21, సెప్టెంబర్ 2013, శనివారం

సమస్యాపూరణం – 1181 (దనుజులు హరి భజన)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది .....
దనుజులు హరి భజనఁ జేయు ధన్యులు సుమతుల్.

29 కామెంట్‌లు:

 1. నారదుఁడు ధర్మజునితోఁ బలికిన సందర్భము...

  విను, ధర్మరాజ! కన, భవ
  దనుజులు హరి భజనఁ జేయు ధన్యులు, సుమతుల్,
  ఘనతర ధీగుణ యుతులును,
  వనజాక్ష విశిష్ట చరణ వందన నిరతుల్!

  రిప్లయితొలగించండి
 2. ఘనమగు పాపపు జగతిని
  మనుజుల కంటెను నయమట మహిషా సురుడౌ
  గనుమయ్య కమల గర్భుడ
  దనుజులు హరి భజన జేయు ధన్యులు సుమతుల్

  రిప్లయితొలగించండి
 3. శ్రీపండిత నేమాని గురువులకు నమస్సులతో

  ద్రుపద పురోహితులు కౌరవ సంసత్తున ధృతరాష్టునితో పల్కుచూ:

  అనయమున పాండవునకున్
  దనుజులు హరిభజనఁ జేయు ధన్యులు సుమతుల్
  పెబకువన నరిభయంకరు
  లని వినలేదా? మరియిక యని మాన్పవలెన్.

  రిప్లయితొలగించండి
 4. గుండు మధుసూదన్ గారూ,
  అద్భుతమైన మీ పూరణతో బ్లాగుకు శుభోదయం అయింది. ‘భవత్ + అనుజులు’ అంటూ మీరు చేసిన పూరణను నేను ఊహించలేదు. చాలా బాగుంది. అభినందనలు.
  *
  రాజేశ్వరి అక్కయ్యా,
  పద్యం చాలా బాగుంది. అభినందనలు.
  అయితే ఈ మాటలను ఎవరేసందర్భంలో అన్నారు?
  *
  తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారూ,
  మీ ఉద్దేశ్యం ‘పాండు తనూజు’లా? అలా అయితే ‘పాండవుడు’ అంటేనే పాండుతనూజుడు. అంతే కాక ‘తనుజుడు’ అనరాదు కదా!
  లేక నేనే మీ భావాన్ని అవగాహన చేసికొనలేక పోయానా? దయచేసి వివరణ ఇవ్వండి.

  రిప్లయితొలగించండి
 5. గురువులకు ధన్య వాదములు
  జరుగుతున్న అక్రమాలకి మనమే భగవంతునికి విన్నవించు కుంటు న్నట్టు
  అదన్న మాట నా ఉద్దేశ్యం

  రిప్లయితొలగించండి
 6. మధుసూదన్ గారూ బాగుంది.. అభినందనలు.
  నేనూ మధుసూదన్ గారి బాట లోనే....

  మనుజుడు కాడాకృష్ణుడు
  దనుజుల గూల్చంగ దిగిన త్రాతౌ హరియే
  విను ధర్మజ నీవున్ భవ
  దనుజులు హరి భజనఁ జేయు ధన్యులు సుమతుల్.

  రిప్లయితొలగించండి
 7. శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు పాదాభివందనములతో ..

  శ్రీ శంకరయ్య గురుదేవులకు ధన్యవాదములు.
  =======*========
  అనవరతమ్ము వలదు వల

  దనుచు హరిని,భువిని వైరి వనుచు భయమునన్

  మునిగిరి నామామృతమున (మునిగిరి నామాంబుధిలో )
  దనుజులు హరిభజనఁ జేయు ధన్యులు,సుమతుల్!

  రిప్లయితొలగించండి
 8. తనపనికొఱకితరులదగు
  పని చెరచెడివారలెవరు? పావనులెవ రీ
  జన హితమును కోరు నెవరు?
  దనుజులు. హరి భజనఁ జేయు ధన్యులు. సుమతుల్.

  రిప్లయితొలగించండి
 9. అనియెను! ప్రహ్లాదుడు,సఖులు,
  దనుజులకొమరులనుబిలచి దానవు లారా!
  వినరే ! హరియే దైవము
  దనుజులు హరి భజన జేయు ధన్యులు సుమతుల్

  రిప్లయితొలగించండి
 10. శంకరార్యులకు నమస్సులు. పద్మశ్రీ పుల్లెల

  శ్రీరామచండ్రుడు గారు వ్రాసిన మహాభారత సారసంగ్రహము నందు అంబాలికకు జన్మించినవాడు”పాండువు” అను ఉండుటచే మరియు ఆంధ్రవాచస్పత్యము ( కొట్రశ్యామలకామశాస్త్రి) నందు “తనుజ = కుమార్తె, తనుజుడు = కుమారుడు అని ఉండుటచే పాండురాజ తనయులుగా స్వీకరించితిని. అయితే పద్యమునందు “పాండువునకున్” వ్రాయుటకు బదులుగా “ పాండవునకున్” అని తప్పు వ్రాసితిని. ఇందలి తప్పొప్పులు పెద్దలు చెప్పవలెను. నేనశక్తుడను.

