27, మార్చి 2014, గురువారం

సమస్యాపూరణం - 1364 (బద్దకించువాఁడె)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
బద్దకించువాఁడె భాగ్యశాలి.
ఈ సమస్యను సూచించిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదాలు.

16 కామెంట్‌లు: 1. పరుగులు జేసి సేద దీర నేల
  కష్ట పడి ఫలమును పొంద నేల
  బువ్వ తిని బజ్జో చిన్ని నాన్నా
  బద్దకించు వాడె భాగ్యశాలి కన్నా


  జిలేబి

  రిప్లయితొలగించండి
 2. కర్మఫలము కోరి కాయకష్టమొనర్చి
  దినదినంబు నూత్నతేజమంది
  పనుల జేయుచుండి బద్ధకించుటయందు
  బద్ధకించువాఁడె భాగ్యశాలి.

  రిప్లయితొలగించండి
 3. ఏపనిని చేయని వాడు ఏ తప్పూ చేయడు. వాని రికార్డులో ఎర్రసిరామార్కు ఉండదు.ప్రభుత్వ సంస్థల్లో పదోన్నతి గూడ పొందుతారు.
  అన్నిపనులు జేసి మన్ననలను బొంది
  నట్టి వాడు సతము నగడు పడును
  పనిని ముట్టకొకడు నానందముగ నుండు
  బద్దకించు వాడె భాగ్య శాలి

  రిప్లయితొలగించండి
 4. పనులు జేయ కున్న పరమసోమరగును
  బధ్ధ కించు వాడె , భాగ్య శాలి
  యగును బద్దకమును దిగవైచినంతనె
  జయము బడయు నెపుడు జగతి లోన

  రిప్లయితొలగించండి
 5. కష్ట జీవి ముందు కాలమే తలవంచు
  వరమిడు సిరి యేల బద్దకించు?
  వాడె భాగ్య శాలి వాడెపో ధీశాలి
  యశము ,జయము వాని వశము గాదె !!!

  రిప్లయితొలగించండి
 6. బద్ధ కించు వాడె భాగ్య శాలి యగునా ?
  అబ్బురమ్ము గొలిపె యార్య !యిదియ
  బద్ధ కించు వాడె పరమ సొమరి యగు
  భక్తి గలుగ నగును భాగ్య శాలి

  రిప్లయితొలగించండి
 7. ఉన్నదానితోనె యూరట జెందక
  గెద్దలట్లు దోచు విద్యనెరిగి
  దూరి సజ్జనులను, దుష్కార్య ములజేయ
  బద్దకించువాఁడె భాగ్యశాలి.

  రిప్లయితొలగించండి
 8. శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు
  నీ శిష్య పరమాణువు వినమ్రవందనములతో.
  ఈ మధ్య టివి లోని ప్రకటన "కరెంట్ బిల్లు కట్టలేదు, రాబోవు మూడు దినములు సెలవులు, అయ్యో .. అప్పుడు బద్దకమున సుతుడు సెల్లు దీసి బిల్లు కట్టు" అది
  ===============*==============
  సకల సొగసులు గల జక్కని యొక సెల్లు
  కరము నందు జేర ఖరము వలెను
  సకల కార్యములను సరగున జేయగన్,
  బద్దకించువాఁడె భాగ్యశాలి.

  రిప్లయితొలగించండి
 9. బద్దకించు వాడె భాగ్యశాలి యటంచు
  విని యొకండు నమ్మి యనుభవమున
  బద్దకమున మొద్దు నిద్దుర వోవగా
  భాగ్య రాసులబ్బె స్వప్నమందు

  రిప్లయితొలగించండి
 10. మిత్రులారా! శుభాశీస్సులు. ఈనాటి పూరణలు అన్నియును అలరించుచున్నవి. అందరికి అభినందనలు.

  శ్రీ సంపత్ కుమార్ శాస్త్రి గారు:
  బద్దకమునకే బద్దకించుట అని double negative గా చెప్పేరు. బాగున్నది మీ పద్యము.

  శ్రీ అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారు:
  ప్రభుత్వ కార్యాలయములలో తీరును ఉట్టంకించేరు. బాగున్నది మీ పద్యము. 3వ పాదములో యతి కాని ప్రాసయతి కాని లేదు.

