ఏకవింశతి పత్ర పూజ (పాట)
ఏకదంతా! నీ కిదే మా
- ఏకవింశతి పత్రపూజ
కరుణతో మా కొసగవయ్యా
- కలిమి బలిమిని విఘ్నరాజా || ఏకదంతా ||
సుముఖ! వీతభయా! సదయ!
నీ - కిదియె మాచీపత్రము
ఓ గణాధిప! శాశ్వతా!
నీ - కిదియె బృహతీపత్రము
శ్రీ ఉమాసుత! గజస్తుత్యా!
- బిల్వపత్ర మ్మిదియె నీకు
హే గజానన! అవ్యయా!
నీ - కిదియె దూర్వాయుగ్మము
హరతనూభవ! గణపతీ! దు-త్తూరపత్ర
మ్మిదియె నీకు
మౌనినుత! లంబోదరా!
నీ - కిదియె బదరీపత్రము
హే గుహాగ్రజ! గ్రహపతి!
అపా-మార్గపత్ర మ్మిదియె నీకు
భక్తవాంఛిత దాయకాయ
వి-నాయకాయ నమో నమః || ఏకదంతా ||
శ్రీపతీ! గజకర్ణకా!
నీ - కిదియె తులసీపత్రము
ఏకదంత! దయాయుతా! గతి!
- చూతపత్ర మ్మిదియె నీకు
వికట! ఇంద్రశ్రీప్రదా!
కర-వీరపత్ర మ్మిదియె నీకు
భిన్నదంతా! దాంత! విష్ణు-క్రాంతపత్ర
మ్మిదియె నీకు
వటు! ద్విజప్రియా!
నిరంజన! - దాడిమీపత్రమ్ము నీకు
కామీ! సర్వేశ్వరా!
దేవ-దారుపత్ర మ్మిదియె నీకు
ఫాలచంద్ర! సమాహితా!
నీ - కిదియె మరువకపత్రము
భక్తవాంఛిత దాయకాయ
వి-నాయకాయ నమో నమః || ఏకదంతా ||
హేరంబా! హే చతుర! సింధు-వారపత్ర
మ్మిదియె నీకు
శూర్పకర్ణ! అకల్మషా!
నీ - కిదియె జాజీపత్రము
హే సురాగ్రజ! పాపహర! ఇదె - గండకీపత్రమ్ము నీకు
అధ్యక్ష! ఇభవక్త్ర!
శుద్ధా! - శమీపత్ర మ్మిదియె నీకు
హే వినాయక! శక్తియుత!
అ-శ్వత్థపత్ర మ్మిదియె నీకు
దేవ! సురసేవిత! కృతీ!
నీ - కిదియె అర్జునపత్రము
కపిల! కలికల్మష వినాశక!
- అర్కపత్ర మ్మిదియె నీకు
భక్తవాంఛిత దాయకాయ
వి-నాయకాయ నమో నమః || ఏకదంతా ||
(దాదాపు పదేళ్ళ క్రితం మా వీధిలో గణేశమండపం వాళ్ళ కోరికపై వ్రాసి
ఇచ్చిన పాట)