12, సెప్టెంబర్ 2013, గురువారం

పద్య రచన – 462 (పట్టు విడుపులు)

కవిమిత్రులారా,
ఈనాటి పద్యరచనకు అంశము....
“పట్టు విడుపులు”
ఈ అంశమును సూచించిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదాలు.

21 కామెంట్‌లు:

 1. శ్రీపండిత నేమాని గురువులకు నమస్సులతో

  పట్టు పట్టరాదేరికి పట్టిన మరి
  పట్టు విద్యల విడువంగ వలదు శిష్య
  పట్టు విడుపులు తప్పవు బంధు జనుల
  హిత జనాళి సమైక్యతా హితము కొరకు.

  రిప్లయితొలగించండి
 2. పట్టిన విడువరు కొందరు
  గట్టీగ తమమాట గెలువ కాల కేయులనన్
  పట్టదు కొందరి మనసుకు
  నట్టే విడువంగ నెంచి నారాయణులౌ

  రిప్లయితొలగించండి
 3. తగిన రీతిని సరియైన తరుణమందు
  పట్టువిడుపుల జూపును ప్రాజ్ఞు డకట!
  మూర్ఖపుం బట్టు వలననె భువనములకు
  కష్ట నష్టమ్ము లెన్నియో కలుగు చుండు

  రిప్లయితొలగించండి
 4. పట్టు పట్టగ రాదయ్య పట్టి విడువ
  రాదనుచు పలికెడు మాట లబ్ధి కలుగ
  జేయు విద్యార్థి లోకపు చిన్న వారి
  కెల్ల చెప్పదగుననుట కింపు గలుగు.

  అయ్యా ,
  నా అజ్ఞతను మన్నించి - ప్రాజ్ఞుని మెచ్చు సందర్భమున అకట (అయ్యో) అని ఎందుకు పలికితిరో తెలుపవలసినదని విన్నపము.


  రిప్లయితొలగించండి
 5. వేటపాలెము గ్రంథాలయమును గురించి తెలిపిన గురువు గారికి, మురళీధరరావుగారికి వందనములు.

  అద్భుతమన నిదియె యాశ్చర్యమానంద
  ములును కలిగెనయ్య! మ్రొక్కులిడుదు
  జ్ఞానదాహపరుల సామర్థ్యములకెల్ల!
  వారి కరుణ వెలుగు భారతమ్ము.

  రిప్లయితొలగించండి
 6. పట్టును బట్టుట మంచిదె
  పట్టునగల తేనె చేత బట్టుట కొరకై
  పట్టును విడుటయు మంచిదె
  కుట్టగ నా యీగలన్ని గుంపుగ రాగన్.

  రిప్లయితొలగించండి
 7. పట్టు విడుపు లున్న వారు ప్రగతిని సాధించ గలరు
  పట్టు విడుపులను విడిన ప్రగతిని సాధించ లేరు
  పట్టిన పనులను విడక పయనము సాగించు వారు
  దిట్టలుగా వెలు గొంది దేశ కీర్తిని పెంచ గలరు.

  రిప్లయితొలగించండి
 8. అమ్మా! లక్ష్మీ దేవి గారూ! శుభాశీస్సులు.
  మీకు కలిగిన సందేహము వంటి వానికి తావు ఇవ్వకుండా వ్రాసి ఉంటే చాల మంచిదే. నేను అంత లోతుగా ఆలోచించ లేదు. ప్రాజ్ఞుడు అనుటతో ఆ వాక్యమును ముగించి, అకట అను పదమును తరువాతి వాక్యముతో అనుసంధానించ వలెను - అప్పుడు అన్వయమునకు ఇబ్బంది ఉండేది కాదు. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 9. పట్టూ విడుపులు ననునివి
  ఇట్టట్టుగ నుండవలెను నెవరికి నైన
  న్నట్టులు జరుగని నెడలను
  పట్టును గోల్పోవు నిజము పండిత వర్యా !

  రిప్లయితొలగించండి
 10. పూజ్య గురుదేవులు శ్రీ శంకరయ్య గారికి, పండిత నేమాని గారికి వందనములు.

  పట్టు విడిచిన స్నేహమ్ము వలపు హెచ్చు
  విడుపు లేకున్న ద్వేషమ్ము వీధి కెక్కు
  పట్టువిడుపుల కతీతమౌ ప్రతిభ నేర్చి
  మనగ సుఖశాంతులుండును జనులకెల్ల

  రిప్లయితొలగించండి
 11. వేటపాలెం గ్రంధాలయం గూర్చిన వివరణ తెలిపిన గురువుదేవులకు ధన్యవాదాలతో..

