28, సెప్టెంబర్ 2013, శనివారం

పద్య రచన – 478 (పరనింద)

కవిమిత్రులారా,
ఈనాటి పద్యరచనకు అంశము....
“పరనింద”

28 కామెంట్‌లు:

 1. పరనింద సేయఁ గడఁగిన
  నరునకుఁ బర శాపజనిత నాశము గల్గున్!
  ధరణినిది జరుగుఁ దథ్యము;
  పరసేవనుఁ జేయఁబూనఁ బాపము లడఁగున్!!

  రిప్లయితొలగించండి
 2. శ్రీపండిత నేమాని గురువులకు నమస్సులతో

  తాము జేసిన పనులను దాచు కొనుచు
  పరుల నిందింతురీ మంత్రి వర్యులంత
  నొకరి నొకరు దూషించుటె యొప్పు యనుచు
  చెలగు చుండగ సభలందు సిగ్గు చేటు.

  రిప్లయితొలగించండి
 3. పర నింద పాపమన దగు
  సుర లోకము మెచ్చ దంట సోముడి నైనన్
  అరి నైన బొగడ నేర్చిన
  కరి వరదుడు కాచునంట కరుణించి మదిన్

  రిప్లయితొలగించండి
 4. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !

  పరనింద జేసేవారు పేడివారితో సమానం :

  01)
  _________________________________

  పాడు నేతలు నిందజేతురు - ప్రక్కవారినె నిత్యమున్
  పాడు పల్కుల దేశవాసుల - పాడె బెట్టగ జూతురే
  వాడి తప్పులు వీడు జెప్పును - వాడ వాడల బోవుచున్
  వీడితప్పులు వాడు జెప్పును - వేడివేడిగ జూడగన్
  తోడు గూడరు కూడియుండరు - దూరదృష్టదె మృగ్యమే
  పేడి వారగు వీరు నిందల - వీడినంతట వేడుకౌ
  _________________________________

  రిప్లయితొలగించండి
 5. గుండు మధుసూదన్ గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  దీనులైన పరులకు సేవ పుణ్యప్రదమే. కాని స్వార్థం (ఉదరపోషణ) కోసం పరసేవ హేయమని పెద్దలంటారు కదా!
  *
  తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారూ,
  మంచి పద్యాన్ని వ్రాసారు. అభినందనలు.
  *
  రాజేశ్వరి అక్కయ్యా,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  *
  వసంత కిశోర్ గారూ,
  చక్కని పద్యాన్ని వ్రాసారు. అభినందనలు.
  ‘దృష్టి + అదె’ సంధి లేదు, యడాగమం వస్తుంది. అక్కడ ‘దూరదృష్టియె’ అంటే సరి!

  రిప్లయితొలగించండి
 6. పరనింద చేయువారల
  కరయంగా నిహము పరము లతిదుఃఖదముల్
  సురుచిర మృదువచనంబులు
  చిరతరసత్సౌఖ్యదములు క్షితివారలకున్.

  రిప్లయితొలగించండి
 7. హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
  మంచి పద్యాన్ని వ్రాసారు. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 8. పరనింద పనికి రాదుర !
  పరమానందమ్ము నెపుడు పంచగవలెరా !
  పరనింద సేయ దలతువ !
  పరులకు నీవైన గాని పరుడవె గనుమా !

  రిప్లయితొలగించండి
 9. పరనిందను దత్తపదిగా చేయుచూ ఒక ప్రయత్నము:

  సుందర రూప సుశోభిత!
  బృందారక బృందవంద్య! విశ్వేశ! చిదా
  నంద! శ్రితావన తత్పర!
  నిందలచి నమస్కరింతు నిర్మల మతినై

  రిప్లయితొలగించండి
 10. పరులేయవి యొనరించిన
  పరహితమతి సాగవలయు ప్రాజ్ఞులు మెచ్చన్
  పరనింద హేయమైనది
  పరువగు నొక చిన్నమాట పలుకుము చాలున్

  రిప్లయితొలగించండి
 11. వర్తమానంలో
  రాజకీయములందు రాణించవలెనన్న
  పరనింద చేయుట ప్రథమ కృత్య
  మనుదిన హర్షంబు నందంగవలెనన్న
  పరనింద చేయుచు బ్రతుక వలయు,
  నత్యుత్తముండంచు యశమందవలెనన్న
  వలయు నన్నింటను పరుల నింద,
  కూర్మితో గద్దెపై కూర్చుండవలెనన్న
  పరనింద చేయంగ వలయు నెపుడు
  కలియుగంబులోన క్రమముగా నీరీతి
  జనుల మనములందు సకలజగతి
  నిరతసుఖము కొరకు పరనింద చేయుటే
  విధియటన్న తలపు విస్తరించె.

