21, నవంబర్ 2015, శనివారం

సమస్య - 1861 (వారకాంత లెల్లరు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
వారకాంత లెల్లరు పతివ్రతలు సుమ్ము.

41 కామెంట్‌లు:

విరించి చెప్పారు...

గురువు గారికి నమస్కారములు....,చక్కని సమస్య నిచ్చినందులకు ధన్యవాదములు

నాటకమున స్త్రీ పాత్రల నటన కొరకు
తెచ్చినారట వేశ్యల మెచ్చి వారు
సీత సావిత్రి యనసూయ శీలవతుల
పాత్రలన్ వేయగా గాంచి వగచి రిట్లు
వారకాంత లెల్లరు పతి వ్రతలు సుమ్ము.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

సుమతి పౌలోమి పార్వతి సుదతు లంత
దేవ తలుగాన వరముల దీప్తి యందు
మార్చు చుండిన యవతార మార్పు కంటె
వార కాంతలెల్ల రుపతి వ్రతలు సుమ్ము

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

'ఆరుగురు పతివ్రతల'ను పేరు తోడ
చిత్రమొక్కటి దీసిరి చిలిపి గాను
పేరులోన వ్యంగమ్మను తీరు దెలిసె
వారకాంత లెల్లరు పతివ్రతలు సుమ్ము!

కంది శంకరయ్య చెప్పారు...

ఆంజనేయ శాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘మెచ్చి’నవారు వగచు టెందుకు? ‘వగచి రిట్లు’ను ‘పలికి రిట్లు’ అనండి.

కంది శంకరయ్య చెప్పారు...

రాజేశ్వరి అక్కయ్యా,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘అవతార మార్పు’ అని సమాసం చేయరాదు కదా!

కంది శంకరయ్య చెప్పారు...

గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

డా.బల్లూరి ఉమాదేవి. చెప్పారు...

చలన చిత్రము లందున చందమామ
బోలు సుందరీ మణులిట పొట్ట కూటి
కొఱకు నటియించు చుందురు కూలి కోరి
వారకాంత లెల్లరు పతివ్రతలు సుమ్ము.

కంది శంకరయ్య చెప్పారు...

డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
కాని పూరణ సమర్థంగా ఉన్నట్టు లేదు. సినీతార లంతా వారకాంత లంటారా?

డా.బల్లూరి ఉమాదేవి. చెప్పారు...

"కొఱకు నటియింత్రు కొందరు "అంటే సరిపోతుందాండి.
వారకాంతలుగా నటించాల్సి వస్తోంది పొట్టకూటి కనే అర్థంలో వ్రాశాను కాని సమన్వయం కుదర లేదనిపించింది

గోలి హనుమచ్చాస్త్రి చెప్పారు...

పతికి మారాడకుండగ పరమ భక్తి
అన్నదమ్ముల భార్యలే యణగియుండు
ప్రక్కనున్నట్టి శ్రీశ్రీనివాసులు పరి
వారకాంత లెల్లరు పతివ్రతలు సుమ్ము.

subbarao చెప్పారు...

శీలరహితులు నుసహనశీలురుగద
వారకాంతలెల్లరు ,పతివ్రతలుసుమ్ము
భర్త దైవమే యనుకొని బగలురేయి
సేవ జేసెడి యువతులే యీవసుధను

కంది శంకరయ్య చెప్పారు...

‘కొఱకు వేశ్యలుగ నటింత్రు కోరి యట్టి| వారకాంత...’ అంటే బాగుంటుందేమో?

కంది శంకరయ్య చెప్పారు...

గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ ‘పరివార కాంతల’ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

పోచిరాజు సుబ్బారావు గారూ,
విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

ఊకదంపుడు చెప్పారు...

ఓ కాంతామణి:
పచ్చకామెర్ల రోగికిఁ బరగ లోక
మెల్ల పచ్చగాఁ దోచుగాదె? యటులె మగ
వారి పోకడయును, మమ్ము మీరలెంచు
వార? కాంత లెల్లరు పతివ్రతలు సుమ్ము

ఊకదంపుడు చెప్పారు...

గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
అణిగియుండ్రు / అణిగియుంద్రు అనవలెనేమో..
భార్యలే అనటం వల్ల - మిగతా ఇళ్లలో ఎవరు అణిగి ఉంటారో చెప్పకనే చెప్పారు. బావుంది.
భవదీయుడు

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

భర్త యడుగు జాడలఁ జని భద్ర గతిని
నిల్లు చక్క బెట్టి పరువు నిలిపి దరికి
జేరి ప్రియకాంతున కెపుడు సేవ జేయు
వార, కాంత లెల్లరు పతివ్రతలు సుమ్ము.

Unknown చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
gurumoorthy చెప్పారు...


* గు రు మూ ర్తి ఆ చా రి *
...........................

{ వేశ్యా వాటికకు చిక్కిన. కా౦తకు మరియు
వేశ్యా నాయికకు మధ్య జరిగిన
స౦భాషణము }

వదలి వేయుము నన్ను - మ్రొక్కెదను నీకు
" నట్టి దానిని " నేను కాదనుచు నేడ్చు
కా౦త తోడ వేశ్యా నాయిక పలికె నిటు :--
" పిచ్చి మొగమ. ! నిన్నెవరు తప్పి౦చ లేరు
పరమ సాధ్విని నేనని వగచ నేల. ?
లొ౦గి . విటులిడు సుఖములో పొ౦గి పొమ్ము
మొదట : నాకడ. జేరక. ము౦దు - నిచటి
వార కా౦త లెల్లరు పతివ్రతలు సుమ్ము ! "

Unknown చెప్పారు...

