9, జనవరి 2016, శనివారం

సమస్య – 1909 (హరిని హరి హరించె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
హరిని హరి హరించె హరి కనంగ.

39 కామెంట్‌లు:

 1. గురువు గారికి సుకవి మిత్రులకు నమస్సుమాంజలులు

  కొలను చెంత మ్రాను కొమ్మపై నచిలుక
  కాంచు చుండ వచ్చె గాలిదిండి
  మడుగు సరసనున్న మండూకమును చేరి
  హరిని హరి హరించె హరి కనంగ

  గాలిదిండి= పాము
  మొదటి.... హరి= కప్ప
  రెండవ.....హరి= పాము
  మూడవ....హరి=చిలుక

  రిప్లయితొలగించండి
 2. సరిగ్గా నేనుకూడా అలాగే వ్రాయా లనుకున్నాను .లంచ్ తిని వచ్చేలోగా శర్మ గారూ .........?
  చాలా చాలా బాగుంది హాట్సాఫ్ !

  రిప్లయితొలగించండి
 3. ధన్యవాదాలు అక్కయ్య గారూ....నమస్కారం

  రిప్లయితొలగించండి
 4. హరిని గాంచి కలువ విరిసె ముదముగాను
  గగన మందు తొలగె కమల ధరుడు
  నయము గాను పాట హరికంఠ మునవిందు
  హరిని హరిహరించె హరి కనంగ
  ------------------------------
  హరి = చంద్రుడు
  కమలధరుడు = సూర్యుడు[హరి]
  హరికంఠము = కోకిలకంఠము

  రిప్లయితొలగించండి
 5. ఆకలియడరంగ హరిభుక్కు దరిచేరి
  కరము వేగ దూకె కప్ప పైకి
  చిలుక వణుకు చుండ చెట్టుపై గూర్చుండి
  హరిని హరి హరించె హరికనంగ

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 6. వానరబలమెల్ల వారధి నిర్మింప
  సాగరమ్ము దాటి శౌర్య మడర
  దశముఖుఁ దనునట్టి దానవున్ సీతాప
  హరిని హరి హరించె హరి కనంగ.
  (హరి=రాముడు, హరి=వానరుడగు సుగ్రీవుడు)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గురువుగారూ మీ పూరణ మనోజ్ఞంగా ఉంది.
   సీతాపహారి ని సీతాపహరి అని కూడా అనవచ్చునా?

   తొలగించండి
  2. మిస్సన్న గారూ,
   ధన్యవాదాలు.
   ‘సీతాపహరి’ విషయంలో నాకూ సందిగ్ధతే. ఉదయం గుండు మధుసూదన్ గారు కూడా అభ్యంతరాన్ని తెలిపారు.
   అపహారము, అపహరము రెండు పదాలూ ఉన్నాయి. అపహారము చేసేవాడు ‘అపహారి’, అపహరము చేసేవాడు ‘అపహరి’ అని భావించాను. సంస్కృతంలో పాండిత్యమున్న వారి నెవరినైనా అడిగి సమాధానం చెప్తాను.

   తొలగించండి
 7. సరసున నొక మకరి కరిపాదముఁబట్ట
  కిరణుడుఁగన వగచి హరిని వేడ
  పరుగు పరుగన నటకరుగుచు దాని యో
  హరిని హరి హరించె హరికనంగన్!

  (ఓహరి=నేను తగినవాఁడను నేనే తగినవాఁడనని పోటుమగలలో నొకరికొకరికిఁ గలిగిన తలఁపు)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 8. హరియనగను కప్ప మరియొక్క టర్థము
  హరికి పాము యగును సరి మరొకటి
  హరియనంగ కోతి యా వరుసను విను
  హరిని హరి హరించె హరి కనంగ.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   ‘పాము+అగును’ అన్నపుడు యడాగమం రాదు. ‘పాము నగును’ అనండి.

   తొలగించండి
  2. మాస్టరుగారూ ... ధన్యవాదములు..సరిచేశాను.


   హరియనగను కప్ప మరియొక్క టర్థము
   హరికి పాము నగును సరి మరొకటి
   హరియనంగ కోతి యా వరుసను విను
   హరిని హరి హరించె హరి కనంగ.

