6, సెప్టెంబర్ 2013, శుక్రవారం

సమస్యాపూరణం – 1166 (సర్వదా చింతయే గాదె)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది .....
సర్వదా చింతయే గాదె సంతు వలన.
(కాళ్ళకూరి నారాయణ రావు గారి ‘సంసార ఘటన’ నుండి)

27 కామెంట్‌లు:

  1. చిరునవ్వు లొల్కెడు శిశుల చేష్టల గన
    ....సర్వదా సౌఖ్యమౌ సంతు వలన
    ముద్దుగా బిడ్డలు ముచ్చటల్ గూర్చుచో
    ....సర్వదా సౌఖ్యమౌ సంతు వలన
    బడులందు ప్రజ్ఞానవంతులై తనరుచో
    ....సర్వదా సౌఖ్యమౌ సంతు వలన
    సద్యోగముల గని సంఘాన రాణించ
    ....సర్వదా సౌఖ్యమౌ సంతు వలన
    అవ్విధమ్మున గాక దుర్వ్యసనములకు
    మూలమై వక్రబుద్ధియై మూర్ఖుడగుచు
    వంశమున కొక్క మచ్చగా పరిణమించ
    సర్వదా చింతయే గాదె సంతు వలన

    రిప్లయితొలగించండి
  2. తండ్రి పేరును నిలఁబెట్టు తనయుఁ డగున
    టంచుఁ దలఁచెడు తండ్రికి, హతవిధి! యిలఁ
    దండ్రి గుణములఁ జెఱచెడు తనయుఁ డైన,
    సర్వదా చింతయే గాదె సంతు వలన?!

    రిప్లయితొలగించండి
  3. సరదా పూరణ...

    పంది కొక్కులు గాదెపో వైరులకట
    గాదె క్రిందన బుట్టును, గాదె తిండి
    పెట్టి పోషించు నవి గాదెపిల్ల లనెద
    సర్వదా చింతయే - గాదె సంతు వలన.

    రిప్లయితొలగించండి
  4. గురువర్యుల పాదపద్మములకు ప్రణమిల్లుతూ...ప్రధమ ప్రయత్నం సాహసించినాను..తప్పులకు మన్నించి ఆశీర్వదించ ప్రార్ధన..

    తల్లి యొడిని దూరి తారాటలాడిన
    ....పసిపిల్లలనుగని బరవశించు
    ఉగ్గుపాలతోనెఉన్నతిని కాంక్షించి
    ....తెలుగుపలుకుతెల్పితీర్చిదిద్దు
    పస్తులున్నగానిపలుకష్టములురాని
    ....పెంచిబెద్దజేయుపేదయైన
    కంటికిరెప్పలా కాచిరక్షించుచు
    ....కాలమెల్ల వారికే ఖర్చుజేయు

    ఎన్ని చేసిన తల్లుల కేమి ఫలము
    ఎదురుమాటలచేతల ఎదను కోయు
    పేరునిల్పరుసరికదావేరుచేయు
    సర్వదా చింతయేగాదెసంతువలన

    రిప్లయితొలగించండి
  5. కొడుకు ప్రహ్లాదు మూలాన మడిసె తండ్రి
    సుతుడు కంసుని చేతిలో వెతల బడిసె
    జగము వీడినా విడకుండె జగను నీడ
    సర్వదా చింతయే గాదె సంతు వలన!!!

    రిప్లయితొలగించండి
  6. కర్ణుని నిర్యాణానంతరము కుంతిమనసులో భావన.........

    పుట్టినప్పుడె నీటను ముంచినాను
    రాయినైతి విద్యాప్రదర్శనమునందు
    నేడు యుద్ధమ్మునందున నింగికెగసె
    సర్వదా చింతయే గాదె సంతువలన

    రిప్లయితొలగించండి
  7. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    హిరణ్య కశిపుని స్వగతం :

    01)
    _______________________________

    చదువు లందు సారంబెల్ల - చదివితి నను !
    చదువు నేర్పెడి గురువుల - శ్రద్ధ వినక
    సర్వ వ్యాపి స్వయంభువు - సౌరి యనుచు
    సర్వ వేళల వానినే - స్మరణ జేయు !
    సర్వ లోకంబులవె నన్ను - సన్నుతింప
    సత్యమును గ్రహింప డదేల - శైశవమొకొ ?
    చంపివేయుద మన్ననూ - చావడేమి ?
    చావు నాకొచ్చి పడె వీని - జంపలేక
    సర్వదా చింతయే గాదె - సంతు వలన !
    _______________________________

    రిప్లయితొలగించండి
  8. శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో

    శ్రీ శంకరయ్య గురుదేవులకు ధన్యవాదములు.
    ======*======
    సంతు వలన గలుగు సుఖ శాంతులనుచు
    పంతమునుభూని పెంచగా సంతు తంతి,
    దంతి వలె వారు వింతగా దాడి జేయ
    సర్వదా చింతయేగాదెసంతువలన?

