9, సెప్టెంబర్ 2013, సోమవారం

పద్య రచన – 458 (గణేశ స్తుతి)

కవిమిత్రులారా,
వినాయక చవితి శుభాకాంక్షలు!
ఈనాటి పద్యరచనకు అంశము....
“గణేశ స్తుతి”

40 కామెంట్‌లు:

  1. శ్రీపండిత నేమాని గురువులకు నమస్సులతో
    మహాక్కర.
    పార్వతీ నందనా! హే గణేశా! కృపాకరా! మూషికవాహనా! హే
    సర్వ దేవతా పూజిత ద్విదేహ శంకర తనయా! గజాననా! హే
    సర్వ విఘ్న విదూర విఘ్నేశ్వరా! సకల పూజాదులన్ ప్రథమ పూజ్యా!
    సర్వ కాలంబులన్ మమ్ము కావుమా! సకల విద్యాబుద్ధు లిడి బ్రోవుమా!

    రిప్లయితొలగించండి
  2. ఏక దంతుడ నిను గొల్తు ప్రాకట ముగ
    దేవ గణ ముల కధి పతి దేవ దేవ
    విఘ్న రాజాయ గనుమయ్య భగ్న జనుల
    శంభు తనయాయ సురలోక శరణు శరణు

    రిప్లయితొలగించండి
  3. మిత్రులందరికీ
    వినాయక చవితి శుభాకాంక్షలు !

    రిప్లయితొలగించండి
  4. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    01)
    __________________________

    భాద్రపద శుక్ల చవితిని - భద్రము గను
    పార్వతీ సుత , విఘ్నేశ - పాహి యనుచు
    ప్రజలు పూజింప భక్తి ప్ర - పత్తి తోడ
    భోగభాగ్యాలు లభియించు - భూమి మీద !
    __________________________

    రిప్లయితొలగించండి
  5. 02)
    __________________________

    విఘ్ననాయక , హేరంభ - విజయ మిమ్ము
    పార్వతీసుత ,గణపతి - పలుకు లిమ్ము
    శక్తినందన , పిళ్ళారి - శక్తి నిమ్ము
    పర్శుపాణీ,కరివదన - భక్తి నిమ్ము
    భక్త వరదా , గణాధిపా - భాగ్య మిమ్ము
    ఉగ్రతనయా ,యెలుకరౌతా - యుక్తి నిమ్ము
    కుడుము, లుండ్రాళ్ళ ,బూజింతు - కోర్కె లిమ్ము !
    __________________________

    రిప్లయితొలగించండి
  6. ప్రధమ పూజలందెపరమేశు తనయుడు
    గౌరి దేవి కితను గారమయ్యె
    ఆపదలను కాచు అమృత హస్తమ్ము
    శంభు సుతుని కొలుచు సర్వ జనులు

    రిప్లయితొలగించండి
  7. ఓం శ్రీ గణేశాయనమః
    శ్రీ శంకరార్యులకు, కవి మిత్రులకు, వీక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.

    శంకరసుత ! విఘ్నపు నా
    శంకర ! నాశంకలన్ని శమియింపుమయా
    వంకర తొండపు దొర ! నా
    వంకను గని మార్చుమయ్య వంకరబుద్ధిన్.

    రిప్లయితొలగించండి
  8. స్రగ్విణీ:

    శ్రీపదం సర్వసంసిద్ధిదం బుద్ధిదం
    తాపహారిం ప్రశాంతం దయాసాగరం
    తాపసానీక హృత్పద్మ సంవాసినం
    పాపనాశంకరం వారణాస్యం భజే

    సర్వ విఘ్నాపహం సర్వభద్రప్రదం
    శర్వపుత్రాగ్రజం జ్ఞానసారాంబుధిం
    ఖర్వరూపం కవిం క్ష్మాధరేంద్రాలయం
    పార్వతీనందనం వారణాస్యం భజే

    దేవదేవోత్తమం దేవతారాధితం
    సేవకానందదం చిత్ప్రభా శేవధిం
    ధీవిశాలం కృపాబ్ధిం త్రిలోకస్తుతం
    పావనం సుందరం వారణాస్యం భజే

    రిప్లయితొలగించండి

  9. నీరాజనం:

