3, జనవరి 2016, ఆదివారం

ఛందస్సు నేర్చుకుందాం - 2

ఛందస్సు - పాఠం 2
గణాలు
గణం అంటే సమూహం. వ్యాకరణంలో అక్షరాల సమూహం పదమైనట్లు ఛందస్సులో అక్షరాల సమూహం గణం అవుతుంది. పదాల వలెనే ఏకాక్షర, ద్వ్యక్షర, త్ర్యక్షర, చతురక్షర గణాలున్నాయి.
ప్రధానంగా ఈ గణాలు రెండు వర్గాలుగా విభజింపబడ్డాయి. అవి (i) అక్షర గణాలు, (ii) మాత్రాగణాలు.
చతుర్మాత్రాగణాలు అని మరొక భేదం ఉంది.

(i) అక్షర గణాలు :- గణంలోని అక్షరసంఖ్యను బట్టి ఏర్పడిన గణాలు ఇవి. వీటిలో మూడక్షరాల గణాలు ప్రధానమైనవి.

1) ఏకాక్షర గణాలు :- ఒకే అక్షరం ఉన్న గణాలు 2.
ఒక లఘువు - దీనిని అంటారు. దీని చిహ్నం I.
ఒక గురువు - దీనిని అంటారు. దీని చిహ్నం U.

2) ద్వ్యక్షర గణాలు :- రెండక్షరాలున్న గణాలు 4.
UU - రెండు గురువులు - దీనిని గగము (గా)అంటారు.  (ఉదా. రామా)
UI - ఒక గురువు ఒక లఘువు - దీనిని హగణము (గలము)అంటారు. గురువుకు ’, లఘువుకు రెంటిని కలిపి గలముఅన్నారు. కాని హగణముఅనడమే ప్రసిద్ధం.  (ఉదా. రామ)
IU - ఒక లఘువు ఒక గురువు - దీనిని వగణము (లగము)అంటారు. లఘువుకు ’, గురువుకు రెంటిని కలిపి లగముఅన్నారు.  (ఉదా. హరీ)
II - రెండు లఘువులు - దీనిని లలము (లా)అంటారు. పద్యాలలో దీని ఉపయోగం లేదు.  (ఉదా. హరి)

3) త్ర్యక్షర గణాలు :- మూడక్షరాల గణాలు 8.
UUU - మగణము (సర్వ గురువు) - శ్రీరామా.
UII - భగణము (ఆది గురువు) - మాధవ.
IUI - జగణము (మధ్య గురువు) - ముకుంద.
IIU - సగణము (అంత్యగురువు) - వరదా.
III - నగణము (సర్వ లఘువు) - వరద.
IUU - యగణము (ఆది లఘువు) - ముకుందా.
UIU - రగణము (మధ్య లఘువు) - మాధవా.
UUI - తగణము (అంత్య లఘువు) - శ్రీరామ.
ఈ మూడక్షరాల గణాలు తెలిసికొనడానికి ఒక సూత్రం ఉంది. అది యమాతారాజభానసలగమ్’.  దీనిని వ్రాసి దీని క్రింద గురు లఘువులను గుర్తించండి. గణాలను క్రింది విధంగా తెలిసికొనవచ్చు.
యమాతారాజభానసలగమ్
  I U  U U I U I  I I   U
యమాతా - IUU - యగణము.
మాతారా - UUU - మగణము.
తారాజ - UUI - తగణము.
రాజభా - UIU - రగణము.
జభాన - IUI - జగణము.
భానస - UII - భగణము.
నసల - III - నగణము.
సలగమ్ - IIU - సగణము.
గణాలను గుర్తించడానికి మరొక సూత్రం ఉంది. అది ఇది...
సర్వగురువు మ - ఆదిమధ్యాంత గురువులు భజస.
సర్వలఘువు న - ఆదిమధ్యాంత లఘువులు యరత
సర్వగురువు మగణము - అన్నీ గురువులు - UUU.
ఆదిగురువు భగణము - మొదట గురువు, తరువాత రెండు లఘువులు - UII.
మధ్యగురువు జగణము - మొదట లఘువు, మధ్యలో గురువుచివర లఘువు - IUI.
అంత్యగురువు సగణము - మొదట రెండు లఘువులు, చివర గురువు - IIU.
సర్వలఘువు నగణము - అన్నీ లఘువులు - III.
ఆదిలఘువు యగణము - మొదట లఘువు, తరువాత రెండు గురువులు - IUU.
మధ్యలఘువు రగణము - మొదట గురువు, మధ్యలో లఘువు, చివర గురువు - UIU.
అంత్యలఘువు తగణము - మొదట రెండు గురువులు, చివర లఘువు - UUI.

