8, సెప్టెంబర్ 2013, ఆదివారం

సమస్యాపూరణం – 1168 (వాసవునకు మయూరమ్ము)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది .....
వాసవునకు మయూరమ్ము వాహనమ్ము.

30 కామెంట్‌లు:

  1. శ్రీపండిత నేమాని గురువులకు నమస్సులతో

    హరికి వాహనమై చెల్లు గరుడుడనగ
    వక్రతుండునికి యెలుక, వల్లభంబు
    వాసవునకు, మయూరమ్ము వాహనమ్ము
    శరవణభవునకు, నంది శంకరునకు.

    రిప్లయితొలగించండి
  2. పఱఁగ నైరావతమ్మగు వాహనమ్ము
    వాసవునకు! మయూరమ్ము వాహనమ్ము
    కార్తికేయున! కాఖువు గణపతికిని
    వాహనము! నంది శివునకు వాహనమ్ము!

    రిప్లయితొలగించండి
  3. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    వాసవునకు ఐరావతము
    పావకునకు మయూరము గదా వాహనములు :

    01)
    __________________________

    పాలసంద్రము బుట్టిన - వారణమ్ము
    దిగ్గజాష్టక మందొక - దిగ్గజమ్ము
    ప్రాచిదిక్కున నుండెడి - భార్గవమ్ము
    అందచందాల తెల్లని - యానకమ్ము
    వాసవునకు ! మయూరమ్ము - వాహనమ్ము
    పార్వతీనందనుం డగు - పావకునకు !
    __________________________
    వారణము = భార్గవము = ఏనుగు
    యానకము = వాహనము
    పావకి = కుమారస్వామి

    రిప్లయితొలగించండి
  4. దక్షాధ్వర ధ్వంస మప్పుడు
    ప్రళయకాలరుద్రుడైన వీరభద్రుని ధాటికి తాళలేని
    దేవతలు చెట్టు కొకరు పుట్టకొకరుగా చెల్లా చెదరై యెవరికి
    చిక్కిన వాహనం వాళ్ళెక్కి ప్రాణాలు దక్కించు కున్నారట !
    ఆ సమయంలో యింద్రుని వాహనం మయూరమైనదట !
    మిత్రులారా ! అదీ సంగతి :

    02)
    __________________________

    దక్ష యఙ్ఞము సతి తాను - దగ్ధమవగ
    దక్షిణామూర్తి కోపించి - తనయు బంప
    ప్రళయ రౌద్రత యా వీర - భద్రుడంత
    ధ్వంస మొనరించి మూర్ఖుడౌ - దక్షు జంపి
    దేవతల నెల్ల దండించ - దివిజులెల్ల
    దెబ్బలకు తాళజాలక - తిరుగబాఱ
    యానకములన్ని మారిన - యవసరమున
    వాసవునకు మయూరమ్ము - వాహనమ్ము !
    కమలజన్ముడు తొందర - గరుడునెక్కె!
    తారు మారయ్యె శకటాలు - వారి వారి !
    __________________________
    తిరుగబాఱు = పాఱిపోవు

    రిప్లయితొలగించండి
  5. మిత్రులందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు !

    రిప్లయితొలగించండి
  6. అమర నాధుడు దిరుగ నై రావ తమ్ము
    కీర్తి నొందుచు నండజ కేత నుండు
    వాసవునకు మయూరమ్ము వాహ నమ్ము
    కార్తి కేయున కది యేమొ గాంచ నిలను
    నంది యానము నీశున కంద మేమొ

    రిప్లయితొలగించండి
  7. ఆరు మోముల స్వామి దివ్యాయుధమ్ము
    బూని రణమున కేగ ప్రమోద మొదవె
    వాసవునకు, మయూరమ్ము వాహనమ్ము
    నై యమరె నంత శైలసుతాత్మజునకు

    రిప్లయితొలగించండి
  8. శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో,
    =======&========
    తారకాసుర సంహారి,యారు దుర్గు
    ణములను హరించి గాచుచు నరుల నెల్ల,
    పార్వతీ నందనుండగు స్వామి,పళని
    వాస వునకు మయూరమ్ము వాహనమ్ము!

