14, సెప్టెంబర్ 2013, శనివారం

సమస్యాపూరణం – 1174 (భాష కేలనయ్య)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది .....
భాష కేలనయ్య వ్యాకరణము.

67 కామెంట్‌లు:

  1. అందరికీ వందనములు !

    పరాయి భాష పలికితే వ్యాకరణ రహితమే గదా :

    01)
    _____________________________

    బ్రతుకుతెఱువు కొఱకు - పరదేశ మేగిన
    ప్రజలు , పరుల భాష - పలుకు టెట్లు ?
    పొట్ట నింపు కొనుట - కట్టిట్టు పలికెడు
    భాష కేల నయ్య - వ్యాకరణము ?
    _____________________________

    రిప్లయితొలగించండి
  2. "జనకులకుం గర్ణయుగళ సద్భూషణముల్ "
    అన్నారు గదా పోతన గారు !
    దానికి వ్యాకరణముతో పనేమిటి?

    02)
    _____________________________

    పలుకు పిదప పలుకు - పసిపాప నేర్చును
    పలుక గలదె వడిగ - భాష సరియ ?
    బాపు చెవుల కింపు - పలుమార్లు కలిగించు
    భాష కేల నయ్య - వ్యాకరణము ?
    _____________________________
    బాపు = తండ్రి

    అనుదిన సంతోషణములు,
    జనితశ్రమతాప దు :ఖ సంశోషణముల్
    తనయుల సంభాషణములు,
    జనకులకుం గర్ణయుగళ సద్భూషణముల్
    (పోతనగారి భాగవతము నుండి)

    రిప్లయితొలగించండి
  3. ముంజేతి కంకణానికద్దమెందుకన్నట్లు
    మూగ సైగ భాషకు వ్యాకణమెందుకోయ్ ?

    03)
    _____________________________

    పలుక నేర్వనట్టి - ప్రజలకు గలదుగా
    సైగ సైగ జెప్పు - మూగ భాష
    మూగవారి కొఱకు - సైగలతో జెప్పు
    భాష కేల నయ్య - వ్యాకరణము ?
    _____________________________

    రిప్లయితొలగించండి
  4. జీవుల మధ్య ప్రేమోదయం తోనే గదా సృష్టి !
    ఆ ప్రేమ తెలియ జెప్పే భాషకు వ్యాకణ మవసరమా?

    04)
    _____________________________

    ప్రేమ లోనె జగము ! - ప్రేమయె దైవమ్ము !
    ప్రేమ తోనె జీవి - పెనగులాడు !
    ప్రేమ గలిగి నంత - ప్రేమ తెలియ జెప్ప
    భాష కేల నయ్య - వ్యాకరణము ?
    _____________________________

    రిప్లయితొలగించండి
  5. కోపిష్ఠి భాషకు వ్యాకరణముండునా ?

    05)
    _____________________________

    బామ ముద్భవింప - సామము గుదురునా?
    పాప మపుడు జీవి - వదరు గాదె !
    వారు వీరి దిట్ట - వడివడి పలికెడి
    భాష కేల నయ్య - వ్యాకరణము ?
    _____________________________
    బామము = కోపము
    సామము = మంచిమాట

    రిప్లయితొలగించండి
  6. నిర్భయ వంటి వారిని నాశనము జేసే వారి కురే సరైనది !
    కామోద్రేకుల భాషకు వ్యాకరణమా ?

    06)
    _____________________________

    పాశనములె మేలు - పాపకర్ముల కిక
    నారి యొంటి జిక్క - నలిపి రకట !
    నాశనమును జేయు - నరహంతకుల కప్డు
    భాష కేల నయ్య - వ్యాకరణము ?
    _____________________________
    పాశనము = కంఠపాశము = ఉరి
    అప్డు = అప్పుడు

    రిప్లయితొలగించండి
  7. బాకుల భాషకు వ్యాకరణ మెక్కడైనా ఉంటుందా ?

