6, సెప్టెంబర్ 2013, శుక్రవారం

పద్య రచన – 456 (పిల్లి)

కవిమిత్రులారా,
ఈనాటి పద్యరచనకు అంశము....
“పిల్లి”

13 కామెంట్‌లు:

గోలి హనుమచ్చాస్త్రి చెప్పారు...

పిల్లెదురుగ వచ్చినచో
చెల్లము పయనమ్ముజేయ ఛీ ! ఛీ ! పిల్లీ !
పిల్లియె పొయ్యిన లేవక
చెల్లదు మన తిండి వండ జే ! జే ! పిల్లీ!

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

వెళ్ళఁ బనుల మీఁద, పిల్లి యెదురు రాఁగ,
ససిగ సాఁగ దనుచు నసుగుకొనుచు
మఱలుచుంద్రు జనులు; మార్జాలమా! యిది
నిజమొ, కాదొ చెపుమ, నిక్కముగను!!

sailaja చెప్పారు...

ఎవరి మోము జూచి ఏగినానోనేను
ఒక్క ఎలుకనైన నొక్కలేదు
మనుజ శకున మెపుడు మంచిది కాదొకొ!
గోల పెడుతు పిల్లి గోడ నెక్కె

subbarao చెప్పారు...

ఓగిరమ్ము కొఱకు వేగిరమ్ము పడునా
గోడ మీది పిల్లి చూడు డార్య !
నలుపు రంగు తోడ మిలమిల లాడుచు
మూషి కమ్ము కొఱకు వేచు చుండె .

సంపత్ కుమార్ శాస్త్రి చెప్పారు...

కలుగున్ దాగిన మూషికమ్మునకు వ్యాఘ్రంబై ప్రవర్తింతు నా
కలి గొన్నట్టిదొ గ్రామసింహమునకున్ కంపింతునెల్లప్పుడున్
బలసామర్థ్యములెంచి గాదె ధరణిన్ ప్రాచుర్యముల్ పొంది ని
ర్మలసౌఖ్యమ్ముల గాంచుచుందురు గదా రంజిల్లుచున్ ధీరులై.

మంద పీతాంబర్ చెప్పారు...

పిల్లికి బిక్షమ్ము బెట్టనేరని వాడు
....పిలిచి సంతర్పణ పెట్ట గలడె ,
పిల్లికి భయపడు పిరికి వాడెపుడైన
....పులిముందు తలయెత్తి నిలువ గలడె
పిల్లి మార్చిన యట్లు పిల్లల పలుచోట్ల
....మార్చిసమస్యల తీర్చ గలడె
పిల్లి కంటబడిన వల్లుగాలేదంటు
....యింటిలోనె బ్రతుకు నీడ్వ గలడె
పిల్లి స్వభావమ్ము పిల్లి ప్రభావమ్ము
....యింటింట యూరుర కంట బడదె

"పిల్లి ఎలుకకు సాక్ష్యమ్ము" "పిల్లికి చెల
గాటమెలుకకు ప్రాణ సంకటము" గాదె
"గోడమీదిపిల్లి" మనకు గోపి . పిల్లి
తెలుగు భాషలోనిటుల జాతీయమయ్యె !!!

Unknown చెప్పారు...

పూజ్యగురుదేవులు శ౦కరయ్యగారికి నమస్కారములు.

మనసు కలిసియుండి వనరులు ధనములు
పంచుకొనగ మంచి ప్రగతి కలుగు
వేరుపాటు కొరకు వీధి కెక్కిన నాడు
పిట్ట తగవులన్ని పిల్లి దీర్చె

Unknown చెప్పారు...


పూజ్యగురుదేవులు శ౦కరయ్యగారికి నమస్కారములు.

అందమైన పిల్లిఅదిగొ చూడుమచట
అందునిందు దుమికి హాయిమీర
పవ్వళిoచె తఖ్తు పైనెక్కి దీటుగా
ఎలుక పట్టకుండ కులుకుచుండె

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నాసిని గాంచిన శకునము
వాసిగ లేదంచు జనులు వాపోవుదురే
మోసపు బ్రతుకుల కంటెను
నాసియె నయమౌను గాదె నళిన దళేక్షా !!

కందుల వర ప్రసాద్ చెప్పారు...


వాడ వాడ లందు దిరిగి - పాదయాత్ర జేయుచున్
వీడ కుండ దిరుగు చుండె- వేగిరమున వీధులన్
గోడ మీద నడచు గొప్ప -గొప్ప పిల్లు లన్నియున్
తోడు నిలిచి యుందు మనుచు- తోక లెల్ల జూపుచున్
నాడు నేడు ననుచు నుండె -నమ్ము మమ్ము నిప్పుడున్
పాడు చుండె మరువ కుండ - పాత పాట లన్నియున్
వేడుక గను జూచు చుండె - వేదిక పయి నిల్చియున్!

తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ చెప్పారు...

శ్రీపండిత నేమాని గురువులకు నమస్సులతో

భక్తి మార్గమందున జెప్పె భక్తుడుండు
రీతి ద్వివిధ మార్గములని ఖ్యాతి గాంచె
మర్కట కిశోర భాతిని మసల, లేక
పిల్లి పిల్లల వైఖరిన్ చెల్లు ననుచు.

కంది శంకరయ్య చెప్పారు...

పిల్లిపై ఎల్లరి ఉల్లము సంతసిల్లునట్లుగా చక్కని పద్యాలను రచిందిన కవిమిత్రులు.....
గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
గుండు మధుసూదన్ గారికి,
శైలజ గారికి,
సుబ్బారావు గారికి,
సంపత్ కుమార్ శాస్త్రి గారికి,
మంద పీతాంబర్ గారికి,
కెంబాయి తిమ్మాజీ రావు గారికి,
రాజేశ్వరి అక్కయ్యకు,
వరప్రసాద్ గారికి,
తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారికి,
అభినందనలు, ధన్యవాదాలు.

G P Sastry (gps1943@yahoo.com) చెప్పారు...

వర్జింపన్ వడి మూషికంబు తరుమన్ వ్యాపారమున్ సాధువై....
దర్జాగానటు బల్లపై నొడలినిన్ ధట్టించి పర్వుంటివే
అర్జీ పెట్టెద! పాడు చేయకుమయో హ్లాదంపు మూత్రమ్మునన్
మార్జాలంబు మహోదయా! ప్రణతులన్ మన్నించుచున్ గావవే!