15, సెప్టెంబర్ 2013, ఆదివారం

సమస్యాపూరణం – 1175 (అమృతము సేవించి సురలు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది .....
అమృతము సేవించి సురలు హతులైరి గదా!

22 కామెంట్‌లు:

  1. అందరికీ వందనములు !

    జగన్మోహిని మాయ :

    01)
    _____________________________

    అమరులుగ నుండి పోయిరి
    అమృతము సేవించి సురలు ! - హతులైరి గదా
    అమృతము దొరకని యసురులు ;
    అమరప్రభువు,చిరజీవి ,- హంసు గరుణతో !
    _____________________________
    అమరప్రభువు=చిరజీవి= హంసుడు=విష్ణువు

    రిప్లయితొలగించండి
  2. దేవతలు రాక్షస భయ కారణమునఁ గొంత కాలము కాకాకృతులై యుండిరి. భయము మరణ సదృశము కదా! అమృతము సేవించియు మృతతుల్యు రైరని నా పూరణము.

    తమిఁ గాకాకృతి భయజ,
    మ్మమృతము సేవించి సురలు హతులైరి గదా!
    యమిత దనుజభయ కారణ
    మమరఁగ మృతియే తలఁపఁగ నమరులకు నటన్!

    రిప్లయితొలగించండి
  3. అమృతము పంచ గారడి
    అమృతమే యంచు నసురుల కందిం చెనుగా
    అమృతము కాదని శంకించి
    అమృతము సేవించి సురలు హతు లైరి గదా

    రిప్లయితొలగించండి
  4. వసంత కిశోర్ గారూ,
    సమస్యను విరిచి చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
    *
    గుండు మధుసూదన్ గారూ,
    దేవతలు కాకాకృతులైన కథ నాకు క్రొత్త. మంచి విషయాన్ని తెలిపారు. ధన్యవాదాలు.
    మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    పూరణ సమర్థనీయంగా ఉన్నట్టు లేదు. మూడు పాదాల్లోను గణదోషం. ‘అమృతము’లో ‘అ’ లఘువే కదా... మీ పద్యానికి నా సవరణ....
    అమృతమును పంచ గారడి
    యమృతమ్మె యనుచు నసురుల కందిం చెనుగా
    యమృతము కాదేమో యని
    యమృతము సేవించి సురలు హతు లైరి గదా

    రిప్లయితొలగించండి
  5. అమరత్వము నొందిరి గద
    అమృతము సేవించి సురలు; హతులైరి గదా
    కుమతులు రాక్షస సంతతి
    సుమనోహరి పంచ సుధను సురలందరికిన్.

    రిప్లయితొలగించండి
  6. భ్రమలోపడి కలుషితమగు
    నమృతము సేవించి సురలు హతులైరి గదా
    ప్రమథులకు నేని కాలు
    ష్యము తప్పదు తప్పదయ్య శంకర సుకవీ!

    అమరులకేని జగత్ప్రళ
    యమున వినాశమ్ము తథ్యమా శంకరుడే
    ప్రమదమున నలరు నిత్యము
    సుమి హాలాహలము గొనియు చోద్యము గాదే!

    రిప్లయితొలగించండి
  7. అమృతమె సారాయందురు
    ఆ మృతసారమ్ము దాగు నా నరులేగా
    అమృతాశనులని దలుతురు
    అమృతము సేవించి సురలు హతులైరి గదా!

    రిప్లయితొలగించండి
  8. అమృతమె సారాయందురె
    ఆ మృతసారమ్ము దాగు నా నరులేగా
    అమృతాశనులగు, కల్తీ
    యమృతము సేవించి సురలు హతులైరి గదా!

    రిప్లయితొలగించండి
  9. అమృతము నిండుకొనెననిరి
    అమృతము సేవించి సురలు ; హతులైరిగదా
    అమృతము గోరిన కుమతులు
    అమృతమె విషమాయె నాటి యసురలకెల్లన్ !!!

    రిప్లయితొలగించండి
  10. బొడ్డు శంకరయ్య గారూ,
    విరుపుతో చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
    *
    పండిత నేమాని వారూ,
    మీ తాజా రెండు పూరణలు అద్భుతంగా ఉన్నాయి. అభినందనలు
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    కాని రెండవ పాదాన్ని దీర్ఘంతో ప్రారంభించారు. ‘అమృతపు సారమ్ము’ అందామా? ఆ మృత అన్న మీ వ్యంగ్యార్థానికి మాత్రం విఘాతం మరి!
    *
    మంద పీతాంబర్ గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    ‘నిండుకొనియె నని/ రమృతము...’ అనండి.

