26, మార్చి 2014, బుధవారం

పద్య రచన – 547

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

20 కామెంట్‌లు:

  1. విద్యలెన్నొ కలవు విద్యల నేర్పెడు
    గురులు కలరు కాని పరమమైన
    విద్య వేరటంచు వేదాంతవేద్యుడౌ
    నాదిగురుని గొలువు డాదరమున

    రిప్లయితొలగించండి
  2. ధర్మైక శాస్త్రవిధానంబులను నేర్పి
    .......... సన్మార్గ గతుల శైశవముజేసె ( ధర్మపురుషార్థము )
    పాఠముల్ బహువిధ పర్యంతములు జెప్పి
    ......... పట్టాలు మేము చేపట్టజేసె ( అర్థపురుషార్థము )
    వివిధ పాండిత్య ప్రభావులై యలర లో
    ....... కజ్ఞానములనిచ్చు కల్పశాఖి ( కామపురుషార్థము )
    భక్తిభావముమాకు భావమందుననిల్పి
    ........ సాధనానుష్ఠాన చయముదెల్పె ( మోక్షసాధనము )

    నిట్టి సద్గురుకీర్తింప నెంతవారి
    కైన సాధ్యమ్ము కాదు తేజోనిధాను
    లార్షధర్మమ్ము కాపాడు నట్టి బుధులు
    వందనమ్ముల జేతు సద్భక్తితోడ.



    రిప్లయితొలగించండి
  3. తేటతెల్లమగు రీతి పలు తెఱగుల పాఠముఁ జెప్పి
    యాటపాటల నేర్పి ప్రియమునందరియందున నిలిపి
    పూటపూటకు వారి ప్రగతి పోడిమిఁ బెంపొనర గని
    నేటికి రేపటికైన నీవు యందుము వందనముల.

    మధ్యాక్కర
    4 పాదములు ఉండును.
    ప్రాస నియమం కలదు
    ప్రతి పాదమునందు 4 వ గణము యొక్క మొదటి అక్షరము యతి స్థానము
    ప్రతి పాదమునందు రెండు ఇంద్ర , ఒక సూర్య , రెండు ఇంద్ర , ఒక సూర్య గణములుండును.

    రిప్లయితొలగించండి
  4. ఒజ్జ యనగ మేటి యుపదే శికుండిల
    నుత్తములుగ దీర్చి దిద్ది బాల
    బాలి కలను ,మఱియు భావిపౌ రులజేయు
    వంద నంబు సేతు వందలాది

    రిప్లయితొలగించండి
  5. గరిటె యొక్కటే తక్కువ గురుని చేత (చిత్రమందు)
    పాఠ శాలను భోజన పథక మంచు
    వంట పని వప్పజెప్పిరి పాపమతడు
    ముప్పు తిప్పలు పడుచుండె మూల్గుచుండె.

    రిప్లయితొలగించండి
  6. విద్య తోడ దాని విలువ నెరుకజేసి
    మంచిచెడులు నేర్పి మలచె మనువు.
    రాయివంటి వానిఁ రత్నంబు జేయు
    దైవసములు గురువు ధాత్రియందు

    రిప్లయితొలగించండి
  7. అన్ని విద్యలందు నతిశయించ వలయు
    నేటి యువకులంత ధాటి గాను
    సకలవిద్యలకును సారథియై యొజ్జ
    తీర్చి దిద్దవలయు తీరుగాను

    రిప్లయితొలగించండి
  8. మిత్రులారా! శుభాసీస్సులు.
    ఈనాటి పద్యములు చాలా బాగుగ నున్నవి. అందరికి అభినందనలు.

    శ్రీ సంపత్ కుమార్ శాస్త్రి గారు:
    4 పురుషార్థములను గురువు ప్రసాదించును అని చక్కగా సెలవిచ్చేరు. పద్యము బాగుగ నున్నది. సీస పద్యము 3వ పాదములో ప్రాసయతి నియమము పాటింప బడలేదు.

    శ్రీమతి లక్ష్మీ దేవి గారు:
    గురువు యొక్క సద్గుణములన్నిటిని చక్కగా చెప్పేరు - పద్యము బాగుగ నున్నది. నీవు + అందుము అనుచోట యడాగమము రాదు.

    శ్రీ సుబ్బా రావు గారు:
    ఒజ్జ గురించి బాగుగ చెప్పేరు. పద్యము బాగుగ నున్నది. 2వ పాదములో యతిమైత్రి లేదు.

    శ్రీ మిస్సన్న గారు:
    ఒజ్జలకు అదనపు బాధ్యతలు గూర్చి ముచ్చటించేరు - ముప్పు తిప్పలు గురించి విచారించేరు. పద్యము బాగుగ నున్నది.