    శ్రీసిద్ధి గణపతికి - శ్రీ గౌరి పుత్రునికి - శీతాద్రివాసునికి
    నీరాజనం - నీరాజనం - నీరాజనం

    వేదండముఖునికి - వేదాంత వేద్యునికి - విజ్ఞాన శేవధికి
    నీరాజనం - నీరాజనం - నీరాజనం

    వందారు వరదునికి - వాగీశవినుతునికి - ఆనంద్రసాంద్రునికి
    నీరాజనం - నీరాజనం - నీరాజనం

    బ్రహ్మాండనాథునికి - బాలార్కతేజునికి - భాగ్యప్రదాతకిదె
    నీరాజనం - నీరాజనం - నీరాజనం

    కైవల్యదాయికిని - కమనీయ రూపునికి - కారుణ్యమూర్తికిదె
    నీరాజనం - నీరాజనం - నీరాజనం

    రిప్లయితొలగించండి
  10. మిత్రులందరికీ
    వినాయక చవితి శుభాకాంక్షలు !

    రిప్లయితొలగించండి
  11. గణపతి చతుర్ధి రోజున
    గణనాధుని పూజసేయ గరికల తోడన్
    గణముల కధిపతి గణపతి
    అణువణువున సంత సించి యడ్డులు తీ ర్చున్ .

    రిప్లయితొలగించండి
  12. శ్రీ కంది శంకరయ్య గారికి మరియు శంకరాభరణములోని అందరి మిత్రులకు శుభాశీస్సులు.

    వరదుడు విఘ్ననాయకుడు పర్వతరాజసుతాత్మజుండు శ్రీ
    కరుడు మదేభరాణ్ముఖుడు కామితదాయి ప్రసన్నవక్త్రుడా
    దరమున పూజలందుకొని ధన్యుల జేయుత లెస్స శంకరా
    భరణ కవీశ్వర ప్రథిత వర్గము నంచు నుతించి మ్రొక్కెదన్

    రిప్లయితొలగించండి
  13. శ్రీ జయసారథి గరూ! శుభాశీస్సులు.
    మీ పద్యము బాగుగనున్నది. అభినందనలు. మా సూచనలు:

    "సర్వ విఘ్నములెల్ల సమసి రావు" నకు బదులుగా -- సర్వ విఘ్నములును సమసిపోవు అనండి.
    విఘ్నరాజ నీ నామము వేడుకొనిన కి బదులుగా -- విఘ్నరాజ నిన్నాదృతి వేడుకొనిన అనండి.

    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  14. గణనాథున్ భజియింపరే సతతమున్ గల్గున్ గదా సంపదల్!
    వణకున్ విఘ్నము లెల్ల విఘ్నపతిఁ సంభావింపగా, దేవతా
    గణముల్, యక్షులు, రాక్షసప్రభృతు లేకార్యమ్ము చేపట్టినన్
    ప్రణతుల్ జేతురు దొల్త దంతిముఖునిన్ ప్రార్థించి సఛ్ఛ్రీలకై.

    రిప్లయితొలగించండి
  15. నా పద్యమును సవరించిన శ్రీ నేమాని గురువులకు ధన్యవాదాలు ..
    ముందుగ సమసిపోవు అని వ్రాసేను.
    కాని వ్యతిరేక అర్థము వస్తుందని అనగా"సమసి పోవేమోనని"

    రిప్లయితొలగించండి
  16. శ్రీ నేమాని గురుదేవుల వారి సవరణలతో
    నా గణేశ స్తుతి

    మూషిక వాహన!దేవ!మునిజన స్తుత్య సద్భావ!
    ద్వేష రాగాది విహీన!దీవ్యద్వివేక నిధాన!
    పోషిత పరిజన బృంద!పుణ్యైక కంద!సానంద!
    దోష వినాశ!గణేశ!స్తోత్రమ్మొనర్తు విఘ్నేశ!

    అద్రిసుతాత్మజ!గణప!అనవద్య చరిత!విఘ్నేశ!
    భద్ర గజానన!గణప!భవభయనాశ!విఘ్నేశ!
    సద్రూప వైభవ!గణప!సద్భక్త వినుత! విఘ్నేశ!
    భద్రగుణాకర!గణప!ప్రమథ గణేశ!విఘ్నేశ!

