12, మార్చి 2014, బుధవారం

పద్య రచన – 533

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

24 కామెంట్‌లు:

 1. మత్స్యరూపమ్మున మాధవా! గాచితి
  సృష్టిని; కూర్మమై చేరి సింధు
  మధనమందున సాయమందజేసితివయ్య!
  శ్రీ వరాహమువైతి క్షితిని గావ;
  నరసింహ యాకృతి నాడు ధరించితి
  బాలుని నమ్మిక పాలనమున;
  బలి నిగ్రహింపగా వామనుడైతివి
  పరశువు ధరియించి బలముఁ జూపి;

  రామచంద్రుడై నడయాడి రామతోడ
  కృష్ణ మోహనువైతి సత్కీర్తిఁ బొంది
  హలముఁ జేతినిఁ బూనుచు బలిమిఁ జూపి
  కల్కి కై కాయుమనెదవు కలియుగమున.

  రిప్లయితొలగించండి
 2. గురువుగారు కానీ, పెద్దలెవరైనా సరే నా పద్యాల్లో ఏమైనా లోపాలు కనిపించిన సూచించమని మనవి.
  తిరుపతి యాత్ర వలన పూరణలన్నీ ఈ రోజే చేస్తున్నాను.

  రావణుని పత్ని, సీతమ్మ, రామభగిని
  శాంతను మరి యూర్మిళనైన చక్కగాను
  రామకథయందు మహిళల రమ్యగతిని,
  వారి నడతలఁ దెల్పిన వరుస గనుడు.

  పుణ్యకర్మలఁ జేయుచు ముక్తిఁ బొంద
  విటులు మఱుపుట్టువునన్-యేల వేల్పులు గద
  వరము లియ్యంగ నెదురుగ వచ్చి నిలువ
  వలయు! తప్పును దిద్దుటె పాడి యగును.

  పనికయి వచ్చిన దాసినిఁ
  గని తాగిన మైకమందు కలవరపడజే
  సినచో యద్దాసి కలబ
  డిన విధమును చిత్తరువున డించిరి, భళిరా!

  వారిదదెంత పుణ్యమొకొ! పామరులైనను గొల్లవారలా
  శ్రీరమణీ విశేషమగు శ్రీధరు చేతిని జారు ముద్దలన్
  కూరిమి మీరగా నిచట కోరినవారికి పెట్టు మాధవున్
  చేరిన జన్మ బొందిరిదె సిద్ధియటంచు మనమ్ము నమ్ముదున్.

  వంశస్థము

  పదే పదే వేణురవమ్ము శ్వాసగా
  నదే ప్రతీకమ్ముగ నందగత్తెగా
  నిదిట్లిదే రాధగ సృష్టి సల్పెనే
  సదా మనమ్మందున జంట రూపునన్.

  నీట నుండు మొసలి నీల్గి పలకరింప
  యెగిరి పోక నిలిచి యిక్కడాగె.
  గాలి నెగురగల్గు కతమును వివరించి
  మొసలి కథల వినగ మోజు జూపె.


  సమ్మానమ్మును లేక భూవనితనున్ సంద్రమ్మునన్ ముంచగా
  నిమ్మై శౌర్యముకున్ వరాహముగ దా హేలాగతిన్ సంపగా
  వమ్మున్ జేసితివంచు శత్రువుగ దా పాపాత్ముడైనట్టి యా
  తమ్మున్ జంపినవాని దేవుఁ డనినన్ దప్పేమి యొప్పే యగున్.

  భూభారమంతయు పువుగుత్తివలె నీవు
  భరియుంచు వానివై ప్రణతి గొనుచు
  బుసిరాజు వని నిన్నుఁ బూజించు నాదైన
  పుట్టింటి వారల పూజఁ గొనుచు
  మాయింటి దైవమ్ము మల్లేశుని గళము
  వీడక నిత్యమ్ము పేర్మి నిలుచు
  స్వామివి నీవంచు స్మరియింతు నిన్నెప్డు
  దీవించుమో యయ్య! తృప్తిఁ దీర

  గా ఫణీంద్ర! మాకు కరుణతోనెవ్వేళ
  చల్లదైన చూపు శాంతి నొసగ
  నెల్లవేళలందు నింపుగ సారించు!
  నాగరాజ! నిలుపు నమ్మకమ్ము.