4) చతురక్షర గణాలు :- నాలుగక్షరాల గణాలు 16. మూడక్షరాల గణాలు తెలిస్తే నాలుగక్షరాల గణాలను తెలిసికొనడం సులభం. ఎలాగంటే III - ఇది నగణము. దీని తరువాత లఘువు చేరితే న(గణము)+ల(లఘువు)= నలము - IIII. నగణము తరువాత గురువు చేరితే న(గణము)+గ(గురువు)=నగము - IIIU. ఇలాగే మిగిలినవి.
UUUU - మగము (మగణము+గురువు) - శ్రీలక్ష్మీశా
UUUI - మలఘువు (మగణము+లఘువు) - శ్రీలక్ష్మీశ. (మలము’ అనరాదు)
UIIU - భగురువు (భగణము+గురువు) - చక్రధరా. (‘భగము’ అనరాదు)
UIII - భలము (భగణము+లఘువు) - చక్రధర.
IUIU - జగము (జగణము+గురువు) - మురాంతకా.
IUII - జలము (జగణము+లఘువు) - మురాంతక.
IIUU - సగము (సగణము+గురువు) - మురవైరీ.
IIUI - సలము (సగణము+లఘువు) - మురవైరి.
IIIU - నగము (నగణము+గురువు) - మురహరా.
IIII - నలము (నగణము+లఘువు) - మురహర.
IUUU - యగము (యగణము+గురువు) - మురధ్వంసీ.
IUUI - యలము (యగణము+లఘువు) - మురధ్వంసి.
UIUU - రగము (రగణము+గురువు) - శ్రీనివాసా.
UIUI - రలము (రగణము+లఘువు) - శ్రీనివాస.
UUIU - తగము (తగణము+గురువు) - లక్ష్మీపతీ.
UUII - తలము (తగణము+లఘువు) - లక్ష్మీపతి.
పై 16 గణాలలో కేవలం నలము (IIII), నగము (IIIU), సలము (IIUI) అనే మూడు గణాలు మాత్రమే ఉపయోగపడతాయి.  అదికూడ ఆటవెలది, తేటగీతి, ద్విపద, సీసపద్యాలకు మాత్రమే. కనుక మిగిలినవాటిని నేర్చుకొనవలసిన అవసరం లేదు. 

(ii) మాత్రాగణాలు :- అక్షరసంఖ్యకు ప్రాధాన్యం లేకుండ ఏర్పడినవి మాత్రాగణాలు.  ఇవి సూర్య, ఇంద్ర, చంద్రగణాలని మూడు విధాలు.
1. సూర్యగణములు :- ఇవి రెండు. హగణము (UI), నగణము (III).
2. ఇంద్రగణములు :- ఇవి ఆరు. నల, నగ, సల, , , గణాలు.
నలము - IIII
నగము - IIIU
సలము - IIUI
భగణము - UII
రగణము - UIU
తగణము - UUI
3. చంద్రగణాలు :-  రగము (UIUU), నగగము (IIIUU), తగము (UUIU), సలగము (IIUIU), భగురువు (UIIU), నలగము (IIIIU), మలఘువు (UUUI), సగలము (IIUUI), రలము (UIUI), నగలము (IIIUI), తలము (UUII), సలలము (IIUII), భలము (UIII), నలలము (IIII).
పైన చెప్పిన మాత్రాగణాలలో కేవలం సూర్య, ఇంద్ర గణాలు మాత్రమే ప్రధానం. చంద్రగణాలు అక్కరలుఅనే ఛందస్సుకు చెందినవి. వీటిని ఇప్పుడు నేర్చుకోవలసిన అవసరం లేదు.

గణ విభజన :-
      పద్యపాదానికి గురు లఘువులను గుర్తించి, అందులో ఏ గణాలున్నవో తెలిసికొనడం. ఉత్పలమాల మొదలైన వృత్తాలకు, కందం మొదలైన జాతులకు, ఆటవెలది మొదలైన ఉపజాతులకు ఈ గణ విభజన వేరువేరుగా ఉంటుంది.
        ముందుగా వృత్తాల గణవిభజన చేద్దాం. ఈ వృత్తాలు కేవలం మూడక్షరాల గణాలతో ఏర్పడతాయి. చివర ఒక అక్షరం లేదా రెండక్షరాలు మిగలవచ్చు. సాధారణంగా గురువు మిగిలితే ‘గ’ అనీ, ఒక లఘువు, గురువు మిగిలితే ‘వ’ అనీ, రెండు గురువులు మిగిలితే ‘గగ(గా)’ అనీ గుర్తించాలి.

