28, నవంబర్ 2015, శనివారం

చమత్కార పద్యాలు - 214

డా. గరికిపాటి వారి అవధానంలో 
వర్ణనాశం “అవధానాలు - స్త్రీలు”

          సంసారంలో భార్యాభర్త లిద్దరూ సమస్యల, కష్టాల రూపంలో అనేక పరీక్షల నెదుర్కొంటున్నప్పటికినీ, పురుషుడి కంటె స్త్రీయే ఎక్కువ ఓర్పును, నేర్పునూ ప్రదర్శించి అనుభవిస్తూ ఉంటుంది. అసలు ఈ ఆధునిక జీవితంలో సాధారణ గృహిణియే అష్ట కష్టావధానం చేస్తుంటుంది. ఆ సందర్భాన్ని మహాసహస్రావధాని డా. గరికపాటి నరసింహారావు గారు ఎలా వర్ణించారో చూడండి.

సీ. 
అడు గడుగున నిషేధాజ్ఞ జారీచేయ 
..........మగడు నిషిధ్ధాక్షరిగను దోప
గుప్పిళ్ళు నిండని గ్రుడ్డి గవ్వలతోడ 
..........మాసమ్ము గడుప సమస్య కాగ
అది సర్దు మిది సర్దు మని చంపు కాన్వెంటు 
..........దత్తుండు దత్త పదంబు కాగ
ముద్దు లొల్కెడి చంటి బుజ్జాయి పాపాయి 
..........వర్ణనీయాంశమై వరలు చుండ
పాలు కూరలు పండ్ల బండ్ల వారల రాక 
..........యాశుధారా కవిత్వార్ధ మనఁగ
అత్తయ్య వేసెడి యక్షింత లవియన్ని 
..........పాత పురాణంపు పఠన మనఁగ
పోనీని రానీని ఫోను మ్రోతల రోత 
..........ఘంటికా గణనమ్ము కరణి దోఁప
బోరు గొట్టించెడి ధారవాహిక సుత్తి 
..........యధిక ప్రసంగమై యడ్డుపడఁగ
తే.గీ. 
దినము దిన మిట్లు వనితలు తిప్పలుపడి
పూటపూటకు నవధాన పూర్ణసిధ్ధి
తనరుచుండఁగ పురుషావధానులేల? 
వర సహస్రావధానులీ పడతు లెల్ల!

(ఫేసుబుక్కునుండి ధన్యవాదాలతో....)

4 కామెంట్‌లు:

  1. గరిక పాటి వారు గణనీయ కవులలో
    మేటి యనగ దగును మేది నిమరి
    వారి యాశు కవితవారియందుపడవ
    వోలె సాగు నుగద బుధులులార!

    రిప్లయితొలగించండి
  2. తేనె లొలుకు రీతి తీయని పద్యాల
    నల్లగలుగు నట్టి యనఘు డతడు
    గరిక పాటి వారి కావ్య ప్రజ్ఞత నెన్న
    వశము గాదు నేను పామరుడను




    రిప్లయితొలగించండి