20, మార్చి 2014, గురువారం

పద్య రచన – 541 (నరనారాయణులు)

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

17 కామెంట్‌లు:

 1. అనుజుని తోడుగా వనరుహాక్షుడు రాముడు భక్తవత్సలుం
  డనుపమ సుందరాంగుడు దయామృతసాగరు డొప్పు మీర ద
  ర్శనమిడె భక్తబృందములు ప్రార్థన సేయుచు సంభ్రమమ్ముతో
  దనరెడు మానసాబ్జములు తన్మయమందుచు బొంగుచుండగా

  రామా! రవి వంశాంబుధి
  సోమా! రణరంగ భీమ1 శుభగుణధామా!
  భూమీతనయా హృదయా
  రామా! మారాభిరామ! ప్రస్తుత నామా!

  శూరా! దశరథ రాజకు
  మారా! వీరాధివీర! మదనాకారా!
  ధీరా! యాశ్రితజన మం
  దారా! దుర్గుణవిదూర! ధర్మోద్ధారా!

  పొందితిమి నీదు దర్శన
  మొందితి మూహింపరాని యుత్తమ యోగం
  బొందితి మతిధన్యత్వము
  వందనమో రామచంద్ర! పార్థివ చంద్రా!

  రిప్లయితొలగించండి
 2. నరనా రాయణు లనుగని
  శిరములు తాటించి మ్రొక్కె శ్రీహరి యనుచున్
  హరిహరుల కబేధ మనెదరు
  వరదుడ గాపాడు మయ్య వారిజ నేత్రా

  రిప్లయితొలగించండి
 3. నరనా రాయణు లనుగని
  కరములు జోడించి మునులు గరుణను గోరెన్
  నరహరి యవతారమనుచు
  పరిపరి విధములనుతించి పరవశమొందెన్

  రిప్లయితొలగించండి
 4. బదరీ వనమందుమునులు
  బదరీనారాయణులను భక్తిగ గొలిచెన్
  పృధివీ తలమున శ్రీహరి
  బదరీ క్షేత్రమునవెలసి భక్తుల భ్రోచెన్

  రిప్లయితొలగించండి
 5. పండిత నేమాని వారూ,
  ‘నరనారాయణుల’ చిత్రాన్ని రామలక్ష్మణుల చిత్రంగా పొరబడ్డా... ఆ పొరపాటు అంత్రానుప్రాసతో శోభించే రామస్తుతిని ప్రసాదించింది. సంతోషం. ధన్యవాదాలు.
  *
  రాజేశ్వరి అక్కయ్యా,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  *
  శైలజ గారూ,
  మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 6. నరుడు మఱి యునా రాయణు లిరువురచట
  దర్శనము నీ యగను నారదాదులు గడు
  నయము తోడన సాష్టాంగ నతులు జేసె
  చూడ కనువిందు గొలిపెను జూ డ్కులకును

  రిప్లయితొలగించండి
 7. ధర వ్రాలెన్ ముని బృందమా యెడను-- తా దంభమ్ముఁ జూపించుచున్
  సురముఖ్యుండల నచ్చరాంగనలనచ్చోటన్ తపోభంగమౌ
  తెఱగున్ పంపగ నూర్వశిన్ సృజన నంతే వేగముంజేయునా
  నరనారాయణులన్ గనంగనట నానందమ్మునిండారగా.

  రిప్లయితొలగించండి
 8. నరనారాయణులన్ కృపాభరణులన్ జ్ఞానప్రభాశాలురన్
  పరమానందనిధానులన్ బదరికా ప్రఖ్యాటవీ వాసులన్
  గురుభక్తిన్ ప్రణుతించి కోరిరి మునుల్ క్షోణిన్ విజృంభించు ము
  ష్కర కోట్లన్ దునుమాడి రక్ష నిడుచున్ గష్టంబులన్ దీర్పగా

  రిప్లయితొలగించండి
 9. అచ్యుతుండు తాఁ జనియించె నవని యందు
  నరుడు నారాయణు డనెడి నామములను
  తపము చేయుచు వారలు తనరు చుండ
  మునులు పూజలు సల్పిరి మోక్షమొంద