గురువుగారికి, పెద్దలకు నమస్కారం. నాకుచేతనైన పూరణ చేశాను. భావము సరిగా ఉందా అని అనుమానంగా ఉంది. దయచేసి పరిశీలించి తప్పులు తెలియచేయగలరు.

తే.గీ

కన్న బిడ్డల యాకలి కడుపు కోయ
వెతలు సుడివడ గనరాక వేరు దారి
మేని మలినము సోకదు మనసు కనెడు
వారకాంత లెల్లరు పతివ్రతలు సుమ్ము

విరించి చెప్పారు...

వేశ్య గృహమున వెలదులన్ పిలిచె ముసలి
తార, దమయంతి, సుమతి, సీతా యనుచును,
వినిన విటుడుతలంచెనీ విధము గాను
వారకాంతలెల్లరు పతివ్రతలు సుమ్మి

A.Satyanarayana Reddy చెప్పారు...

వయసుడిగిన పిమ్మట చెడ వైభవమ్ము
నిండుయవ్వన మందున నిధుల వృష్టి
కురియ జేసిన వైశికుల్ తరిగిపోవ
విటులకు ముఖము మొత్తిన వెనుక, వృద్ధ
వార కాంతలెల్లరు పతివ్రతలుసుమ్ము

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

[జేయువార= జేయువారే]

గండూరి లక్ష్మీనారాయణ చెప్పారు...

భర్త వాక్కును బాటించి ప్రమద మొప్ప
కష్ట సుఖములలో పాలు నిష్ట ముగను
పంచుకొని జీవనము గడప దలచుకొను
వార, కాంత లెల్లరు పతివ్రతలు సుమ్ము.

Unknown చెప్పారు...

పతియె ప్రత్యక్ష దైవంబు పడతికనుచు
భక్తిభావానమెలిగెడి శక్తియున్న
వార?కాంతలెల్లరు పతివ్రతలుసుమ్ము
ననుచు నూహించగలిగెడి మనసువార?
2.పల్లెటూర్లలో గమనించ భయముభక్తి
నిత్యనియమాలు,సత్యంబు భత్యమనెడి
వార?కాంతలెల్లరు పతి వ్రతలుసుమ్ము
తెలుసుకొమ్మని కథలను దెల్పు వార?
3.క్రమాలంకారంలో
వేశ్య వాటికలందుండి విటులగనుచు{వారకాంత లెల్లరు}
పతియె వ్రతకర్తగానెంచి భక్తిచేత
సత్య సహవాస మందున సాగువారె{పతివ్రతలుసుమ్మి}


కంది శంకరయ్య చెప్పారు...

ఊకదంపుడు గారూ,
వైవిధ్యమైన విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

పోచిరాజు కామేశ్వర రావు గారూ,
వైవిధ్యమైన విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

గురుమూర్తి ఆచారి గారూ,
మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

వేదుల సుభద్ర గారూ,
మీ పూరణ నిర్దోషంగా, చక్కగా ఉంది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

ఆంజనేయ శర్మ గారూ,
మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
‘వృద్ధనారీ (వేశ్యా) పతివ్రతా’ అన్న మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

సుమతి పౌలోమి పార్వతి సుదతు లంత
దేవతలు గాన వరముల దీప్తి యందు
మార్చు చుండగ యవతార మలుపు లెల్ల
వార కాంతలెల్లరు పతివ్రతలు సుమ్ము

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
Unknown చెప్పారు...

ధన్యవాదాలు గురువుగారు.

కంది శంకరయ్య చెప్పారు...

కె. ఈశ్వరప్ప గారూ,
మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
మొదటిపూరణలో ‘పతివ్రతలు సుమ్మ|టంచు’ అనండి.

Bhagavatula Krishna Rao చెప్పారు...

త్రేత యుగమున మనుజులు త్రివిధములనె
కాక కర్మలన్ జేయ సంకల్పు లగుచు
నీతి నీమము పాటించి నెగడ , పరి
వారకాంత లెల్లరు , పతివ్రతలు సుమ్ము.

గోలి హనుమచ్చాస్త్రి చెప్పారు...

మాస్టరుగారూ ! ధన్యవాదములు..రామకృష్ణగారూ ! నిజమేనండీ..మీ సూచనమేరకు సరిచేశాను. ధన్యవాదములు.
పతికి మారాడకుండగ పరమ భక్తి
అన్నదమ్ముల భార్యలే యణగియుంద్రు
ప్రక్కనున్నట్టి శ్రీశ్రీనివాసులు పరి
వారకాంత లెల్లరు పతివ్రతలు సుమ్ము.

గోలి హనుమచ్చాస్త్రి చెప్పారు...

రామకృష్ణ గారూ.. వారలను చక్కగా ఎంచారు...బాగుంది.

sailaja చెప్పారు...

తాళి గట్టిన భర్తను దైవముగను
మదిని గొల్తురు వసుధలో మగువ లంత
వేళ మించిన దలచుచు వేచి యుండు
వార , కాంతలెల్లరు పతివ్రతలు సుమ్ము !!!

Unknown చెప్పారు...

తనువు మాసిననేమాయె?మనసు నకును
మలినమంటగ లేదు నామాట నమ్ము
మనెడి రేయి ద్రిమ్మరు లైన గణికలు తెల
వార, కాంతలు.,పతివ్రతలు., సుమ్ము!!!