23, సెప్టెంబర్ 2013, సోమవారం

హనుమానంద లహరిహనుమానంద లహరి

 హనుమంతా! శ్రీ హనుమంతా! జయ
అనుపమ బల గుణ ధీమంతా!

రామహితాగ్రణి హనుమంతా! జయ
రామకార్యరత! హనుమంతా!

భాగవతోత్తమ! హనుమంతా! జయ
యోగివరేణ్యా! హనుమంతా!

హీర శరీరా! హనుమంతా! జయ
ధీర శూరవర! హనుమంతా!

శాంత విభూషణ! హనుమంతా! జయ
శాంతి సుఖప్రద! హనుమంతా!

జ్ఞాన నిధానా! హనుమంతా! జయ
ధ్యాన పరాయణ! హనుమంతా!

ధర్మ రక్షకా! హనుమంతా! జయ
దుర్మదాంధ హర! హనుమంతా!

అంజనాతనయ! హనుమంతా! జయ
రంజిత రఘువర! హనుమంతా!

శుభకర! శ్రీకర! హనుమంతా! జయ
అభయవరప్రద! హనుమంతా!

శంకరాంశ భవ! హనుమంతా! జయ
సంకట నాశక! హనుమంతా!

కేసరి నందన! హనుమంతా! జయ
భాసుర చరితా! హనుమంతా!

వానర నాయక! హనుమంతా! జయ
దానవ నాశక! హనుమంతా!

సురవర వందిత! హనుమంతా! జయ
పరమానందా! హనుమంతా!

భాను కోటి నిభ! హనుమంతా! జయ
జ్ఞాన మహార్ణవ! హనుమంతా!

అవనిజార్తి హర! హనుమంతా! జయ
పవమానాత్మజ! హనుమంతా!

అక్షయ సంహర! హనుమంతా! జయ
రాక్షస నాశక! హనుమంతా!

రావణ మదహర! హనుమంతా! జయ
పావన శీలా! హనుమంతా!

వారిధి లంఘన! హనుమంతా! జయ
వీరవరేణ్యా! హనుమంతా!

రవిసుత సచివా! హనుమంతా! జయ
సవినయ భావా! హనుమంతా!

సుందర రూపా! హనుమంతా! జయ
మందస్మిత ముఖ! హనుమంతా!

వేదవిదుత్తమ! హనుమంతా! జయ
వేదాంత ప్రియ! హనుమంతా!

పరమ దయాకర! హనుమంతా! జయ
సరసవచోనిధి! హనుమంతా!

గిరివర విగ్రహ! హనుమంతా! జయ
గిరిధర! జయకర! హనుమంతా!

లంకాధ్వంసక! హనుమంతా! జయ
పంకజాక్ష హిత! హనుమంతా!

దీనజనావన! హనుమంతా! జయ
గాన వినోదన! హనుమంతా!

రామపదార్చక! హనుమంతా!! జయ
ప్రేమరసాకర! హనుమంతా!

సకల భయాపహ! హనుమంతా! జయ
సుకృత గుణార్ణవ! హనుమంతా!

భావి విధాతా! హనుమంతా! జయ
భావాతీతా! హనుమంతా!

కామిత దాయక! హనుమంతా! జయ
శేముషీ విభవ! హనుమంతా!

గురుపద భూషణ! హనుమంతా! జయ
పరమార్థ ప్రద! హనుమంతా!

విజయ రథస్థా! హనుమంతా! జయ
విజయోత్సాహా! హనుమంతా!

విజితేంద్రియచయ! హనుమంతా! జయ
విజయ వరప్రద! హనుమంతా!

రోగ వినాశక! హనుమంతా! జయ
యోగమార్గరత! హనుమంతా!

దుష్ట నివారణ! హనుమంతా! జయ
శిష్ట జనావన! హనుమంతా!

అనుపమాన జవ! హనుమంతా! జయ
అనుత్తమప్రియ! హనుమంతా!

శోక నాశకా! హనుమంతా! జయ
లోకరక్షకా! హనుమంతా!

గ్రహ పీడాపహ! హనుమంతా! జయ
బహుగుణ శోభిత! హనుమంతా!

భవబంధాంతక! హనుమంతా! జయ
త్రివిధ తాపహర! హనుమంతా!

రామనామ ప్రియ! హనుమంతా! జయ
రామానుజ హిత! హనుమంతా!

వందనమయ్యా! హనుమంతా! జయ
చందన కల్పక! హనుమంతా!

