29, సెప్టెంబర్ 2013, ఆదివారం

సమస్యలు కావలెను...

సాహితీ మిత్రులారా!
          లోకంలో అందరూ ఏవో కొన్ని సమస్యలతో సతమతమౌతున్నారు. నా సమస్య ‘సమస్యలు లేకపోవడం’! అంటే నాకు ఆర్థిక, కుటుంబ, ఆరోగ్య సమస్యలు లేవని కాదు. సామాజిక, రాజకీయ సమస్యల చర్చలతో నాకు పనిలేదు. వాటికోసం కావలసినన్ని బ్లాగులున్నాయి.
          దాదాపు నాలుగు సంవత్సరాలుగా ‘శంకరాభరణం’ బ్లాగు సమస్యాపూరణం శీర్షికను నిర్వహిస్తున్నది. రోజుకొక సమస్య చొప్పున ఇస్తూ 1200ల సంఖ్యను చేరబోతున్నది. ఇందులో మిత్రులు పంపినవి, మిత్రుల బ్లాగులనుండి, గతంలో జరిగిన అవధానాల నుండి, సాహిత్య గ్రంథాలనుండి సేకరించినవి దాదాపు సగం ఉండవచ్చు. మిగతా సగం నేను సృష్టించినవి. కొత్త సమస్యను సృష్టించడానికి ఒక్కొక్కసారి చాలా ఇబ్బంది పడవలసి వస్తున్నది. ఏదో ఒకటి ఇవ్వాలి కనుక అప్పటికప్పుడు ఆలోచించి ఇస్తున్న సమస్యల్లో అప్పుడప్పుడు ఔచిత్యం లోపించడమో, పేలవంగా ఉండడమో జరుగుతున్నది. అందువల్ల సమస్యలను సృష్టించడం నాకు పెద్ద సమస్య అయి కూర్చుంది.
          సమస్యలను పూరించడం కష్టం కాని, సమస్యలను తయారు చేయడం సులభమే!
          మిత్రులు సమస్యలను తయారు చేసిగాని, సేకరించి గాని పంపి ‘శంకరాభరణం’ బ్లాగు చేస్తున్న సాహితీ యజ్ఞానికి తోడ్పడవలసిందిగా మనవి.
          ఎన్నో ఏళ్ళుగా ‘ఆకాశవాణి’ వారు సమస్యా పూరణ శీర్షికను నిర్వహిస్తున్నారు. ఆ సమస్యలను సేకరించే అవకాశం ఉందా?
          ఇది అందరి బ్లాగు. ఇది నిరాటంకంగా కొనసాగడానికి సహకరించ వలసిందిగా సవినయంగా వేడుకొంటున్నాను.
          సమస్యలను, మీ సలహాలను క్రింది మెయిల్‍కు పంపండి.
          shankarkandi@gmail.com

12 కామెంట్‌లు:

  1. మాస్టరు గారూ ! నిజమే మీ సమస్య పెద్దదే.. అసలు దాదాపు నాలుగు సంవత్సరములుగా రోజుకొక సమస్యను ఇస్తూ నియమముగా ఈ సాహితీ యజ్ఞాన్ని నిర్వహిస్తున్న మీకు శతసహస్ర వందనములు. ఇది అనితర సాధ్యము కూడా అనుటలో అతిశయోక్తి లేదు.మీ దృఢ సంకల్పమునకు నమోవాకములు.పద్యమందభిలాష గలిగి యెప్పుడో ఒక పద్యసుమమును పూయించి ఆనందించే మాలాంటి వారితో నిత్య కృషీవలురై పద్యకవితా సేద్యమును చేయించుచూ బహువిధముల పలురకముల పద్య సుమములను పూయింపజేసి మాకెంతో ఆనందమును కలుగ జేయుచూ అందులోనే మీరు తృప్తిని బొందుచూ నిజమైన గురువర్యులుగా గురుతర బాధ్యతను నిర్వర్తించుచున్న మీకు అభినందనలు.
    తెలుగుభాషాభి వృద్ధికై కృషిచేయుచున్నామనే కొన్ని పత్రికలు మీ కృషిని గమనించి ప్రాచుర్యము గలిగించినచో మరింతమంది ఉత్సాహవంతులు పద్య కవులుగా చే రవచ్చును కదా..తెలుగు వారి సొంతమనుకునే పద్యమును ఇంకా యెల్లలు దాటించుటకు తమవంతు కర్తవ్యమును నిర్వహిస్తే బాగుంటుందని నా ఆకాంక్ష. అప్పుడిక సమస్యలు ఇచ్చుట పెద్ద సమస్యయే కాదు. సమస్యల సమిధలు తెచ్చే వారు తెస్తూ ఉంటారు. క్రతువును నిరహించేవారు నిరహిస్తూ ఉంటారు.
    కవిమిత్రుల మందరమూ ఒక్కొకరము కనీసము ఐదు సమస్యలు ఈ వారములో ఈయగలిగితే...మాస్టరు గారికి ఈ సమస్యల సమస్య పెద్ద సమస్య కాబోదు.. ఈక్రతువులో భాగస్వాములమయ్యె అదృష్టము గలిగినందుకు ఆనందిస్తూ....

