ఉన్న అక్షరాలను గమనించారా? ఉర్దూ మీడియం స్కూల్లో పనిచేసినందువల్ల కొద్దిగా ఉర్దూ చదవడం వ్రాయడం అబ్బింది లెండి!
    *
    లక్ష్మీదేవి గారూ,
    నిజమే! ఇండోనేషియాలో ముస్లిములు హిందూ దేవుళ్ళను పూజిస్తారని విన్నాను.
    మంచి పద్యాన్ని వ్రాశారు. అభినందనలు.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    మూడవ పాదాన్ని యడాగమంతో ప్రారంభించారు. అక్కడ ‘తలపించు దైవ మొకటని’ అందాం.
    *
    జిలేబీ గారూ,
    మీ భావానికి నా పద్యరూపం.......
    ఇదె ముసల్మానుల మిచ్చట కేగుదెంచి
    రామ! హారతి నిత్తుము నీమమునను
    భరతదేశము వేల సంవత్సరముల
    మతసహన మెంతొ చూపించి నుతుల నందె.
    *
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    మొదటి పాదం సరిగానే ఉంది. నేమాని వారు అది తేటగీతి అని పొరబడి ‘ప్రదర్శించి’ గణదోష మన్నారు.
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    చక్కని పద్యాన్ని వ్రాశారు. అభినందనలు.
    ‘రాముడు + ఒకటే’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘రాముం డొకటే’ అనండి.
    *
    సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    శైలజ గారూ,
    బాగుంది మీ పద్యం. అభినందనలు.
    రెండవ పాదాన్ని ఇలా సవరిస్తున్నాను. ‘ప్రేమమున గొలిచిరి చెలులు వేడుకతోడన్"
    మీ సవరణలోనూ లోపం ఉంది. ‘చెలులు చేసె’ (చేసిరి అని ఉండాలి కదా!)
    నేమాని గురువు గారి సవరణ పద్యాన్ని చివరగా చూశాను.
    *
    పియెస్సార్ మూర్తి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    గురుదేవులు నేమాని వారి సవరణలను గమనించండి.
    (దయచేసి మీ పూర్తి పేరు మరోసారి తెలియజేయండి.)
    *
    సహదేవుడు గారూ,
    బాగుంది మీ పద్యం. అభినందనలు.
    ‘నొకడే దైవమటంచును
    నొక మత మనకుండ శ్రద్ధ నుంచిరి రామా!" అని ప్రాసదోషాన్ని తొలగిద్దామా?
    *
    మిస్సన్న గారూ,
    ‘భారతావని సహజమ్ము పరమతముల
    భక్తితో నాదరించుట’ అంటూ మీరు చెప్పిన పద్యం చాలా బాగుంది. అభినందనలు.
    *
    హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
    ‘మానవులలో పరమతాభిమానదీప్తి’ విలసిల్లాలంటూ మీరు వ్రాసిన ఖండిక అత్యుత్తమంగా ఉంది. ఇది విద్యార్థులకు పాఠ్యాంశంగా పెట్టడానికి సంపూర్ణ యోగ్యత కలిగి ఉంది. అభినందనలు, ధన్యవాదాలు.
    *
    పానుగంటి గారూ,
    మంచి పద్యాన్ని వ్రాశారు. అభినందనలు.
    ‘మతము + అడ్డు + ఏల = మత మడ్డేల’ అవుతుంది. విసంధి, యడాగమం ఉండకూడదు. ‘మతపు టడ్డు లేల’ అనండి.
    (మీ పూర్తి పేరు తెలియజేయండి.)
    *
    పండిత నేమాని వారూ,
    మిత్రుల పద్యాలను సమీక్షించినందుకు కృతజ్ఞుడను.

    రిప్లయితొలగించండి
  18. శంకరయ్య గారు నా పద్యముపై స్పందించినందుకు ధన్యవాదాలు. నా పూర్తి పేరు పానుగంటి చంద్రయ్య

    రిప్లయితొలగించండి