    అగ్రగణ్యా!మహాకాయ!ఆరోగ్యమిమ్ము విఘ్నేశ!
    అగ్రపూజ్యా!మహానంద!ఆనందమిమ్ము విఘ్నేశ!
    అగ్రనాయక!మహైశ్వర్య!ఐశ్వర్యమిమ్ము విఘ్నేశ!
    అగ్రణీ!కవిలోక వంద్య!ఆశ్రిత రక్ష!విఘ్నేశ!

    శ్రీగణనాథ! భజించుచు నిన్నున్
    మాగిన తియ్యని మామిడి పండ్లన్
    బాగుగ నిచ్చెదు పాలును తేనెల్
    సాగిలి మ్రొక్కుదు సద్గతు లిమ్మా!

    వేదము వ్రాసిన విభుడవు విఘ్నవినాశా!
    మోదక ఖాదివి గణపతి! పొంకము తోడన్
    పాదములూనితి మరువక పావన మూర్తీ!
    మీదయ గోరుదు నిరత మమేయ కృపాళూ!

    లంబోదర! సుముఖ!గణప!ప్రజ్ఞానిధాన! విఘ్నేశ!
    కంబు సుధానిధి!గణప!కర్పూర గౌర! విఘ్నేశ!
    సాంబశివాత్మజ!గణప!సజ్జన వరద! విఘ్నేశ!
    అంబుజహిత తేజ! గణప!ప్రార్థింతు నిన్ను విఘ్నేశ!

    రిప్లయితొలగించండి
  17. వరప్రసాద్ గారు మీ పద్యములు చాలా బాగున్నాయి.

    రిప్లయితొలగించండి
  18. శ్రీ జయసారథి గారు ధన్యవాదములు,మీరు కూడా చాలా మంచి సీసపద్యము వ్రాసినారు.

    రిప్లయితొలగించండి
  19. నిత్య విద్యార్థులకు వినాయకుని ఆశీస్సులందవలెనని ప్రార్థించుచున్నాను.

    శ్రీగౌరి సత్పుత్ర! శ్రీసుందరాకార! లంబోదరా! చిన్మయానంద రూపా! నినున్ శ్రద్ధనర్చింప, నీ స్తోత్రముల్ పాడగా నెట్టి విఘ్నంబు రాకుండ కాపాడు లోకమ్ము , దాక్షిణ్యమున్ జూపి మమ్మేలుమో స్వామి! విద్యా ప్రదానమ్ము జేయంగ నేటేట నిచ్చోట మా పూజలందంగ కైలాసమున్ వీడి రావయ్య ! పూర్ణమ్ముతో నింపి పెక్కుల్ కుడాల్ నేతి భక్ష్యంబులన్ , పండ్లు, తాంబూలముల్ పెట్టు మా ముద్దు తీర్చంగ రారమ్ము, దేవా ! నమస్తే నమస్తే నమోన్నమః

    రిప్లయితొలగించండి
  20. మూషిక వాహన నాలో
    దోషముల హరించి గాచు తొండపు దేవా!
    భాషకు నందని నీదగు
    వేషముఁ గొనియా డఁదరమె?వేల్పుల కైనన్

    రిప్లయితొలగించండి
  21. పూజ్యులు నేమానివారికి, మిత్రులు శ్రీ కంది శంకరయ్యగారికి,కవి పండిత మిత్రులందఱకును వినాయక చతుర్థి పర్వదిన శుభాకాంక్షలతో...

    ఓం శ్రీ మహాగణాధిపతయే నమః

    స్వాగత వృత్తము:
    శ్రీ గణేశ! ఘన చిత్సుఖ దాతా!
    శ్రీ గిరీశ సుత! శ్రేష్ఠ! వరిష్ఠా!
    యోగి రాడ్వరద! యోగ విశేషా!
    స్వాగత ప్రమథ వర్గ! నమో ऽహమ్! (1)

    ప్రమాణి వృత్తము:
    గజాననా! ఘనాకృతీ!
    ప్రజావళి ప్రమోద! స
    ద్ద్విజ స్తుత! స్థిరా! చతు
    ర్భుజా! నమో ऽస్తు తే ऽనిశమ్! ( 2)

