21, సెప్టెంబర్ 2013, శనివారం

పద్య రచన – 471 (జూదము)

కవిమిత్రులారా,
ఈనాటి పద్యరచనకు అంశము....
“జూదము”

21 కామెంట్‌లు:

  1. మోదముగ జూద మాడిన
    బాధగ నడవులకు నేగె ప్రభువు లనంగా
    కాదని మోహము వీడిన
    ఖేదమునకు దూర మైన గీష్పతు లౌగా !

    రిప్లయితొలగించండి
  2. ధర్మజుఁడు జూదమాడియుఁ దనదు రాజ్య
    సంపదలఁ గోలుపోయి, విచార పడక,
    యపుడు నారణ్యవాస గతాత్ముఁ డయ్యు,
    ద్రౌపదినిఁ, దమ్ములనుఁ గూడి, తరలె నయ్య!

    రిప్లయితొలగించండి
  3. శ్రీపండిత నేమాని గురువులకు నమస్సులతో

    ఆయురారోగ్యభాగ్యంబు లంతరించు
    పరువు మర్యాదలంతట పారిపోవు
    సతిపతుల మధ్య కలహాలు సాగుచుండి
    చూడ సంసారమే గూలు జూద మాడ.

    రిప్లయితొలగించండి
  4. నలుడట జూదము నాడగ
    నిల నోడెను తెలివి మాలి నిడుముల పాలై
    కులపాలి దమయంతి దారను
    విల పింపగ విడచె నడవి వీడని ప్రేమన్

    రిప్లయితొలగించండి
  5. రాజేశ్వరి అక్కయ్యా,
    జూదంలో రాజ్యాలు పోగొట్టుకున్న ఇద్దరి గురించి రెండు పద్యాలను వ్రాసారు. బాగున్నవి. అభినందనలు.
    రెండవ పద్యం మూడవ పాదంలో గణదోషం. ఆ పాదాన్ని ‘కులసతి దమయంతి మిగుల’ అందాం.
    *
    గుండు మధుసూదన్ గారూ,
    ధర్మజుని ప్రస్తావనతో మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారూ,
    జూదం వలన నష్టాలను చాలా బాగుగా పద్యంలో చెప్పారు. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  6. జూదములో వారెవ్వా !
    రాదోయీ సిరుల మూట, రాజులె పోయెన్
    ఖేదముజెందుచు నడవికి
    కాదన వారెవ్వరైన గలరే చెపుమా !

    రిప్లయితొలగించండి
  7. జూదము లాడిన జనులకు
    వేదన మిగులును బ్రతుకున వేడుక లేదే
    జూదము లాడిన ప్రభువులె
    భాధల పాలై ఆడవుల బడితిరి గాదా

    రిప్లయితొలగించండి
  8. వ్యసనము లన్నిటి కంటెను
    వ్యసనము మఱి జూద మరయ వ్యధలను గూర్చున్
    వ్యసనంబు లేడు రకములు
    వ్యసనంబుల దరికి బోక వర్తిలు మెపుడున్

    రిప్లయితొలగించండి
  9. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పద్యం ‘వారెవ్వా’ అనిపించింది. అభినందనలు.
    *
    శైలజ గారూ,
    మంచి పద్యం చెప్పారు. అభినందనలు.
    చివర ‘పాలయిరి గదా’ అనండి.
    *
    సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  10. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    జూదమాడి పాండవులు పడిన బాధలు ఎవరికీ వద్దు !

    01)
    ________________________________

    బాధ లొందిరి కుంతిపుత్రులు - పాడు జూదము వల్లనే
    వేద నొందిరి కాన కేగిరి - వీగిపోవుట చేతనే !
    జూదమాడిన వేదనే మరి - చోద్యమించుక లేదులే !
    వాదనెందుకు ఖేదమెందుకు - వద్దు జూదము సోదరా !
    ________________________________

    రిప్లయితొలగించండి
  11. జూదంబాడిన కలుగప
    వాదము ధనహాని జరుగు వాసి నశించున్
    జూదరి యను ముద్ర పడును
    పేదరికము దాపురించు వీడుము మిత్రా

    రిప్లయితొలగించండి
  12. సప్తవ్యసనంబుల ని
    క్షిప్తముగానుండి జనుల చెంతకు చేరెన్
    వ్యాప్తంబగు జూదముచేఁ
    ప్రాప్తంబగు కష్టనష్టఫలములు జగతిన్.