    రిప్లయితొలగించండి
  9. దైవ మొక్కటి యన్నను దర్శనములు
    వేలు వాహనంబులెల్ల వేరు వేరు
    వందనీయమైరావతం వాసవునకు
    మయూరమ్మువాహనమ్ముపావకునకు

    రిప్లయితొలగించండి
  10. తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారూ,
    విరుపుతో చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
    ‘వక్రతుండునకు నెలుక’ అనండి.
    చివరి పాదంలో గణదోషం. ‘శరవణభవునకును’ అంటే సరిపోతుంది.
    *
    గుండు మధుసూదన్ గారూ,
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    *
    వసంత కిశోర్ గారూ,
    మీకోసం సమయాన్ని ముందుకు జరిపినా మీకంటె ముందే ఇద్దరు మిత్రులు పూరణలు పంపారు. చిత్రం! విదేశాల్లో ఉండేవాళ్ళు కూడా కాదు.
    మీ రెండు పూరణలూ చాలా బాగున్నవి. అభినందనలు.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పూరణలో అన్వయం లోపించినట్లు అనిపిస్తున్నది. ఒకసారి పరిశీలించండి.
    *
    పండిత నేమాని వారూ,
    మీ పూరణ మనోహరంగా ఉంది. అభినందనలు.
    *
    వరప్రసాద్ గారూ,
    ‘పళని వాసుడు’ అనడం సరి. వాసవుడు శబ్దానికి ఇంద్రుడనే అర్థం తప్ప మరో అర్థం లేదు.

    రిప్లయితొలగించండి
  11. శైలజ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    రెండవ పాదంలో గణదోషం. ‘ఐరావతం’ అని వ్యావహారికాన్ని ప్రయోగించారు.
    నా సవరణ....
    వేలు వాహనంబులవెల్ల వేరు వేరు
    వంద్య మైరావత మ్మది వాసవునకు...

    రిప్లయితొలగించండి
  12. జీవ కారుణ్య సంఘాలు దేవతలకు
    లేవు కాబోలు యానాడు , లేని యెడల
    తట్టుకొందురే కఠినమౌ చట్టములను
    వాసవునకు,మయూరమ్ము వాహనమ్ము
    గాగలుగువానికి, హరికి కలత దప్పె!!!

    రిప్లయితొలగించండి
  13. శ్రీ శంకరయ్య గురుదేవులకు ధన్యవాదములు.

    పళని లోని రోప్ వే పై సరదాగా

    తారకాసుర సంహారి,యారు దుర్గు
    ణములను హరించి గాచుచు నరుల నెల్ల,
    పార్వతీ నందనుండగు స్వామి,పళని
    వాసుడు సిరుల కైనిడె బాడుగ కును
    వాసవునకు,మయూరమ్ము,వాహనమ్ము!

    రిప్లయితొలగించండి
  14. గురుదేవులకు బ్లాగు వీక్షకులకు ముందుగా గౌరీ గణేశ పండుగ శుభాకాంక్షలు(గౌరీ గణేశ హబ్బద శుభాశయగళు) ఇక్కడి ఆచారము ప్రకారము. పండుగ రెండు రోజులు జేయుదురు ముందు రోజు గౌరి పూజ, రెండవ రోజు గణేశ పూజ చేయుదురు.

    రిప్లయితొలగించండి
  15. పరగ నైరావతము కద వాహనమ్ము
    వాసవునకు , మయూ రమ్ము వాహనమ్ము
    శంక రాత్మజు డైనట్టి షణ్ము ఖు నకు
    వాహనమ్ములు వేరైన దయ్య మొకటె .


    (దై వము ప్ర కృ తి ,దయ్యము వికృ తి )

    రిప్లయితొలగించండి
  16. మిత్రులు శ్రీ సుబ్బారావుగారికి నమస్కారములు! తమరి పద్యము బాగున్నది. కాని, 4వ పాదమున యతి తప్పినటులున్నది. పరిశీలించఁగలరు.

    రిప్లయితొలగించండి
  17. అమరె నైరావతము వాహనముగ నాడు
    వాసవునకు; మయూరమ్ము వాహనమ్ము
    యయ్యె నగ్నిభవునకును; హంస బ్రహ్మ
    దేవునకు గరుడుడు వాసుదేవునకును

    రిప్లయితొలగించండి
  18. చిన్న దిద్దుబాటు : ... అగ్నిభువునకు

    రిప్లయితొలగించండి
  19. తనకు నభినందనలు దెల్పు తరుణమందు
    వాసవునకు మయూరమ్ము వాహనమ్ము
    గాగలుగు తారకహరుండు గౌరవమున
    జేరి మ్రొక్కెను సురలెల్ల జే యనంగ