    ప్రణవ వృత్తము:
    హేరంబా! మిత హిత సంతుష్టిన్
    గౌరీ నందన! కరి మూర్ధన్యా!
    సూరి ప్రాకట శుభ సంశ్లోకా!
    భూరి క్షత్ర! విముఖ! వందే ऽహమ్! (3)

    శాలినీ వృత్తము:
    సారాచారా! నీత సత్పుణ్య దాతా!
    పారాశర్యామోద బాష్పోత్సుకా! క్రౌం
    చారి భ్రాతా! భూరి సమ్మోద పాత్రా!
    ధీర స్తుత్యా! హే ద్విదేహ ప్రభాసా! (4)

    వంశస్థము:
    నమో నమో విఘ్న వినాశకాయ తే!
    నమో విచిత్రాయ! వినాయకాయ తే!
    నమః పవిత్రాంచిత నామకాయ తే!
    నమో సదాదాన! ఘనాయ తే నమః! (5)

    వన మయూరము:
    హేరుక! భవాత్మజ! మహేంద్ర నుత గాత్రా!
    ధీర! సుముఖ! ప్రముఖ! దివ్య దరహాసా!
    ఘోర తర సంసృతి వికూప తరణాప్తా!
    చారు రుచి దంత కులిశ ప్రహరణాఢ్యా! (6)

    స్రగ్విణీ వృత్తము:
    పార్వతీ నందనా! భారతోల్లేఖనా!
    సర్వ గర్వాపహా! ఛాత్ర విద్యోదయా!
    ఖర్వ విఘ్నోన్నతా! కార్య సిద్ధిప్రదా!
    శర్వ పుత్రాగ్రజా! శాంత మూర్తీ! నమః! (7)

    ఇంద్ర వంశము:
    జీవేశ! సర్వోత్తమ! చేతన ప్రదా!
    దేవ స్తుతా! శాంకరి! ధీ విశేష! ది
    వ్యా! విశ్వ సంపూజిత! వక్రతుండ! ఢుం
    ఠీ! వేద వేద్యా! ఘన తేజ! తే నమః! (8)

    భుజంగ ప్రయాతము:
    ద్విపాస్య! త్రి ధామ! త్రిధాతు! ప్రసిద్ధా!
    సుపర్వ ప్రమోదా! శుభాంగా! వృషాంకా!
    కపి త్థాత్త సంపృక్త భుక్త ప్రహృష్టా!
    కృపాంభోధి! కుబ్జాకృ తీశా! నమస్తే! (9)

    -:< శుభం భూయాత్ >:-

    రిప్లయితొలగించండి
  22. శ్రీ పండిత నేమాని గురువులు..
    శ్రీ కంది శంకరయ్య గురువులకు పాదాభివందనాలు.

    భాద్రపదంపు మాస సిత పక్ష చతుర్థి గణాధిపత్యమున్
    అద్రి తనూజ సూనుదు గజానను డoదెను గుజ్జు రూపమున్
    రుద్రుని శక్తి తేజమును లోకమునందున విఘ్నహంత్రియై
    భద్రత గాగ నీ భరతవాసుల కిచ్చును శాంతి భద్రతల్ .

    దుగ్ధము లాను వేళ చిరు తోరపు బొజ్జ వినాయకుండు యా
    దుగ్ధములిచ్చు చన్ను జత తొండము తో గనలేక యాదెసన్
    ధగ్ధగలాడు త్రాచు గని దంతి కరమ్మని ఆటలాదు యా
    ముగ్ధమనోజ్ఞ రూపమును ముచ్చట గా పరికించి చూడరే

    రిప్లయితొలగించండి
  23. శ్రీ పండిత నేమాని గురువులు..
    శ్రీ కంది శంకరయ్య గురువులకు పాదాభివందనాలు.