    రిప్లయితొలగించండి
  11. అమరులుగ నిల్చిరి భళా !
    అమృతము సేవించి సురలు ; హతులైరి గదా !
    సమరమున దానవు లపుడు
    అమరులకు జయ మపజయము దైత్యులకు గదా !

    రిప్లయితొలగించండి
  12. అమరత్వము నొందిరి మఱి
    అమృతము సేవించి సురలు, హతు లైరి గదా !
    సమరంబున రాక్షసులా
    కమలాక్షుని జూచు తోడ కలవర బడుచున్

    రిప్లయితొలగించండి
  13. భ్రమయై స్వేఛ్ఛాస్వప్నము,
    తమ బ్రతుకులు 'నల్లదొరల' దాడికి గురియై
    కుమిలిరి భారత జనులే!
    అమృతము సేవించి సురలు హతులైరి గదా!

    రిప్లయితొలగించండి
  14. పూజ్యగురుదేవులు శంకరయ్య గారికి వందనములు

    భ్రమయో! విచిత్రమిదియో!
    అమృతము సేవి౦చి సురలు హతులైరి గదా!!
    అమరిన ఆలస్యముచే
    అమృతము విషమాయె? ఎరుగవా లోకోక్తిన్!!!

    రిప్లయితొలగించండి
  15. శ్రీ శంకరయ్య గురుదేవులకు, శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో..

    దేవతల కంటెను సజ్జనులు కీర్తి గాంచిరని దెలుపుచు
    =======*====
    అమరత్వమునొందిరి జనులు
    నమృత హృదయులై నవనిని యజిత విజయులై,
    అమరాపురియందు దొరకు
    నమృతము సేవించి సురలు హతులైరి గదా!

    జనులు యమ బాధలకు ఆ యమునుని ప్రార్థించుచున్నారు,ఈ రీతిని
    =======*==========
    యమ బాధలకు భువిపైన యముని ప్రార్థించుచు స్వామి
    యమృతము సేవించి సురలు హతులైరి గద!నేడు మీరు
    సమరము జేయ వలయును శాకిని,డాకిని పైన,
    సముచితమగునె సామాన్య జనులపై సమరముజేయ?
    (సురలు = కాపాడువారు)

    రిప్లయితొలగించండి
  16. శాశ్వతముగ నిలుచు సర్వేశుడొక్కడె
    మూడు జగములకును మునుక నిజము
    ప్రళయ కాలమందు బ్రహ్మమొకటి నిల్చి
    తాను గొనును జేర్చి లోన నిలుపు.

    భ్రమలను బాపుట కొఱకై
    సుమనస్కుడయిన శివుండు సొక్కంజేయున్
    సమభావనతో నెల్లర-
    నమృతము సేవించి సురలు హతులైరి గదా

    రిప్లయితొలగించండి
  17. అమృతమును పోయునపుడు మోహిని అందానికి తమ ప్రాణాలు(మతులు) గోల్పోయిన సందర్భమున

    కమలాక్షుడు మోహినియై
    తమకము చెందించి సుధను ద్రావించంగన్
    తమ మతులను గోల్పోవుచు
    అమృతము సేవించి సురలు హతులైరి గదా

    రిప్లయితొలగించండి
  18. మాస్టరు గారూ ! ధన్యవాదములు. నిజమే .. పొరపాటైనది..చిన్న సవరణ చేయుచున్నాను....

    అమృతమె సారా యని చె
    ప్పు మతి దో ' చెడు ' రసంపు నాస్వాదకులే
    అమృతాశనులగు, కల్తీ
    యమృతము సేవించి సురలు హతులైరి గదా !

    రిప్లయితొలగించండి
  19. నాగరాజు రవీందర్ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    మిస్సన్న గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    లోకోక్తిని పూరణకు చక్కగా వినియోగించుకున్నారు. బాగుంది. అభినందనలు.
    *
    వరప్రసాద్ గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    *
    లక్ష్మీదేవి గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    *
    బొడ్డు శంకరయ్య గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    గోలి వారూ,
    సవరించిన మీ పూరణ ఇప్పుడు చాలా బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  20. అశ్వత్థామా బలిర్వ్యాసో హనూమాంశ్చ విభీషణః ।
    కృపః పరశురామశ్చ సప్తైతే చిరజీవినః ॥


    అమరుల్లిల నేడుగురే!
    మమతా బంధనము నందు మాయకు లోనై
    తమతమ నెలవులు దప్పగ
    నమృతము సేవించి సురలు హతులైరి గదా!

    రిప్లయితొలగించండి
  21. అమరపురి నుండి వాలుచు
    విమలమ్మగు భాగ్యపురిని వింతగు రీతిన్
    సుమనోహరమగు కల్తీ
    అమృతము సేవించి సురలు హతులైరి గదా!

    రిప్లయితొలగించండి