19, సెప్టెంబర్ 2013, గురువారం

పద్య రచన – 469 (శబ్ద కాలుష్యము)

కవిమిత్రులారా,
ఈనాటి పద్యరచనకు అంశము....
“శబ్ద కాలుష్యము”

22 కామెంట్‌లు:

  1. మాలిన్యము పలు రకములు
    నేలకు నింగికిని నడుమ నిబిడీ కృతమౌ
    తేలుచు మునుగుచు రణమున
    గాలికి నూగెదరు శబ్ధ కాలు ష్యమునన్

    రిప్లయితొలగించండి
  2. రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  3. ధ్వని కాలుష్యము భువి నను
    దినమును పెంపొందుచుండె దిక్కులదరు రీ
    తిని మైకులును, పరిశ్రమ
    లును, వాహనములును పెరిగి శ్రుతబాధకమై

    రిప్లయితొలగించండి
  4. ఒకచోట నెలుగెత్తి యుద్యమకారుల
    ....త్యుద్వేగమున జేయుచుండు గోల
    నొక వంక రాజకీయోన్నత నేతల
    ....వ్యర్థ వాగ్దానాల వరుస హేల
    నొక ప్రక్క వెర్రిగా నూగుచు కుర్రలు
    ....వాయించు కర్కశ వాద్య లీల
    నొక త్రోవ వేగాన నురుకుచు బోయేడు
    ....వాహనమ్ములు చేయు ధ్వనుల మ్రోత
    పలు పరిశ్రమ లందనవరతము కడు
    భయదమై యుండు ఘోర శబ్దముల వలన
    పరిసరమ్ములు మిక్కిలి వ్యథలు గూర్చి
    జీవకోటికి కడు హాని సేయుచుండు

    రిప్లయితొలగించండి
  5. పట్ట్ణముల ధ్వనికలుషిత
    ఘట్టములే యెట్టి చోటఁ గాంచిన మిగులన్
    గట్టలుగను వ్యాపించియు
    మట్టియె మిగులంగఁ జేయు మార్గమె యెసఁగెన్!

    రిప్లయితొలగించండి
  6. పూజ్యులు నేమానివారికి నమస్కారములు. తమరి సీస పద్యము చాల బాగుగ నున్నది. అభినందనలతో...

    భవదీయుఁడు,
    గుండు మధుసూదన్

    రిప్లయితొలగించండి
  7. ఊరికినొక్కవాహనము యుండెడి కాలముఁ బోయె, నింటికిన్
    పేరునకొక్కవాహనము పేర్మి దలంచుచు నుంచినారహో,
    బారులు తీరి మ్రోతల విపర్యయభావములున్ జ్వలించగా
    భారమదయ్యె నీ బ్రతుకు పట్టణమందున, పల్లెపల్లెలన్.

    మ్రోతలు = horn

    రిప్లయితొలగించండి
  8. పండిత నేమాని వారూ,
    మీ రెండు పద్యాలు ఉత్తమంగా ఉన్నాయి. అభినందనలు.
    *
    గుండు మధుసూదన్ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ‘పట్టణము’ టైపాటు వల్ల ‘పట్ట్ణము’ అయింది.
    *
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    చక్కని ఉత్పలమాల వ్రాసారు. బాగుంది. అభినందనలు.
    ‘వాహనము + ఉండెడి’ అన్నప్పుడు సంధి నిత్యం. యడాగమం రాదు. అక్కడ ‘వాహనమె యుండెడి’ అందాం.

    రిప్లయితొలగించండి
  9. వీనుల విందగు ధ్వనియే
    వీనుల కందిన సుఖమగు విపరీతముగా
    వీనులు కందెడు ధ్వనితో
    వీనులు బందగు నశాంతి వేగమె హెచ్చున్.