    గోలి హనుమచ్ఛాస్రి.

    రిప్లయితొలగించండి

  2. అందరూ సమస్యలు మా కొద్దు బాబోయ్ అని పారి పోతూంటే ఇక్కడ కంది వారు నాకు 'సమస్యలు' కావాలోయ్ అని టపా పెడు తున్నారు !

    కంది వారికి 'మరిన్ని' సమస్యలు వస్తాయని అందరు 'సమస్యలకి' తోడ్పాటు ఇస్తారని ఆశిస్తూ

    జిలేబి

    రిప్లయితొలగించండి
  3. సమస్యాపూరణానికి సమస్యలు పంపే వారికి నాకు తోచిన ముఖ్య సూచనలు:

    * సమస్యతో పాటుగా తమతమ పూరణను కూడా జతపరచ వలసి ఉంటుంది.
    * సమస్య ఎవరి మనోభావాలనూ గాయపరచకుండా పూరించటానికి వీలుగా ఉండటం ఉచితంగా ఉంటుంది.
    * సమస్య పూర్తిగా ఒక పద్యపాదం నిడివి ఉండటం సాధారణంగా చూస్తూ ఉంటాం. పూరణలు కూడా సమస్యాపాదాన్ని చివరిపాదంగా చేసి చెప్పటమూ‌ అంతే సాధారణం. సమస్య ఇందుకు వీలుగా రూపోందించటం మంచిది. సమస్యను పూర్తిపాదంగా ఇవ్వక పోయినా, దానిని ఒక పాదం చివర యథాతధంగా చేర్చి పూరించటానికి వీలుగా ఉండటం ముఖ్యం అని మరువ వద్దు.
    * సమస్యగా ఇచ్చే పాదంలో తెలుగు, సంస్కృత భాషాపదాలు తప్ప దయచేసి అన్యభాషాపదాలు వాడకండి - ముఖ్యంగా ఇంగ్లీషు పదాలు.
    * అలాగే‌ సమస్యలో వ్యాకరణదోషాలు లేకుండా జాగ్రత వహించండి.

    శంకరయ్యగారికి సూచన:
    మీరు ఇంతవరకు ఇచ్చిన సమస్యలను అకారాది క్రమంలో అమర్చిన ఒక పట్టిగా ప్రకటించండి. ఈ‌ పట్టీని మీ బ్లాగులో ఒక పేజీగా చేర్చండి. అది ఒక టపాగా వేయకండి . అలాగే ఈ‌ పట్టికను నెల కొకసారి అప్‌డేట్‌ చేస్తూ ఉంటే బాగుంటుంది. ఇలా చేయటం వలన ఇచ్చిన సమస్యనే‌మరల ఇవ్వకుండా మీకూ సులభంగా ఉంటుంది.

