15, సెప్టెంబర్ 2013, ఆదివారం

పద్య రచన – 465 (గుడి గంట - బడి గంట)

కవిమిత్రులారా,
ఈనాటి పద్యరచనకు అంశము....
“గుడి గంట - బడి గంట”

28 కామెంట్‌లు:

  1. బడి గంట భవిత బంగారముగ జేయు
    గుడి గంట తెరచు గుండె గదిని,
    గంటయేదియైన గట్టిగా తెల్పును
    మాదు మాట వినుచు మనుము, నరుడా!

    రిప్లయితొలగించండి
  2. భక్తి పిలుపంట గుడిగంట ముక్తి నిడగ
    సకల జగతికి చైతన్య సాధ నమ్ము
    జ్ఞాన మొసగెడి ధామము మాన వునకు
    భవిత వరమంట బడిగంట బ్రతుకు తెరువు
    -------------------------------------
    గుడి గంటలు విని నంతనె
    సడి జేయక కనులు మూసి జపియిం చంగా
    బడి గంట కుపసి వారలు
    వడి వడిగా పరుగు లిడుచు బడి జేరంగా !

    రిప్లయితొలగించండి
  3. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    గుడిలో గంట మ్రోగిస్తే పాపాలు శ్రీకాంతార్పణం -
    బడిలో గంట మ్రోగితే శిష్యులకు వాక్కాంతానుగ్రహం :

    01)
    ______________________________________

    గుడిలో గంటల మ్రోగ జేయుచును, జై - గోవింద యన్నంత నే
    కడు పుణ్యంబులు గల్గు, పాపములు శ్రీ - కాంతార్పణం బౌనులే !
    బడిలో గంటలు మ్రోగ ,శిష్యులకు సౌ- భాగ్యంబు వాగ్భామిడున్ !
    సడినే జేయక శ్రద్ధగా జదువ , శ్రీ - శర్వాణి శక్తిన్నిడున్ !
    ______________________________________
    వాక్కాంత = వాగ్భామ = సరస్వతి
    శర్వాణి = పార్వతి

    రిప్లయితొలగించండి
  4. గుడి గంటలు, బడి గంటలు
    నెడఁదను వికసింపఁ జేసి, హిత మందించున్!
    గుడి గంట దైవ మననము;
    బడిగంటయ జ్ఞాన యజ్ఞ భాస్వ ద్వరమే!

    రిప్లయితొలగించండి
  5. ప్రభల రామలక్ష్మి గారూ,
    మంచి భావంతో పద్యం చెప్పారు. అభినందనలు.
    మొదటి రెండు పాదాల్లో గణదోషం.. నా సవరణతో మీ పద్యం...
    భవితను బడి గంట బంగారముగ జేయు
    గుడిని గంట తెరచు గుండె గదిని,
    గంటయేదియైన గట్టిగా తెల్పును
    మాదు మాట వినుచు మనుము, నరుడ!
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ రెండు పద్యాలూ బాగున్నవి. అభినందనలు.
    *
    వసంత కిశోర్ గారూ,
    మీ మత్తేభం బాగుంది. అభినందనలు.
    ‘వాగ్భామ + ఇడున్’ అన్నప్పుడు సంధిలేదు. యడాగమం వస్తుంది. ‘శక్తిని + ఇడున్ = శక్తి నిడున్’ అవుతుంది. నా సవరణ...
    బడిలో గంటలు మ్రోగ ,శిష్యులకు నా- వాగ్దేవి భాగ్యం బిడున్ !
    సడినే జేయక శ్రద్ధగా జదువ , శ్రీ - శర్వాణి సత్త్వ మ్మిడున్ !
    *
    గుండు మధుసూదన్ గారూ,
    భాస్వద్వర పద్యాన్ని రచించారు. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  6. బడిగంటల మ్రోతలువిని
    వడివడిగా పిల్లలంత బడులకు పోవన్
    నడయాడుచు వెళుచుందురు
    గుడిగంటలు మ్రోగ జనులు గుడి మెట్టులపై