    07)
    _____________________________

    బాటసారి నిలిపి - బాకును చూపించి
    పణము నంత దోచు - పచ్చెకాడు !
    పచ్చెకాని చేతి - బాకులు పలికెడి
    భాష కేల నయ్య - వ్యాకరణము ?
    _____________________________
    పణము = ధనము
    పచ్చెకాడు = దొంగ

    రిప్లయితొలగించండి
  8. ప్రేమచూపుల భాషకు వ్యాకరణ మెక్కడిది?

    08)
    _____________________________

    బస్సు లాగు చోట - బడి లోన గుడి లోన
    బాటలందు మేటి - తోట లందు
    భామ పైని ప్రేమ - బ్రహ్మచారులు చూపు
    భాష కేల నయ్య - వ్యాకరణము ?
    _____________________________

    రిప్లయితొలగించండి
  9. చంటి బిడ్డల్ని చూపించి యాచించే
    యాచక భాషకు వ్యాకరణ మెందుకు ?

    09)
    _____________________________

    బస్సు లాగు చోట - పలుమార్లు కనుపించి
    భారమైన బ్రతుకు - బండి నడుప
    పట్టి జూపి ముష్టి - బట్టెడు యాచక
    భాష కేల నయ్య - వ్యాకరణము ?
    _____________________________

    రిప్లయితొలగించండి
  10. భాష యనెడు దేవపాదపమ్మున గన
    వ్యాకరణమె మూలమగును గాదె
    భాష కేల నయ్య వ్యాకరణమ్మను
    తలపు వ్యర్థమగు గదా కవీశ!

    రిప్లయితొలగించండి
  11. శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు పాదాభివందనములతో .
    శ్రీ శంకరయ్య గురుదేవులకు ధన్యవాదములు.

    శ్రీ వసంత కిషోర్ గారికి ధన్యవాదములు. మంచి పద్యములతో, మంచి భావములతో మొదలు పెట్టిరి
    శ్రీ నేమాని గురుదేవులు భాష దేవపాదపమ్ముననుచు మంచి పద్యముతో మంచి విషయము తెలియ జేసినారు ఈ దినము తప్పక శుభ దినమే.
    పద్యము వ్రాయలేక భాష కేల నయ్య - వ్యాకరణము ? అని పలుకు వారి పై
    ======*=======
    ప్రాస యతులు నిలుప బహు కష్టమొందుచు
    భాష కేల నయ్య వ్యాకరణము ?
    పద్య రచన వలదు పామరులకనుచు
    పారి పోయె వాడు పద్య మిడచి.

    రిప్లయితొలగించండి
  12. కవుల కలము లందు కమనీయ మగు భాష
    అంద చంద ములకు నాట పట్టు
    భాష కేల నయ్య వ్యాకర ణమనుచు
    పలుక వలదు వినగ బాధ కలుగు

    రిప్లయితొలగించండి
  13. ఎట్టి భాషకైన నే భావమునకైన
    వలయు వ్యాకరణము భాష కనుక
    భాష కేల నయ్య వ్యాకరణ మ్మనఁ
    దగునె శంకరార్య, ధర్మ మగునె?

    రిప్లయితొలగించండి
  14. మద్యపానరతుఁడు మానహీనుఁడు పామ
    రుం డవజ్ఢఁ జెంది రోషమునను
    పురజనులు వినంగ బూతులఁ బల్కెడు
    భాష కేల నయ్య వ్యాకరణము?

    రిప్లయితొలగించండి
  15. ఎట్టి భాషకైన నే భావమునకైన
    వలయు వ్యాకరణము, భాష కనుక;
    భాష కేల నయ్య వ్యాకరణ మ్మనఁ
    దగునె శంకరార్య? ధర్మ మగునె?

    రిప్లయితొలగించండి
  16. బహువిధంబులైన వాగ్దానములఁ జేసి
    మఱచినట్టి ద్రోహ మంత్రితతుల
    నాదరించలేక నతికోపయుక్త దు
    ర్భాష కేల నయ్య వ్యాకరణము

    రిప్లయితొలగించండి
  17. పక్షి జంతు జాతి భాషకు లిపిలేదు
    నోటి యరుపులన్ని మాట లగును
    శబ్ధ సంజ్ఞలెల్ల సందేశ మయ్యెడు
    భాష కేల నయ్య వ్యాకరణము?