    రిప్లయితొలగించండి
  20. మంద పీతాంబర్ గారూ,
    మరికొంత కాలానికి పశుపక్ష్యాదుల నెక్కి ఉన్న దేవతల బొమ్మలను నిశేధిస్తారేమో?
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    ‘కాబోలు నానాడు’ అనండి.
    *
    వరప్రసాద్ గారూ,
    పళిని రోప్ వే ఎక్కిన అనుభవాన్ని గుర్తుకు తెచ్చారు. దిగడం మాత్రం మెట్లదారి గుండానే వచ్చాము. ఆ మెట్లు దిగుతున్న సమయంలోనే ఎన్.టి.ఆర్ గారి మరణవార్త తెలిసింది.
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    మా ప్రాతంలో మాత్రం చవితినాడే పండుగ. తరువాతి తొమ్మిదిరోజుల పండుగ సంగతి వేరే చెప్పనక్కరలేదు!
    *
    సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    చివరి పాదం గురించిన గుండువారి వ్యాఖ్య గమనించారు కదా! వారే సూచించిన సవరణ....
    ‘వేరె వాహనలుగాని వేలుపొకడె’
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ‘వాహనమ్ము + అయ్యె’ అన్నప్పుడు యడాగమం రాదు. సంధి జరుగుతుంది. కనుక దానిని ‘వాహనముగ నయ్యె’ అందాం.
    *
    పండిత నేమాని వారూ,
    మీ తాజా పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  21. మాన్యశ్రీ నేమాని గురువర్యులకు, శ్రీ శంకరయ్య గారికి
    నమస్కృతులతో,

    వాసవునకు గెల్పు, విబుధవ్రతిగణాసృ
    గాసవునకు నిల్పు, రిపునిరాసజయర
    మాసవునకుఁ గొల్పు కుమారమణి చమూప
    వాసవునకు మయూరమ్ము వాహనమ్ము.

    సప్రశ్రయంగా,
    ఏల్చూరి మురళీధరరావు

    రిప్లయితొలగించండి
  22. ఏల్చూరి మురళీధర రావు గారూ,
    అద్భుతమైన పూరణ ఇది. ధన్యవాదాలు.
    కాని అందరికి సుగ్రాహ్యమయ్యే అవకాశాన్ని కల్పిస్తూ వ్యాఖ్యానాన్ని కూడా దయతో ప్రకటించవలసిందిగా మనవి.

    రిప్లయితొలగించండి
  23. 08.09.2013
    శ్రీ పండిత నేమాని గురువులు..
    శ్రీ కంది శంకరయ్య గురువులకు పాదాభివందనాలు.

    వేయి కనులున్న వేల్పన పేరెవరికి?
    వివిధ రంగుల పురియున్న విహగమేది?
    విష్ణునకు తార్ క్ష్యుడు? విశదపరచు
    వాసవునకు మయూరమ్ము వాహనమ్ము

    రిప్లయితొలగించండి
  24. నమస్కారములు
    అమర నాధునికి ఐరావతము , గరుక్మంతుడు వాసవునకు , మయూరము కార్తి కేయునకు నంది శివునకు అని నా ఉద్దేశ్యము పొరబదిన గురువులు మన్నించ గలరు

    రిప్లయితొలగించండి
  25. మిత్రులు శ్రీ ఏల్చూరి మురళీధరరావు గారికి నమస్కారములు. తమరి పూరణ మసాధారణమై, మా బోంట్లకు దురవగాహమై యలరారుచున్నది.

    1. వాసవునకున్+గెల్పు (సుగ్రాహ్యమే)

    2. విబుధ-వ్రతి-గణ+అసృక్+ఆసవునకున్+నిల్పు=?

    3. రిపు నిరాస (తారకాపజయకారకమైన)
    జయరమా (విజయలక్ష్మిని వరించుట యనెడి)
    సవునకున్ (యాగము గల వానికి)
    కొల్పు ([విజయ]ఉత్సవము)

    4. కుమార-మణి (కుమారస్వామి యనెడి)
    చమూ+ఉప-వాసవునకు (సైన్యాధ్యక్షునకు)
    మయూరమ్ము-వాహనమ్ము!

    నే నింతియే యర్థము చేసికొనఁగలిగితిని. తప్పో, యొప్పో తామే తెలియఁ జేయఁ గలరు.

    అభినందనలతో...
    బుధజనవిధేయుఁడు,
    గుండు మధుసూదన్

    రిప్లయితొలగించండి
  26. మాన్యులు శ్రీ శంకరయ్య గారికి
    నమస్సులతో,

    ఇటీవలి కాలంలో నాకు కనబడిన అత్యంతక్లిష్టమైన సమస్య ఇది. నాలుగవ పాదంగా గ్రహింపకపోతే - అసలు సమస్యే లేదు. పదాలు పూర్వాపరపాదాలతో పొందుపడతాయి. వాసవ – మయూర – వాహన శబ్దాల నానార్థాలేవీ ఉపకరింపవు.

