18, సెప్టెంబర్ 2013, బుధవారం

పద్య రచన – 468 (గణేశ నిమజ్జనము)

కవిమిత్రులారా,
ఈనాటి పద్యరచనకు అంశము.... 
 గణేశ నిమజ్జనము

17 కామెంట్‌లు:

 1. తొమ్మిది నాళ్ళు భక్తిమెయి స్తోత్రములున్ భజనల్ సమర్చనల్
  నెమ్మది చేసి భక్తతతి నీ కరుణామృత సిద్ధినొంది స్వాం
  తమ్ముల వెల్గు నిండ ప్రమథస్తుత! చేసి నిమజ్జనమ్ము, గం
  గమ్మను జేర్చిరయ్య నిను గం గణనాయక! జే గణేశ్వరా!

  రిప్లయితొలగించండి
 2. ముంచెదము దేవ ! మమ్ముల
  ముంచకు భవజలధి - నిన్ను మోదముతో మే
  ముంచెదము మదిని - పరులను
  ముంచెడు మా బుద్ధి మాన్పు మూషికవాహా !
  ,

  రిప్లయితొలగించండి
 3. శ్రీగణనాథునిఁ గొలిచితి
  మేగఁగ వలె స్వీయనిలయ మిప్పుడటంచున్
  వేగమె నిమజ్జనమ్మును
  సాగరమునఁ జేయఁ గోరి సాఁగ నిడి రటన్!

  రిప్లయితొలగించండి
 4. తొమ్మి దిదినంబు లియ్యెడ నెమ్మనమున
  భక్తి శ్రధ్ధల బూజించి భర్గు సుతుని
  భక్ష్య భోజ్యముల్ సరగున భక్తి నిడుచు
  చేతురు నిమజ్జనము నిక చెరువు నందు

  రిప్లయితొలగించండి
 5. సాటెవ్వారిక లేరు నీకు భువనస్సంతోష సంధాయకా
  ధాటిన్ శూరపరాక్రమాన్వితమునన్ దైత్యేయులన్ గూల్చి పో
  రాటస్ఫూర్తి కలుంగఁజేసితివి విద్యాదాయకా! హేరుకా!
  నీటన్ ముంచితి పాల ముంచు వరమున్ నేవేడుకొంటిన్ గదా!

  రిప్లయితొలగించండి
 6. గణేశా నీనిమజ్జనమున
  గుణదోషములెన్నియున్న గూరిమి తోడన్
  గణుతించకయ్య వానిని
  గణనాధా ప్రణతులిడెదను కావుము తండ్రీ

  రిప్లయితొలగించండి
 7. శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు పాదాభివందనములతో....
  స్వామి నీ రూపము మా దరినే యుండ వలెనని
  =======*========
  పాడి పంటల వృద్ధి జేయ!పాప జాలము ద్రుంచి వేయ !
  వాడ వాడల కీడు జేయు!వారి పీడను ద్రుంచి వేయ !
  పాడు బుద్ధులనెల్ల డుల్చి! ప్రజ్ఞాన సంపద నిమ్ము!
  తోడు కోరి నిమజ్జనమ్ము ! తొమ్మిది నాళ్ళకు జేయు!

  చుంటిమి శ్రీగణనాథ ! సొక్కుచు,మ్రొక్కుచు స్వామి !
  కంటకములు వలదనుచు!గణనాయక తమ బంటులకు !
  బంటులము కరుణామృతము!బంచి దీవెన లిమ్ము స్వామి!
  మంటలు బెట్టు వారలను!మట్టిని గలుపుచు స్వామి !

  రిప్లయితొలగించండి

 8. ఓ బొజ్జ గణపయ్య ఉండ్రాళ్ళు నీకయ్య
  ..... గణరాయ విఘ్నాలు గలుగ నీకు
  రావయ్య మము బ్రోవ రతనాల గణపయ్య
  ..... విజయాలు చేకూర్చు విఘ్న రాయ
  నవ రాత్రులు గడిపి నడిపించు మమ్ముల
  ..... సంఘటితమ్ముగ జగమునందు
  ఆది వంద్యుడ వీవు అఖిల జగములకు
  ..... గజముఖ స్మరియింతు గౌరిపుత్ర

  మట్టి గణపతి ప్రతిమలు మరులు గొలుప
  చవితి మొదలు చతుర్దశి సంబరములు
  జరుపు కొని గణేశుని నిమ జ్జనము జేయ
  తరలి వచ్చిరి జనులంత ధన్యులయ్య.

