17, సెప్టెంబర్ 2013, మంగళవారం

పద్య రచన – 467 (జోలపాట)

కవిమిత్రులారా,
ఈనాటి పద్యరచనకు అంశము....
“జోలపాట”

20 కామెంట్‌లు:

  1. చంద్రుని మించిన యందము
    సంద్రము లుప్పొంగు రీతి సౌరులు విరియన్
    మంద్రకము నుండ జగతిని
    నింద్రుడవై సురల నేలు నేతగ తనయా !

    నేత _- రాజు , విష్ణువు

    రిప్లయితొలగించండి
  2. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    బాలరాముడు చంద్రబింబం కావాలని పేచీ పెట్టినప్పుడు :

    01)
    __________________________________

    వాలుగన్నుల నీలవేణులు - భామలందరు ముచ్చటన్
    బాలరాముని నూయలందున - పాలుబట్టుచు నూపుచున్
    గోలసేయకు చంద్రబింబము - గోసితెమ్మని గోరుచున్
    జోలపాటల నోలలాడగ - జోలబాడిరి యందరున్ !
    __________________________________

    రిప్లయితొలగించండి
  3. క్షమిం చాలి సరదాకి ఒకటి .పొరబడితే ఏముంది ? మన్నించడమే

    చంద మామ దెచ్చె సాసులు పిజ్జాలు
    ప్రియము గాను నీకు బేగి లంట
    సాండు విచ్చి తినగ మెండైన రుచి యంట
    గోల జేయ కుండ జోల వినుము

    రిప్లయితొలగించండి
  4. జో నందనందనా! జో చిదానంద!
    జో గోకులానంద! జో జో ముకుంద!

    వైకుంఠ పురవాస! వారిజాతాక్ష!
    శ్రీకరా! శుభకరా! శ్రితజనానంద!

    బ్రహ్మాది దేవతల్ వచ్చిరిట నీకు
    ప్రణతి సేయుచు దివ్య పాదారవింద!

    గంధర్వ కాంతలు గానామృతమున
    గావించుచున్నారు కర్ణముల విందు

    సకల లోకములకు స్వామివి నీవు
    మా యింటి దీపమౌ మా కనులవిందు

    రిప్లయితొలగించండి
  5. లాలను పోసిన బిడ్డకు
    పాలను ద్రావించి తల్లి పాడును పాటల్
    గోలగ నుండని రాగము
    లాలీ ళుళుళూళుళాయి లాలన జోలౌ.

    రిప్లయితొలగించండి
  6. maanini:

    జో రఘునందన! జో శ్రితచందన! జో స్మరసుందర! జో సుగుణా!
    జో రవిమండన! జో శుభదర్శన! జో సురవందిత! జో సుముఖా!
    జో రిపుభంజన! జో జలజేక్షణ! జో మునిరక్షణ! జో విమలా!
    జో రమణా! యని జోలలు పాడుదు జో నిదురించర జో వరదా!

    రిప్లయితొలగించండి
  7. జోల పాటను బాడుదు నోలలామ !
    నిదుర పొమ్ముమ యికనైన నిశ్చలముగ
    చాల పనియుండె నికనాకు ,చాలు కినుక
    పండు కొనుమమ్మ బాలిక ! పండు కొనుము

    రిప్లయితొలగించండి
  8. అమ్మ జోలపాట హాయిని గూర్చును
    శిశువు నిదుర నొదుగు చిన్ననాట
    జగము నేలు వారె చల్లగా నిదురించు
    రమ్య మయిన జోల లాలి పాట

    రామయ్యకి యిచ్చె రత్నాల లాలిని
    నల్లనయ్య నచ్చె నంద లాలి
    వెంకన్నమెచ్చేను వకుళమ్మ లాలిని
    గణపతికిముద్దాయె గౌరి లాలి

    రిప్లయితొలగించండి
  9. జోజో సాధుజనావన!
    జోజో ఖగరాజగమన! జోజో కపిలా!
    జోజో దనుజబలాంతక!
    జోజో కంజాతనేత్ర! జోజో కృష్ణా! (1)

    జోజో పంకజనాభా!
    జోజో బ్రహ్మేంద్రవినుత! జోజో కేశా!
    జోజో ముకుంద! మాధవ!
    జోజో కరుణాంతరంగ! జోజో కృష్ణా! (2)

    జోజో జగదీశ! హరీ!
    జోజో పూర్ణేందుముఖ! విశుద్ధ హృదబ్జా!
    జోజో పన్నగశయనా!
    జోజో గిరిధారి! జిష్ణు! జోజో కృష్ణా! (3)

