16, మార్చి 2014, ఆదివారం

సమస్యాపూరణం - 1353 (సాహెబు తా నిష్టపడు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
సాహెబు తా నిష్టపడు వసంతోత్సవమున్.

21 కామెంట్‌లు:

 1. మోహా వేశము నందున
  సాహెబు తానిష్ట పడు వసంతో త్సవమున్
  స్నేహితులు గేలిజేయగ
  నాహా యీరంగు ఘోష నాకేల యనెన్

  రిప్లయితొలగించండి
 2. స్నేహితులు నాకు మువ్వురు
  మోహన్, మోజెస్సు మరియు మొగలా సాహెబ్
  జీ హా మైకో ప్యారని
  సాహెబు తా నిష్టపడు వసంతోత్సవమున్.

  రిప్లయితొలగించండి
 3. జీహా ! వచ్చితినిదెయని
  దేహంబున రంగుపులుమ దిగివచ్చె గృహం
  బీ హోలీ కనువిందని
  సాహెబు తా నిష్టపడు వసంతోత్సవమున్.

  ఆ హిమగిరిపై ముని సా
  మూహిక ప్రార్ధనలు సలుపు మొహరము నాడే !
  యాహా హోలీ యనుచును
  సాహెబు తా నిష్టపడు వసంతోత్సవమున్. !

  రిప్లయితొలగించండి
 4. వాహెబ్ వివాహ మాడెను
  మోహిని యను హిందువు నతి మోహము తోడన్
  సాహిణము నడుపు నాచిన
  సాహెబు తానిష్ట పడువసంతోత్సవమున్

  రిప్లయితొలగించండి
 5. తాహెర్ ఖా నను వర్తకుఁ
  డా హుబ్లీలోన రంగు లమ్మును, తన కౌ
  రా హోళి గిరాకి పెరుగ
  సాహెబు తా ఇష్టపడు వసంతోత్సవమున్.

  రిప్లయితొలగించండి
 6. ఆహా పరమత సహనము
  మోహన మిట హిందువుడును మొహరము మెచ్చున్
  స్నేహముతో సహృదయు డయి
  సాహెబు తా నిష్టపడు వసంతోత్సవమున్

  రిప్లయితొలగించండి
 7. ఈ హోళీ పండుగను మ
  నోహరముగ జగుపుచుండ న్యూనత లేకన్
  స్నేహితులతోడ నాడుచు
  సాహెబు తానిష్ట పడు వసంతోత్సవమున్!

  రిప్లయితొలగించండి
 8. సౌహార్ద కౌగిలింతకు
  సాహెబు తానిష్టపడు , వసంతోత్సవమున్
  బాహాటంబుగ జేయగ
  నీ హోలీ దినమునాడు హిందువు తలచున్ II

  రిప్లయితొలగించండి

 9. ఆహా ! యేమని చెప్పిరి ?
  సాహెబు తా నిష్టపడు వసంతో త్సవమున్
  సాహెబు మాత్రమె కాకను
  సాహెబు బంధువులు కూడ సైయని రార్యా !

  రిప్లయితొలగించండి
 10. రాజేశ్వరి అక్కయ్యా,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ మిత్రులపై పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘మైకో’ అనరాదు. ‘ముఝ్ కో (లేదా) ముఝే’ అనాలి. పామరులు ‘మేరేకో’ అని అంటారు.
  *
  భాగవతుల కృష్ణారావు గారూ,
  మీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు.
  *
  నాగరాజు రవీందర్ గారూ,
  మణిప్రవాళంలో మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  మిస్సన్న గారూ,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.
  *
  బొడ్డు శంకరయ్య గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  డా. మాడుగుల అనిల్ కుమార్ గారూ,
  విరుపుతో చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
  *
  సుబ్బారావు గారూ,
  సైయనిపించే పూరణ చెప్పారు. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 11. డా. మాడుగుల అనిల్ కుమార్ గారు: శుభాశీస్సులు.
  మీ పద్యములో "సౌహార్ద కౌగిలింత" అనే సమాసము సాధు ప్రయోగము కాదు. సవరించండి. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 12. స్నేహితు లెల్లరు తమ తమ
  తాహతుల మరచి కులమత తగవుల గతులే
  నూహల రానీక మెలగ
  సాహెబు తా నిష్టపడు వసంతోత్సవమున్ !

  రిప్లయితొలగించండి
 13. స్నేహితులు యువతి యువకులు
  దేహంబులు మరచి హోళి దినమున ప్రీతిన్
  ఆహా! జరుపుట గనుగొని
  సాహెబు తానిష్ట పడు వసంతో త్సవమున్

  రిప్లయితొలగించండి
 14. ఆర్యా ! నేమాని వారూ ! నమస్కారములు. ఈ విషయంలో నేను కూడ సందేహించాను. దోషమని చూపినందుకు ధన్యవాదములు. సరి చేస్తున్నాను.

  సౌహార్దాలింగనమును
  సాహెబు తానిష్టపడు , వసంతోత్సవమున్
  బాహాటంబుగ జేయగ
  నీ హోలీ దినమునాడు హిందువు తలచున్ II

  రిప్లయితొలగించండి
 15. సాహసము హెచ్చు బుచ్చియె
  సాహెబు మా వాడలోన సరదా పడుచున్
  మోహనుడై తిరుగుచు నా
  సాహెబు తా నిష్టపడు వసంతోత్సవమున్

  రిప్లయితొలగించండి
 16. డా. అనిల్ కుమార్ గారూ! శుభాశీస్సులు.
  మీ సవరణ బాగుగ నున్నది. అభినందనలు. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 17. సహదేవుడు గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  ‘మత తగవులు’ అని సమాసం చేయరాదు కదా. అక్కడ ‘మతముల తగవుల గతులే/ యూహల రానీక...’ అనండి.
  *
  గండూరి లక్ష్మినారాయణ గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  ‘యువతీ యువకులు’ అనాలి కదా. అప్పుడు గణదోషం అవుతుంది. కనుక అక్కడ ‘స్నేహితులగు నవయువకులు...’ అందామా?
  *
  పండిత నేమాని వారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 18. మాస్టరుగారూ ! ధన్యవాదములు...నిజమే..ఉర్దూపదం తప్పుగా వ్రాశాను...మీరు చెప్పినట్లుగా సవరించుచున్నాను..


  స్నేహితులు నాకు మువ్వురు
  మోహన్, మోజెస్సు మరియు మొగలా సాహెబ్
  జీ హా ముఝ్ కో ప్యారని
  సాహెబు తా నిష్టపడు వసంతోత్సవమున్.

  రిప్లయితొలగించండి


 19. మోహంబయ్యెడి వేళన్
  బాహాటమ్ముగ జిలేబి పారుండైనన్
  జోహారనుచున్నైనన్
  సాహెబు, తానిష్టపడు వసంతోత్సవమున్!

  జిలేబి

  రిప్లయితొలగించండి
 20. ఆ హోలీ పండుగనున్
  మా హాస్టలునందు భంగు, మందులు పంచన్
  ఆహా! ఆహా! అనుచున్
  సాహెబు తా నిష్టపడు వసంతోత్సవమున్

  రిప్లయితొలగించండి