27, సెప్టెంబర్ 2013, శుక్రవారం

సమస్యాపూరణం – 1187 (అప్పు లేనివాఁడె)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది .....
అప్పు లేనివాఁడె యధముఁడు గద.

47 కామెంట్‌లు:

  1. మాస్టారూ,
    మీకిది అక్కడ సమస్య యేమో తెలియదు గానీ, అమెరికాలో అప్పులేనివాడు నిజంగానే అధముడు. కావాలని కొంచెం అప్పు అట్టేపెట్టుకొంటాం. అదే మీకు ఘనతని (క్రెడిట్ హిస్టరీ) తెచ్చిపెడుతుంది ఇక్కడ."స్థానమహిమ గాని తనమ హిమగాదు"!!

    రిప్లయితొలగించండి
  2. పెండ్లి కొఱకు నప్పు పేకాట కనియప్పు
    ఉప్పు పప్పు కొనగ నూరి కప్పు
    నిండ మునిగె నంత నిక్కమే చలి లేదు
    నప్పు లేనిఁ వాడె యధముఁ డుగద

    రిప్లయితొలగించండి
  3. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    అప్పు చేసి పప్పు కూడు సినిమాలో రామారావునకు రేలంగి హితబోధ :

    01)
    ______________________________

    అప్పు జేయ వలయు - హాయిగా నుండంగ
    అప్పు కష్ట మందు - నాదుకొనును !
    అప్పు పెరుగునంచు - నారాటము వలదు
    అప్పు లేనివాఁడె - యధముఁడు గద !
    ______________________________

    రిప్లయితొలగించండి
  4. రేలంగికి రామారావు బదులు :

    02)
    ______________________________

    అప్పు లేనివాఁడె - యధముఁడు గద యంచు
    చేవ లేని వాడు - చెప్పు మాట !
    అప్పు చేత నున్న - నిప్పు వంటిది గదా
    అప్పు లేని నాడె - హాయి మెండు !
    ______________________________

    రిప్లయితొలగించండి
  5. తిరిగి రేలంగి హితబోధ :

    03)
    ______________________________


    అప్పు జేసి నంత - నవసరమ్ములు దీరు
    అప్పు జేయు టిలను - తప్పు గాదు !
    అప్పు జేసి జనుల - మెప్పు పొందగ వచ్చు !
    అప్పు లేనివాఁడె - యధముఁడు గద !
    ______________________________

    రిప్లయితొలగించండి
  6. తిరిగి రేలంగికి రామారావు బదులు :

    04)
    ______________________________

    అప్పు లేని వాడు - యధముడు గద యంచు
    చేదు వంటి మాట - చెప్పకోయి !
    అప్పు దీర్చ కున్న - నభిమాన మది పోవు
    అప్పు లేని నాడె - హాయి మెండు !
    ______________________________

    రిప్లయితొలగించండి
  7. మరల రేలంగి సమాధానం :

    05)
    ______________________________

    అప్పు, నుప్పు ,పప్పు - నిప్పు వంటిది జూడ
    నిత్య మైన మనకు - యవసరమ్ము !
    అప్పె యాప దందు - నావల పడవేయు !
    అప్పు లేనివాఁడె - యధముఁడు గద !
    ______________________________

    రిప్లయితొలగించండి
  8. తిరిగి రేలంగికి రామారావు సమాధానం :

    06)
    ______________________________

    అప్పు లేని వాడు - యధముడు గద యంచు
    నన్ను మార్చ లేవు - నమ్ము నిజము !
    అప్పు జేసి పరుల - మెప్పు పొందగ నేల ?
    అప్పు లేని నాడె - హాయి మెండు !
    ______________________________

    రిప్లయితొలగించండి
  9. దానికి రేలంగి ప్రతివచనము :

    07)
    ______________________________

    అప్పుతోనె మెతుకు - యప్పుతోనె బ్రతుకు
    నాదు మాట వినుము - నన్ను నమ్ము !
    అప్పె జీవుల కిల - నాధార భూతంబు !
    అప్పు లేనివాఁడె - యధముఁడు గద !
    ______________________________