  రిప్లయితొలగించండి
 11. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  వరప్రసాద్ గారూ,
  మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.
  *
  చింతా రామకృష్ణారావు గారూ,
  క్రమాలంకార పద్ధతిలో మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
  *
  శైలజ గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 12. వినుము మఱి రాజగు పాండు
  దనుజులు హరి భజన జేయు ధన్యులు సుమతుల్
  అనవరతము కృష్ణు మనన
  మెనరంగా జేతు రార్య ! యె ప్పు డు మదిలోన్

  రిప్లయితొలగించండి
 13. శ్రీ గుండుమధుసూధన్ గారికి ప్రత్యేకాభినందనలు.

  కను ప్రహ్లాదుని వలనన్
  దనుజులు హరిభజన జేయు ధన్యులు, సుమతుల్
  మనుజులఁ దనుజులనెంచరు
  వనవాసమునందునైన వదలరు భక్తిన్.

  రిప్లయితొలగించండి
 14. పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు

  క్షణికము బుద్బుదము లగు నీ
  తనువు లశాశ్వతము లనుచు తత్పరభక్తిన్
  మునిగిన ప్రహ్లాడుడుయు త
  దనుజులు హరి భజన జేయు ధన్యులు సుమతుల్

  రిప్లయితొలగించండి
 15. మనసే మందిరమనుకొని
  మనసున హరిహరుల నిల్ప మంగళ ప్రదమౌ
  మనుజులె కనబడు దివిజులు
  దనుజులు ,హరిభజన జేయు ధన్యులు సుమతుల్!!!

  రిప్లయితొలగించండి
 16. మిత్రులు శ్రీ కంది శంకరయ్యగారికి ధన్యవాదములు. సాహితీ మిత్రులు శ్రీ గోలి హనుమచ్ఛాస్త్రి మఱియు శ్రీ సంపత్ కుమార్ శాస్త్రి గార్లకు మనఃపూర్వక ధన్యవాదములు.

  రిప్లయితొలగించండి
 17. శ్రీ గుండు మధుసూదన్ గారి పూరణ ప్రశస్తంగా ఉంది. హృదయ పూర్వక అభినందనలు.

  రిప్లయితొలగించండి
 18. కనికరమును హరి చూపుచు
  తనలోపల చేర్చు ననుట తథ్యము మహిలో.
  మనుజులు, సురులును, పశువులు,
  దనుజులు, హరి భజనఁ జేయు ధన్యులు- సుమతుల్.

  ఎవరైనా హరి భజన జేయు ధన్యులైతే , సుమతులై హరి కనికరమున హరిలో జేరగలుగుట తథ్యము.

  రిప్లయితొలగించండి
 19. ఘన వైరులు శ్రీహరికిని
  దనుజులు; హరి భజనఁ జేయు ధన్యులు సుమతుల్
  మనమున దలతురు నిత్యము
  వినయముగా భక్తితోడ వేడుచు నతనిన్

  రిప్లయితొలగించండి
 20. సుబ్బారావు గారూ,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.
  మొదటి పాదంలో గణదోషం ఉంది.
  *
  సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  మంద పీతాంబర్ గారూ,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.
  *
  లక్ష్మీదేవి గారూ,
  మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.
  *
  బొడ్డు శంకరయ్య గారూ,
  విరుపుతో మంచి పూరణ చెప్పారు. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 21. కనుకలి గలిగిన హరినిన్
  కనుమోడిచి మొరను బెట్ట కాచు తడవునన్
  అనునిత్యము భక్త జనులు,
  దనుజులు హరి భజన జేయ ధన్యులు సుమతుల్

  రిప్లయితొలగించండి
 22. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !

  బాల ప్రహ్లాదుడూ, బలి చక్రవర్తీ దనుజులైనా
  హరిభక్తులూ మంచివారూ గదా :

  01)
  _________________________________

  తన తండ్రి నెదిరి నిల్చిన
  తనయుడు ప్రహ్లాదుడు, మరి - ధర్మపు దీక్షన్
  దనరిన బలియును , కారే
  దనుజులు , హరి భజనఁ జేయు - ధన్యులు , సుమతుల్ !
  _________________________________

  రిప్లయితొలగించండి
 23. కనివిని యెరుగని రకములు
  కనుగొనుచు సురలను బెట్టు కష్టపు విధముల్
  మనమున సతతము దలచెడి
  దనుజులు హరి భజనఁ జేయు ధన్యులు సుమతుల్

  రిప్లయితొలగించండి


 24. వనితా! గర్వపు మనుజులు
  దనుజులు! హరి భజనఁ జేయు ధన్యులు సుమతుల్,
  వనమాలిని మదితలచు సు
  జనులమ్మ ! నమనము లిడుము జయము జయమనన్!

  జిలేబి

  రిప్లయితొలగించండి
 25. రణముల నోడగ పరిపరి
  కనుగొని వడి భాజపాల కమ్మని కిటుకుల్
  కొనగను వోట్లను కాంగ్రెసు
  దనుజులు హరి భజనఁ జేయు ధన్యులు సుమతుల్

  రిప్లయితొలగించండి


 26. మనసుని గట్టిగ నిలుపుచు
  దనుజులు హరి భజనఁ జేయు ధన్యులు సుమతుల్
  ఘనముగ కాగలరయ ము
  క్తిని కోరుచు విభుని చేర తిరముగ కొల్వన్ !


  జిలేబి

  రిప్లయితొలగించండి