    మదినిను ధ్యాననిష్ట నభిమంత్రణమున్యొనరించి యింటిలో
    కుదురుగ నుత్తరంపుదిశకూర్చుని పీఠముఅర్ఘ్యపాద్యముల్
    ఉదకము నిచ్చి జల్లుకొని ఊటజలమ్ముల పానమిచ్చి క్షీ
    రదధిమరంద నేతులను రమ్యఫలోదక గంగస్నానమున్
    తదుపరి గంధమక్షతలు ధావళి యుగ్మము జన్నిదమ్ములున్
    పదపడి దూర్వయుగ్మములు పల్లవపత్రము పూజలన్ యధా
    విధిగనుమోదకమ్ములనివేదనతాంబులదక్షిణల్నివా
    ళి దివియ నిచ్చి మ్రొక్కెదములేమినిబాపుము శ్రీ గణాధిపా

    రిప్లయితొలగించండి
  24. మిత్రులారా! శుభాశీస్సులు.
    ఈనాటి గణేశ స్తుతికి మంచి స్పందన లభించుట ముదావహము. బ్లాగు భక్తిరస భరితముగా అలరారినది. అందరికీ అభినందనలు.
    శ్రీ తోపెల్ల శర్మ గారికి
    శ్రీమతి రాజేశ్వరి గారికి
    శ్రీ వసంత కిశోర్ గారికి
    శ్రీమతి శైలజ గారికి
    శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారికి
    శ్రీ సుబ్బా రావు గారికి
    శ్రీ మిస్సన్న గారికి
    శ్రీ వరప్రసాద్ గారికి
    శ్రీమతి లక్ష్మీ దేవి గారికి
    శ్రీ సహదేవుడు గారికి
    శ్రీ మధుసూదన్ గారికి పేరు పేరునా అభినందనలు.
    శ్రీ వసంత కిశోర్ గారికి, శ్రీ వరప్రసాద్ గారికి, శ్రీ మధుసూదన్ గారికి ప్రత్యేక ప్రశంసలు. శ్రీమతి లక్ష్మీదేవి గారి దండకము కూడా ఒక మంచి ప్రయత్నము.
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  25. శ్రీ తిమ్మాజీ రావు గారు కూడా ప్రశంసనీయమైన పద్యములను వ్రాసేరు. అభినందనలు. అక్కడక్కడ వ్యాకరణ దోషములు కలవు. శ్రీ తోపెల్ల వారివి మరియు శ్రీ జయసారథి గారి స్తుతులు కూడా ప్రశంసార్హములే.

    రిప్లయితొలగించండి
  26. శ్రీ నేమాని గురుదేవులకు పాదాభివందనములు.

    నేమాని వారి బలుకులు,
    నా మది భూతలము నందు నాటితిస్వామీ!
    వామన రూపున బెరుగగ
    నామోదము దెలుపుమయ్య!ఆప్యాయమునన్!

    రిప్లయితొలగించండి
  27. గురువులు శ్రీ శంకరయ్యగారికి, పూజ్యులు నేమానివారికి,కవిపండిత మిత్రులందఱికిని వినాయక చతుర్థి పర్వదిన శుభాకాంక్షలు.

    వందే పార్వతి తనయా
    వందే జ్ఞాన ప్రదాత వరగుణ శీలా
    వందే శ్రీకర భవహర
    వందే కరుణాల వాల వందనమయ్యా !!!

    రిప్లయితొలగించండి
  28. నాకు పద్య రచనాశక్తి గలిగించిన శ్రీ శంకరయ్య గురుదేవులకు పాదాభివందనములు.
    నా పద్య రచనలో ప్రశంసలన్నియును నా గురుదేవులకు, తప్పులున్న అవి నావిగా భావించగలరు.

    ప్రేమను జూపిరి గురువులు
    పామరు పయి బహు విధముల పద్యరచనకున్,
    నా మనవిని విన మనమున
    పామర పొర దొలగె,జన్మ పావనమయ్యెన్!

    రిప్లయితొలగించండి
  29. శ్రీ పీతాంబర్ గారూ! శుభాశీస్సులు.
    మీరు వ్రాసిన పద్యము బాగుగనున్నది. ఒక సూచన: మీరు వందే అని మొదలిడినారు - అది సంస్కృత పదము. అందుచేత పూర్తిగ పద్యము సంస్కృతములో ఉండుట మంచిది. కొంత తెలుగు కొంత సంస్కృతము ఉంటే "మణి ప్రవాళ శైలి" అంటారు. వందేకి బదులుగా మీరు వందనము అని వాడితే పూర్తిగా తెలుగులో పద్యమును వ్రాయచ్చును. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  30. సాహితీ మితృలకు వినాయక చవితి శుభాకాంక్షలతో..............