    రిప్లయితొలగించండి
  4. గురువుగారు,
    మీరు "సమస్య"ను ప్రస్తావించడమూ, మిత్రుల సూచనలూ బాగున్నవి.
    మీరు బాగా వ్రాయగలరని, మీరు వ్యాసాల ద్వారా కొన్ని విషయాలను నేటి తరానికి బోధించమని ఇంతకుముందు కూడా మనవి చేసియున్నాను.
    ఇప్పుడుకూడా మీరు పైన వ్రాసిన దాన్ని విస్తరించి వ్రాసి "తెలుగువెలుగు" మాసపత్రికకు పంపితే బాగుంటుందని మనవి చేసుకుంటున్నాను.

    రిప్లయితొలగించండి
  5. ఈ బ్లాగు నిర్వహణలో మీ శక్తిసామర్థ్యాలను, ఓర్మిని గురించే ఒక వ్యాసము వ్రాసి పంపాలని నేను అనుకుంటూనే కాలం గడిపేస్తున్నాను.

    రిప్లయితొలగించండి
  6. గురువుగారికి నమస్సుమాంజలి.

    నాలుగు సంవత్సరములుగా "రోజుకు ఒక సమస్య " అనే నిబంధనతో పద్యరచనాభిలాషులకు క్రొత్తపద్యాలను వ్రాయడములో చేయూతనిస్తూ ఎప్పటికప్పుడు నూతనోత్సాహాన్ని నింపుతూ పద్యనిర్మాణములో అభివృద్ధి సాధింపచేయగలిగిన "మీరు" మరియు "శంకరాభరణము" మాకు దైవంతో సమానము.

    ఈనాడు మీరు చెప్పిన "సమస్యల సమస్య" అనేది మనమందరము కలిసి తీర్చవలసినదే. ఎంతో మంది సమస్యలు సృష్టించగలరు. కానీ మీరన్నట్లు సమస్య పూరించడమే కష్టమవుతుంది. శ్రీశ్యామలీయంగారన్నట్లు సమస్యనిచ్చేవారు సమస్య పూరణకూడా ఇవ్వాలి అనే నిబంధనతో చాలా తక్కువ సమస్యలను సేకరించగలమేమో అని నాకు ఒక సందేహము వచ్చుచున్నది. కానీ వారన్నట్లుగా తెలుగుపదాలు లేక సంస్కృతపదాలతో మాత్రమే సమస్యను సృష్టించగలిగితే చాలా బాగుంటుంది. అంతే కాకుండా సమస్యను పూర్తిపాదముతో యివ్వాల్సిన నిబంధన కూడా తొలగిస్తే బాగుంటుంది. యిటువంటివి ( ఉదా : కుక్క సామజమగుటే ) పూరణచేసే వాళ్ళకు మరింత ఉత్సాహాన్ని యిస్తుందనడములో సందేహము లేదు. ప్రౌఢ సమస్యలైతే మరింత మంచిది.

    యిటువంటి మహాసాహితీ యజ్ఞములో సమస్యల సమిధలను చేర్చడానికి కూర్చడానికి సాహితీ మిత్రులందరు ఐక్యమై వస్తారని ఆశిస్తున్నాను.

    నావంతుగా కొన్ని సమస్యలను ఈ రెండు మూడు రోజులలో పంపిస్తాను పూరణలతో సహా.

    ఈ యజ్ఞము నిర్విరామంగా నిరాటంకంగా సాగాలని అభిలషిస్తున్నాను.

    శ్రీశ్యామలీయగారు,

    నమస్సులు. ఒక్క పూరణ విషయము తప్ప మీతో సంపూర్ణంగా ఏకీభవిస్తున్నాను. ఇది కూడా ఎందుకంటే పూరణ నిబంధంతో ఆలస్యము జరుగుతుందేమో నని. సమస్యలు పంపగలిగే మన కవిమిత్రులందరు కూడా పూరణ చేస్తున్నవారే కదా.

    రిప్లయితొలగించండి
  7. సమస్యను ఇచ్చిన పృఛ్ఛకుడు దానికి ఒక పూరణతో సిధ్ధంగా ఉండటం అనేది సాధారణనిబంధన. ఒక వేళ అవధాని సమస్యకు సరసమైనసమాధానం లేదంటే పృఛ్ఛకుడే ఉందని ఋజువు చూపాలి.