    రిప్లయితొలగించండి
  9. దశరథుని దుఃఖం :

    02)
    _______________________________

    సత్యభామకు వరమనే - సాకు జూపి
    వలదు వలదన్న వినకుండ - వనములకును
    సత్య వాక్పరిపాలుండు - నిత్య వ్రతుడు
    పయన మాయెను రాముండు - పత్ని తోడ !
    రాముడే నాకు భాగ్యమ్ము - భూమి మీద
    రాముడే లేని యెడ నాకు - రాజ్యమేల ?
    రాముడే లేని నా కింక - ప్రాణమేల ?
    రామ శ్రీరామ శ్రీరామ - రామ రామ
    యనుచు దుఃఖించి దుఃఖించి - తనువు విడచె !
    సర్వదా చింతయే గాదె - సంతు వలన !
    _______________________________

    రిప్లయితొలగించండి
  10. దృతరాష్ట్రుని వేదన :

    03)
    _______________________________

    వంద మందిని గంటిని - సుందరముగ !
    పెంచు కొంటిని ముదమార - ప్రేమ తోడ !
    దుష్టవర్తన జరియించి - దురితవశము
    సమసి పోయిరి సుతులెల్ల - సమర మందు !
    దుఃఖ మాపగ లేనింక - దుర్బలుండ
    సర్వదా చింతయే గాదె - సంతు వలన !
    _______________________________

    రిప్లయితొలగించండి
  11. గంప గయ్యాళి యౌ భార్య గలుగు నెడల
    సర్వదా చింతయే గాదె , సంతు వలన
    వంశ మభి వృ ధ్ధి మార్గాన బచ్చ గాను
    ఉడు పతిని వోలె కాంతులు నొందు చుండు

    రిప్లయితొలగించండి
  12. సర్వదా చింతయే గాదె సంతు వలన
    ననకు, మానందదాయి నందను డనంగ
    పుత్రుడన నరక బాధల బోవ జేయు
    పుణ్యముల రాశి పుత్రియౌ పుడమి పైని

    రిప్లయితొలగించండి
  13. శ్రీ మంద పీతాంబర్ గారు మంచి పద్యము వ్రాసినారు "జగము వీడినా విడకుండె జగను నీడ" ధన్యవాదములు,శ్రీ వసంత కిషోర్ గారికి ధన్యవాదములు. నా వంతు శ్రీ వసంత కిషోర్ పూర్తి జేసినారు. పరీక్షల వల్ల మధ్యలో సమయము దొరుకుట లేదు.రాత్రికి ప్రయత్నము జేసెదను.

    రిప్లయితొలగించండి
  14. వసంత కిశొర్జీ ! బహుకాలదర్శనం... ఆరోగ్యమెలా ఉంది...కుశలమే కదా..
    దశరథుని స్వగతం లో..సత్యభామ వచ్చింది ..కొంచెం చూస్తారా...

    రిప్లయితొలగించండి
  15. చింత గలుగు దంపతులకు సంతులేక
    సంతసింతురు కలిగిన సంతువలన,
    సంతు చెడుయైనచోతల్లి దండ్రులకును
    సర్వదా చింతయే గాదె సంతు వలన

    రిప్లయితొలగించండి
  16. పూజ్యగురుదేవులు శ౦కరయ్యగారికి నమస్కారములు.