  రిప్లయితొలగించండి
 10. పైడికశిపు జంపి ప్రహ్లాదు రక్షించె
  .......నరహరి రూపమ్ము హరి ధరించి
  నరసింహ తేజంపు నరరూపు నరునిగా
  .......హరిరూపు నారాయ ణాఖ్య మాయె
  బదరికాశ్రమమున భగము జేయగ వీర
  .......లమరేంద్రు డంపినా డచ్చరలను
  నారాయణుండంత నయముగా తొడ గీట
  .......నూర్వశి జనియించె నూరువునను
  అందచందమ్ముల నామె తమను మించ
  .......నవమాన మాయెనా యచ్చరలకు
  తపము భంగము జేయ తరలి వచ్చిన వారి
  .......గర్వ భంగమ్మాయె పర్వు మాసె
  సాహస్ర కవచుడు సమరమ్మునకు రాగ
  .......నొకరు తప మొనర్ప నొకరు పోరి
  దైత్యుని భంజించి తపము సాగించిరి
  .......బదరిని వెలసిరి ప్రాభవముగ

  విష్ణు దివ్యాంశ సంభూత వైభవాన
  శమదమాదుల మునులకు సలిపి బోధ
  మోక్ష సాయుజ్యముల నిచ్చి ముదము మీర
  నరుడు నారాయణుండును ధరను మనిరి.

  రిప్లయితొలగించండి
 11. మిస్సన్న గారు,
  అనేక ధన్యవాదములు.
  నరనారాయణులు ఊర్వశిని సృష్టించుట, వారి యవతార రూపాలే కృష్ణార్జునులని మాత్రమే తెలుసు. మీరు సహస్ర కవచుని విషయము ప్రస్తావించినది చూచి నెట్ లో వెతికి వారి కథనెల్లను తెలిసికొంటిని.
  భాగవతములో కృష్ణార్జునులు బ్రాహ్మణబాలకుని బ్రదికించి తెచ్చుటకై బయలుదేరి అన్ని లోకములను దాటి నరనారాయణ స్వరూపమే మనమను మాట కృష్ణుడు అర్జునునకు తెలుపు ప్రస్తావన చదువుట తప్ప నరనారాయణుల పుణ్యగాథలు తెలియవు. మీ మూలకముగా ఈనాడు తెలిసికొంటిని. ధన్యవాదములు.

  రిప్లయితొలగించండి
 12. నరుని, నారాయణుని కన నారదాది
  మునులు బదరీవనమునకు చనిరి, కరము
  భక్తి తోడను వారల భజన జేసి
  తరలి నారు దివికి కడు తనివి తోడ

  రిప్లయితొలగించండి
 13. సుబ్బారావు గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  ‘నతులొనర్ప’ అంటే క్రియాపదం చక్కగా అన్వయిస్తుంది.
  *
  లక్ష్మీదేవి గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  *
  పండిత నేమాని వారూ,
  మీ పద్యం ప్రశస్తంగా ఉంది.. అభినందనలు.
  *
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
  *
  మిస్సన్న గారూ,
  నరనారాయణుల గురించిన సమగ్ర విషయాలనూ సీసమాలికలో ఇమిడ్చారు. బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 14. గురువుగారు,
  మీ ప్రొఫైల్ లో విశ్రాంత కాకుండా అవిశ్రాంత అని ఉంటేనే సరిపోతుంది.
  _/\_
  నమస్కారములు.
  ధన్యవాదములు.

  రిప్లయితొలగించండి
 15. శ్రీ మిస్సన్న మహాశయా! శుభాశీస్సులు.

  నర నారాయణుల కథను
  సరళమ్మగు భాషలోన సత్కవితగ మా
  కెరిగించిన నీ ప్రతిభకు
  పరితోషము మెరయ గూర్తు బహు సంస్తుతులన్

  రిప్లయితొలగించండి
 16. నేమాని పండితార్యా! చాలా సంతోషంగా ఉంది.

  గురువుగారూ ధన్యవాదాలు.

  లక్ష్మీదేవి గారూ ధన్యవాదాలు. నిజానికి నాకు లభించిన సమాచారం కూడా నెట్ లోనిదే.

  రిప్లయితొలగించండి
 17. కురు సంగరమీ జీవిత
  పరిభ్రమణమంచు 'గీత ' పథమున్ దెలుపన్
  నరనారాయణ తత్వము
  ధరలో ధర్మము నిలుపగ తపియించుటయే !

  రిప్లయితొలగించండి