27, జనవరి 2016, బుధవారం

ఛందస్సు పాఠాలు -3

యతి ప్రాసలు
క్రింది పద్యాన్ని గమనించండి.
నిరుపమగుణజాలా *నిర్మలానందలోలా
దురితఘనసమీరా *దుష్టదైత్యప్రహారా
శరధిమదవిశోషా *చారుసద్భక్తపోషా
సరసిజదళనేత్రా *సజ్జనస్తోత్రపాత్రా.
ఈ పద్యం పేరు మాలినీవృత్తం.  దీని గణాలు న-న-మ-య-య. యతిస్థానం 9. ప్రాసనియమం ఉంది.
వృత్తంఅంటే ఏమిటో తరువాత తెలుసుకుందాం.
గణాలగురించి తెలుసుకున్నాం.
యతిస్థానం 9’ అని ఉంది. అదేమిటో చూద్దాం... మొదటిపాదంలో మొదటి అక్షరం ని’, తొమ్మిదవ అక్షరం ని’. రెండవపాదంలో మొదటి అక్షరం దు’, తొమ్మిదవ అక్షరం దు’. నాల్గవపాదంలో మొదటి అక్షరం ’, తొమ్మిదవ అక్షరం ’. ఈ విధంగా ప్రతి పాదంలో మొదటి అక్షరం, తొమ్మిదవ అక్షరం ఒకేవిధంగా ఉన్నాయి. దీనిని యతిమైత్రి అంటారు. ఒక్కొక్క పద్యానికి ఒక్కొక్క స్థానం యతిగా గుర్తింపబడింది. పై పద్యంలో మూడవపాదంలో మొదటి అక్షరం కాగా, తొమ్మిదవ అక్షరం చాఉంది. అంటే యతిస్థానంలో ఆ పాదంలోని మొదటి అక్షరమే కాక, దానితో మిత్రత్వం కలిగిన వేరే అక్షరాలు వేయవచ్చు. అవేమిటో యతిమైత్రిఅన్న శీర్షికలో వివరంగా తెలుసుకుందాం.
ప్రాసనియమం ఉందిఅంటే ఏమిటో తెలుసుకుందాం... పై పద్యంలో ప్రతిపాదంలో రెండవ అక్షరంగా వరుసగా రు, రి, , ర అనే అక్షరాలు ఉన్నాయి. ఈ విధంగా అన్నిపాదాలలోని రెండవ అక్షరం ఒకే హల్లై ఉండడం ప్రాస అంటారు. దీని గురించి ప్రాసమైత్రిఅనే శీర్షికలో వివరంగా తెలుసుకుందాం.

యతిమైత్రి
ఛందస్సులో యతి అనేది ఒక పారిభాషికపదం. సంస్కృతంలో దీనికి విచ్ఛేదమని అర్థం. విచ్ఛేదమంటే ఏ పదానికి ఆ పదం విడిపోవడం అని తాత్పర్యం. కస్తూరీతిలకే లలాటఫలకే వక్షస్థలే కౌస్తుభంఇది శార్దూలవృత్తం. దీని యతిస్థానం 13. అంటే 12వ అక్షరంతో ఒక పదం పూర్తయి 13వ అక్షరంతో మరొక పదం ప్రారంభం అవుతుంది. ఇది సంస్కృత సంప్రదాయం.
కాని తెలుగులో పదవిచ్ఛేదం కాకుండా పాదంలోని మొదటి అక్షరంతో మైత్రి కలిగిన మరో అక్షరాన్ని  ఆ స్థానంలో వేయవచ్చు.
ఈ మైత్రి అచ్చులకు, హల్లులకు వేరువేరుగా ఉంటుంది. యతిమైత్రి హల్లులకే కాక, వాటితో కలిసిన అచ్చులకు కూడ వర్తిస్తుంది.
పదాలమధ్య సంధి జరిగినపుడు రెండవపదం మొదటిఅచ్చుకు యతి చెల్లించాలి. ఉదా- *అతులవిక్రముఁ డతఁడు వి*ద్యాధికుండు (విద్యా +*అధికుండు).
ఒకటికంటె ఎక్కువ హల్లులు కల సంయుక్తాక్షరం పాదం మొదటి అక్షరంగా కాని, యతిస్థానంలో కాని ఉంటే అందులో ఏదో ఒక హల్లుకు మైత్రిని పాటించవచ్చు. ఉదా-  (i) *స్మరజనకా వాసుదేవ *సజ్జనవినుతా (స్మఅనే సంయుక్తాక్షరంలోని కు యతి). (ii) *క్రతురక్షక దీనబంధు *రాక్షసవైరీ (క్రఅనే సంయుక్తాక్షరంలో కు యతి). (iii) *పరిపాలింపు మని నిన్ను *ప్రార్థింతు హరీ (ప్రాలోని కు యతి). (iv) *రక్షించెడి దేవుడవని *ప్రార్థింతు సదా (ప్రాలోని కు యతి).

