28, సెప్టెంబర్ 2013, శనివారం

సమస్యాపూరణం – 1188 (కాలుఁడు హిమశైలసుతకు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది .....
కాలుఁడు హిమశైలసుతకుఁ గాంతుం డయ్యెన్.

25 కామెంట్‌లు:

 1. శైలమునఁ దపమొనర్చెడు
  ఫాలాక్షుని సేవలోన వలపుఁ గొనిన త
  ల్లోలాక్షి మహిమఁ; గంఠే
  కాలుఁడు హిమశైలసుతకుఁ గాంతుండయ్యెన్!

  రిప్లయితొలగించండి
 2. శ్రీపండిత నేమాని గురువులకు నమస్సులతో

  వేలుపుల పనుపున నజుడు
  వేలుపుగమికాని కొరకు వేయగ శరముల్
  కాలిన తదుపరి కంఠే
  కాలుఁడు హిమశైలసుతకుఁ గాంతుం డయ్యెన్.

  రిప్లయితొలగించండి
 3. మేలిమి బంగరు గుణముల
  నీలపు మేఘంపు చాయ నీలాం బరుడౌ
  హేలగ లోకము లేలెడు
  కాలుడు హిమ శైల సుతకు గాంతుం డయ్యెన్ !

  ఇక్కడ కాలుడు = శివుడు

  రిప్లయితొలగించండి
 4. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !

  కొండఱేని కన్యగా పుట్టిన దాక్షాయణికి కాంతుడయ్యింది శివుడే గదా :

  01)
  _________________________________

  కాలంజరి ,దాక్షాయణి
  కాలిక,మాలిని, నగపతి - కన్యగ బుట్టన్
  కాలాంతకుడౌ కంఠే
  కాలుడు హిమశైలసుతకు - గాంతుం డయ్యెన్ !
  _________________________________

  రిప్లయితొలగించండి
 5. మన్మథుణ్ణి భస్మం జేసిన పిదపే గదా శివుడు నగజాతను పెండ్లాడింది : :

  02)
  _________________________________

  కాలాతీతునిపై తన
  కోలల నేయంగ , నజుని , - కోపానలమున్
  కాలగ జేసిన పిమ్మట
  కాలుడు హిమశైలసుతకు - గాంతుం డయ్యెన్ !
  _________________________________
  అజుడు = మన్మథుడు
  కాలుడు = శివుడు

  రిప్లయితొలగించండి
 6. మన్మథుణ్ణి భస్మం జేసిన పిమ్మట గదా శివుడు శైలసుతను వివాహమాడినది:

  03)
  _________________________________

  కోలల నేసిన మన్మథు
  కీలల భస్మంబు జేసె - కింకిరపాటున్ !
  కాలానుగుణముగ మహా
  కాలుడు హిమశైలసుతకు - గాంతుం డయ్యెన్ !
  _________________________________
  కింకిరపాటు = కోపము
  మహాకాలుడు = శివుడు

  రిప్లయితొలగించండి
 7. కవిమిత్రులకు నమస్కృతులు.
  ఈనాటి సమస్యను ఇచ్చేముందు ఒకసారి నిఘంటువును చూస్తే బాగుండేది. ‘కాలుడు’ శబ్దానికి యముడు, శనైశ్చరుడు అని మాత్రమే అర్థాలున్నా యనుకున్నాను. ‘శివుడు’ అనే అర్థం ఉన్నట్లు తెలియదు. ఇప్పటికే కొందరు పూరణలు చేశారు కనుక మార్చడానికి అవకాశం లేదు. ఒకవిధంగా ఇది సమస్యగా కాకుండా పాదపూరణమే అవుతున్నది. కానీండి...
  ‘కంఠేకాలుడు’ అంటూ గుండు మధుసూదన్ గారు, టిబియస్. శర్మ గారు, వసంత కిశోర్ గారు పూరణలు చేశారు కూడా.
  *
  గుండు మధుసూదన్ గారూ,
  ‘కంఠేకాలుడు’ అంటూ మనోహరమైన పూరణ చేశారు. అభినందనలు.
  *
  తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారూ,
  ‘కంఠేకాలుడు’ అని మంచి పూరణ చెప్పారు. అభినందనలు.
  *
  రాజేశ్వరి అక్కయ్యా,
  మంచి పద్యాన్ని చెప్పారు. అభినందనలు.
  ‘నీలాంబరుడు’ అంటే ‘శని, బలరాముడు’ అనే అర్థాలున్నాయి. అక్కడ ‘నీలగళుండున్’ అందాం.
  *
  వసంత కిశోర్ గారూ,
  మీ మూడు పూరణలూ బాగున్నవి. శివుణ్ణి కంఠేకాలుడు, మహాకాలుడు అనడం బాగుంది. అభినందనలు.