    రిప్లయితొలగించండి
  7. వాగ్దేవతా పాద పద్మ విభూషణ
    ....కల నాదమగు బడి గంట నాకు
    ఆ గంట వినినంత నలరును స్వాంతమ్ము
    ....ప్రమదమొందుచు చాల పరవశించి
    ఆ గంటలోననే యఖిల పాఠ్యాంశాలు
    ....మననమ్ము కాబడు మానసమున
    ఆ గంటయే కూర్చి యతుల చైతన్యమ్ము
    ....చిత్త మేకాగ్రమ్ము చేయుచుండు
    శివుని తాండవ కేళిలో జెలగు మృదుల
    ప్రణవ నాదమ్ములే వినబడుచునుండు
    విందు జేయుచు గుడిగంట లందు లెస్స
    నంత శివలీల లలరు మదాత్మ లోన

    రిప్లయితొలగించండి
  8. చతుష్ప్రాసతో ఎప్పుడో వ్రాసిన పద్యం :

    గణగణ మ్రోగెను గంటలు
    గణగణమని మ్రోగెను బడిగంటలు; మ్రోగెన్
    గణగణ గుడిలో గంటలు
    గణగణ గణగణ గణగణ గంటలు మ్రోగెన్.

    రిప్లయితొలగించండి
  9. బొడ్డు శంకరయ్య గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    పండిత నేమాని వారూ,
    సీసంలో బడిగంటల, ఎత్తుగీతిలో గుడిగంటల ప్రాశస్త్యాన్ని వివరించారు. చాలా బాగుంది. అభినందనలు.
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  10. గురువు గారికి నమస్కారములు
    త్వరగా పద్యం పూర్తి చేసి బ్లాగులో పెట్టాలనే తొందరలో పొరపాటును గ్రహించలేదు మీ సవరణకు ధన్యవాదములు

    రిప్లయితొలగించండి
  11. గుడి గంటలు బడిగంటలు
    వడివడిగా మ్రోగుచుండు బడిలో గుడిలోన్
    బడిలో పిల్లల కొఱకవి
    గుడిలో నవి భక్తతతులు కోరిక లడుగన్

    రిప్లయితొలగించండి
  12. బంగారుగుడి గంట పలుకును మంత్రమ్ము
    భక్తి ముక్తి నొసగె భావరవము
    బడిగంట నదము భవితకు శ్రీకరము
    భుక్తి యుక్తి కరపె పుణ్యపథము.

    రిప్లయితొలగించండి
  13. గుడి గంటలు వినగానే
    అడుగులు ఆవైపుమరలు ఆనందముతో
    బడి గంటలువినబడగా
    వడిగా బాలురు వెడలును పరుగులు పెడుతూ

    రిప్లయితొలగించండి
  14. నడతను నేర్పి నిల నరుని
    బడిగంట మనగను జేయు, ఫలవంతముగాన్.
    సుడిగుండపు మోహమునున్
    గుడిగంట విడువగ జేయు గురువై యిలలోన్.

    రిప్లయితొలగించండి
  15. శ్రీ శంకరయ్య గురుదేవులకు, శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో..
    ========*=========
    గుడిగంట మ్రోగుచు నుండు గోవతనము వీడు మనుచు
    బడిగంట మ్రోగుచు నుండు పామరత్వము వీడు మనుచు
    గుడిగంట సజ్జన తతిని గురుని పాదమ్ముల జేర్చు
    బడిగంట దుర్గణ తతిని పచనమ్ము గావించు చుండు
    గుడిగంట బడిగంట గలసి గురుపాదమ్ములు గుర్తు జేయు.
    ( గోవతనము= చెడ్డతనము)

    రిప్లయితొలగించండి
  16. నేమాని పండితార్యా! రెండు ధ్వనుల ప్రభావాన్ని సూటిగా చక్కగా చెప్పారు.
    నా ప్రయత్నం:

    గుడిగంట, బడిగంట గుండెలో నిండుగా
    ...........కొలువున్న పరమాత్మ పిలుపు లగును!
    గుడిగంట, బడిగంట గుండెలో నెలకొన్న
    ...........యజ్ఞాన తిమిరాల కర్కు లగును!
    గుడిగంట, బడిగంట కోట్లాది హృదయాల
    ...........చైతన్య పరచెడు శబ్ద మగును!
    గుడిగంట, బడిగంట కొడిగట్టు సంస్కృతీ
    ...........సంప్రదాయపు దివ్వె చమురు లగును!