    రిప్లయితొలగించండి
  18. పరభాష ప్రియునకు వ్యాకరణమేలయని
    ======*========
    పట్టు బట్టి బలుక పరబాష యువకుడు
    పరవశించె నొక్క పడతి,పలికె
    పెద్ద వారితోడ ప్రియుడు బల్కు తెలుగు
    భాష కేల నయ్య వ్యాకరణము?

    యువతితో తన ప్రేమను తెలుపలేక
    =========*========
    పడతిని నొక పట్టు పావడలోగని
    పట్టు దప్పి యతడు పలుకు చుండె
    దేవపాదపమ్ము,తేనెలూరు తెగులు
    భాష కేల నయ్య వ్యాకరణము?

    రిప్లయితొలగించండి
  19. పలుక వలయునన్న భావమొక్కటి చాలు
    ప్రాస యతుల దారి పట్టనేల
    పలుకు పలికి నపుడు పద్యాలు పలుకునా
    భాష కేల నయ్య - వ్యాకరణము ?

    రిప్లయితొలగించండి
  20. టీవీ లో మంత్రిగారి ప్రసంగము వలదని
    ==========*=====
    మతిని యాలికిచ్చి మంత్రులు బలికెడి,
    భాష కేల నయ్య వ్యాకరణము?
    వారుబలుకు చున్న వారము వచ్చునే?
    వలదుజూపవలదు వారి బలుకు!

    రిప్లయితొలగించండి
  21. శ్రీ వసంత కిశోర్ గారి పూరణలకు పొద్దు ,శ్రీ వరప్రసాదు గారి పూరణలకు హద్దులేల యన్నట్లు,

    గాలికేల నయ్య గట్టులు కట్టలు
    జలము కేలనయ్య కులము మతము
    ఆకసమునకెట్టి హద్దు గలదె ? మూగ
    భాష కేలనయ్య వ్యాకరణము !!!

    రిప్లయితొలగించండి
  22. టీ వీ సిరియళ్ళ లోని ఆడు వారి బలుకులపై, ప్రసంగము వలదని
    ======*==========
    నేటి యాడ వారి నీతి లేని బలుకు,
    వలదుజూపవలదు వారి హావ
    బావములకు లేదు పాప పుణ్యము,వారి
    భాష కేల నయ్య వ్యాకరణము?
    (వ్యాకరణము= మంచి చెడుల విచారము)

    రిప్లయితొలగించండి
  23. శ్రీ మంద పీతామంబర్ గారికి ధన్యవాదములతో....

    ==========*=======
    భాష కేల నయ్య వ్యాకరణమనుచు
    నడుగ,దెలిపె గురుడు,నాట పాట
    లందు లేకయున్న నంకణములు
    ప్రీతి గలుగ కుండు రాతి వలెను!

    రిప్లయితొలగించండి
  24. కిశోర్జీ ! మా పూరణకు ఏ విషయమూ మిగల్చలేదు..కవి మిత్రులందరూ చక్కని పూరణలు చేశారు. అభినందనలు..

    బోసి నవ్వు తోడ బుజ్జాయి దోగుచు
    పలుకు పలుకు లోన నొలుకు తేనె
    తల్లి తనయ మధ్య తన్మయంబున పలుకు
    భాష కేలనయ్య వ్యాకరణము.

    రిప్లయితొలగించండి
  25. శ్రీ గోలి వారికి ధన్యవాదములతో....
    తప్పు జేసితిని,శ్రీ మంద పీతాంబర్ గారు నన్ను మన్నించగలరు.
    ====*========
    పేసు బుక్కు నందు పేనులై,చర వాణి
    సరిగమలకు చచ్చి శవము లైన,
    దూర వాణి జూచి,దుర్భలులు బలుకు
    భాష కేల నయ్య వ్యాకరణము?

    రిప్లయితొలగించండి
  26. కంటి భాషకేల ఘనమయి నలిపులు
    కనులచెమ్మ తెలుప గలదె భాష
    అమ్మ ప్రేమ కొలుచు అవనిలో నేభాష
    భాష కేల నయ్య వ్యాకరణము?