    నాలుగవ పాదంగా గ్రహిస్తే మాత్రం అభూతకల్పన ద్వారానో, క్రమాన్వయం ద్వారానో మాత్రమే సాధ్యం. దక్షాధ్వరధ్వంసవేళ అక్కడ నెమలి వర్ణన లేదు. కుమారసంభం అప్పటికింకా జరుగలేదు కాబట్టి.

    వేఁటకాఱు ముట్టి వెనుకొనఁగా శ్వేత, నగము చఱికిఁ దారు నమిలివోలె
    నభ్రగజము మీఁది కా సహస్రాక్షుండు, ప్రాఁకి పాఱెఁ బ్రమథరాజి యార్వ.

    అని మాత్రమే నన్నెచోడుని కుమారసంభవం (2-70). సమస్యను వేఱొక పాదంలోకి మార్చటమూ, క్రమాన్వయమూ పైని జరిగాయి కాబట్టి కొంత వైవిధ్యంకోసం శబ్దాలంకారాన్ని ఆశ్రయింపవలసి వచ్చింది.

    వాసవునకు గెల్పు = ఇంద్రునికి జయకారణం; విబుధ ... నిల్పు = ధర్మపరులైన దేవతలయొక్క, మునిగణములయొక్క, అసృక్ + ఆసవునకు = రక్తమే ఆసవంగా కలిగిన తారకాసురునికి, నిల్పు = స్తంభహేతువు; రిపునిరాస జయరమా సవునకు = శత్రువులను మట్టుపెట్టి జయేందిరను స్వీకరించటమే, సవము - యజ్ఞముగా కలవాడైన; కుమారమణి చమూపవాసవునకు = సేనానిశ్రేష్ఠుడైన కుమారస్వామికి; కొల్పు = ప్రీతిపాత్రమైన; వాహనమ్ము = యానసాధనం; మయూరమ్ము = నెమలి.

    అని భావించాను.

    ఈ విధంగా అనునిత్యం పద్యవిద్యార్థులను సరస్వతీసేవార్థం నిఃస్వార్థంగా ఉత్తేజపరస్తున్న మీ సౌజన్యానికి, ప్రోత్సాహానికి ధన్యవాదాలు!

    సప్రశ్రయంగా,
    ఏల్చూరి మురళీధరరావు

    రిప్లయితొలగించండి
  27. మిత్రులు ఏల్చూరివారికి నమస్కారములు. తమరి రచనా చమత్కృతి యద్భుతము. నేను పైనఁ దెలిపినట్లుగ (2)వ యంశము నర్థము చేసికొనలేకపోయితిని. తాము విశదముగఁ దెలిపినందులకు ధన్యవాదములు.

    అభినందనలతో...
    గుండు మధుసూదన్

    రిప్లయితొలగించండి
  28. మాన్య సత్కవి శ్రీ గుండు మధుసూదన్ గారికి
    నమస్కృతిపూర్వకంగా,

    మీ ఆదరాభిమానాలకు కృతజ్ఞుణ్ణి. ఏవంరూపాన మీ వంటి ఆనందవర్ధనులైన విద్వాంసులతో మైత్రీప్రతీతిలాభం కలిగినందుకు ఎంతో సంతోషంగా ఉన్నది!

    సప్రశ్రయంగా,
    ఏల్చూరి మురళీధరరావు

    రిప్లయితొలగించండి
  29. ఏల్చూరి వారికి వందనములు !
    సమస్యను నాలుగవ పాదం లోనే ఉంచి అత్యద్భుతంగా సాధించారు !
    అభినందన సహస్రములు !

    నాదంతా శ్రుత పాండిత్యమే !
    ఎప్పుడో దూరదర్శిని యందు గరికిపాటివారు
    ఒకరి వాహనములు మరొకరు పట్టుకొని పారిపోయారని విన్నట్టు గుర్తు !
    మయూరంగురించి వారు చెప్పారో లేదో గుర్తు లేదు గాని
    మీరు చెప్పిన దానిని బట్టి చూస్తే తప్పకుండా చెప్పి యుండరు !
    కుమారసంభవమే జరుగలేదు కావున
    మయూరమచ్చటకు వచ్చుట కవకాశమే లేదు గదా !

    మంచి విషయం తెలియ జేసినందులకూ
    కుమార సంభవం లోని పద్యాన్ని పరిచయం చేసినందులకూ
    ధన్యవాదములు !

    రిప్లయితొలగించండి