  కర్తయు నాతడె, జగతికి
  భర్తయు నాతండె , యెఱిగి పాలించు, వెతల్
  తీర్తునని రణమున నసురభర్తను
  వధియించ వనిత పరితోషించెన్.

  ఘనమగు హరి కథలఁ బలుకు
  చినవానిని, ప్రియమగు సుతుఁ జిత్రముగా నా
  తని తండ్రియె పలు విధముల
  తన బాలునిఁ జంప నెంచి తానే చచ్చెన్.  కవితను కొమ్మను నిల్చిన
  కవికిదె వందనము! పలుకగ దెలిసెనంచున్
  చెవికింపుగ రాముని కథ
  కవనమ్ముగఁ దీర్చి తనదు ఘనతను చాటెన్.

  రిప్లయితొలగించండి
 3. ఏక వింశతి యనుచున నేక రూపు
  మత్స్య కూర్మము కపిలుడు నార దుండు
  పరశు రాముడు శ్రీరామ వామ నుండు
  బ్రహ్మ విష్ణువు పరమాత్మ పరమ శివుని
  నెన్న తరమౌనె నేరికి చిన్న మాట

  రిప్లయితొలగించండి
 4. అమ్మా! లక్ష్మీ దేవి గారూ: శుభాశీస్సులు.
  మీ దశావతార వర్ణనను సీసపద్యములో వ్రాసేరు కాని కుదించేసేరు. విపులముగా వ్రాయండి - ఒక్కొక్క పాదములో ఒక్కొక్క అవతారము వస్తే బాగుండును. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 5. అమ్మా! లక్ష్మీ దేవి గారూ: శుభాశీస్సులు.

  మీరు వ్రాసిన పద్యములన్నియును బాగుగనే యున్నవి. ఎక్కడ కూడా సవరణలు అక్కరలేదు. అభినందనలు. స్వస్తి.

  అమ్మా రాజేశ్వరి గారూ: శుభాశీస్సులు.

  మీరు 21 అవతారము లన్నారు. కానీ 10 అవతారముల గూర్చి కూడా పూర్తిగా వ్రాయలేదు. పద్యము బాగుగ నున్నది. అభినందనలు.

  స్వస్తి.

  రిప్లయితొలగించండి
 6. మీరు చెప్పిన విధముగా విపులీకరించి ఒక ఆటవెలదిని జేర్చినాను.

  మత్స్యరూపమ్మున మాధవా! గాచితి
  వయ్య సృష్టినిల పావనచరిత్ర!
  కూర్మమై గిరిక్రింద కూర్మితో జేరితి
  వయ్య మధనమందు పాండురంగ!

  శ్రీ వరాహమువైతి క్షితిని గాచితివీవు
  సోమకాసురుఁ గూల్చి సుందరాంగ!
  నరసింహ యాకృతి నాడు ధరించితి
  బాలుని పాలింప పరమపురుష!

  బలినిఁ గూల్చవచ్చి వామనుడైతివి
  కరముఁ జాచితీవు కరుణఁ దోడ
  పరశువు ధరియించి బ్రాహ్మణ వర్ణపు
  బలము జూపిమాదు బంధువైతి

  రామచంద్రుడై నడయాడి రామతోడ
  కృష్ణ మోహనువైతి సత్కీర్తిఁ బొంది
  హలముఁ జేతినిఁ బూనుచు బలిమిఁ జూపి
  కల్కి కై కాయుమనెదవు కలియుగమున.

  రిప్లయితొలగించండి
 7. శిష్ట రక్షణ మఱియును దుష్టుల నిక
  సంహ రించుట కొఱకునై చక్రి యార్య !
  యెత్తె నవతార ములుపది యింపు గాను
  మత్స్య కూర్మము మొదలుగా మహిని దనర .

  రిప్లయితొలగించండి
 8. శ్రీ నేమాని , శ్రీ శంకరయ్య గురువులకు వందనాలు.
  .
  అల దశావతారములతో నిలను గాచి,
  భక్త కోటిని రక్షించి ముక్తినొసగె.
  పరమధామపతి ! పరేశ ! వందనములు !
  సతతము మము రక్షించుము సాదరమున!.