    రిప్లయితొలగించండి
  10. కాలుష్యము లన్నిటిలో
    కాలుష్యము శబ్ద మరయ కులుషితు జేయున్
    మేలివియు లేని చోటులు
    బాలలు కడు దూరముంట పఱగును నెపుడున్

    రిప్లయితొలగించండి
  11. నాదమే బ్రహ్మ మనెడి జ్ఞానమ్ము నెఱిఁగి
    మనకు శాస్త్రీయ సంగీతము నొసఁగిరట!
    తను మనో స్వాస్థ్యము నిడెడి ధన మది కద!
    యాధునికమయి శ్రావ్యత, యాత్మతృప్తి
    లుప్తమగు పాట శబ్దకాలుష్య మిడును.

    రిప్లయితొలగించండి
  12. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  13. శ్రీపండిత నేమాని గురువులకు నమస్సులతో

    చలన చిత్ర సంభాషణల్, టెలివిజనున
    సీరియల్సు యాంకరుల విచిత్ర భాష,
    వేదికలనెడి పేరున వేడివేడి
    వాదన లనుచు వాడెడి చేదు భాష

    సంస్కృ తివిడచి సభ్యతాసభ్యతలను
    మరచి లజ్జను విడచుచు మాటలాడు
    హుంక రింపులహంకార కింకరాది
    వంకర పదజాలంబంత శంక రార్య!
    శబ్ద కాలుష్యమే యందు సరకు లేదు.

    లోక రాజ్య సభల యందు లో(కు వైన
    నేతల పరస్పరారోపణాతిశయపు
    రాజకీయ ప్రసంగ దుర్భాష వినగ
    రోత పుట్టించు చుండెను రోజు రోజు

    రిప్లయితొలగించండి
  14. కాలుష్యములన్నియునూ
    కాలము మనసును తనువుల కబళించంగన్
    గోలగు కర్కశ శబ్దపు
    కాలుష్యముతో బ్రతుకులుగాడిని తప్పెన్

    రిప్లయితొలగించండి
  15. బైకు హారన్ల శబ్దము మైకు వలెను
    చెవుల మ్రోగించు చుందురు సిగ్గు లేక
    గుండెలకు దడ పుట్టించు గోల నాప
    ఉద్యమించుము భారత యువకులార

    పెళ్ళి వేడుకలు జరుప వీధులందు
    బాణ సంచాను పేల్చుచు భవ్యమైన
    శబ్ద కాలుశ్యమును చేయు చర్య నాప
    ఉద్యమించుము భారత యువకులార

    రిప్లయితొలగించండి
  16. పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు

    కోడి కూతకు బదులుగా ఘోషణమ్ము
    కొలువు జేరగ పిలిచిన కూలి కూత
    పాఠశాలకు బోవగ బస్సు మోత
    కర్మచారుల వాహన గతుల ఘోష

    కంఠశోషల కార్మిక గణము రణము
    హోరు హోరున వినిపించు ఉదయమందు
    శ్రవణ కుహరముల్ జొచ్చుచు చెవుడు కలుగ
    శబ్దకాలుష్యమునకు ప్రారబ్ధమగుచు

    పెండ్లి వేడుకలందు, పేరంటముల యందు
    చావు,పుట్టులందు శబ్ద రవము
    కర్ణభేది యగుచు కాలుష్యమును పెంచ
    కావు, కావు మనెను కాకి కూడా

    రిప్లయితొలగించండి
  17. దూర దర్శిని వీక్షించు వార లెల్ల
    పెంచి టీవీల శబ్దము వినిన ముప్పు
    కర్ణభేరికి చెడుజేయు కార్యమాప
    ఉద్యమించుము భారత యువకులార

    రిప్లయితొలగించండి
  18. వాయు గొట్టాలు పాడైన వాహనములు
    తోలు చుందురు శబ్దాలు దొర్లుచుండ
    నింగి ముట్టెడు శబ్దాల నిలువరించ
    ఉద్యమించుము భారత యువకులార

    రిప్లయితొలగించండి