పండిత నేమాని రామజోగి సన్యాసి రావు

10 కామెంట్‌లు:

 1. నమస్కారములు
  మనమా నంద కరమైన హనుమా నందలహరికి ప్రణామములు .
  పూజ్య గురువులకు ధన్య వాదముల , శిరసాభి వందనములు

  రిప్లయితొలగించండి
 2. హీందీ నందలి శ్రీ తులసీదాస కృత రామచరితమానసాంతర్గ శ్రీ హనుమాన్ చాలీసా వలె తెనుగున 40 పదరేకులతో “హనుమానంద లహరీ పుష్ప” వికాసమునకు నా ప్రణతులు.

  హనుమ నామ పారాయణమన పుడమిని
  నిత్య ప్రార్థనా గేయమై నిలచి పోవ
  వ్రాసి యిచ్చిన నేమాని పండితార్య!
  అందుకోవయ్య! మా యభివందనములు!
  అందుకోవయ్య! మా యభినందనములు!

  రిప్లయితొలగించండి
 3. స్పందించిన మిత్రులకు శుభాశీస్సులు.

  హనుమాన్ చాలీసా కిది
  యనుకరణం బగునటంచు నాదరమున నే
  హనుమానంద లహరి యని
  తెనుగున స్తోత్రమును వ్రాసితిని గురుకృపతో

  సుందరకాండము సంగ్రహముగా ఒక పద్యములో:

  వనధి దరించి, లంక నలువంకల జుట్టి, సమీరసూతి, సీ
  తను గని, బాపి శోకమును, ధైర్యము గూర్చి, వనమ్ము డుల్చి, య
  క్షుని బరిమార్చి, రావణుడు కుందుచునుండగ లంక గాల్చి, వే
  జని రఘు రామచంద్రునికి జానకి సేమము దెల్పె నొప్పుగా

  రిప్లయితొలగించండి
 4. అన్నగారి హనుమ స్తుతి చాలా బాగుంది. హీర శరీర హనుమంతుడు స్తుతి తరువాత భీమకాయు డవడము నిశ్చయము. ఉత్కృష్ట రామభక్తులకే యిట్టి స్తోత్రమును వ్రాయ గలగడము సాధ్యము !

  రిప్లయితొలగించండి
 5. గురుదేవుల “హనుమానంద లహరీ ” చాలా బాగుంది.

  పూజ్య గురుదేవులకు ధన్యవాదములు,వినమ్ర వందనములతో........
  =======*===========
  పండితుల హనుమ నామ పారాయణ మన పుడమిని
  మండిత భూషణము గద మనుజుల కెల్లను,వినయ
  మండిత వందనములను మధుర కవికి దెల్పు చుంటి,
  నిండిన మనమున నిలుచు నిత్య ప్రార్థన గేయముగను.

  రిప్లయితొలగించండి
 6. రామ నామము బలుకుదు రమ్య మలర
  రామ భజనలు సేతును రాగ మొప్ప
  నీకు కైదండ లిడుదును నీవ దిక్కు
  నా మనంబున నుండుమా రామ భక్త !

  రిప్లయితొలగించండి
 7. హనుమద్భజనం బదిరెను
  అనగా మరి నోటికేమొ హాయిగ నుండెన్
  వినువారి జన్మ ధన్య
  మ్మనుమానములేదు నాకు నణుమాత్రంబున్.

  రిప్లయితొలగించండి
 8. రాజేశ్వరి అక్కయ్యా,
  ధన్యవాదాలు. కొద్ది మార్పులతో మీ మాటలను కందంపద్యంగా మార్చవచ్చు.

  మన మానందకరమయిన
  హనుమానందలహరిని నయంబుగ లిఖియిం
  చిన పండిత నేమాని గు
  రుని పూజ్య పదమ్ములకును మ్రొక్కెద భక్తిన్.
  *
  పండిత నేమాని వారూ,
  ‘హనుమానంద లహరి’ని మాకు ప్రసాదించి, పారాయణ పుణ్యఫలం మాకు దక్కించినందుకు ధన్యవాదాలు.
  మనోహరమూ, శుభదాయకమూ అయిన సుందరకాండను సంగ్రహంగా ఒకే పద్యంగా వ్రాసిన మీ కవితాశక్తిని జోహార్లు.
  *
  తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారూ,
  గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
  వరప్రసాద్ గారూ,
  సుబ్బారావు గారూ,
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ
  ........... ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 9. నమస్కారములు
  హృద్యముగా మలచి నందులకు గురువులకు ధన్య వాదములు

  రిప్లయితొలగించండి