    Sri Psr Murthi garu
    ఒజ్జ గురించి బాగుగ చెప్పేరు. నెరుగజేసి అనుటకు నెరుకజేసి అనుట టైపు పొరపాటు అనుకొంటాను. 3వ పాదము చివరన "ను" అని కలపండి.

    శ్రీ అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారు:
    సకల విద్యల కును సారథి యొజ్జ అని చక్కగా సెలవిచ్చేరు. పద్యము బాగుగ నున్నది.

    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  9. ఏ రీతి నేర్చు వారల
    కా రీతి న బోధ జేయ నఖిలమ్ము సదా
    బేరీజు వేసెడు గురువు
    నారాధించగ నేరికైన నౌన్నత్య మదే

    రిప్లయితొలగించండి
  10. మంచి మార్గము జూపెడు మార్గదర్శి
    జ్ఞాన భోధన జేయు విజ్ఞాన వేత్త
    మట్టి ముద్దను శిల్పంగ మార్చు శిల్పి
    బహు మఖమ్మల ప్రతిభతో బరగు యొజ్జ
    నట్టి బుధులకు భక్తితో నంజలింతు

    రిప్లయితొలగించండి
  11. శ్రీ సహదేవుడు గారు: శుభాశీస్సులు.
    మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు.
    4వ పాదములో 1 గురువు ఎక్కువగా నున్నది.

    శ్రీమతి శైలజ గారు: శుభాశీస్సులు.
    మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు.
    శిల్పంగ అనునది వ్యావహారికము; ప్రతిమగ అందామా?
    4వ పాదములో టైపు పొరపాటులు కలవు.

    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  12. గురువుగారికి నమస్సులు.

    తప్పు దొర్లినందులకు క్షమించాలి.

    వివిధ అనుటకు బదులుగా వరలు అంటే సరిపోతుందనుకుంటాను.

    "వరలు పాండిత్య ప్రభావ".......

    రిప్లయితొలగించండి
  13. శ్రీ సంపత్ కుమార్ శాస్త్రి గారు: శుభాశీస్సులు.
    వరలు అని సవరించితే యతి మైత్రి సరిపోవును.
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  14. గురువుగారు, ధన్యవాదములు.

    సవరించిన పద్యము.

    తేటతెల్లమగు రీతి పలు తెఱగుల పాఠముఁ జెప్పి
    యాటపాటల నేర్పి ప్రియమునందరియందున నిలిపి
    పూటపూటకు వారి ప్రగతి పోడిమిఁ బెంపొనర గని
    నేటికి రేపటికైన నిక్కము వంద్యుండవయితి.

    రిప్లయితొలగించండి
  15. నిరతము విద్యను నేర్పుచు
    పరహిత మునుగోరుచుండు వాత్సల్యముతో
    సరిరారు గురువుకెవ్వరు
    గురుదేవోభవ యనుచును గొలువగ రారే!

    రిప్లయితొలగించండి
  16. పూజ్య గురుదేవులకు ధన్యవాదాలు. పద్య సవరణ :

    ఏ రీతి నేర్చు వారల
    కా రీతి న బోధ జేయ నఖిలమ్ము సదా
    బేరీజు వేసెడు గురువు
    నారాధన జేయు శిష్యు నౌన్నత్య మదే

    రిప్లయితొలగించండి

  17. ధన్యవాదములు గురువుగారు...మీ సూచనతో.సవరించాను...కృతజ్ఞతలతో...

    మంచి మార్గము జూపెడు మార్గదర్శి
    జ్ఞాన భోధన జేయు విజ్ఞాన వేత్త
    మట్టి ముద్దను ప్రతిమగ మార్చు శిల్పి
    బహు ముఖమ్ముల ప్రతిభతో బరగు యొజ్జ
    నట్టి బుధులకు భక్తితో నంజలింతు

    రిప్లయితొలగించండి
  18. అన్ని చదువులందునారితేరిగురువు
    మదిన వెలుగు నింప మార్పుగోరు
    కోటివిద్యలన్ని కూటికొరకనెడు
    ప్రగతి బాటలేయు భాధ్యతెరిగి

    రిప్లయితొలగించండి
  19. శ్రీమతి శైలజ గారు: శుభాశీస్సులు.
    సవరించిన మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు.

    శ్రీ పానుగంటి వారు: శుభాశీస్సులు.
    మీ పద్యములో కొన్ని సవరణలు చేయుచున్నాను:

    అన్ని విద్యలందు నారితేరి గురువు
    మది వెలుంగు నింపు మార్పు గోరు
    కోటివిద్యలన్ని కూటి కొరకునయ్యు
    ప్రగతి బాట వేయు బాధ్యతమెయి

    రిప్లయితొలగించండి
  20. పండిత నేమాని గారికి ధన్యవాదాలు. మీసూచనలు మరిన్ని కావాలి.

    రిప్లయితొలగించండి