    రిప్లయితొలగించండి
  27. భాషకేలనయ్య వ్యాకరణమనుట
    నొప్పు దార్య ! వినుము తప్పని సరి
    భాషకు మఱి తగిన వ్యాకరణ మవస
    రమ్ము నిజమునే బలుకుదు నెపుడు

    రిప్లయితొలగించండి
  28. టీ వీ లో రాజకీయనాయకుల వ్యాఖ్యలపై విశ్లేషణ జూచి జనులనె
    =======*======
    పిచ్చి వాడి బలుకు మెచ్చి పురజనుల
    తోడ గూడి నేడు తూగు చుండ
    విసుగు జెంది జనులు విదళితముగ వారి
    భాష కేల నయ్య వ్యాకరణము?

    ( వ్యాకరణము= విశ్లేషణ)

    రిప్లయితొలగించండి
  29. కష్టమందుఁ జిక్కి గాయాల నోర్వక
    పిక్కటిల్లు నట్లు వేడు కొనుచు
    నార్తి తోడ ప్రభువు నాశగాఁ బిల్వంగ
    భాష కేల నయ్య వ్యాకరణము?

    రిప్లయితొలగించండి

  30. భాష కేల నయ్య వ్యాకరణమనుచు
    నడుగ,దెలిపె గురుడు,నాభరణము
    లేని యతివ వలెను,లేకుండును సొగసు
    వ్యాకరణములేని భాష,శిష్య !

    రిప్లయితొలగించండి

  31. శ్రీరాముని వేడిన రామదాసు పై
    ========*=======
    కష్ట కడలి యందు కరివలె నిలచిన
    కర్మజీవి కావు కావు మనుచు
    కరి వరధుని వేడ కడు వేడ్కతోడను,
    భాష కేల నయ్య వ్యాకరణము?

    రిప్లయితొలగించండి
  32. మాన్యులు శ్రీ శంకరయ్య గారికి నమస్కృతులతో,

    పూర్వాంధ్రకవిచంద్రసర్వప్రయోగాళి నర్థయుక్తముగఁ గాపాడుకొఱకు
    ప్రకృతి లింగ వచన బహువిభక్తి పరిణామముల తత్త్వంబు మీమాంసకొఱకు
    జ్ఞానార్థులు చ్యుతసంస్కారాదిదోషంబు నించుకైనఁ బరిహరించుకొఱకు
    యుక్త మయుక్తంబు యుక్తియుక్తంబుగా నేర్చి ధర్మపథము నిల్పుకొఱకు

    వ్యాప్తి కొఱకు వాఙ్మయాధ్వర మొనరించి
    సంప్రదాయరక్ష సలుపఁ గాక
    మనకు నేల నయ్య మరణాంతక వ్యాధి!
    భాష కేల నయ్య వ్యాకరణము!

    సప్రశ్రయంగా,
    ఏల్చూరి మురళీధరరావు

    రిప్లయితొలగించండి
  33. గిడుగు రామమూర్తి కినుకతో పల్కెను
    సవరలన్న వారు కవులె? వారి
    భాష కేల నయ్య వ్యాకరణము? విను
    వ్రాయఁ జాలు లిపియె వరము కాదె?

    (గిడుగు రామమూర్తి పంతులు గారు సవరల భాష కొక రూపు నిచ్చే
    లిపిని తయారు జేయడానికి చాలా శ్రమించారంటారు. ఆ భాషకు వారు
    వ్యాకరణము కూడ తయారు జేసి నట్లైతే నా పూరణ తప్పు.)

    రిప్లయితొలగించండి
  34. మాన్యులు శ్రీ ఏల్చూరివారి ముగింపు కొంత నర్మగర్భంగా ఉన్నదనిపిస్తోంది. పైన అంత సలక్షణమైన సీసం వ్రాసి చివరకు "మనకు నేల నయ్య మరణాంతక వ్యాధి!" అనటంలో శ్రేష్ఠమైన కవివరుల ఆంతర్యం!!!
    ప్రసంశాపూర్వక నమస్సులు.