    రిప్లయితొలగించండి
  13. జూదము కానేకాదు వి
    నోదము,జూదమున గెలిచి నూర్వురు కొడుకుల్
    వేదన మిగిల్చిరి,నా
    మోదము దెలిపిన ప్రభువుకు మూర్ఖత్వముతో !!!

    రిప్లయితొలగించండి
  14. పేరు తలుపగ రానట్టి విషపు వ్యసన
    ముల నొకటి యిది యలవడు మూర్ఖ జనుల
    సర్వ నాశమునొనరించు సైపరాదు
    మిత్రవర్గము మారదె శత్రువుగను.

    రిప్లయితొలగించండి
  15. పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు

    ఈనాటిద యీ జూదము
    ఏనాడో ధర్మజుండు ఏలిక నలుడున్
    పోనాడిరి రాజ్యములను
    కానల తిరుగాడి చుండి కటకట బడుచున్

    జూదములాడుట నేరము
    కాదా యన దగదు ఎందుకనగా బ్రతుకే
    జూదమ్మాయెను యిక నీ
    వేదన వినిపించుకోరు పెద్దలు ఎవరున్

    చదువులు జూదమ్మాయెను
    పదవులు ఎన్నికలు గెల్వ పార్టీ నేతల్
    బెదరక నాడిన జూదము
    అది యిది అని జెప్పనేల అక్షమదమ్మే

    తురగపు పరుగుల జూదము
    మరి ధనములు పెంచు స్టాకు మార్కెటు జూద
    మ్మరయగ రులిటీ చక్రము
    మురిపెముగా నాడు మూడు ముక్కల యాటల్

    పల్లెలలో పులి జూదము
    పల్లీయులు మెచ్చు కోడి పందెపు జూద
    మ్మిల్లిల్లు గుల్ల జేయుచు
    పిల్లల, పెండ్లము రుధిరము పీల్చుట గనమే

    రిప్లయితొలగించండి
  16. జూదముపై మంచి మంచి పద్యాలను రచించిన కవిమిత్రులు...
    వసంత కిశోర్ గారికి,
    బొడ్డు శంకరయ్య గారూ,
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    మంద పీతాంబర్ గారూ,
    లక్ష్మీదేవి గారూ,
    అభినందనలు, ధన్యవాదాలు.
    *
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    ఖండిక లాగా చక్కని పద్యాలను రచించారు. అభినందనలు.
    ‘తగదు + ఎందుకు’, ‘ఆయెను + ఇక’, ‘పెద్దలు + ఎవరున్’, ‘జూదము + అది’ అన్నప్పుడు సంధి జరుగుతుంది. అక్కడ ‘అనగూడ దెందుకనగా’, ‘జూదమ్ముగ నయె నిక నీ’, ‘పెద్ద లెవారున్’, ‘జూద/మ్మది యిది యని’ అంటే సరి!
    ‘పదవులు నెన్నికలు’ అనండి.

    రిప్లయితొలగించండి
  17. మంద పీతాంబర్ గారూ,
    మూడవ పాదంలో గణదోషం. టైపాటు కావచ్చు. ‘వేదనను మిగిల్చిరి నా’ అని ఉండాలనుకుంటాను.

    రిప్లయితొలగించండి
  18. శ్రీ శంకరయ్య గారికి వందనములు

    అది టైపాటే ‘వేదనను మిగిల్చిరి'గా గమనించ గలరు.

    రిప్లయితొలగించండి
  19. అన్నవస్త్రములందున ఆశపోవు
    ఆలుబిడ్డలనెప్పుడు అరచుచుండు
    వ్యర్థమవునండి జీవనమర్థముడుగు
    జూదమిచ్చును మిక్కిలి ఖేదములను.

    రిప్లయితొలగించండి
  20. ప్రభల రామలక్ష్మి గారూ,
    చాలా మంచి పద్యాన్ని చెప్పారు. అభినంచనలు.

    రిప్లయితొలగించండి