    ఒకటి యాముష్మికమ్మున కూత మగును,
    రెండవది యైహికపు వెల్గు రేక లగును,
    రెండు గంటల శబ్దాలు లేని నాడు,
    నరుడు చుక్కాని లేనట్టి నావ యగును.


    రిప్లయితొలగించండి
  17. శ్రీ మిస్సన్నా గారికి శుభాశీస్సులు. చాల బాగుగ పద్యమును చెప్పేరు. అభినందనలు. కొన్ని సూచనలు:

    1. రెండవ పాదములో నెలకొన్న తరువాత నుగాగమము చేయాలి అనుకొంటాను.
    2. మూడవ పాదము ఉత్తరార్థములో బహువచనముగ వాడితే బాగుంటుంది - స్వరములగును అందామా?
    3. 4వ పాదములో సంస్కృతి అని హ్రస్వ ఇకారమునే వాడాలి - దీర్ఘము రాదని పూర్వము డా. ఏల్చూరి వారు సెలవిచ్చేరు కదా.

    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  18. పూజ్యగురుదేవులు శంకరయ్య గారికి వందనములు

    గుడిగంట మ్రోగగానే
    సడి సేయుచు వచ్చి యచట సాగిలపడుచున్
    ముడుపులు యపరాధముతో
    వడిగా చెల్లింతు మనుచు భక్తులు మ్రొక్కన్

    బడి గంటలు వినగానే
    దడ పుట్టును ఫీజు కట్ట తండ్రులకెంతో
    మిడిమేలపు చదువులకై
    గడియించిన జీతమంత ఖర్చై పోగా

    చదివిన చదువుకు ఘనముగ
    చదివింపులు చాలవింక సామర్ధ్యముకై
    మొదలగు పరీక్ష లాపై
    కుదుట పడగ బ్రతుకు నందు కోర్కెలు దీర్చన్

    రిప్లయితొలగించండి
  19. శ్రీ వరప్రసాద్ గారికి శుభాశీస్సులు. మీ మధ్యాక్కర ధోరణులు బాగుగ నున్నవి. అభినందనలు. కొన్ని సూచనలు:

    4వ పాదములో : దుర్గణ తతిని కి బదులుగా దుష్టజాలమును అందామా?
    5వ పాదము ఉత్తరార్థమును ఇలాగ మార్చుదామా? : గురుపాద ముద్రలై యలరు

    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  20. శ్రీ తిమ్మాజీ రావు గారికి శుభాశీస్సులు.
    మీ 3 పద్యములు బాగుగ నున్నవి. అభినందనలు.
    కొన్ని సూచనలు:

    1వ పద్యము 3వపాదములో యడాగమము రాదు.
    3వ పద్యము : చదువునకు అనవలెను. అలాగే సామర్థ్యమునకై అనవలెను.

    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  21. గుడి గంటల ధ్వనులు గొప్పగా వినిపించు - నిండుగా మదిలోన నింపు భక్తి
    దైవ దర్శనమున తన్మయత్వముగల్గి - సద్గుణములు గూరి శాంతి కలుగు
    బడిగంటల ధ్వనులు పరుగు లెత్తించుచు - బాలబాలికలను బడికి జేర్చి
    విద్యార్థులకు విద్య, వినయమ్ము గలిగించి - విశ్వ మందున గొప్ప విలువ నిచ్చు

    గంట మ్రోగును గుడిలోన గణగణ మని
    భక్తులకు పారవశ్యము ప్రాప్తమవ్వ
    గంట మ్రోగును బడిలోన గణగణమని
    విద్వ దర్థులకు సరియైన విద్యనివ్వ

    రిప్లయితొలగించండి
  22. గంట మ్రోగును గుడిలోన గణగణ మని
    భక్తులకు పారవశ్యము ప్రాప్తమవ్వ
    గంట మ్రోగును బడిలోన గణగణమని
    వెలుగు బాటను జూపుచు విద్యనివ్వ

    రిప్లయితొలగించండి
  23. బడి గంట మ్రోగె లోనికి
    నడుగిడరారండి పలుకులమ్మును కొలువున్
    గుడి గంట మ్రోగె లోనికి
    నడుగిడరారండి పలుకులమ్మను కొలువన్