    రిప్లయితొలగించండి
  35. ఆంగ్ల భాష పైన నాసక్తి తోడుత
    బాల లంత ఆంగ్ల బడుల జేరి
    మాట లాడు చుండ మనది గానటువంటి
    భాష కేలనయ్య వ్యాకరణము?

    రిప్లయితొలగించండి
  36. వసంత కిశోర్ గారూ,
    నవరత్నాల వంటి పూరణల నందించి మహదానందాన్ని కలిగించారు. అభినందనలు.
    ౧) వచ్చీరాని పరభాషను మాటాడేటప్పుడు తద్వాకరణాంశాలు మనకేం తెలుస్తాయి? స్వభాషకు చెందిన వ్యాకరణమే సంపూర్ణంగా తెలియని వాళ్ళం!
    ౨) పసిపాలను అనుకరిస్తూ వాళ్ళను ఆడిస్తూ మనమే తప్పులు మాట్లాడుతుంటాము. (ప్రస్తుతం మా మనుమడితో అది నా స్వానుభవం)
    ౩) మూగబాసకు సైగల వ్యాకరణం ఉండండోయ్! అది సర్వభాషలకూ ఒక్కటే!
    ౪) ప్రేమ మైకంలో మాటాడే మాటల్లో వ్యాకరణ దోషాలే కాదు, వాగ్దానదోషాలూ ఉంటాయి.
    ౫) కోపిష్ఠికి యుక్తాయుక్త విచక్షణ ఉండకపోవడం సహజమే.
    ౬) కామాతురాణాం న(శిక్షా)భయం నలజ్జా...
    ౭) కత్తులకు తెలిసిన వ్యాకరణ మొక్కటే.. రక్తపుటేర్లు పారించడం.
    ౮) రోడ్డుసిడు రోమియాల భాష సంగతి ప్రత్యేకంగా చెప్పేదేముంది?
    ౯) యాచకుల భాషలో శుద్ధి ఉంటే ఎవరు దానం చేస్తారు?
    ఇలా అన్ని విషయాలను స్పృశిస్తూ చక్కని పూరణలు చెప్పారు. ఇంతకుముందు చెప్పినట్లు మీది అయితే అతివృష్టి... లేకుంటే అనావృష్టి!

    రిప్లయితొలగించండి
  37. పండిత నేమాని వారూ,
    భాషాకల్పవృక్షానికి మూలం వ్యాకరణమన్న మీ పూరణ మహత్తరంగా ఉంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  38. పూజ్యగురుదేవులు శంకరయ్య గారికి వందనములు

    తెలుగుభాష లోన తీపితనము తెల్ప
    వ్యాకరణ నిబద్ధపద్యములను
    వ్రాయు కవుల కిపుడు పాడియా పేర్కొనగ
    భాష కేల నయ్య వ్యాకరణము