    వ్రతములును నోములును పూజ లను ముడుపులు
    మొక్కు చెల్లించ పిల్లలు పుట్ట వారి
    పెంపకము చదువు కొలువు పెండ్లిసేయ
    సర్వదా చింతయే గాదె సంతు వలన

    రిప్లయితొలగించండి
  17. చిన్న నాటను ముద్దైన చిలుక పలుకు
    పెరిగి నంతనె ప్రేమలు తరుగు చుండు
    పెండ్లి జేయగ గుండెలు బండ బారు
    సర్వదా చింతయే గాదె సంతు వలన

    రిప్లయితొలగించండి
  18. ఈషణ త్రయమ్మందు సంతోష మేది?
    ధనము, దారయు కల్గుట ఘనము కాదు.
    సంతు పొందగ, పెంచగ, చక్క బ్రతుక,
    సర్వదా చింతయే గాదె సంతు వలన.
    ఆర్యులారా!
    ఆంధ్రామృతం ద్వారా మీ కవితామృతంతో గణపతిని అభిషేకించండి.
    http://andhraamrutham.blogspot.in/2013/09/blog-post_6.html#.UinULtKBnmQ

    రిప్లయితొలగించండి
  19. శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో,

    వై యస్ ఆర్ తన భార్యకు జేయు తత్వభోధ
    ======*========
    సంతు సమర శరములకు-సర్వదా చింత యే గాదె
    సంతు వలనలేదు సుఖము- సత్య భామ!జనుల కెల్ల
    గంతులు గట్టితి సుతుని- గట్టి కోర్కెలు దీర్చ! సుతుని
    బ్రాంతి యందు మరచిపోతి- పరిపాలన! వలదు నీకు
    పంతము వలదన్న మరచి- పాదయాత్రలు జేయ వాని
    చింతలు దీరవు! పోకు -చెరసాల జెంతకు బోకు !
    సంతసమున భువిలోన -జనులు విను మన బలుకు!
    వంత బాడునుగద కొంత-పైకమిచ్చిన'సంతు'జనులు!
    వింత గాదు,సుమ నేనెంత -వెదికిన కానరా లేదు
    సొంత జనులనువారు -సుఖమును గనుడు మీరెల్ల
    రంతర్యామిని భక్తి తోడ-నాదు కొమ్మనుచు గొలిచి!

    రిప్లయితొలగించండి
  20. పండిత నేమాని వారూ,
    సౌఖ్యాన్ని కల్గించే సంతానం గురించి, చింత కలిగించే సంతానం గురించి విపులంగా వివరించారు మీ మొదటి పూరణలో.
    సంతు సంతోషాన్నిస్తుందని రెండవ పూరణ కూడా చక్కగా ఉంది. అభినందనలు.
    *
    గుండు మధుసూదన్ గారూ,
    భ్రష్టుడైన సంతు వలన కలిగే చింతను గురించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ గాదె సంతు పూరణ సరదాగా, చమత్కారావహంగా ఉంది. అభినందనలు.
    *
    శైలజ గారూ,
    మీ సీసపద్య పూరణ బాగుంది. అభినందనలు.
    రెండవ పాదంలో ‘ఉగ్గుపాలతోనె’ అన్నచోట గణదోషం. అక్కడ ‘ఉగ్గుపాలను పోసి’ అందాం.
    మూడవ పాదాన్ని ‘పస్తులున్ననుగాని పలుకష్టములురాని/....పెంచిబెద్దగ జేయు పేదయైన’ అంటే గణదోషం తొలగిపోతున్నది.
    ‘రెప్పలా’ అంటే వ్యావహారికం. ‘రెప్పగ’ అనండి. ‘కాలమ్ము వారికే’ అంటే గణదోషం పోతుంది.
    *
    మంద పీతాంబర్ గారూ,
    కొడుకుల వలన చింత పొందిన తండ్రుల గురించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    కుంతి చింతను చక్కగా పూరణలో వివరించారు. బాగుంది. అభినందనలు.
    *
    వసంత కిశోర్ గారూ,
    హిరణ్యకశిపుడు, దశరథుడు, ధృతరాష్ట్రుడు ముగ్గురిపై మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    రెండవ పూరణపై గోలివారి వ్యాఖ్యను గమనించారా?
    *
    వరప్రసాద్ గారూ,
    మీ మొదటి పూరణ శబ్దాలంకార శోభితమై అలరిస్తున్నది.
    రెండవ పూరణ కూడా బాగుంది. అభినందనలు.
    జనులు అని బహువచనానికి విను, వంతబాడును అని ఏకవచన క్రియారూపాలను ఉపయోగించారు.
    *
    సుబ్బారావు గారూ,
    విరుపుతో చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
    *
    బొడ్డు శంకరయ్య గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    ‘చెడుయైనచో’ అన్నదాన్ని ‘చెడిపోయినన్ దల్లి...’ అనండి.
    *
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    పిల్లల పెంపకంలో వివిధ స్థాయిలను మీ పూరణలో చక్కగా తెలిపారు. బాగుంది. అభినందనలు.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    *
    చింతా రామకృష్ణా రావు గారూ,
    బహుకాలానికి నామీదు దయ కల్గింది. సంతోషం.
    మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
    మీరు కోరినట్లుగా ఆంధ్రామృతంలో పద్యాలు వ్రాయడానికి ప్రయత్నిస్తాను.