  రిప్లయితొలగించండి
 9. శ్రీపతి! జగదాధారా!
  పాపాపహ! చక్రధారి! పావనచరితా!
  హే పరమానందద! చి
  ద్రూపా!పద్మాయతాక్ష! దుఃఖవిదారా! 1.

  అవనిలోపల ధర్మంబు నణగద్రొక్కి
  తా నధర్మంబు వ్యాపింప, దాని గూల్చి
  మానవాళిని రక్షించి జ్ఞానమొసగ
  నవతరింతువు గోవింద! యద్భుతముగ. 2.

  నీరూపము లనుపమములు
  కారుణ్యాత్ముడవునీవు కంసారి! హరీ!
  తోరపు భక్తిని గొల్చిన
  వారికి కల్మషములుడుగు వైభవమబ్బున్. 3.

  తొల్లి మత్స్యమవౌచు దుష్టు రాక్షసు గూల్చి
  ..........వేదరక్షణ చేసి విమలమతుల
  జీవరాశుల నెల్ల నావలో నెక్కించి
  ..........జలధికావల జేర్చి సాకినావు,
  సురసంఘములు నాడు శుక్రశిష్యులగూడి
  ..........క్షీరాబ్ధి ద్రచ్చంగ గోరునపుడు
  కూర్మరూపంబంది కుధరంబు నిలబెట్టి
  ..........యమరుల కండయై యలరినావు,
  నాడు వరాహమై నవ్యతేజముతోడ
  ..........నసురు హిరణ్యాక్షు నణచి భూమి
  నుద్దరించుటెగాక యుత్సవంబుగ నాగ
  ..........మంబులం గాచితి వద్భుతముగ,
  నిరతంబు నినుగొల్చు నిజనందనుని జంపు
  ..........యత్నంబులోనున్న యసురపతిని
  నరసింహరూపివై నఖములతో జీల్చి
  ..........చెండాడితివినీవు దండమయ్య,
  పరమాద్భుతంబుగా వడుగౌచు వామనా
  ..........కారుండవై యజ్ఞకాలమందు
  బలిని యాచనచేసి పదముల మూడింట
  ..........నాక్రమించెడి మేర నందినావు,
  పరశురాముండవై బలమదయుతులైన
  ..........క్షత్రియులంబట్టి సంహరించి
  క్షితినిక్షత్రియహీన జేయబూనినయట్టి
  ..........దక్షుండ వోదేవ! దానవారి!
  రామావతారాన రావణాసురు గూల్చి
  ..........ధర్మంబు కాపాడి ధరణిజాత
  కానందమును గూర్చి మానవాళికి సతం
  ..........బాదర్శ దైవమై ఖ్యాతి గాంచి,
  యటుపైన కృష్ణుండ వౌచు యశోదకు
  ..........సంతసంబును నిల్పి సర్వగతుల
  గోపాల బంధులన్ కాపాడుటే కాదు
  ..........కంసాది దుష్టులన్ క్రమత గూల్చి
  భారతావనిలోన భవ్యసద్ధర్మంబు
  ..........నిలిపియుంటివి నీవు నిష్ఠబూని,
  శాక్యవంశమునందు జన్మించి మునివౌచు
  ..........ధరణిపై నెన్నెన్నొ ధర్మములను
  బోధించి యంతటన్ బుద్ధుండవై వెల్గి
  ..........లోకముల్గాచినా వేకదీక్ష
  కలియుగాంతపువేళ యిలనుగావగ నీవు
  ..........కల్కివౌదు వటంచు పల్కుచుంద్రు
  దేవ! వైకుంఠవాసి! హే దివ్యతేజ!
  అఘవిదారక!కేశవ! హరి! ముకుంద!
  భాగ్యదాయక! మాధవ! వాసుదేవ!
  సకలభువనావనానంత! సత్యరూప! 4.

  దుష్టరాక్షససంహార! దురితదూర!
  నిత్యసంతోషదాయక! నిర్మలాంగ!
  శిష్టరక్షక! దైత్యారి! శ్రీప్రదాత!
  సన్నుతించెద సతతంబు నిన్నుదేవ!. 5.