    రిప్లయితొలగించండి
  39. వరప్రసాద్ గారూ,
    వసంత కిశోర్ గారి కంటే ఒక ఆకు ఎక్కువే చదివాననిపించుకున్నారు (ఇప్పటికి)! చాలా సంతోషం, అభినందనలు.
    ౧) సంప్రదాయపద్యం వ్రాయాలంటే వ్యాకరణజ్ఞానం తప్పనిసరి. కాదంటే వచనకవిత్వాది వివిధప్రక్రియ లున్నాయి కదా!
    పద్యం చివర ‘విడచి’ని ‘ఇడచి’ అని వ్యాకరణ విరుద్ధంగా(!) ప్రయోగించారు. అక్కడ ‘పద్యము విడి’ అందాం.
    ౨) ఆంధ్రేతరుని తెలుగుభాష ఎలా ఉంటుందో కర్ణాటకలో నివసించే మీకు బాగా తెలుసునని మాకు తెలుసండీ!
    ౩) ప్రేమోన్మాదుని భాష గురించి యౌవనంలో నాకూ అనుభవమే :-)
    ౪) మంత్రుల భాషను టివిలో ‘వింటా ఉన్నాము’ ‘చూస్తా ఉన్నాము’ కదా!
    ౫) టివి ఆంకర్ల సంగతి ప్రత్యేకంగా చెప్పాలా? ఈ మధ్య నేను గమనించిన అంశం.. అది ఏ టివీ అయినా కానీడి. పిల్లలుకు, రైతులుకు... అంటున్నారు.
    ౬) మూడవ పాదంలో గణదోషం...?
    ౭) ఈ పూరణ చాలా బాగుంది.
    ౮) ‘జనులు’ బహువచనం కదా. ‘అనె’ అని ఏచనాన్ని ప్రయోగించారు. ఈ దోషం మీ పూరణలలోను, వ్యాఖ్యలలోను తరచుగా కనిపిస్తున్నది. ఒకసారి నేమాని వారు హెచ్చరించారు కూడా!
    ౯) ఇది కూడా మంచి భావంతో అలరిస్తున్నది. బాగుంది
    ౧౦) ఆపదమొక్కుల్లో వ్యాకరణ సూత్రాలేం గుర్తుంటాయి?
    మొత్తం మీద మంచి పూరణలను వ్రాసి ఆనందాన్ని కలిగించారు. ఈరోజు మీ కళాశాలకు సెలవు కాదు కదా?

    రిప్లయితొలగించండి
  40. శ్రీ శంకరయ్య గురుదేవులకు ధన్యవాదములు.

    నాకు ఒక మంచి వ్యాకరణ గ్రంధమును తెలుపగలరు. తప్పులు మరల మరల జేయకుండుగా శ్రద్ద వహించెదను. మీరన్నది నిజము నేను తెలుగును సరిగా బలుకలేను. ౨౦ ఏండ్లు తెలుగును మరచి దిరిగి మీ దయతో మరల చదువు చుంటిని.గురువులేని విద్య గుడ్డి విద్యయను చందమున తప్పులు దొర్లుచున్నవి.ఈరోజు మా కళాశాలకు సెలవు గురువుగారు.నా తప్పులను తెలిపినందులకు మరొక్కసారి ధన్యవాదములు

    రిప్లయితొలగించండి
  41. గణ దోషము సవరించి మరొక్కసారి..
    ======*========
    భాష కేల నయ్య వ్యాకరణమనుచు
    నడుగ,దెలిపె గురుడు,నాట పాట
    లందు లేకయున్న నంకణములు గొన్ని
    ప్రీతి గలుగ కుండు రాతి వలెను!

    రిప్లయితొలగించండి
  42. వ్యాకరణము లేని భాష చైనీ సని
    గూగులమ్మ జెప్పు కొంత వరకు
    సత్య మేమొ !? గాని చైనీసు లనవచ్చు
    "భాష కేల నయ్య వ్యాకరణము ? "

    రిప్లయితొలగించండి
  43. రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    గుండు మధుసూదన్ గారూ,
    వ్యాకరణం లేని భాష అస్థిపంజరం లేని శరీరం. ఆ విషయాన్ని చక్కగా తెలియజేసారు మీ పూరణలో. అభినందనలు.
    *
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    దుర్భాలకు వ్యాకరణం లేదన్న మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    బొడ్డు శంకరయ్య గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    *
    శైలజ గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    *
    మంద పీతాంబర్ గారూ,
    మూగ బాసను గురించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    బోసి నవ్వుల మాటలపై మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    చివరి పాదంలో యతిదోషం. ‘రమ్ము నా పలుకు నిజమ్ము సుమ్ము’ అందాం.
    *
    సహదేవుడు గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    *
    ఏల్చూరి మురళీధర రావు గారూ,
    వ్యాకరణావశ్యకతను వివరిస్తూ అద్భుతమైన పూరణ చెప్పారు. అభినందనలు.
    *
    చంద్రశేఖర్ గారూ,
    వ్యాకరణచ్యుతి అనే వ్యాధిని ఏల్చూరి వారు ప్రస్తావించారనుకుంటాను.
    *
    మిస్సన్న గారూ,
    గిడుగు వారిపై చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  44. శ్రీ శంకరయ్య గురుదేవులకు ధన్యవాదములు.
    ( లవణము కొంచెమున్న తీపి దనము పెరుగునని)
    ==========*=========
    భాష కేల నయ్య వ్యాకరణమనుచు
    నడుగ, తీపి యందు నలతి లవణ
    మున్న తీపి దనపు వెన్నె పెరుగు శిష్య!
    దెలిపె గురుడు బాష తీపి నంత.