    మత్తేభవక్తృడా మహిత లావణ్యుడా, మాపూజలందుకో మహితరూప,
    విఘ్నముల్ బాపేటి వీర్యవంతుడవీవు, వేడుచుంటిమి నిన్ను విఘ్నరాజ,
    ఆంధ్రదేశమ్మందు అంధకారమునిండె, దివిజేంద్ర వంద్యుడా దివ్వె నిడుమ,
    పాలకుల్ తల్లిని బాధించుచున్నారు, బాధను బాపుమా భక్తవరద,

    సఖ్యతే సుఖమనుచును చాటవయ్య
    వేరు కుంపటి వేడిని వీడ చేసి
    ఆంధ్రమాతను వేగమె ఆదుకొనగ
    భువికి పరుగున రావయ్య ఒజ్జ దేవ.

    రిప్లయితొలగించండి
  31. పెద్దలకు, సాహితీ మిత్రులకు వినాయక చవితి శుభాకాంక్షలతో...
    [నాన్నగారు పింగళి వేంకట శ్రీనివాసరావు గారు వ్రాసిన మహాగణపతిం మనసాస్మరామి (సంపూర్ణ పూజావిథాన సహిత పద్యకావ్యం నుండి) ]

    శ్రీ విఘ్నేశ్వరాష్టోత్తర శతనామ స్తోత్రo.

    1. ఓంకారాన్విత! పూజ్యమూర్తి కలితమ్! యోథాగ్రగణ్యం! విభుం!
    శ్రీమన్మంగళ రూపిణం! భవహరం! ద్వైమాతరం! సుందరమ్!
    శ్రీ లంబోదర భూరికాయకలితం! శ్రీ శాంకరీ నందనం!
    దాతారం! ప్రణతో౨స్మి సంతతమహం శ్రీ సిద్ధివిఘ్నేశ్వరం.

    2. సౌవర్ణాభ సుదేహినం! గజముఖం! గౌరీసుతం! పావనం!
    మౌంజీకృష్ణవరాజినం! హ్యహిమహాయఙ్ఞోపవీతాన్వితమ్!
    శూర్పాకారక కర్ణసంయుతవిభుం! పీతాంబరోద్భాసితం!
    అవ్యక్తం! ప్రణతో౨స్మి సంతతమహం శ్రీ సిద్ధివిఘ్నేశ్వరం.

    3. విశ్వేశం! వరదాభయాంకుశ మహాపాశాన్ ధృతంహస్తయోః!
    గాంగేయం! స్మితసుప్రసన్న వదనం! వాణీరమా వత్సకం!
    సర్వం సిద్ధి విధాయకం! ధృతిమతిం! గంభీర వాగ్భూషితం!
    విశ్వాక్షం! ప్రణతో౨స్మి సంతతమహం శ్రీ సిద్ధివిఘ్నేశ్వరం.

    4. సర్వోపాస్య! ముమాసుతం! ప్రమథ! సైన్యాధ్యక్ష! మంబాప్రియం
    బ్రహ్మణ్యం! జితమన్మధం! పరజితం! ప్రాజ్ఞం! కపిత్థప్రియం!
    సర్వైశ్వర్య విధాయకం! సురుచిరం! కారుణ్య వారాంనిధిం!
    బుధ్ధీశం! ప్రణతో౨స్మి సంతతమహం శ్రీ సిద్ధివిఘ్నేశ్వరం.

    5. హ్రస్వగ్రీవ! మనాథనాథ! మఖిలం! హ్రస్వాంగ సంశోభితం!
    బాలేన్దుద్యుతి మిష్టదం! గణవిభుం! సూద్దండ విఘ్నాపహం!
    భక్తాభీష్టకరం శుభం! జయకరం! బ్రహ్మాండ భాండోదరం!
    యోగీశం! ప్రణతో౨స్మి సంతతమహం శ్రీ సిద్ధివిఘ్నేశ్వరం.

    6. కైలాసాచల వాసినం! గురుగుహం! పంచాననం! శ్రీకరం!
    జ్యోతిశ్శాస్త్రవిశారదం! రిపుహరం! ధర్మైకనిష్ఠాకరం!
    దృశ్యాదృశ్య విచిత్ర సృష్టి రచనా వ్యాపార సంశోభితం!
    హేరంబం! ప్రణతో౨స్మి సంతతమహం శ్రీ సిద్ధివిఘ్నేశ్వరం.