  సకలభువనంబులనుగావ జగతిలోని
  జీవరాశుల నెద్దాని స్వీకరించి
  రూపధారణ జేతువో పాపమణచ
  నూహచేయగ లేరెవ్వరుర్విలోన. 6.

  రిప్లయితొలగించండి
 10. అమ్మా! లక్ష్మీదేవి గారు: శుభాశీస్సులు.
  మీ పద్యములను చూచితిని - కొన్ని సవరణలను చేసితిని:
  మీ ప్రయత్నము చాల బాగుగ నున్నది. అభినందనలు.

  మత్స్య రూపమ్మున మాధవా! కాచితి
  ....వయ్య సృష్టినిల పావన చరిత్ర!
  కూర్మమై గిరిక్రింద కూర్మితో జేరితి
  ....వబ్ధి మథనమందు పాండు రంగ!
  శ్రీ వరాహమవయి క్షితిని గాచితివయ్య
  ....అసురేశుడగు హిరాణ్యాక్షు గూల్చి
  నరసింహ రూపమ్ము నాడు ధరించితి
  ....ప్రహ్లాదు బాలింప పరమ పురుష!
  బలిని వేడ నేగి వటురూప మొందితి
  కరము జాచుచు నవకంజనేత్ర!
  పరశువు ధరియించి బ్రాహ్మణ వర్ణపు
  బలము చూపితీవు భార్గవాఖ్య!

  రామతో నడయాడితి రామచంద్ర!
  యదుకులోద్వహ! కృష్ణ మోహనుడవైతి
  బలము మెరయ హలాయుధ పాణివైతి
  కల్కికై కాయుమనెదవు కలియుగమున

  శ్రీ సుబ్బా రావు గారు: శుభాశీస్సులు.
  మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు.

  శ్రీ జయసారధి గారు: శుభాశీస్సులు.
  మీ పద్యము బాగుగ నున్నది - అభినందనలు.

  రిప్లయితొలగించండి
 11. శ్రీ హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారు: శుభాశీస్సులు.
  మీ సీసమాలికను మిగిలిన పద్యములను చూచితిని. మీ కృషి ప్రశంసనీయము. అభినందనలు.
  సీసమాలికలో --
  మత్స్యావతారములో వేదరక్షణ జేసి అన్నారు;
  వరాహావతారములో: ఆగమంబుల గాచితివి అన్నారు.
  ఏమైన సవరణ కావాలేమో చూడండి.
  స్వస్తి.

  రిప్లయితొలగించండి
 12. మత్స్యరూపమున సోమకుని ద్రుంచితి వీవు
  .......కూర్మమై మోసితి గిరిని నీవు
  వారాహరూపివై పైడికంటిని జంపి
  .......నరహరి! ప్రహ్లాదు నరసి నావు
  వామన మూర్తివై బలి గర్వ మడగించి
  .......పరశురాముడ వయి బరగినావు
  రాఘవ మూర్తివై రావణు వధియించి
  .......గీత జెప్పితి వీవు కృష్ణుడ వయి

  శుద్ధ బుద్ధుడవై నీ వసురుని సతికి
  మాన భంగము గావించి మడియ జేసి
  కల్కి రూపాన దుష్టుల కలియుగాన
  జంప రానుంటివి గదోయి సత్యము హరి!

  రిప్లయితొలగించండి
 13. ఆర్యా!
  నమస్కారములు,
  ఈ క్రింది వికీపీడియా సమాచారం ప్రకారం వరాహావతారంలో
  "నాడు వరాహమై నవ్యతేజముతోడ
  ..........నసురు హిరణ్యాక్షు నణచి భూమి
  నుద్దరించుటెగాక యుత్సవంబుగ నాగ
  ..........మంబులం గాచితి వద్భుతముగ" అని వ్రాశాను. పొరపాటు జరిగింది దానిని క్రింది విధంగా మారుస్తున్నాను. పరిశీలించగలరు.
  మీ మార్గదర్శనకు, సూచనకు ధన్యవాదములు.
  (వికీపీడియా నుండి - శ్రీవరాహమూర్తి, వరాహావతారము, వరాహ స్వామి (Varaha incarnation)- ఇవన్నీ శ్రీమహావిష్ణువు మూడవ అవతారమును వర్ణించే నామములు. హిందూ పురాణాల ప్రకారం త్రిమూర్తులలో విష్ణువు లోకపాలకుడు. సాధుపరిరక్షణకొఱకు, దుష్టశిక్షణ కొఱకు ఆయన ఎన్నో అవతారాలలో యుగయుగాన అవతరిస్తాడు. అలాంటి అవతారాలలో 21 ముఖ్య అవతారాలను ఏకవింశతి అవతారములు అంటారు. వానిలో అతిముఖ్యమైన 10 అవతారాలను దశావతారాలు అంటారు. ఈ దశావతారాలలో మూడవ అవతారము వరాహావతారము. మహాలక్ష్మిని సంబోధించే "శ్రీ" పదాన్ని చేర్చి శ్రీవరాహమూర్తి అని ఈ అవతార మూర్తిని స్మరిస్తారు. వరాహావతారం హిరణాక్షుడిని చంపి, భూమిని ఉద్ధరించి, వేదములను కాపాడిన అవతారము.)