    రిప్లయితొలగించండి
  45. శ్రీ "మన తెలుగు" చంద్రశేఖర్ గారికి
    నమస్కారం!

    మీ ఆదరాభిమానాలకు ధన్యవాదాలు.

    జీవితాంతం నేర్చినా వ్యాకరణంలో సందేహాలు వస్తూనే ఉంటాయి. ఇది సుశబ్దమా? అపశబ్దమా? ఇది సుప్రయుక్తమా? అప్రయుక్తమా? వ్యాకరణదోషమా? తాపీ ధర్మారావు గారు అన్నట్లు వ్యాకరణము యొక్క దోషమా? సందేహాలు ఒక పట్టాన తీరవు. సూత్రక్రమం ఇలా ఉందగా, లోకవ్యవహారం ఇలా ఎందుకున్నది? ఈ వ్యవహారాన్ని ఇలా ఎందుకు సూత్రీకరించారు? "ఆంధ్రకౌముది"లో గణపవరపు వెంకటకవి "పెండ్లి"కి బహువచనం "పెండ్లులు" కావాలి కదా, అలా ఎందుకు కాలేదు? "పెండ్లిండ్లు" ఎందుకనాలి? అని ఆలోచించాడు. సమాధానం చెప్పాడు. ఎంతో ఆలోచిస్తే కాని, భాషలోని అంతస్సూత్రం అవగతం కాదు. తత్త్వం బోధపడదు. వయసు మీరినకొద్దీ సంశయాలు పెరుగుతాయే కాని, తరగవు. జీవితాంతం ఆలోచిస్తూనే, ప్రయోగాలను పరిశీలిస్తూనే ఉండాలి. అందుకే, పూర్వం శుక్రచార్యుడు "మరణాంతో వ్యాధిర్వ్యాకరణం" అన్నాడని ప్రాతిశాఖ్యం.

    "రక్షోహాగమలఘ్వసందేహాః ప్రయోజనం" అని మహాభాష్యం. వ్యాకరణప్రయోజనం భాషకు సంస్కారం. పూర్వుల రచనలను అర్థం చేసుకొని మన సంస్కృతి వారసత్వాన్ని కాపాడుకోవటంకోసం, శబ్దాపశబ్దవివేకంతో దోషాలను పరిహరించటంకోసం, ధర్మపథాన్ని నిలపటంకోసం, వాఙ్మయక్రతువు చేసి సంప్రదాయాన్ని రక్షించటంకోసం కాకపోతే, భాషకు వ్యాకరణం ఎందుకు? మనకు ఈ మరణాంతవ్యాధి ఎందుకు? అని.

    ఇదంతా సంప్రదాయ పరిరక్షకోసమే అని నిశ్చయాంతం.

    సప్రశ్రయంగా,
    ఏల్చూరి మురళీధరరావు

    రిప్లయితొలగించండి
  46. వరప్రసాద్ గారూ,
    ‘విద్యార్థి కల్పతరువు’ మీకు ఉపయోగపడుతుందనుకుంటాను. అది ‘వెంకట్రామా అండ్ కో, ఏలూరు’ వారి ప్రచురణ. మీ నగరంలో పుస్తకాల షాపులో దొరకవచ్చు. లేదా పబ్లిషర్‍కు 040-27568298, 9390002426 నెం.లకు ఫోన్ చేసి తెప్పించుకోవచ్చు.
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    చైనా భాషకు వ్యాకరణం లేదా? చిత్రం! నాకు తెలీదు సుమా. మంచి పూరణ. అభినందనలు.
    *
    ఏల్చూరి వారూ,
    నా అజ్ఞానాన్ని మన్నించండి.
    ‘మరణాంతోవ్యాధి వ్యాకరణమ్’ అన్న శుక్రవాక్కు ఎంత అర్థవంతమైంది! ధన్యావాదాలు.