ఉదా…
శ్రీవేంక టేశద యితే త వ సుప్ర భాతమ్
UU I  UI  I   I  U  I  I  U I   U  U
   త     భ      జ      జ     గగ.

విజయీ భవ వేం కటశై లపతే
I  I  U   I  I  U   I I U I I U
   స       స      స     స

ఇంతలు గన్నులుం డఁ దెరు వెవ్వరి వేడేదు భూసురో త్తమా
U  I  I  U  I   U    I   I  I   UI  I  U I I   U  I  I    I U
    భ       ర            న       భ      భ        ర       వ

స్తుతమ తి యైన యాంధ్రక వి ధూర్జ టి పల్కు ల కేల కల్గెనో
 I  I  I   I   U  I   U   I  I  I  U  I  I   U  I   I U I  U I U
    న         జ        భ        జ         జ        జ      ర

తల్లీ ని న్నుఁ దలం చి పుస్త కము చే తంబూ ని తిన్ నీ వు నా
UU U  I     I   U  I  U  I  I  I   U  U  U   I  U  U  I   U
  మ         స          జ       స          త          త      గ

సరి బే సై రిపు డేల భా స్కరులు భాషానా థ పుత్రా వసుం
I I  U  U I I   U I U   I   I  I   U  U U  I  U U  I U


ఇలాగే మీరు కొన్ని వృత్తాలను (ఉత్పలమాల, చంపకమాల, శార్దూలం, మత్తేభం) తీసికొని గణవిభజన చేయండి. 

10 కామెంట్‌లు:

 1. ఈ పాఠాలను గురించి సవరణలను, సూచనలను అందించవలసిందిగా కవిమిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నాను.

  రిప్లయితొలగించండి
 2. మిత్రులు శంకరయ్యగారికి నమస్సులు! మీరు సవరణములకును, సూచనములకును తావులేకుండునట్టి పాఠమునందఁజేసితిరి! ఇది ఛందస్సాధకులకుఁ దప్పక యుపయుక్తముగ నుండఁగలదనుటలో సందియములేదు! మీకు నా శుభాభినందనలు!!

  రిప్లయితొలగించండి
 3. అద్భుతమండి గురువుగారు......ఛందస్సు గురించి అరటీపండు ని ఒలిచీనంత చక్కగా వివరించారు.... అభినందనలు...నాలాంటి వారీకీ యెంతో అపయొగకరము

  రిప్లయితొలగించండి
 4. నమో నమః !

  చదువు కొనగ టీచరై కంది వా
  రధిగ, టపల తోరణాశ్రేణి యీ
  పద కవులకు సంపదా వాలమై
  నదిర ! కవివరా నమో శంకరా !

  చీర్స్
  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబీ గారూ,
   మీ ప్రభావృత్తం బాగుంది. అభినందనలు.
   ‘టపాల’ గణంకోసం ‘టపల’ అయింది. ‘తోరణశ్రేణి’ అనడం సాధువు. అలా అన్నా ‘ణ’ గురువే.
   జిలేబీ‘ప్రభ’ను ఇతర చ్ఛందస్సుల్లోకీ ప్రసరింపజేయండి.

   తొలగించండి
 5. ప్రణామములు గురువుగారు...అందరికీ సులువుగా అర్ధమయ్యే రీతిలో మీరు వ్రాస్తున్న చందస్సు పాఠాలు నాలాంటి వారందరికీ ఎంతో ఉపయోగకరమైనవి...అలాగే యడాగమం,నుగాగమంల గురించినపాఠాల గురించి ఎదురుచూస్తుంటాను..

  రిప్లయితొలగించండి
 6. ఛందస్సు పాఠాలను ఆమోదించిన మిత్రులందరికీ ధన్యవాదాలు.
  *****
  శైలజ గారూ,
  ఛందస్సు పాఠాల అనంతరం ఆ పాఠాలను చెప్పాలని ఈ ఉదయమే నిర్ణయం తీసుకున్నాను.

  రిప్లయితొలగించండి
 7. నమస్తే అండి.
  చాలా బాగుంది.
  నేను ఎన్నో నేర్చుకుంటున్నాను మీ బ్లాగు నుండి.
  చాలా కృతజ్ఞతలు.

  శ్రీకాంత్ గడ్డిపాటి.

  రిప్లయితొలగించండి