18, సెప్టెంబర్ 2013, బుధవారం

ఓంకార గీతము


పల్లవి :
ఓం నమశ్శివాయ యంచు ఓం నమశ్శివాయ యంచు
ఓం నమశ్శివాయ యంచు జపము సేయరే || ఓం ||


ఓంకారమే బ్రహ్మ మోంకారమే విశ్వ
మోంకారమే సర్వ మో సుధీమతీ! || ఓం ||


ఓంకారమే ధాత ఓంకారమే చక్రి
ఓంకారమే శూలి ఓ సుధీమతీ! || ఓం ||


ఓంకారమే సత్య మోంకారమే జ్ఞాన 
మోంకారమే యనంత మో సుధీమతీ! || ఓం ||

ఓంకారమే ధ్యేయ మోంకారమే జ్ఞేయ
మోంకారమే శ్రేయ మో సుధీమతీ! || ఓం ||

ఓంకారమే యొజ్జ ఓంకారమే శ్రద్ధ
ఓంకారమే సిద్ధి ఓ సుధీమతీ! || ఓం ||


పండిత నేమాని రామజోగి సన్యాసిరావు

12 కామెంట్‌లు:


 1. ఓం కారము బ్రహ్మాయెను
  హ్రీం కారము విష్ణు వయ్యె హ్రీం శివు డయ్యెన్
  ఐం కారము శ ర్వా ణిగ
  శ్రీం కారము లక్ష్మి గాగ శ్రేయం బయ్యెన్ .

  రిప్లయితొలగించండి
 2. శ్రీ నేమాని గురుదేవులకు ధన్యవాదములు.

  మంచి భక్తి రసమయమైన "ఓంకార గీతము" మాకు జపము సేయమనుచు నిచ్చిరి.
  తప్పక ఓం కారగీతముతో,మీతో మా స్వరము కలిపెదము.

  రిప్లయితొలగించండి
 3. Sree Chinta Ramakrishna Rao's appreciation:
  ఎద లోతులలో పలికే
  మృదు నాదము ఓంకారము.
  మదుర గతిని, వెలికుబకగ
  సుధగా ప్రవహింప జేసి,
  హృదయ కమల విలసిత హరి
  యెదపై వసియించు లక్ష్మి,
  మదుర గతిని హరికి తెలుపు
  మధుర గీతి యటులున్నది.
  మధురాక్షర పండిత కవి
  హృదయ వేద్య! మహనీయా!
  మది గొలుతును మీకవిత్వ
  మృదుల భావ పరంపరను.
  మీ
  రామ కృష్ణా రావు.

  రిప్లయితొలగించండి
 4. ఆదినాదమ్ముగా నవతరించిన గీత-
  ........మానంద సంధాయ మైన గీతి!
  పంచాక్షరికి ముందు పల్లవించెడు గీత-
  ........మాది శంకరున కామోద గీతి!
  ఆముష్మికము గోరు నా ముముక్షుల గీత-
  ........మాగమమ్ముల కమ్మ యైన గీతి!
  జపతప యజ్ఞాది సర్వ కర్మల గీత-
  ........మష్టసిద్ధుల నిచ్చు నమర గీతి!

  నాట్య సంగీత శాస్త్రాల నవ్య గీతి!
  భారతీయుల సంస్కృతి ప్రాణ గీతి!
  అన్ని జీవులలో మ్రోయు హంస గీతి!
  ప్రణవ నాద! మోంకారము! భవ్య గీతి!

  రిప్లయితొలగించండి
 5. శ్రీ నేమాని గురుదేవులకు మాకు మంచి భక్తి రసమయమైన "ఓంకార గీతము" ఇచ్చినందులకు ప్రణతి ప్రణతి యనుచు
  ======*==========
  ఓంకార మే శివుడనుచు
  నోంకార జపమ్ము జేయ ఓం ఓమ్మనగన్!
  ఓం కార గీతము నిడిరి
  ఓంకార మహిమ గనంగ నుత్తేజముతో !

  మన గురుదేవులకు ప్రణతి
  యని బలుక నొక తురి జిహ్వ యనుభాగమునన్
  అనవరతము సుధ లూరున్
  వినిపించెద నది కవికుల విజ్ఞానులకున్ !

  రిప్లయితొలగించండి
 6. నమస్కారములు
  భక్తి రస భరిత మైన ఓం కార ప్రణవ నాదమును అందించిన పూజ్య గురువులు , పాండితీ స్రష్టలు ఐన శ్రీ నేమాని అవధాన సరస్వతి కి ప్రణామములు

  రిప్లయితొలగించండి
 7. అకార ఉకార మకార రూప ఓంకార తత్త్వాన్ని రూపాన్ని గీత రూపంలో వెలయించిన బ్రహ్మశ్రీ నేమాని పండితులకు, వారి ప్రేరణాంచిత సీసగీతము వెలయించిన అన్న మిస్సన్న గార్కి అభినందన పూర్వక నమస్సులు.

  రిప్లయితొలగించండి
 8. మా ఓంకార గీతమును గురించి చక్కగా స్పందించిన మిత్రులు --
  శ్రీ సుబ్బా రావు గారికి
  శ్రీ వరప్రసాద్ గారికి
  శ్రీ చింతా రామకృష్ణా రావు గారికి
  శ్రీ మిస్సన్న గారికి
  శ్రీ తోపెల్ల శర్మ గారికి
  శ్రీమతి రాజేశ్వరి గారికి

  మరియు మన బ్లాగు నిర్వాహకులు శ్రీ కంది శంకరయ్య గారికి
  హృదయపూర్వక శుభాభినందనలు. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 9. ధాత చక్రి శూలి త్రిమూర్త్యాత్మక ముగా ఓంకార రూపాన్ని దర్శింప జేశారుధన్యవాదాలు

  రిప్లయితొలగించండి