    రిప్లయితొలగించండి
  24. మిత్రులందరూ చక్కని పద్యాలు వ్రాసారు. ఎలాగూ నేమాని వారు పరిశీలించారు కనుక .....
    సుబ్బారావు గారికి,
    శైలజ గారికి,
    లక్ష్మీదేవి గారికి,
    వరప్రసాద్ గారికి,
    మిస్సన్న గారికి,
    కెంబాయి తిమ్మాజీ రావు గారికి,
    బొడ్డు శంకరయ్య గారికి,
    ముఖ్యంగా పండిత నేమాని వారికి
    అభినందనలు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  25. శంకరార్యులకు ధన్యవాదములతో :

    అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    గుడిలో గంట మ్రోగిస్తే పాపాలు శ్రీకాంతార్పణం -
    బడిలో గంట మ్రోగితే శిష్యులకు వాక్కాంతానుగ్రహం :

    01అ)
    ______________________________________

    గుడిలో గంటల మ్రోగ జేయుచును, జై - గోవింద యన్నంత నే
    కడు పుణ్యంబులు గల్గు, పాపములు శ్రీ - కాంతార్పణం బౌనులే !
    బడిలో గంటలు మ్రోగ ,శిష్యులకు నా- వాగ్దేవి భాగ్యం బిడున్ !
    సడినే జేయక శ్రద్ధగా జదువ , శ్రీ - శర్వాణి సత్త్వ మ్మిడున్ !
    ______________________________________
    వాక్కాంత = వాగ్భామ = సరస్వతి
    శర్వాణి = పార్వతి

    రిప్లయితొలగించండి
  26. శ్రీ బొడ్డు శంకరయ్య గారు!
    శుభాశీస్సులు. మీ పద్యములు బాగుగ నున్నవి. కొన్ని సూచనలు:
    1. ప్రాప్తమవ్వ -- అనే సమాసము బాగులేదు. ఆ పాదమును ఇలాగ మార్చుదాము: "భక్తులకు పారవశ్య సంప్రాప్తి కొరకు"
    2. విద్యనివ్వ అనుట బాగులేదు -- విద్య నిడగ అందామా?
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  27. నేమాని గురువు గారికి నమస్కారములు, మీ సూచనలకు ధన్యవాదములు.....సవరణతో........


    గుడి గంటల ధ్వనులు గొప్పగా వినిపించు - నిండుగా మదిలోన నింపు భక్తి
    దైవ దర్శనమున తన్మయత్వముగల్గి - సద్గుణములు గూరి శాంతి కలుగు
    బడిగంటల ధ్వనులు పరుగు లెత్తించుచు - బాలబాలికలను బడికి జేర్చి
    విద్యార్థులకు విద్య, వినయమ్ము గలిగించి - విశ్వ మందున గొప్ప విలువ నిచ్చు
    గంట మ్రోగును గుడిలోన గణగణ మని
    భక్తులకు పారవశ్య సంప్రాప్తి కొఱకు
    గంట మ్రోగును బడిలోన గణగణమని
    వెలుగు బాటను జూపుచు విద్య నిడగ

    రిప్లయితొలగించండి
  28. నేమాని పండితార్యా! అవును తప్పులు దొర్లాయి.
    మీ సవరణకు ధన్యవాదములు. ఒక్క నెలకొన్న తర్వాత నుగాగమం అవుతుందా
    అన్న సందేహం మాత్రం నన్ను పీడిస్తోంది.
    సవరించిన పద్యం:

    గుడిగంట, బడిగంట గుండెలో నిండుగా
    ...........కొలువున్న పరమాత్మ పిలుపు లగును!
    గుడిగంట, బడిగంట గుండెలో నెలకొన్న
    ...........నజ్ఞాన తిమిరాల కర్కు లగును!
    గుడిగంట, బడిగంట కోట్లాది హృదయాల
    ...........చైతన్య పరచెడు స్వరము లగును!
    గుడిగంట, బడిగంట కొడిగట్టు సంస్కృతి
    ...........సంప్రదాయపు దివ్వె చమురు లగును!


    ఒకటి యాముష్మికమ్మున కూత మగును,
    రెండవది యైహికపు వెల్గు రేక లగును,
    రెండు గంటల శబ్దాలు లేని నాడు,
    నరుడు చుక్కాని లేనట్టి నావ యగును

    రిప్లయితొలగించండి