    రిప్లయితొలగించండి
  8. మాస్టరుగారూ ! చిన్న సూచన... సమస్యలు యేవీ దొరకనప్పుడు "నాలుగు మంచి ముక్కలు" దత్తపదిగా నీయవచ్చుకదా.. మాకు అదికూడా సమస్యే కదా...

    రిప్లయితొలగించండి
  9. గురువుగారూ,

    ప్రస్తుతం కొనసాగిస్తున్న వర్ణనాంశముతో పాటూ దత్తపది, నిషిద్ధాక్షరి లాంటివి కూడా సమస్యకు బదులుగా ఎంచుకోవచ్చు కదా. కానీ, సమస్యాపూరణ లో ఉన్నంత ఆనందము మిగతా వటిలో రాదులెండి.

    రిప్లయితొలగించండి
  10. గురువుగారూ,
    కవిమిత్రుల మందరమూ సమస్యలను
    తప్పక పంపెదము.ఈక్రతువులో భాగస్వాములమయ్యె అదృష్టము గలిగినందుకు ఆనందిస్తూ....

    రిప్లయితొలగించండి
  11. ‘సమస్యలు కావలెను’ అని నేను చేసిన అభ్యర్థనకు స్పందించి, సానుభూతిని, సలహాలను అందించిన మిత్రులు గోలి హనుమచ్ఛాస్త్రి గారికి, జిలేబీ గారికి, శ్యామల రావు గారికి, వేమకోటి చలం గారికి, లక్ష్మీదేవి గారికి, సంపత్ కుమార్ శాస్త్రి గారికి, వరప్రసాద్ గారికి ధన్యవాదాలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ రన్నట్టు ‘నాలుగు ముక్కలను’ దత్తపదిగా ఇవ్వవచ్చు. కాని ఆ నాలుగు ముక్కల యుక్తాయుక్తాలను గమనించాలి కదా! ఫిజిక్స్, కెమిస్ట్రీ, హిస్టరీ, జాగ్రఫీ పదాలను ఉపయోగిస్తూ భారతార్థంలోనో, రామాయణార్థంలోనో పద్యం వ్రాయమని అడగవచ్చు. అడగడానికేం? అందలి సాధ్యాసాధ్యాలను కూడా విచారించాలి. నా ఉద్దేశ్యంలో దత్తపదిని తయారు చేయడం కంటే సమస్యను తయారు చేయడమే సులభం.
    *
    శ్యామల రావు గారూ,
    మంచి సూచనల నిచ్చారు. అవశ్యం పాటించవలసినవే.
    సమస్యలను పూరణలతో సహా పంపమనడం బాగానే ఉంది. కాని వాటిని ఒక ఫైల్లో సేవ్ చేసుకొని అవసరానికి వెతుక్కొనడం ఇబ్బందిగా ఉంటుందేమో! ఎలాగూ ఆ సమస్యల యుక్తాయుక్తాలను పరిశీలించే ఇస్తాను కదా. వాటి పూరణలను నేరుగా బ్లాగులోనే ప్రకటించవచ్చు.
    సమస్యల అకారాదిగా పట్టిక చేయమన్న మీ సలహా బాగుంది. కొంతకాలం ఆ విధంగా ఒక ఫైలులో సేవ్ చేస్తూ వచ్చాను. కాని సిస్టంను ఫార్మాటింగ్ చేయించినప్పుడు డెస్క్ టాప్ మీది ఆ ఫైలు పోయింది. మళ్ళీ ఆ ప్రయత్నం చేస్తాను. ‘వర్గాలు’లో ‘సమస్యలు’ అన్న శీర్షిక క్రింద వాటిని ప్రకటిస్తాను.
    *
    లక్ష్మీదేవి గారూ,
    ఆ పని చేసి పుణ్యం కట్టుకోండి.
    *
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    సమస్యలను పూరణలతో సహా తప్పక ఇవ్వాలని నియమం లేదు. కాని మీరిచ్చిన సమస్యకు దానిని ప్రకటించిన రోజున పూరణ ఇస్తే బాగుంటుంది.

    రిప్లయితొలగించండి