  కానీ,

  పరనింద పాపకృత్యము
  పరనిందయ హానిదంబు బహువిధములుగా
  పరనింద సత్వనాశిని
  పరనిందను చేయువారు బడుగులు జగతిన్.

  పరనింద వైరవర్ధిని
  పరనిందయ యశహరంబు భాగ్యాంతకమౌ,
  పరనింద నరకతుల్యము
  పరనిందను మానవలయు ప్రజలెల్లరకున్.

  రిప్లయితొలగించండి
 12. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ పద్యం చాలా బాగుంది. అభినందనలు.
  *
  పండిత నేమాని వారూ,
  దత్తాంశాన్ని దత్తపదిగా స్వీకరించి, పరబ్రహ్మను స్తుతిస్తూ మీరు వ్రాసిన పద్యం ఉత్తమంగా ఉంది. అభినందనలు, ధన్యవాదాలు.
  *
  పింగళి శశిధర్ గారూ,
  చక్కని పద్యాన్ని వ్రాసారు. అభినందనలు.
  *
  హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
  ముందు పరనింద వలన లాభాలను పొందేవారిని గురించి చెప్పి, తరువాత దాన్ని గర్హిస్తూ మీరు చెప్పిన పద్యాలు చాలా బాగున్నవి. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 13. మరియొక ప్రయత్నము:

  పరనిందల్ పరసంస్తుతుల్ వలదురా, పాపంబుగా నెంచుమా
  పరమోదార గుణాకరుండవగుచున్ భాసిల్లుమా ధర్మ త
  త్పర లక్ష్యంబున నిల్పి చిత్తము సదా ధన్యత్వమున్ బొందుమా
  పరమార్థప్రద యోగ సాధక సుధీ! వర్ధిల్లుమా ధీనిధీ!

  రిప్లయితొలగించండి
 14. శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు పాదాభివందనములతో ..
  ========*==========
  పరనింద వలన గలుగును
  పరమ సుఖము నేడు వైరి వరులకు,`జగ`తిన్
  పరనింద నరక సమమన
  చిరుత వలె బడు గద నేడు క్షితివారలపై !

  రిప్లయితొలగించండి
 15. పరనిందనుచేయవలదు
  పరనిందలుపడుటవలదువసుమతిలోనన్
  పరమాత్మకెరుకయనుచు
  పరమార్దములనుతెలిసి బ్రతుకుట మేలౌ

  ద్వేషభావమున్న దేహానికేగీడు
  సహనగుణముయున్న శాంతి నొసగు
  తన్ను తానె బొగడ తలవంపు లేతెచ్చు
  పరుల నింద చేయ పనికి చేటు

  రిప్లయితొలగించండి
 16. పాలనాదక్షత ప్రభుతకు లేకున్న
  ..........పరనిందలోనైన ప్రతిభ వలయు,
  కర్తవ్యదీక్షితుల్ కాలేనివారికి
  ..........పరనిందలోనైన ప్రతిభ వలయు,
  దిశలు నిండెడు సవ్య యశమందలేకున్న
  ..........పరనిందలోనైన ప్రతిభ వలయు,
  దాతృత్వబుద్ధితో దయజూపలేకున్న
  ..........పరనిందలోనైన ప్రతిభ వలయు,
  సంఘసేవను బూని సహకారి గాకున్న
  ..........పరనిందలోనైన ప్రతిభ వలయు,
  సజ్జనసన్నుతుల్ సంధించలేకున్న
  ..........పరనిందలోనైన ప్రతిభ వలయు,
  వరమృదువాక్యాలు వచియింప లేకున్న
  ..........పరనిందలోనైన ప్రతిభ వలయు,
  సత్యవాచనమన్న సఖ్యత లేకున్న
  ..........పరనిందలోనైన ప్రతిభ వలయు,
  న్యాయానువర్తన ధ్యేయంబు గాకున్న
  ..........పరనిందలోనైన ప్రతిభ వలయు,
  సద్గురుడౌటకు సత్వంబు లేకున్న
  ..........పరనిందలోనైన ప్రతిభ వలయు,
  హితకాంక్షియై చేరి జతగొన లేకున్న
  ..........పరనిందలోనైన ప్రతిభ వలయు,
  ధర్మరక్షణవిధుల్ దాల్చగలేకున్న
  ..........పరనిందలోనైన ప్రతిభ వలయు,
  ఎందు జూచిన పరనింద కిలను నేడు
  పెద్దపీటయ కనవచ్చు, విమలు డగుచు
  పరుల నిందించ లేనట్టి నరుని చరిత
  మకట హాస్యాస్పదంబయ్యె ననుట నిజము.