    రిప్లయితొలగించండి
  10. చివరికి రేలంగి వాదనతో విసిగిపోయిన రామారావు మౌనం :

    రిప్లయితొలగించండి
  11. నీరే జీవకోటికి ప్రాణాధారము గదా :

    08)
    ______________________________

    అప్పు ప్రాణి కోటి - కాధార భూతమ్ము
    అప్పు లేక శూన్య - మవని యగును !
    అప్పు లేక, శుద్ధి - యాగిపోవును గాన
    అప్పు లేనివాఁడె - యధముఁడు గద !
    ______________________________
    అప్పు = నీరు

    రిప్లయితొలగించండి
  12. మళ్ళీ రేలంగి యిలా చెప్పాడు ;

    అణువు నణువు గూడ ఋణముతో సంధిల్లు
    సృష్టి లోన గనగ చిత్ర రీతి !
    ఋణము గలుప జనుల నేడు జన్మల దాక
    నప్పు లేని వాడె యధముడు గద !!!

    రిప్లయితొలగించండి
  13. శ్రీ వసంత కిశోర్ గారి పద్యములో అప్పు తచ్చుల సవరణ ;

    అప్పు, నుప్పు ,పప్పు - నిప్పు వంటివి జూడ
    నిత్యజీవితమున - కవసరమ్ము !
    అప్పె యాపద దఱి - నావల దరి జేర్చు !
    అప్పు లేనివాఁడె - యధముఁడు గద !

    తఱి = సమయము ; దరి = గట్టు

    రిప్లయితొలగించండి
  14. అందమైన సవరణలతో అలరించిన మూర్తి గారికి ధన్యవాదములు !

    రిప్లయితొలగించండి
  15. అప్పువలన గలుగు ననుబంధములు తన
    దార, పుత్ర, గృహము ధరను జూడ
    నప్పులేని వాని కవియన్ని గూడునా ?
    అప్పు లేనివాఁడె యధముఁడు గద.

    రిప్లయితొలగించండి
  16. వానఁ గుఱిపించిన పిదప నుఱుకులు పరుగులతోఁ జనుచున్న మేఘుని మాటలు...

    జలములన్ని కుఱిసి, యిలఁ దడిపియు నేను
    సలిలములను నింప సాగరమున
    కేఁగుచుంటి నిపుడు నెంతయుఁ దపనతో!
    నప్పు లేనివాఁడె యధముఁడు గద!!

    రిప్లయితొలగించండి
  17. అప్పు జేయ వచ్చు ఆపదలందున
    అప్పు లేని దెవరు అవని యందు
    అప్పు యేలు చుండె యఖిల జగంబు
    అప్పు లేని వాడె యధముడు గద

    దేశ మప్పు కొరకు దేవిరించునపుడు
    దేశ ప్రజలు పట్టు దేహి దారి
    దోస మేమి లేదు దోసిలి పట్టిన
    అప్పు లేని వాడె యధముడు గద

    అప్పు లేని వాడె యధముడ కదయంచు
    పలుక వలదు ప్రజలు ప్రభుత జూడ
    అప్పు లేని వారె అన్నింట బెద్దలు
    తప్పు లెన్ని యున్న తప్పు కొనును






    రిప్లయితొలగించండి
  18. అప్పు కొంతయున్ననాస్తిపన్నులభార
    మింత యైన తగ్గునేయటంచు
    సాహసమునఁ జేసి నేఁడు తీర్చఁబడిన
    యప్పు లేని వాఁడు యధముఁడు గద.

    అప్పు మీద కలిగే వడ్డీ మనకు ఆదాయపు పన్నులో మినహాయింపు ఉంటుంది. అందుకే చాలా మంది తీసుకుంటారు. ఇది ఒక తెలివైనపని అని అందరూ అంటారు. అటువంటి అప్పు ( తీర్చి వేయబడిన అప్పు ) లెనివాడు అధముడు అని భావన.

    అప్పు తప్పు అని నమ్మే వాణ్ణి నేను. నాలాంటి ఇతరులను నొప్పించి ఉంటే క్షమించాలి.