  "నాడు వరాహమై నవ్యతేజముతోడ
  ..........నసురు హిరణ్యాక్షు నణచి భూమి
  నుద్దరించుటచేత నుత్సాహమమరుల
  ..........కందించి యున్నాడ వద్భుతముగ!"

  రిప్లయితొలగించండి
 14. విష్ణుడు జనించు నవనిపై వివిధ రూప
  ములను దుష్టుల శిక్షింప పుణ్య వంతు
  లందరను రక్షింపంగ మురారి లీల
  లాహరునికైన గోచరంబవ్వ వండ్రు

  రిప్లయితొలగించండి
 15. శ్రీ నేమాని గురుదేవులను మన్నించమని ప్రార్థిస్తూ ..

  మత్తకోకిల వృత్తములలో ప్రయత్నము జేసితినండి .తప్పులున్న మరొక్క మారు మన్నించమని ప్రార్థిస్తూ ..
  ============*================
  వేద భూమిని సోమకుండను వెఱ్ఱి రాక్షసు డొక్కడున్
  వేద సారము నెల్ల నాతడు వేగ జేర్చగ వార్థికిన్
  వేద వేద్యుడు మత్స్య రూపము వేగదాల్చి రణమ్మునన్
  వేద తస్కరునిన్ వధియించెను వేదరక్షణ జేయగన్ !


  దేవ దానవ వీరు లెల్లరు దేవ దేవుని గొల్వగా !
  బావ భేదము వీడి వచ్చిన వారి కోర్కెల ధీర్చగన్
  దేవ దేవుడు కూర్మి తోడను దెల్చె కూర్మపు రూపమున్
  క్ష్మావరేశుడు జేరి నిల్చెను శైల పాదప మందునన్ !

  నీతి మార్గము వీడి రాక్షస నేత లెల్లరు నేట్టుచున్
  భూతలమ్మును నీట ముంచగ పోరు జేయుచు వారితో
  త్రాతగా జల మందు నిల్చి వరాహ రూపము నందునన్
  భూతలమ్మును నెత్తి జూపెనుమూర్ఖ రాక్షస దండుకున్

  కోరి యిచ్చిన కాలకూటము కూర్మి తోడను ద్రాగగన్
  వైరి పాదము బట్టి యుంటివి, వైరి వైతివి పుత్రుడా
  దారి జూపుము దైవ ముండిన దారి జూపుము చేరువన్
  పోరు సల్పెడి వాడి జాడను ముందు దెల్పుము నాకనన్
  నార సింహుని రూపమందున నమ్మి గొల్చిన భక్తునిన్
  జేరి,పోరున జంపె తండ్రిని చీల్చి దేహము నంతయున్!


  బాల బాలుని రూప మందున వచ్చి వామన కోర్కెలన్
  చాల గోరక మూడు పాదము జాలు నేలను గోరగన్
  మూల మర్మము గాంచి యుండిన ముక్తి జాలని వేగమున్
  పాల జేయగ గ్రోలె నాతడు వాంఛితమ్మున భిక్షమున్

  ధర్మ మార్గము దప్పి యుండిన దైత్య వర్గము, జంపగా
  కర్మ మార్గము నందు నిల్చిన కర్మజీవుల,రాము డా
  ధర్మ రావణ మిత్రవర్గము,తాటకేయుని జంపగన్
  కూర్మి నొందెను లోకమెల్లను కోసలేశుని దాపునన్!