  పట్టుపట్టవలెను పరీక్షాకాలమ్ము
  ఫలితమొచ్చు కీర్తి ప్రాప్తమగును
  పట్టువిడువకున్న పడిపోవుబంధాలు
  చెట్టు పిట్టకొకరు పట్టిపోవు.

  రిప్లయితొలగించండి
 12. అయ్యా! తిమ్మాజీ రావు గారూ! శుభాశీస్సులు.
  మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు. 3వ పాదములో గణ భంగము గోచరించుచున్నది. సరిచేయండి. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 13. పట్టు విడుపు లుండనిచో
  పుట్టెడు కష్టములు గలుగు ముప్పుయు వచ్చున్
  పట్టు విడుపు లుండినచో
  పట్టిన పనుల నెరవేర్చ వచ్చును మిత్రా

  రిప్లయితొలగించండి
 14. తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  *
  రాజేశ్వరి అక్కయ్యా,
  బాగుంది మీ పద్యం. అభినందనలు.
  ‘కాలకేయులకున్’ అన్నచోట గణదోషం. ‘మనసు’ సాధువు కాదు. అంతే కాదు మనసును మనము అని మార్చినా మనమునకున్ అనవలసి ఉంటుంది. సవరించండి.
  *
  పండిత నేమాని వారూ,
  మీ పద్యం చాలా బాగుంది. అభినందనలు.
  *
  లక్ష్మీదేవి గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  నేమాని వారి పద్యాన్ని గురించి వారు చెప్పిన సమర్థననే నేను చెపుదామనుకున్నాను. ఈలోగా వారే చెప్పారు.
  వేటపాలెం గ్రంధాలయం గురించిన మీ పద్యం బాగుంది. అభినందనలు.
  *
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ పద్యం తేనెలూరుతున్నది. బాగుంది. అభినందనలు.
  *
  బొడ్డు శంకరయ్య గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  *
  సుబ్బారావు గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  ‘పట్టూ’ అని వ్యావహారికాన్ని వాడారు. అక్కడ ‘పట్టును విడుపును ననునవి’ అనండి. ‘జరుగని + ఎడల’ అన్నప్పుడు యడాగమం వస్తుంది.
  *
  కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  మూడవ పాదాన్ని ‘పట్టు విడుపులు విడనాడి ప్రతిభ నేర్చి’ అందాం.
  *
  శైలజ గారూ,
  బాగుంది మీ పద్యం. అభినందనలు.
  మొదటి పాదంలో గణదోషం. ‘పట్టు పట్టవలెను పలు పరీక్షలలోన’ అనండి.

  రిప్లయితొలగించండి
 15. బొడ్డు శంకరయ్య గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 16. శ్రీ శంకరయ్య గురుదేవులకు, శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో..
  సరదాగా:
  ========*=====
  పట్టు విడుపులు లేకున్న పట్టు చీర,(చీర అందమును)
  ఎత్తు పల్లము లేకున్న నేటి నీరు, (అలల సోయగము)
  చీకటి వెలుగు లేకున్న లోకమునను,
  పకృతి రమణీయతను జూడ వశము గాదు!

  రిప్లయితొలగించండి
 17. పూజ్య గురుదేవులు శ్రీ శంకరయ్య గారికి, పండిత నేమాని గారికి వందనములు.

  గురుదేవుల సవరణ చాల బాగుగా నున్నది. ధన్యవాదములు.

  తిమ్మాజీ రావు

  రిప్లయితొలగించండి
 18. గురువులకు ప్రణా మములు సవరించిన పద్యము

  పట్టిన విడువరు కొందరు
  గట్టిగ గెలువంగ తాము కాపురుషు లనన్
  పట్టని కొందరు ప్రముఖులు
  నట్టే విడువంగ నెంచి నారాయణు లౌ !

  రిప్లయితొలగించండి
 19. అయ్యా,
  అర్థము, అంతరార్థము ఏమైనా ఉన్న తెలుసుకొనవలెనన్న ఆరాటము తప్ప వేరేమీ నా ఉద్దేశ్యము కాదని విన్నపము.
  గురువు గారికి ధన్యవాదములు.

  రిప్లయితొలగించండి
 20. మిత్రులారా! శుభాశీస్సులు.
  ఈనాటి వివిధములైన పద్యములు చాలా బాగుగ నున్నవి. అందరికీ అభినందనలు. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 21. కాటి కాపరి గా మారు కలత లెన్నొ
  సతిని విడనాడి వగచెడు వెతల నెన్నొ
  పట్టు విడుపులు లేకనా పడిరి వారు?
  సున్నితంబైన యంశమ్ము జూడ నిదియు!

  రిప్లయితొలగించండి