    రిప్లయితొలగించండి
  19. అవనిలోన గొప్ప అధిక సంపన్నుడు
    అప్పులేనివాడె, యధముడు గద
    గోప్పలకును బోయి యప్పులెన్నో జేసి
    తీర్చలేక తిట్లు తినెడి వాడు .

    రిప్లయితొలగించండి
  20. శ్రీ శంకరయ్య గురుదేవులకు, శ్రీ నేమాని గురుదేవులకు పాదాభివందనములతో ..

    శ్రీనివాసుని అప్పుల వైభవమును జూచిన
    =======*=========
    అప్పు జేసి నాడు హరి దన బెండ్లికి
    గొప్పగాను తీర కుండె నప్పు
    నేటి వరకు,జూచి నేటి జనులనెరి
    యప్పు లేని వాడె యధముడు గద!

    రిప్లయితొలగించండి
  21. శ్రీ వసంత కిషోర్ గారి అప్పు చేసి పప్పు కూడు సినిమాలో రామారావునకు రేలంగి హితబోధలు చాలా చాలా భాగున్నవి.అందరి పూరణలూ అలరించు చున్నవి !

    అప్పిచ్చి చైనా అమెరికా డాలరును కాపాడుచున్నది.
    =======*=========
    2. అప్పు లందు మునగ యమెరిక,వానికి
    యప్పు లిచ్చి నట్టి గొప్ప వారు
    గాచు చుండ నేడు కౌఫీనములు బెట్టి,
    యప్పు లేని వాడె యధముడు గద !

    రిప్లయితొలగించండి
  22. అప్పు జేసి నీవు ఏమి కొన్నను ఇన్కమ్ ట్యాక్స్ వారు ఏమియు అనరు.
    =======*=========
    అప్పు జేసి నీవు నవనిని గొన్నను
    గొప్ప వాడ వనుచు,కూడ బెట్టి
    పూరి గుడిసె గొన్న పోటు బెట్టుచు నుండ,
    యప్పు లేని వాడె యధముడు గద !

    రిప్లయితొలగించండి
  23. ఉత్తముండు తానె యున్నతుడన్నింట
    అప్పు లేనివాడె, యధముడు గద!
    అప్పుచేసియైన గొప్పకు యత్నించు
    చుండు వాడు సత్య ముర్విలోన. 1.

    బొంకులాడువాడు పుణ్యాత్ము డీనాడు,
    సత్యవాది యౌను చవట యిలను,
    ఒరుల ముంచువాడె యుత్తము డింకేమి
    యప్పు లేనివాడె యధముడు గద. 2.

    రిప్లయితొలగించండి
  24. అప్పు లేనివాడె యధము డుగదయన
    కప్పు లున్న యెడల నతిగ ఖర్చు
    పెట్టకుండ కూడబెట్టును ధనమును
    అప్పు భయము తోడ నార్య! వినుము

    రిప్లయితొలగించండి
  25. అప్పు లిచ్చు క్రెడిట్ కార్డు కావలెననిన మరొక క్రెడిట్ కార్డు వారు పంపు పత్రము జూపిన జాలు.
    ========*=========
    అప్పులున్న వాని యండ గలిగి యున్న
    నప్పు లిచ్చు చుండు గొప్పగాను,
    అప్పు చిప్ప లిడుగ గొప్ప హాయిని నేడు
    నప్పు లేని వాడె యధముడు గద!

    రిప్లయితొలగించండి
  26. 5. అప్పు తోడ జేరు నన్ని సుఖములని
    చెవిని యిల్లు గట్టి జెప్పు చుండ
    వలదు వలదనుచును వసుధ పై దిరుగెడి
    యప్పు లేని వాడె యధముడు గద!

    రిప్లయితొలగించండి
  27. అప్పు లున్న వారు గొప్ప వారని దలచి అప్పులు కాట్టడం లేదు.(మంత్రులు కరెంటు బిల్లులు కూడా కట్టకుండు)
    ========*=========
    6.అప్పు లందు గలదు హాయి యనుచు బల్కి
    గొప్పవారు మారె కొంటెగాను
    సిరుల తోడ దిరుగ సిగ్గు విడచి నేడు
    నప్పు లేని వాడె యధముడు గద !