    రిప్లయితొలగించండి
  21. శ్రీపండిత నేమాని గురువులకు నమస్సులతో

    సతి గర్భమున్ దాల్చ - సతిపతుల మనసు
    సతతమూహలలోన – సంచరింప
    బాల్యదశ నరిష్ట - బాధల దీర్పగ
    వైద్యాలయంబుల – వెడలు చుండ
    పెరిగి పెద్ద యగుచు – విద్య నేర్చుకొనంగ
    వారి భవిత గూర్చి – పరితపింప
    పెండ్లి చేయగ వారి – పేర్మిని దాంపత్య
    జీవిత మేగతి జిలుగు లొల్కు

    దూర తీరాల జేరుచు దూర మవ్వ
    ముదిమి వయసున మనలను ముంచు నేమొ
    యనుచు తలిదండ్రు లీవేళ హడలు చుండె
    సర్వదా చింతయే గాదె సంతు వలన.

    రిప్లయితొలగించండి
  22. Sri T.B.S.Sarma garu!
    శుభాశీస్సులు.
    మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు. కొన్ని సవరణలు:
    వై కి వె కి యతి చెల్లదు. అందుచేత -- ఆసుపత్రుల కొరకరుగు చుండ అని మార్చండి.
    దూర మవ్వ అనరాదు - దూర మయిన అనండి.
    హడలు చుండె (ఏకవచనము అక్కడ కాదు కదా) హడలు చుండ అనండి.
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  23. వరప్రసాదు గారికి ధన్యవాదములు !

    గోలివారికి ధన్యవాదములు !
    అయ్యా ! ఆరోగ్యము బాగుగనే యున్నది !
    మనసులో కైకేయి పూరణలో సత్యభామ ఐనట్టుంది !
    సవరించెదను !

    శంకరార్యా ! ధన్యవాదములు !

    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    రిప్లయితొలగించండి
  24. గోలివారికి ధన్యవాదములతో :

    దశరథుని దుఃఖం :

    02అ)
    _______________________________

    సవతితల్లికి వరమనే - సాకు జూపి
    వలదు వలదన్న వినకుండ - వనములకును
    సత్య వాక్పరిపాలుండు - నిత్య వ్రతుడు
    పయన మాయెను రాముండు - పత్ని తోడ !
    రాముడే నాకు భాగ్యమ్ము - భూమి మీద
    రాముడే లేని యెడ నాకు - రాజ్యమేల ?
    రాముడే లేని నా కింక - ప్రాణమేల ?
    రామ శ్రీరామ శ్రీరామ - రామ రామ
    యనుచు దుఃఖించి దుఃఖించి - తనువు విడచె !
    సర్వదా చింతయే గాదె - సంతు వలన !
    _______________________________

    రిప్లయితొలగించండి
  25. శ్రీపండిత నేమాని గురువులకు నమస్సులతో సవరణానంతరము

    సతి గర్భమున్ దాల్చ - సతిపతుల మనసు
    సతతమూహలలోన – సంచరింప
    బాల్యదశ నరిష్ట - బాధల దీర్పగ
    ఆసుపత్రుల కొర - కరుగు చుండ
    పెరిగి పెద్ద యగుచు – విద్య నేర్చుకొనంగ
    వారి భవిత గూర్చి – పరితపింప
    పెండ్లి చేయగ వారి – పేర్మిని దాంపత్య
    జీవిత మేగతి జిలుగు లొల్కు

    దూర తీరాల జేరుచు దూర మయిన
    ముదిమి వయసున మనలను ముంచు నేమొ
    యనుచు తలిదండ్రు లీవేళ హడలు చుండ
    సర్వదా చింతయే గాదె సంతు వలన.

    రిప్లయితొలగించండి