  శ్రీ మంద పీతాంబర్ గారు: మంచి విరుపుతో పూరించేరు. బాగున్నది మీ పద్యము.

  శ్రీమతి శైలజ గారు:
  పరమ సోమరి యనుట సాధువు కాదు. బద్దకములేని వాడు బడయు జయము అన్నారు. పద్యము బాగున్నది.

  శ్రీ సుబ్బా రావు గారు:
  పరమ సోమరి అనుట దుష్ట సమాసము. భక్తి గలుగ నగును భాగ్య శాలి అన్నారు. పద్యము బాగున్నది.

  శ్రీ భాగవతుల కృష్ణా రావు గారు: నమస్కారములు.
  గద్ద (గ్రద్ద) అనుటకు గెద్ద అన్నారు - టైపు పొరపాటా? దుష్కార్యముల చేయుటకు బద్దకించు వాని గురించి చెప్పేరు. పద్యము బాగుగనున్నది. 2వ పాదములో ప్రాసయతి నియమము పాటింపబడలేదు.

  శ్రీ కందుల వరప్రసాద్ గారు:
  సకల సొగసులు అనుట సాధువు కాదు. సెల్లుతో జరుపుచున్న పనులను గూర్చి చెప్పేరు. మీ పద్యము బాగుగనున్నది.

  స్వస్తి.

  రిప్లయితొలగించండి
 11. పూజ్య గురుదేవులు శంకరయ్య గారికి నమస్సులు. మూడవ పాదాన్ని యిలామార్చాను
  "పనిని ముట్టకొకడు పరగును సుఖముగన్"

  రిప్లయితొలగించండి
 12. కలిమిఁ గూడ బెట్టు బలిమి సొంతంబని
  యంది నంత దోచు యావ మాని
  యక్రమార్జనముకుపక్ర మించక తాను
  బద్ధ కించు వాడె భాగ్యశాలి

  రిప్లయితొలగించండి
 13. శ్రీ అన్నపురెడ్డి సత్యనారాయణరెడ్డి గారు: శుభాశీస్సులు.
  మీరు సవరించిన పాదము బాగుగనే యున్నది.

  శ్రీ నాగరాజు రవీందర్ గారు: శుభాశీస్సులు.
  మీ పద్యము బాగుగ నున్నది. బద్దకము వలన బస్సు ప్రమాదములో తాను లేకపోవుట భాగ్యమే కదా. అభినందనలు.

  శ్రె సహదేవుడు గారు: శుభాశీస్సులు.
  మీ పద్యము బాగుగ నున్నది. అక్రమార్జనమునకు అనుట సాధువు. అక్రమార్జనముకు అనరాదు.

  స్వస్తి.

  రిప్లయితొలగించండి
 14. పూజ్య గురుదేవులు పండిత నేమాని గారికి నమస్సులు. తమరిచ్చిన సలహాలకు సవరణలకు కృతజ్ఞతలు.

  రిప్లయితొలగించండి
 15. శ్రీ నాగరాజు రవీందర్ గారు! శుభాశీస్సులు.
  మీ తాజా పద్యము కూడా మంచి విరుపుతో చాల బాగుగ నున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 16. కవిమిత్రులకు నమస్కృతులు.
  హైదరాబాదుకు అనుకున్న ప్రయాణం హుస్నాబాదుకు మారింది. అక్కడ ఒక పెళ్ళికి వెళ్ళి ఇంతకుముందే ఇల్లు చేరాను.
  నిన్న, ఈరోజు మిత్రులు ఉత్సాహంగా పూరణలు, పద్యాలను వ్రాయడం, పండిత నేమాని వారు దయతో వాటిని సమీక్షించడం నాకు ఆనందాన్ని, తృప్తిని కలిగించాయి. అందరికీ ధన్యవాదాలు.
  మంచి పూరణలు చెప్పిన మిత్రులు.....
  సంపత్ కుమార్ శాస్త్రి గారికి,
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి,
  శైలజ గారికి,
  మంద పీతాంబర్ గారికి,
  సుబ్బారావు గారికి,
  భాగవతుల కృష్ణారావు గారికి,
  కందుల వరప్రసాద్ గారికి,
  పండిత నేమాని వారికి,
  నాగరాజు రవీందర్ గారికి,
  సహదేవుడు గారికి,
  అభినందనలు.

  రిప్లయితొలగించండి