    రిప్లయితొలగించండి
  28. అధికారులు అవినీతి మంత్రుల వద్ద పని జేయుచు లంచము వలదనుట,అప్పు లేకుండుట అతని మూర్ఖత్వము
    ===========*========
    7. నీతి జాతి లేని నేటి నేతల జెంత
    జేరి యుప్పు పప్పు దూరమనుచు
    నీతుల వల నందు నిల్చుని యున్నట్టి,
    యప్పు లేని వాడె యధముడు గద !

    రిప్లయితొలగించండి
  29. వసంత కిశోర్ జీ మీ 5 వ పద్యములోను నా సవరణ లోను రెండవ పాదములో యతి ? మరో సవరణ ,

    అప్పు, నుప్పు ,పప్పు - నిప్పు వంటివి లేక
    నిత్యజీవితమ్ము - నెట్ట గలమె ?
    అప్పె యాపద దఱి - నావల దరి జేర్చు !
    అప్పు లేనివాఁడె - యధముఁడు గద !

    తఱి = సమయము ; దరి = గట్టు

    రిప్లయితొలగించండి




  30. అప్పు జేసి యైన పప్పుకూడె తినుము,
    అప్పు జేసి సుఖములనుభవించు.
    అప్పుజేసి యిల్లు నొప్పుగా గట్టుము,
    అప్పు లేనివాడె యధముడు గద.

    రిప్లయితొలగించండి
  31. పూజ్యగురుదేవులు శ౦కరయ్య గారికి వందనములు

    దొంగతనము తప్పు దోపిడీలు ముప్పు
    అప్పు చేసి బ్రతుక తప్పదనును
    అప్పు లేని వాడు అధముడుగద యప్పు
    లిచ్చి పిదప ముప్పు తెచ్చు వాడు

    రిప్లయితొలగించండి
  32. అప్పు చేసి పట్టె నలమేలు మంగను
    భువికి దిగిన హరియె పోఁడిమనుచు
    నప్పు తీర్చు గడువుఁ జెప్ప యుగమనుచు!
    నప్పు లేని వాడె యధముడుగద!

    (పోఁడిమి = ఒప్పు)

    రిప్లయితొలగించండి
  33. నేటి కాలమందు దాటిగా నప్పును
    జేసి యెదిగి వాడు వాసి కెక్కి
    పెద్ద మనిషిగాను బుద్ధి చెప్పుచునుండు
    అప్పు లేనివాఁడె యధముఁడు గద !

    రిప్లయితొలగించండి
  34. దేశ వాసులకును తీర్చలే నంతగా
    నప్పు పెరుగు చుండె యవని నందు
    నప్పు లున్నవాడె గొప్పవా డీనాడు
    అప్పులేనివాఁడె యధముఁడు గద !

    రిప్లయితొలగించండి
  35. ఉత్త మోత్తముండు యూరి మనుజుల యం
    దప్పు లేని వాడె ; యధముడు గద
    యప్పు లున్న వాడు - పప్పుకూడు దినును ;
    అప్పులేల జేయ నయ్యలార !