  రిప్లయితొలగించండి
 8. త్రైలోక్యరక్షకుండును,
  శ్రీలన్గురిపించు ఘనుడు, చిన్మయుడగు నా
  వ్యాలాభరణుడు, కంఠే
  కాలుడు హిమశైలసుతకు కాంతుం డయ్యెన్

  రిప్లయితొలగించండి
 9. హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 10. కోలన వేయగ దలచుచు
  కాలూనిన పూలబాణు గాలిచి వేసెన్
  వాలగు చూపులకే బడి
  కాలుఁడు హిమశైలసుతకుఁ గాంతుం డయ్యెన్.

  రిప్లయితొలగించండి
 11. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 12. శూలము చేతను బట్టిన
  హాలా హలధరుడు మరుని అణచిన వాడున్
  ఫాలుడు జడధారి మహా
  కాలుఁడు హిమశైలసుతకుఁ గాంతుండయ్యెన్!

  రిప్లయితొలగించండి
 13. శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు పాదాభివందనములతో ..

  శివుని వివాహమునకు యముడు మున్నగు వారు వచ్చిరని
  ==========*==========
  కాలుని జెంతకు జేరగ
  కాలుడు హిమశైలసుతకుఁ గాంతుం డయ్యెన్.
  కాలుడు,శూలము బట్టిన
  కాలుడు పెండ్లికి వలదనె కానుక లెల్లన్!

  రిప్లయితొలగించండి
 14. 2. ========*==========
  కోలలు వేయగ మన్మధ
  బాలుడు గాలెను ధరణిని పార్వతి వేడన్
  శూలము విడచిన కంఠే
  కాలుడు హిమశైలసుతకుఁ గాంతుం డయ్యెన్.

  రిప్లయితొలగించండి
 15. శైలజ గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  వరప్రసాద్ గారూ,
  మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 16. 3. =======*=========
  శూలిని కోరిగ పార్వతి
  కాలుడు హిమశైలసుతకుఁ గాంతుం డయ్యెన్.
  కాలాతీతుని వేడుక
  కోలాహలముగ జరిపిరి కువలయమందున్!

  రిప్లయితొలగించండి
 17. పూలే శరములు కాగా
  వేళం గని పికశుకాళి బృందము రాగా
  ఆలము రతుడౌ పాలిటి
  కాలుఁడు హిమశైలసుతకుఁ గాంతుం డయ్యెన్.

  రిప్లయితొలగించండి
 18. హేలాగతి కుసుమశరము
  లాలయకారుని ఎడందనంటిన క్షణమా
  భీలజ్వలితుఁడు భావజ
  కాలుఁడు హిమశైలసుతకు కాంతుండయ్యెన్.

  రిప్లయితొలగించండి
 19. పూజ్యగురుదేవులు శ౦కరయ్య గారికి వందనములు

  మేలుగప్రజ కష్టసుఖము
  లాలించిన విక్రమార్కు రాజ్యమునందున్
  హాళిని ఉజ్జయిని మహా
  కాలుడు హిమశైలసుతకు కాంతుం డయ్యెన్

  రిప్లయితొలగించండి
 20. కాలక్రమ చక్ర సృష్టికి
  వేలుపు లీ బ్రహ్మ విష్ణు భృగువులలోనన్
  కాలుని యెదిరించు ప్రలయ
  కాలుడు హిమశైల సుతకు గాంతుండయ్యెన్

  రిప్లయితొలగించండి
 21. ఫాలాక్షుడు నీలగళుడు
  హాలాహల భక్షకుండు నగ్నినయనుడున్
  బాలేందుమౌళియు మహా
  కాలుఁడు హిమశైలసుతకుఁ గాంతుం డయ్యెన్.

  రిప్లయితొలగించండి
 22. మాలలఁ గూర్చెడు సేవిక
  పూలశరుని లీల తోడ మోహము నింపన్!
  మేలగు తారకు వధకై
  కాలుఁడు హిమశైల సుతకుఁ గాంతుండాయెన్!

  రిప్లయితొలగించండి
 23. శైలమ్మునఁ జేరి తనదు
  లలనామణినిన్ పరీక్షలనుఁ బెట్టి గదా,
  శిలయౌ హృదయము గరుగగ
  కాలుఁడు హిమశైలసుతకుఁ గాంతుం డయ్యెన్.

  నమస్కారములతో.....

  రిప్లయితొలగించండి
 24. శైలమ్మునఁ జేరి తన యి
  ల్లాలని జూడక పరీక్షలనుఁ బెట్టి గదా,
  హాలాహలధారి యయిన
  కాలుఁడు హిమశైలసుతకుఁ గాంతుం డయ్యెన్.

  రిప్లయితొలగించండి
 25. వరప్రసాద్ గారూ,
  మీ మూడవ పూరణ కూడా బాగుంది. అభినందనలు.
  *
  గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.
  *
  గండూరి లక్ష్మినారాయణ గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  మిస్సన్న గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  సహదేవుడు గారూ,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.

  రిప్లయితొలగించండి