   తొలగించండి
 9. కోతి కొమ్మ పైన గూర్చుని యుండగా
  గంతు లేస్తు వచ్చె కప్ప యొకటి
  గుబురులందు దాగు గోకర్ణమదిజూచి
  హరిని హరి హరించె హరి కనంగ!!!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శైలజ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   ‘ఏస్తు’ అని గ్రామ్యాన్ని వాడారు. ‘గంతు లిడుచు’ అనండి.

   తొలగించండి
 10. హరి వనంబున హరి హరుల రానీయని
  హరి హరికి నరియగు హరి విధ మది
  హరి హరులు నభమున నలరుచు నుండగ
  హరిని హరి హరించె హరి కనంగ.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పచ్చని యరణ్యము, సూర్య కిరణముల రానీయని, లో పాము కప్పకు శత్రువు విష్ణువు పద్దతియది. సూర్య చంద్రులాకాశముననుండి యలరుచునుండగా గుఱ్ఱమును సింహము కోతి చూస్తుండగా చంపెను.

   తొలగించండి
  2. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 11. మడుగునందుమిగుల మాటుగనుండ యా
  హరినిహరిహ రించె, హరికనంగ
  వేలకొలది నతుల విడువక యిడగను
  హరియె కాచిమనల నాదుకొనును

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పోచిరాజు సుబ్బారావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 12. తరువు పైన నిక్కి హరి జానకిని చూడ
  హరియు జేరె కొలను దరికి భృతికి
  పుట్టనున్న హరియు బస్సున పడగెత్తె
  హరిని హరి హరించె హరి కనంగ.

  రిప్లయితొలగించండి
 13. కనకకశిపు డెవరి జెనకెను? నరహరి
  యెవ్వ? రతడు దనుజు నేమి చేసె?
  దనుజసుతుడు భక్తి దండ మిడె నెపుడు?
  హరిని, హరి, హరించె, హరి కనంగ!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మిస్సన్న గారూ,
   తగిన ఐతిహ్యాన్ని ఎన్నుకొని ప్రశస్తమైన పూరణ చెప్పారు. అభినందనలు.

   తొలగించండి
 14. తరువు పైన హరియె పరికించి చూడంగ
  పుట్టలోని హరియె చెట్టు చెంత
  చెరువు గట్టు నున్న హరినిగాంచుచువచ్చి
  హరిని హరి హరించె హరికనంగ

  రిప్లయితొలగించండి
 15. హరి,హరి,హరి,హరి,,హరియును
  హరిత హరి దయ హరిహరుని నాదరణమునన్
  హరిహర యందుండగనే
  హరిని హరి హరించె హరికనంగను విధిగా|
  {హరి=కోతి2.హరి=పాము3.హరి=కప్ప4.హరి=చిలుక5.హరి=నెమలి,హరితహరి=సూర్యుడు,
  హరిహర=కర్నాటకంబున పట్టణము

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కె. ఈశ్వరప్ప గారూ,
   మీ పూరణలో చూపిన శబ్దవైచిత్రి ప్రశంసార్హం. బాగుంది. అభినందనలు.

   తొలగించండి
 16. సరసిలోకరి యెవరిని సన్నుతించె
  మకరి నెవ్వరే విధమునే మార్చి రచట
  యేనికకు నెప్పుడేరీతి ముదమయ్యె
  హరినిహరి హరించె హరి కనగ .

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
   మీ భావం బాగుంది. కాని సమస్య ఆటవెలది అయితే మీరు తేటగీతి వ్రాశారు. సవరించండి.

   తొలగించండి
 17. హరి యెచటర యనగ హరి యిచటయెచట
  హరియె; గనుము తండ్రి హరియె నీవు
  హరియె నేను; వేడ హరిని వచ్చె హరియు
  హరిని హరి హరించె హరి కనంగ !

  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబీ గారూ,
   మీ పూరణ, అందలి ‘లాజిక్కు’ బాగున్నవి. అభినందనలు.

   తొలగించండి
 18. మన్నించండి పొరపాటు.
  సరసిఁకరి యెవరిని సన్నుతించి కొలిచె
  మాయ చేసి రెవరు మకరి నచట
  హస్తి కెప్పుడిలను హర్షంబు కలిగేను
  హరిని హరి హరించె హరి కనగ.

  రిప్లయితొలగించండి
 19. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
  సవరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  అరసున్నా ఉన్నప్పుడు 'సరసిఁ గరి' అనండి. 'కలిగేను' వ్యావహారికం. 'కలిగెను' అనండి.

  రిప్లయితొలగించండి