    రిప్లయితొలగించండి
  36. చంద్రశేఖర్ గారూ,
    మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు. మీ వ్యాఖ్యకు నా పద్య రూపం....
    కలదు నీతి యమెరికాలోనప్పులు
    జేయునట్టివాఁడె శిష్టుఁ డనఁగ;
    క్రెడిటు కార్డులు గలిగినవాని దృష్టిలో
    నప్పు లేనివాఁడు యధముఁడు గద!
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    నిండా మునిగినవానికి చల లేదన్న మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    *
    వసంత కిశోర్ గారూ,
    రేలంగి, రామారావుల సంవాదరూపమైన మీ ఏడు పూరణలూ బాగున్నవి. ‘అప్పు’కున్న మరో అర్థంతో వ్రాసిన ఏడవ పూరణ వైవిధ్యంగా ఉంది. అభినందనలు.
    ‘వాడు + అధముడు’ సంధి నిత్యం. యడాగమం రాదు. ‘వాడె యధముడు’ అనడమే మేలు.
    ‘ఆపద + అందు’ సంధి లేదు. ‘అప్పె సంకటమున’ అనండి.
    ‘మెతులు + అప్పు’ అన్నచోట ‘మెతుకు లప్పు’ అందాం.
    *
    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    వసంత కిశోర్ గారు మొదలు పెట్టిన సంవాదానికి స్వస్తివాక్యం లాటి మీ పూరణ బాగుంది. అభినందనలు.
    మీ సవరణలు సూచించినందుకు ధన్యవాదాలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    ‘ఋణానుబంధ రూపేణ...’ అన్న భావంతో మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    గుండు మధుసూదన్ గారూ,
    నీరు అనే అర్థంతో మీరు చేసిన బాగుంది. అభినందనలు.
    *
    శైలజ గారూ,
    మీ మూడు పూరణలూ బాగున్నవి. అభినందనలు.
    మొదటి పూరణలో కొన్ని సంధిదోషాలు.... నా సవరణ...
    అప్పు జేయ వచ్చు నాపదలందున
    నప్పు లేని దెవ్వ రవనియందు
    నప్పు లేలు చుండె నఖిల జగంబు
    నప్పు లేని వాడె యధముడు గద
    *
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    మీ భావాన్ని నెగెటివ్ అనుకోవాలా? పాజిటివ్ అనుకోవాలా? మొత్తానికి ‘తీర్చని అప్పు కలవాడు అధముడు’ అంటారు. చాలా బాగుంది. అభినందనలు.
    *
    గండూరి లక్ష్మీనారాయణ గారూ,
    ‘అప్పులేనివాడె యధిక సంపన్నుడు’ అన్న భావాన్ని విరుపుతో సాధించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    వరప్రసాద్ గారూ,
    మీ ఏడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    ‘మునుగ నమెరికా వానికి / నప్పులిచ్చి...’, ‘ఉండ నప్పు లేనివాడె’, అనవలసింది.
    ‘గొప్పవారు మారిరి’ అన్నాలి కదా. అక్కడ ‘గొప్పవారలైరి’ అనండి.
    *
    కమనీయం గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    ‘పప్పుకూడే తిను/ మప్పు...’, ‘యనుభవించు/ మప్పు...’,
    *
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మంచి భావంతో పూరణ చెప్పారు. అభినందనలు.
    మీ పద్యానికి నా సవరణ...
    దొంగతనము తప్పు దోపిడీలు ముప్పె
    యప్పు చేసి బ్రతుక తప్పదనుర
    యప్పు లేని వాడె; యధముడుగద యప్పు
    లిచ్చి పిదప ముప్పు తెచ్చు వాడు
    *
    సహదేవుడు గారూ,
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    ‘పోడిమి యని/ యప్పు....’ అనండి.
    *
    కుసుమ సుదర్శన్ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    బొడ్డు శంకరయ్య గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    ‘చుండె నవనియందు’, ‘వాడీ దిన/మప్పులేని...’ అనండి.
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ‘ఉత్తమోత్తము డగు నూరి...’కూడు దినగ/ నప్పులేల...’ అనండి.

    రిప్లయితొలగించండి
  37. పూజ్యగురుదేవులు శ౦కరయ్య గారికి వందనములు
    మీరు సవరించిన వ్యాఖ్య సమంజసము,యుక్తముగా
    నున్నది .ధన్యవాదములు

    రిప్లయితొలగించండి
  38. పూజ్యగురుదేవులు శ౦కరయ్య గారికి వందనములు
    మీరు సవరించిన వ్యాఖ్య సమంజసము,యుక్తముగా
    నున్నది.ధన్యవాదములు.

    తిమ్మాజీ రావు

    రిప్లయితొలగించండి
  39. అప్పుచేతునేని ఆయాసపడవలె
    అప్పులేకయున్న అధిక సుఖము
    పురుషకారమునకు పూర్తిగా సెలవిచ్చు
    అప్పులేనివాడె యధముడు గద.

    రిప్లయితొలగించండి
  40. మూర్తిగారూ ! ధన్యవాదములు !
    వరప్రసాద్ గారూ ! ధన్యవాదములు !
    శంకరార్యా ! ధన్యవాదములు !

    రిప్లయితొలగించండి