    జోజో దివ్యకృపాకర!
    జోజో సర్వాత్మక! జలజోదర! చక్రీ!
    జోజో వైకుంఠేశా!
    జోజో కమలేశ! విమల! జోజో కృష్ణా! (4)

    జోజో కైటభ వైరీ!
    జోజో మధుసూదన! కపి! జోజో శార్ఞ్గీ!
    జోజో నారాయణ! విధి!
    జోజో విరజా! విలాసి! జోజో కృష్ణా! (5)

    రిప్లయితొలగించండి
  10. "శ్రీ పాండు రంగ భక్త మాలకీర్తనలు " పుస్తకము నందు గల జోల పాట

    ప: జో అచ్యుతా నంద జోజో ముకుందా! రార పరమానంద రామ గోవిందా !! జోజో!!
    తొలుత బ్రహ్మాండంబు తొట్టె గావించి! నాలుగు వేదములు గొలుసుల మరించి !
    బలువైన ఫణిరాజు పాన్పునమరించి! చెలియ డోలికపైని చేరిలాలించి !! జోజో!!
    తొమ్మిది వాకిళ్ళ తొట్టిలోపలను ! క్రూరులు ఆరుగురు సాధులైదుగురు!
    అందులో ముగ్గురు మూర్తులున్నారు! తెలిసి తెలిపే వాడు దేవుడున్నాడు !! జోజో!!
    పట్టువలె నలుగురిని పదిలంబుగాను! కట్టవలె ముగ్గురిని కదలకుండగను
    వుంచవలె ఒక్కరిని హృత్కమల మందు! వుండవలె పండువెన్నెల బయలలోను !! జోజో!!
    యీడు గలవానిని కూడుండ వలెను! జోడుగల వానిచే జాడ గనవలెను
    మేడ మీదను వుండె మహిమ గనవలెను! కోరి యా గోవిందు గురుని గనవలెను !! జోజో!!
    వీధి నొక బాటలో గీతంబు శాయ ! కోటలోభేరి మృదంగంబులు మ్రోయు
    కోట కావలి వాండ్రు కోలాట మేయు! ధీటు లేని ప్రభువు దొరతనము శాయ !! జోజో!!
    ఓంకార మని యేటి ఒక తొట్టిలోను ! తత్వమని యేటి చలువలంబరచి
    వేడ్క తో పావనీ యేర్పాటు జేసి! యేడు భువనముల వారేక మై పాడే !! జోజో!!

    రిప్లయితొలగించండి
  11. పూజ్యగురుదేవులు శంకరయ్య గారికి వందనములు

    లాలీ రామా యనుచును
    జోలలలు పాడుచును రాము స్తుతియిoపంగా
    ఏలా నిదురించు నతడె
    పాలించెడివాడు సర్వప్రాణుల గావన్

    దేవుని కనులను మూయగ
    లేవాతడు కర్మసాక్షి లీలలు తెలియన్
    లావాదేవీలు తగవు
    నీవొనరించిన పనులను నిత్యము జూచున్

    రిప్లయితొలగించండి
  12. చాలా ప్రముఖమైన జోలపాట నందించిన
    వరప్రసాద్ గారికి ధన్యవాదములు !
    ఇందులో యెన్నో వేదాంత రహస్యములు యిమిడి యున్నట్టున్నవి !
    తెలిసిన మిత్రులెవరైనా విశదీకరించగలరు !

    ఇది అన్నమయ్య కీర్తన అని విన్నట్టు గుర్తు ! నిజమేనా ?
    కాకపోతే రచయిత యెవరు ?

    అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !
    అందరికీ అభినందనలు !

    రిప్లయితొలగించండి
  13. శ్రీ వరప్రసాద్ గారికి శుభాశీస్సులు.
    ఒక ముఖ్యమైన భక్తి జ్ఞాన స్ఫోరకమైన జోలపాటను అందించిన మీకు అభినందనలు. ఇది విన్నదే కానీ పూర్తి పాఠము మా వద్ద లేదు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  14. జోలపాటపై చక్కని పద్యాలను రచించిన కవిమిత్రులు....
    రాజేశ్వరి అక్కయ్యకు,
    వసంత కిశోర్ గారికి,
    పండిత నేమాని వారికి,
    గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
    సుబ్బారావు గారికి,
    శైలజ గారికి,
    గుండు మధుసూదన్ గారికి,
    వరప్రసాద్ గారికి,
    కెంబాయి తిమ్మాజీ రావు గారికి,

    రిప్లయితొలగించండి