  కన్న వారల కూర్మి నొందగ కంస మామను జంపెరా !
  కన్నె భామల చీర లెల్లను గట్ట గట్టెను జూడరా!
  వెన్న దొంగగ మన్ను మెక్కుచు వీధు లందున నిల్చెరా!
  మన్ను తోడను మిన్ను జూపెను మాత కప్పుడు జూడరా!  రిప్లయితొలగించండి
 16. దనుజుండొక్కడు సోమకాఖ్యుడు బలాత్కారమ్ముగా వేద రా
  శిని గొంపోవుచు నున్న వేళ గని యక్షీణప్రతాపంబుతో
  చని మత్స్యాకృతి దాల్చి గూల్చి యసురున్ సర్వేశ! భద్రమ్ముగా
  గొని వేదమ్ముల బ్రహ్మకిచ్చిన నినున్ గొల్తున్ జగత్పాలకా!

  కలశాంభోధిని ద్రచ్చువేళ గిరి మున్గన్ సాగరంబందు, నా
  జలధిన్ జేరితి కూర్మమూర్తి వగుచున్ శైలంబునున్ వీపుపై
  నలరంజేయుచు సాయమిచ్చితివి దేవా! దీన రక్షాపరా!
  జలజాతాసన వాసవాది వినుతా! స్వామీ! నినున్ గొల్చెదన్

  ధరణిన్ జాపగజుట్టి సాగరము మధ్యన్ ద్రోయ గొంపోవగా
  సురవిద్వేషి హిరణ్యనేత్రు గని యస్తోక ప్రభాశాలివై
  యురు దంష్ట్రాహతి వాని గూల్చితి హరీ! యుర్విన్ వెసన్ గాచితో
  యరవిందేక్షణ! క్రోడరూపధర! దేవా! గొల్తు నిన్ భక్తితో

  హరి భక్తిన్ వెలుగొందు పుత్రకుని ప్రహ్లాదున్ వధింపంగ నే
  వెరవున్ బారక నల్గు దానవు దురావేశంబునున్ ద్రోయుచున్
  నరసింహాకృతి దాల్చి జీల్చితి రిపున్ భక్తావనా! మాధవా!
  యరవిందాసన వందితా! గొలుతు నిన్నానంద సంధాయకా!

  బలి దైత్యేంద్రుని జేరి వామనుడవై వాక్చాతురిన్ జూపి నీ
  వల పాదత్రయ భూమినే యడిగి బ్రహ్మాండాంతసంవర్ధివై
  తొలగం జేయుచు దైత్యుభాగ్యమును సంతోషమ్మునున్ గూర్చితో
  బలదైత్యారికి దేవ! నీకివె నతుల్ వైకుంఠ లోకేశ్వరా!

  ధరణిన్ క్షత్రియ పాలకుల్ చెలగగా దర్పంబుతో ధూర్తులై
  పరశున్ బూనుచు నీవు భార్గవుడవై భాసిల్లు తేజంబుతో
  ధరణీనాథుల గూల్చినాడవు కదా! ధాత్రీసురోత్తంసమా!
  పరమానంద నిధాన! నిన్ను గొలుతున్ పద్మాయతాక్షా! హరీ!

  అమరారాతి దశాననుండు బల దర్పాధిక్యుడై కామియై
  రమణిన్ సీతను దొంగిలించి చన, ధర్మత్రాణదీక్షా మతిన్
  సమర క్షోణిని సంహరించి యసురున్ క్షత్రేశ! శ్రీరామ! ధ
  ర్మము ధాత్రిన్ దనరార జేసిన నినున్ రాజేంద్రునిన్ మ్రొక్కెదన్

  తనరన్ జేసితి గోపవంశమును, సద్భావంబుతో పాండు నం
  దనులన్ బ్రోచితి, బోధ సేసితివి గీతాజ్ఞానమున్, ధాత్రి దు
  ర్జనులన్ గూల్చితి, ధర్మరక్షణపరా! సర్వేశ్వరా! కృష్ణ! వం
  దనముల్ కూర్తును నీ పదాబ్జములకున్ త్రైలోక్యనాథా! హరీ!