  రిప్లయితొలగించండి
 17. పూజ్యగురుదేవులు శ౦కరయ్య గారికి వందనములు

  “తనపర భేదముల్ తగవు తాళిక గల్గి సుఖిoపగా వలెన్
  యనుజులవోలె నుండగ “సనాతన ధర్మము ఘోష సేయగా
  వినక స్వకీయ సంస్తుతులవీరవిహారమొనర్చి వైరులన్
  నెనరు యొకింత లేక “పరనింద”ల జేయగ నేతకే తగున్

  రిప్లయితొలగించండి
 18. మిత్రులు కంది శంకరయ్యగారికి నమస్సులు. నేను దీనులైన పరులకు సేవఁజేయఁ బూనుటఁ గూర్చియే భావించితిని గాని వాచ్యముగఁ జెప్పకుంటిని. చివరి పాదము నిటుల మార్చుచుంటిని. పరిశీలించఁగలరు.

  పరనింద సేయఁ గడఁగిన
  నరునకుఁ బర శాపజనిత నాశము గల్గున్!
  ధరణి నిది జరుగుఁ దథ్యము;
  పరులగు దీనులకు సేవ పాపము లడఁచున్!!

  రిప్లయితొలగించండి
 19. పరనింద చేయుచు బ్రతుకు నీడ్చుటకన్న
  ..........బండగట్టుక బావి బడుట మేలు,
  పరనింద చేయుచు నరుసమందుటకన్న
  ..........భీకరాగ్నిని జేరి దూకు టొప్పు,
  పరనింద చేయుచు ధరనుండు కన్నను
  ..........రైలు పట్టాలపై వ్రాలు టొప్పు,
  పరనింద చేయుచు చరియించు కన్నను
  ..........అంభోధిలో దూకు టర్థవంత
  మవని పరనింద తుల్యమౌ యఘము లేదు
  కోటి గ్రంథాల సారమౌ మాట లివియె
  పరుల కుపకార మొనరింప చిరసుఖంబు
  పాప మొదవును పరనింద వలన నిజము.

  రిప్లయితొలగించండి
 20. పరనిందలాత్మసంస్తుతు
  లరయంగా పనికిరానివాత్మజ్ఞానుల్
  మరి వీటినాదరించరు
  చరియింతురు ధర్మమార్గ సంవర్తనులై.

  రిప్లయితొలగించండి
 21. పరనిందఁ జేయుటన్నది
  కిరిమలమాస్వాదనమని గీతగ జెప్పెన్
  పరమాత్ముడు సాయీశుఁడు!
  హరినామస్మరణ పాప హరణంబనెనే!

  రిప్లయితొలగించండి
 22. పరుల నింద జేసి పాశవికమ్ముగా
  హాయి నొందు చుందు రల్పజనులు
  నిక్కమైన హాయి నిందలో నుండదు
  పొందు హాయిని పరనిందమాని

  రిప్లయితొలగించండి
 23. పరుష మాట లాడి పరనింద జేసిన
  నెదుటి వారు నిన్ను హీను డంద్రు
  విలువ తగ్గిపోవు వెక్కిరింతలు జేయ
  మృదుపలుకులు మనకు మేలుజేయు.

  రిప్లయితొలగించండి
 24. పరనిందయునాత్మస్తుతి
  నరులకు తగవననెఱుగుము, నమ్రతతోడన్
  కరముల జోడింపగ శుభ
  కరమౌనను మాట నిజము, క్షమ ఘనమనరే?

  రిప్లయితొలగించండి
 25. ‘పరనింద’ అంశంపై చక్కని పద్యాలను రచించిన కవిమిత్రులు....
  పండిత నేమాని వారికి,
  వరప్రసాద్ గారికి,
  శైలజ గారికి,
  హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారికి,
  కెంబాయి తిమ్మాజీ రావు గారికి,
  గుండు మధుసూదన్ గారికి,
  సంపత్ కుమార్ శాస్త్రి గారికి,
  సహదేవుడు గారికి,
  బొడ్డు శంకరయ్య గారికి,
  కుసుమ సుదర్శన్ గారికి,
  లక్ష్మీదేవి గారికి,
  అభినందనలు, ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 26. శైలజ గారూ,
  మీ మొదటి పద్యం 3వ, 4వ పాదాల్లో గణదోషం. ‘పరమాత్మకెరుకయనుచును/పరమార్థమ్ములను తెలిసి బ్రతుకుట మేలౌ’ అవండి.
  రెండవ పద్యంలో ‘గుణము + ఉన్న’ అన్నప్పుడు సంధి నిత్యం. యడాగమం రాదు. ‘గుణము గలుగ’ అందాం.
  *
  కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  ‘వలెన్ + అనుజుల’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘సుఖింప నొప్పు తా/ మనుజుల..’ అనండి.
  *
  గుండు మధుసూదన్ గారూ,
  సవరించిన మీ పూరణ బాగుంది. ధన్యవాదాలు.
  *
  కుసుమ సుదర్శన్ గారూ,
  ‘పరుష వాక్కు లాడి’ అనండి.

  రిప్లయితొలగించండి