యతిమైత్రి కలిగిన అక్షరాలు....
1) అ-ఆ-ఐ-ఔ
2) ఇ-ఈ-ఋ-ౠ-ఎ-ఏ.
3) ఉ-ఊ-ఒ-ఓ.
గమనిక - హల్లుతో పాటు దాని మీది అచ్చుకు  కూడా యతిమైత్రి పాటించాలి. ఉదా- i)క-కా-కై-కౌ; ii)కి-కీ-కృ-కౄ-కె-కే; iii)కు-కూ-కొ-కో.
4)క-ఖ-గ-ఘ
5) చ-ఛ-జ-ఝ-శ-ష-స
6) ట-ఠ-డ-ఢ
7) త-థ-ద-ధ
8) ప-ఫ-బ-భ-వ
9) అనుస్వారం(సున్న)తో కూడిన వర్గాక్షారాలు నాలుగు ఆ వర్గపు పంచమాక్షరం (అనునాసికాక్షరం)తో యతి చెల్లుతాయి.
ంక,ంఖ,ంగ,ంఘ-ఙ;
ంచ,ంఛ,ంజ,ంఝ-ఞ;
ంట,ంఠ,ండ,ంఢ-ణ;
ంత,ంథ,ంద,ంధ-న;
ంప,ంఫ,ంబ,ంభ-మ.
10) పు,ఫు,బు,భు-ము.
11) -ఱ-ల-ళ.
12) న-ణ.
13) అచ్చులతో య,హ లకు యతి చెల్లుతుంది. అంటే (i) అ,ఆ,ఐ,ఔ, య,యా,యై,యౌ, హ,హా,హై,హౌ; (ii) ఇ,ఈ,ఋ,ౠ,ఎ,ఏ, యి,యీ,యె,యే, హి,హీ,హృ,హె,హే; (iii) ఉ,ఊ,ఒ,ఓ, యు,యూ,యొ,యో, హు,హూ,హొ,హో.
14) ‘క్ష’ అనేది కకార, షకారాల సంయుక్తాక్షరం కనుక దానికి క,ఖ,గ,ఘలతోను, చ,ఛ,జ,ఝ,శ,ష,సలతోను యతి చెల్లుతుంది.
15) యతిమైత్రి లేని అక్షరాలు రెండింటికి ఋత్వం ఉన్నట్లయితే వాటికి యతి చెల్లుతుంది. ఉదా. కృ-తృ.
ఇవి ముఖ్యమైన యతిభేదాలు. ఇంకా ఎన్నో భేదాలున్నాయి. అవి తరువాత వివరంగా తెలిసికొనవచ్చు.  ఆసక్తి కలవారు క్రింది లింకులను చూడండి.


(తరువాతి పాఠంలో ప్రాసమైత్రిని గురించి తెలుసుకుందాం)

8 కామెంట్‌లు:

  1. గురువు గారికి ధన్యవాదములు చాలా చక్కగా వివరించారు కానీ చిన్న సందేహం వుండిపోయింది

    కందపాదం

    కృష్ణని నమ్మిన నుచాలు తృప్తిగ బ్రతకన్ యతి సరిపోతుందా

    రిప్లయితొలగించండి
  2. ‘కస్తూరీతిలకే లలాటఫలకే వక్షస్థలే కౌస్తుభం’ . శార్థూలంకు 13 వ అక్షరం యతిస్తానం కదా. ఆ పద్యంలో 13 వ అక్షరం "వ" వచ్చింది. 14 వ అక్షరం "క్ష" వచ్చింది.దయతో వివరించండి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తెలుగుపద్యాలలో యతిమైత్రిస్థానంలో అక్షరసామ్యయతి చెలించాలి. సంస్కృతశ్లోకాలలో నియమం వేరు. అక్కడ యతిమైత్రిస్థానంలోనూ పాదం చివరనూ పదవిరామం ఉండాలి. అంటే పదం పూర్తికావాలి.వక్షస్థలే అన్నచోట కొత్తమాటతో మొదలు కావటం. అలాగే ప్రతిపాదమూ కొత్తపదంతో ప్రారంభంకావటమూ చూడండి ఈ శ్లోకంలో. సమాసం ఒకపాదంనుండి మరొకపాదానికి ప్రవహించవచ్చును కాని అందులోని ఒకపదం అలా ప్రవహించటం కుదరదు. తెలుగులో పాదచివరన ఒక మాట కొంతభాగం ఉండి మిగిలినభాగంతో తరువాతి పాదం ప్రారంభం కావచ్చును.

      తొలగించండి
  3. కంది శంకరయ్య గారు ఛందము చెప్ప
    తెలుసుకొంటిమయ్య తేటగాను
    సంశయములు తీర్చ చక్కని గురువయి
    జనని దయను దొరికె జాలమందు

    నమస్తే అండి.
    ఏదో ప్రయత్నించేను. సరిగా ఉందా అండి?

    శ్రీకాంత్ గడ్డిపాటి.

    రిప్లయితొలగించండి
  4. మీ వివరణ చాలాబాగుందండి.
    చిన్న సందేహం పద్యాలలో రవడికిగల(ఛందస్సులొ) ప్రత్యేకనియమం చెప్పగలరా please.

    రిప్లయితొలగించండి