    రిప్లయితొలగించండి
  47. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    రిప్లయితొలగించండి
  48. మిత్రులు
    వరప్రసాద్ గారికి
    పీతాంబరధరులకూ
    గోలివారికీ
    ధన్యవాదములు !

    రిప్లయితొలగించండి
  49. శంకరార్యా !
    ధన్యవాదములు !
    నా పూరణకు హేతువు మూగసైగల భాష నేర్వని వారి గురించి !

    రిప్లయితొలగించండి
  50. ఏల్చూరివారు అద్భుతమైన పురణ నిచ్చుటయే గాక
    గొప్ప సందేశం కూడా అందించారు !

    ఙ్ఞానమనే దొక తరగని గని !
    ఎంత తవ్వినా విలువైనవి దొరుకుతూనే యుంటవి !

    "మరణాంతో వ్యాధి వ్యాకరణం" అన్న శుక్రవాక్కు నందించిన వారికి ధన్యవాదములు !
    సందేహాన్నడిగి సందేహ నివృత్తికి తోడ్పడిన
    మనతెలుగు చంద్రశేఖరుల వారికి
    ప్రత్యేకధన్యవాదములు !

    రిప్లయితొలగించండి
  51. కాలకాలమందు కడు మార్పు చెందుచు
    జనులు పలుకు భాష సౌరు జూపు.
    సర్వయుగములందు సమ్మతి యిడనిచో
    భాషకేల నయ్య వ్యాకరణము?

    రిప్లయితొలగించండి
  52. అద్భుతమైన పూరణ చేసిన మురళీధరరావుగారికి వందనములు.
    వారి పూరణ సారాన్ని గ్రహించే నేను పూరణ చేసినాను.

    రిప్లయితొలగించండి
  53. భక్తితోడ కోరు భక్తుని కోర్కెకు
    పదము పలుకకుండ పథము చూపి |
    భుక్తి ముక్తినిచ్చి బోథచేసెడి వాని
    భాషకేలనయ్య వ్యాకరణము ||

    రిప్లయితొలగించండి
  54. అద్భుతమైన పూరణ నిచ్చి అపురూపమైన విషయాన్ని తెలియజేసిన డా. ఏల్చూరి వారికి నమస్సులు.

    ప్రభల రామలక్ష్మి గారు, వారి మరిది గారు అప్పుడప్పుడు చుక్కల్లా తళుక్కు మంటున్నారు!

    రిప్లయితొలగించండి
  55. లక్ష్మీదేవి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ‘కాలకాలమందు’ అన్నది ‘కాలగమనమందు’ అయితే?
    *
    ప్రభల రామలక్ష్మి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  56. ధన్యవాదములు గురువు గారూ ! languages without grammar అని గూగుల్ లో శోధించి చూడండి.

    రిప్లయితొలగించండి
  57. సాహితీ గురువులు మిస్సన్న గారికి నమస్కారములు,
    దైవానుగ్రహంతో మరియూ మీవంటివారి ప్రోత్సాహంతో రోజు మెరవాలనే ఉంది.

    రిప్లయితొలగించండి
  58. శ్రీ కంది శంకరయ్య గారికి కుసుమాంజలి, తమరి బ్లాగును చాలా కాలంగా వీక్షిస్తూ స్ఫూర్తినొంది పూరణ చేయుటకు ప్రయత్నించి నిన్న పంపంచడంలో విఫలమయ్యాను. ఒక రోజు ఆలస్యంగా పంపిస్తున్నందులకు అన్యదా భావించక స్వీకరిస్తారని మనవి.

    కుస్మ సుదర్శన్, భివండీ. మహారాష్ట్ర. ఉపాద్యాయులు.

    మనసు తెలుపు భాష మంచి పెంచెడి భాష
    నోట పలుక సూర్య కోటి ప్రభలు
    మాట లోన భావ మూటలున్న యెడల
    భాష కేల నయ్య వ్యాకరణము

    రిప్లయితొలగించండి