  పురదైత్యత్రయమున్ వధింపగ ధరన్ బుద్ధావతారంబునన్
  గురురూపంబున దానవాంగనలకున్ మోసంబునున్ జేసి చె
  చ్చెర మానంబును దోచినాడవు కదా! క్షీరాబ్ధికన్యాపతీ!
  పరమేశా! వినుతింతు నీ విభవముల్ స్వామీ! నినున్ గొల్చెదన్

  కలికాలంబిది హెచ్చె నెల్లెడ ధనాకాంక్షల్ మదోన్మత్తులై
  పలు మోసంబులు చేసి దుర్జనతతుల్ భాసిల్లి రుత్సాహులై
  నిలువంజాలదు ధర్మదేవత ధరన్ దీనావనా! కల్కివై
  యిల వెల్గొందవె? రావె? కావ మము సర్వేశా! సరోజేక్షణా!


  రిప్లయితొలగించండి
 17. శ్రీ నేమాని గురుదేవులను మన్నించమని ప్రార్థిస్తూ ..

  మీరు శ్రీ హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారి పద్యములపై వ్యాఖ్యను ఇప్పుడు జూచితిని.
  మత్స్యావతారములో వేదరక్షణ అని వ్రాసాను.

  మీ మత్తేభ వృత్తములు చాలా బాగున్నవండి.

  రిప్లయితొలగించండి
 18. శ్రీ మిస్సన్న గారు: శుభాశీస్సులు.
  మీ పద్యమును చూచితిని. అభినందనలు. కొన్ని సవరణలు:

  కూర్మమై మోసితి కుధరమీవు అందాము. (యతి మైత్రి కొరకు)
  వామనమూర్తివై బలి గర్వ మడచితి అందాము.
  ద్విజుడవై నృపుల చంపితివి బల్మి అందాము.
  శుద్ధ బుద్ధుడవై నీ వసురుల సతుల అందాము. (ముగ్గురు రాక్షసుల భార్యలు)

  శ్రీ హరి వెంకట సత్యనారాయణ మూర్తి గారు:
  మీ సవరణ బాగుగ నున్నది. అభినందనలు.

  శ్రీ అన్నపరెడ్డి సత్యనారయణ రెడ్డి గారు: శుభాశీస్సులు.
  మీ పద్యము బాగుగ నునది. అభినందనలు.

  3వ పాదములో: అందరకు రక్ష గూర్ప అందాము.
  4వ పాదములో: ఆ హరునికైన గోచరమగునె చూడ? అందాము.

  శ్రీ వరప్రసాదు గారు:శుభాశీస్సులు.
  మీ పద్యములు బాగుగ నున్నవి. అభినందనలు.
  కొన్ని సవరణలు:
  1వ పద్యములో వధించెను అని ఉండాలి - టైపు పొరపాటు కావచ్చును.
  3వ పద్యములో: మూర్ఖ రాక్షస జాతికిన్ అందాము.
  4వ పద్యములో: జేరి పోరున దైత్యనాథుని జీల్చినాడవు బల్మిమై అందాము.
  5వ పద్యములో: చాల గోరక ముప్పదంబులు.
  6వ పద్యము: నాకు అర్థము కాలేదు.

  శ్రీ నాగరాజు రవీందర్ గారు:
  హిరణ్య కశిపుని అని అనాలి -- మీరు కేవలము కశిపుని అని మాత్రమే వాడేరు. హిరణ్యకశిపుడు అంటే బంగారు శయ్య కలవాడు అని అర్థము.

  స్వస్తి.

  రిప్లయితొలగించండి
 19. పదియవతారమ్ములగన
  పదిలముగా జీవ గతియె వసుధను వరుసన్
  ఒదిగిన పరిణామమ్మని
  బుధులందురు " దశ " ల గనుడు భూజనులారా !

  రిప్లయితొలగించండి
 20. శ్రీ నాగరాజు రవీందర్ గారు: శుభాశీస్సులు.
  మీ సవరణ "అశరుడు" అనుట బాగుగనే యున్నది. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 21. నేమాని పండితార్యా! తగ్గ సవరణలు చేసినందుకు ధన్యవాదములు.

  మీ పది పద్యాలు ఆణిముత్యాలు.

  రిప్లయితొలగించండి