  రిప్లయితొలగించండి
 9. అంబర మంటిన వేడుక
  సంబరముగ జరుగు చుండె సాగర తటిపై
  గంభీర మైన ఠీవిగ
  నంబా సుతుడమర పురికి యాదర మొప్పన్ !

  రిప్లయితొలగించండి
 10. సజ్జనులందరు గొల్చిరి
  ముజ్జగముల పూజలందు మోదకహస్తున్
  బొజ్జయునూగగణపతి ని
  మజ్జనమునకేగెనేడు మాన్యులుబొగడన్ !!!

  రిప్లయితొలగించండి
 11. శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు వందనములతో

  బుజ్జి వినాయకా గిరిజ ముద్దుల పుత్రుడ! శంకరుండు నీ
  గుజ్జు విశుద్ధరూపమున కుంజరవక్త్రము నేకదంతమున్
  బొజ్జను నాగజన్నిదము మూషికవాహన మిచ్చి జేసె నిన్
  యొజ్జగ సర్వవిద్యలకు నుండగ నండ జగత్త్రయమ్మునన్

  తొమ్మిది రాత్రముల్ గడచె తొల్లిట నిన్నుప్రతిష్ట జేసి నీ
  మమ్ముగ పూజ జేయుచు సమర్పణగా కుడుముల్,యపూపముల్
  తొమ్మిది బిండి వంటలను తోరపు బొజ్జ దినంగ నేడు నీ
  సమ్మతి గంగలోన మనసార నిమజ్జన సేతుమయ్యనిన్

  తప్పులొ యొప్పులో తెలియదన్న యొనర్చితి జాల వానినిన్
  మెప్పులుగా దలంచి మము మించిన మీ కృప గావుమయ్య మీ
  యప్పులు దీర్చలేమిక భవాంబుధినిన్ తరియింప జేయుమా
  గొప్పగ చెప్పుకొందుమిల కొమ్ముల వేలుప యో గణాధిపా

  రిప్లయితొలగించండి
 12. సాహితీ మిత్రులు శ్రీ తిమ్మాజి రావుగారికి నమస్కారములు. తమరు వ్రాసిన గణేశ స్తుతి పద్యములు చాల బాగుగ నున్నవి.అభినందనలు. అటులనే కొన్ని వ్యాకరణ దోషములు కూడ నున్నవి. సరిచూచుకొనఁగలరు.

  రిప్లయితొలగించండి
 13. ‘గణేశ నిమజ్జనము’పై మంచి పద్యాలను రచించిన మిత్రులు....
  పండిత నేమాని వారికి,
  గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
  గుండు మధుసూదన్ గారికి,
  సుబ్బారావు గారికి,
  సంపత్ కుమార్ శాస్త్రి గారికి,
  శైలజ గారికి,
  వరప్రసాద్ గారికి,
  బొడ్డు శంకరయ్య గారికి,
  రాజేశ్వరి అక్కయ్యకు,
  మంద పీతాంబర్ గారికి,
  కెంబాయి తిమ్మాజీ రావు గారికి
  అభినందనలు, ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 14. అర్థమేలేని జన్మము వ్యర్థమనుచు
  చేయసాగిరి గణపతి సేవ జనులు
  కణములొచ్చెను మిక్కిలి కరమునిండ
  సాగనంపిరి దేవుని స్నానమునకు.
  ( కణము = పైసా )
  అర్థమేలేని జన్మము వ్యర్థమనుచు
  చేయసాగిరి గణపతి సేవ జనులు
  కణములొచ్చెను మిక్కిలి కరమునిండ
  మజ్జనము చేయనేగిరి బొజ్జదేవు.

  రిప్లయితొలగించండి
 15. విఘ్నపతికి పెద్ద విగ్రహాలను బెట్టి
  చవితి మొదలు జేసి సంబరాల
  నట్టహాస మొప్ప నాడంబ రముగా ని-
  మజ్జనమ్ము జేయ మంది పోవు.

  పూజ వేళ భక్తి పొంగునేమో కాని
  పిదప వెకిలి పాట లదర గొట్టు
  పెద్ద లడ్డు లంద్రు, పెద్ద విగ్రహ మంద్రు
  గొప్ప గాక, నయ్య కోరె నేమి?

  రిప్లయితొలగించండి
 16. ప్రభల రామలక్ష్మి గారూ,
  మంచి పద్యాలు వ్రాసారు. అభినందనలు.
  ‘ఒచ్చెను’ అని గ్రామ్యాన్ని ప్రయోగించారు. ‘కణములేతెంచె’ అనండి.
  *
  మిస్సన్న గారూ,
  చాలా చక్కని పద్యాలు. అభినందనలు.

  రిప్లయితొలగించండి