    7. హస్తే మోదకపూర్ణభక్ష్యకలితం! సఖ్యే సతీ పాలకం!
    విష్ణుబ్రహ్మ సురేంద్ర సేవిత పదం! శ్రీ విఘ్నరాజం! ప్రభుం!
    శ్రీమత్షణ్ముఖ సోదరం ప్రవిమలం! ’గం’ బీజ సంవాసినం!
    శ్రీ డుంఢిం! ప్రణతో౨స్మి సంతతమహం శ్రీ సిద్ధివిఘ్నేశ్వరం.

    8. శ్రీయక్షోరగ కిన్నరాది వినుతం! బుద్ధిప్రియం! సిద్ధిదం!
    దంతాద్యాయుధ యుద్ధకౌశలనిధిం! త్రైలోక్య సంసేవితం!
    వేదాంతాటవికేళిలోల రసికం! విద్వద్వచో భూషితం!
    తత్వార్ధం! ప్రణతో౨స్మి సంతతమహం శ్రీ సిద్ధివిఘ్నేశ్వరం.

    9. శ్రీకంఠార్చిత! మష్టసిద్ధి కలితం! శ్రీకాల రూపాకృతిం!
    భద్రం! సామజవక్రతుండ వదనం! స్మేరాననం! చిన్మయం!
    శ్రీమద్ధూర్జటి నందనం! శశినిభం! కల్యాణ సంధాయకం!
    లోకేశం! ప్రణతో౨స్మి సంతతమహం శ్రీ సిద్ధివిఘ్నేశ్వరం.

    10. ఈశానం! జగదీశ్వరం! హరసుతం! హేమాంబరాడంబరం!
    భక్తానామభయప్రదం! సువిమలం! విద్వజ్జనోపాసితం!
    సౌహార్ద్రాన్విత ధీవరం! నిరుపమం! విఘ్నాబ్ధి సంశొషణం!
    నైర్గుణ్యం! ప్రణతో౨స్మి సంతతమహం శ్రీ సిద్ధివిఘ్నేశ్వరం.

    11. చిద్రూపం! శశిమౌళినం! శుభకరం! వాచాంసు సంవర్థనం!
    సంపూణాఘనివారకం! కవివరం! సద్బుద్ధి ప్రేమాస్పదం!
    యోగానందకరం! శ్రితా౨భయకరం! విఘ్నాపదాం వారణం!
    సర్వజ్ఞం! ప్రణతో౨స్మి సంతతమహం శ్రీ సిద్ధివిఘ్నేశ్వరం.

    రిప్లయితొలగించండి
  32. శ్రీ నేమాని గారు మీ సూచనకు ధన్య వాదాలు. అజ్ఞానంవల్ల అలా వ్రాసాను మన్నించండి .

    మారుస్తూ వ్రాసిన పద్యము

    వందన మిదుగో శుభకర
    వందనము దయాలవాల వరగుణ శీలా
    వందనమిదె సురసేవిత
    వందన శతములు గణేశ వైరివినాశా !!!

    రిప్లయితొలగించండి
  33. శ్రీ విఘ్నేశ్వరాష్టోత్తరశత నామ స్తోత్రము చాలా బాగున్నది. రచించిన శ్రీ పింగళి వారికి నమోవాకములు.

    రిప్లయితొలగించండి
  34. మనోహరమైన పద్యాలతో గణేశుని స్తుతించిన కవిమిత్రులు.....
    తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మగారికి,
    రాజేశ్వరి అక్కయ్యకు,
    వసంత కిశోర్ గారికి,
    శైలజ గారికి,
    శ్రీ యెర్రాజి జయసారథి గారికి,
    గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
    పండిత నేమాని వారికి,
    సుబ్బారావు గారికి,
    మిస్సన్న గారికి,
    వరప్రసాద్ గారికి,
    లక్ష్మీదేవి గారికి,
    సహదేవుడు గారికి,
    గుండు మధుసూదన్ గారికి,
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మంద పీతాంబర్ గారికి,
    ప్రభల రామలక్ష్మి గారికి (బహుకాల దర్శనం!),
    పింగళి శశిధర్ గారికి (అద్భుతమైన నాన్నగారి పద్యాలను పరిచయం చేసినందుకు),
    అభినందనలు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి