9, సెప్టెంబర్ 2013, సోమవారం

సమస్యాపూరణం – 1169 (గరళకంఠుని శత్రువు)

కవిమిత్రులారా,
వినాయక చవితి శుభాకాంక్షలు!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది .....
గరళకంఠుని శత్రువు గజముఖుండు.

23 కామెంట్‌లు:

  1. శ్రీపండిత నేమాని గురువులకు శ్రీ శంకరార్యులకు, శ్రీ ఏల్చూరి మురళీధర రావుగారికి అన్న శ్రీ మిస్సన్న గార్లకు నమస్సులతో శంకరాభరణ బ్లాగు సోదరసోదరీమణులకు వీక్షకులకు నా హృదయపూర్వక వరసిద్ధి వినాయక చవితి శుభాకాంక్షలు.

    జగము లల్లాడ జేయ గజాసురుండు
    గరళకంఠుని శత్రువు, గజముఖుండు
    విద్యలకునొజ్జ గణపయ్య విఘ్నములను
    బాపు పార్వతీ సుతునకు ప్రణతు లిడుతు.

    రిప్లయితొలగించండి
  2. మిత్రులందరికీ
    వినాయక చవితి శుభాకాంక్షలు !

    రిప్లయితొలగించండి
  3. తనదు సం రక్ష ణార్ధమై తలచి యంబ
    ప్రతిమ జేయంగ ముదమంది ప్రాణ మిడిన
    గరళ కంఠుని శత్రువు గజ ముఖుండు
    నీల లోహితు తనయిడౌ లీల గాను

    పూజ్య గురువులకు సోదర సోదరీ మణులకు వినాయక చవితి శుభా కాంక్షలు

    రిప్లయితొలగించండి
  4. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    అంబ మందిరం లోనికి
    శివుని ప్రవేశము నడ్డుకొని యుద్ధం చేసినవాడు
    బాలుడైనా శత్రువే గదా !

    01)
    ____________________________

    నలుగు పిండిని బొమ్మగ - మలచి గౌరి
    ప్రాణమును పోసి సృజియించి - బాలునంత
    కాపు కాయగ ద్వారమ్ము - కడకు బంపె !
    అంతకాంతకు డేతెంచె - నంబ గలువ
    నడ్డగించెను బాలుడు - హరుని యచట !
    శివుడు కోపించి బాలుని - శిరసు తరిగె !
    పార్వతీదేవి ప్రార్థనన్ - ఫాలుడంత
    గజపు ముఖమును యతికించి - కాచె ! గాన
    గరళకంఠుని శత్రువు గజముఖుండు.
    ____________________________

    రిప్లయితొలగించండి
  5. చిత్రసీమలలో చాల చిత్ర కథలు
    కల్పన మొనర్చు చుందురు కవులు బళిర!
    నేడె విడుదల యయ్యెను చూడరండి
    గరళకంఠుని శత్రువు గజముఖుండు

    రిప్లయితొలగించండి
  6. పూజ్యులు నేమానివారికి, మిత్రులు కంది శంకరయ్యగారికి, కవిపండిత మిత్రులందఱికిని "వినాయక చతుర్థి పర్వదిన" శుభాకాంక్షలతో...

    తలఁచి, సతినగ్ని కెఱఁ జేసి, దక్షుఁ డాయె
    గరళ కంఠుని శత్రువు! గజముఖుండు
    గరళ కంఠుని పుత్రుండు; కరుణఁ బ్రోచి,
    విఘ్నపతి తొలఁగించుత విఘ్నములను! (1)

    రిప్లయితొలగించండి
  7. గురువు గారికి అన్నయ్యగారికి నమస్సులు . మిత్రులందఱికీ , సోదరీమణులకు వినాయక చవితి శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  8. పూజ్య గురువర్యులకు మరియు బ్లాగు కవి మిత్రులకు వినాయక చవితి శుభాకాంక్షలు.

    తండ్రి శిరమున నుండుచు తళుకు లీను
    చంద్రుడనుచును విడువక శాప మీయ
    తనయుడైనను బృత్యుని కినుకఁబరుచ
    గరళ కంఠుని శత్రువు గజముఖుండు

    రిప్లయితొలగించండి
  9. పసుపు బొమ్మను చేసియు ప్రాణమిచ్చె
    మురిపె మందగ పార్వతి ముద్దు జేసె
    శివుని కోపము దునిమె శిశువునపుడు
    గరళ కంఠుని శత్రువు గజముఖుండు

    రిప్లయితొలగించండి
  10. శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు
    బ్లాగు కవి మిత్రులకు వినాయక చవితి శుభాకాంక్షలు.
    =====*=======
    జ్ఞాన మను విశ్వ నాశ విజ్ఞాన మెల్ల
    గరళ కంఠుని శత్రువు,గజముఖుండు
    కోరు పిండి వంటల తోడ కుడుములు,మన
    యింటికి బిలచి యిడ రండి యింపుగాను

    రిప్లయితొలగించండి
  11. గురువులకు,పెద్దలకు, కవిమిత్రులకు, తమ్ముడు శర్మకు వినాయక చతుర్థి శుభాకాంక్షలు.

    మూడు లోకాల వారికి పూజ్య మాయె
    శిరసు గణనాథు శిరముగా జేయబడుటఁ
    నంది చేతను హతుడయ్యు వందితుండు
    గరళకంఠుని శత్రువు గజముఖుండు.

    రిప్లయితొలగించండి
  12. మానినులకు మరులు గొల్పు మన్మ ధుండు
    గరళ కం ఠు ని శత్రువు , గజ ముఖుండు
    పార్వతీ పరమ శివుల ప్రధమ సుతుడు
    పూజ జేయగ వారిలో మొదటి వేల్పు

    రిప్లయితొలగించండి
  13. శ్రీ శంకరయ్య గారికి, శ్రీ గురువులకు, సుహృన్మండలిక్
    వినాయక చవితి శుభాకాంక్షలు!

    మహిషసుతుఁడు గజాసురుని ప్రార్థన:

    "దేవ! కరుణించి, నన్ను మ్రందించి, గృత్తి
    వాసుఁడవు గమ్ము! నీకయి వైరమూని
    విశ్వహింసఁ జేసితి" నని విన్నవించె
    గరళకంఠుని శత్రువు గజముఖుండు.

    తారకాసుర సంగ్రామవేళ కార్తికేయుని విక్రమవిలాసం:

    రిపు పరాక్రమలీలకు రిత్తవోయి
    తమ్ముని మహత్త్వమును జూచి బమ్మరిల్లి
    తమక మొందిరి ఖేదమోదములతోడ
    గరళకంఠుని శత్రువు, గజముఖుండు.

    సప్రశ్రయంగా,
    ఏల్చూరి మురళీధరరావు

    రిప్లయితొలగించండి
  14. శ్రీ సుబ్బారావు గారి బాటలో
    ======*=======
    భావజుని శరమ్ములు దాకి భంగమయ్యె
    భవుని తపము,భస్మము జేయ భావజుడను,
    బలికె రుద్రగణములంత భావజుండు
    గరళ కంఠుని శత్రువు,గజముఖుండు
    పుడమి యందు భక్తవరుల ముక్తి దాత!

    రిప్లయితొలగించండి
  15. మాన్య కవివతంసులు శ్రీ వసంత కిశోర్ గారికి
    నమస్కృతిపూర్వకంగా,

    నిన్నటి మీ లేఖను ఇప్పుడే చూచి ఆలస్యంగా స్పందించినందుకు మన్నింప ప్రార్థన.

    “శంకరాభరణము” బ్లాగు ప్రారంభమయిన తొట్టతొలినాటి నుంచి సరస్వతికి నిరంతరాయితంగా సురభిళ పద్యప్రసూనాలను సమర్పిస్తున్న (“సీనియర్ మోస్టు”) విద్వత్సత్కవిగా మీరంటే నాకెంతో గౌరవం. “అందరికీ వందనములు! అందరి పూరణలూ అలరించుచున్నవి!” అంటూ సద్రచనలతో అనునిత్యం ఆప్యాయనంగా అందరిని అలరించే మీ వంటి ఆత్మీయుల అభిమానానికి ధన్యవాదాలు!

    మాన్య సత్కవి శ్రీ తోపెల్ల బాలసుబ్రహ్మణ్యము గారికి,

    మీ స్మరణకు, మీ అభిమానానికి ప్రత్యభివాదపూర్వకంగా ధన్యవాదాలు!

    రిప్లయితొలగించండి
  16. శైలజ గారు మంచి పద్యము వ్రాసారు,మీ పద్య మూడవ పాదమున గణ దోషమును సవరించి

    శివుడు కోపమ్మున దునిమె శిశువునపుడు

    రిప్లయితొలగించండి
  17. గురువులు శ్రీ శంకరయ్యగారికి, పూజ్యులు నేమానివారికి,కవిపండిత మిత్రులందఱికిని వినాయక చతుర్థి పర్వదిన శుభాకాంక్షలు.

    ప్రజల ధనముదోచి బాధపెట్టెడు వాడు
    గరళ కంఠుని శత్రువు,గజముఖుండు
    వాని మదమడంచు వరుస విఘ్నాలతో,
    ధర్మ పథము వీడ తగదు తగదు !!!

    రిప్లయితొలగించండి
  18. గురువులు శ్రీ శంకరయ్యగారికి, పూజ్యులు నేమానివారికి,కవిపండిత మిత్రులందఱికిని వినాయక చతుర్థి పర్వదిన శుభాకాంక్షలు.

    గరళకంఠుని శత్రువు గజముఖుండు
    యనుచు ప్రచురణమాయెను అచ్చుతప్పు
    గరళకంఠుని పుత్రుడు గజముఖుండు
    యనుచు సవరణ జేసితిమార్యులార

    రిప్లయితొలగించండి
  19. గరళకంఠుని భక్తుడు గజముఖుండు
    కోరెనుదరము లోనుండ-కోర్కె దీరె
    తల్లినొంటరిజేసెగా తరచి చూడ
    గరళ కంఠుని శత్రువు గజముఖుండు

    రిప్లయితొలగించండి
  20. మిత్రులారా! శుభాశీస్సులు.
    ఈనాటి సమస్యకు వివిధములైన భావములతో పూరణలు వచ్చినవి. అన్నియునూ చాల బాగుగ నున్నవి. అందుచేత మిత్రులందరికి అభినందనలు - అందరికీ పేరు పేరు వరుసనా శుభాకాంక్షలు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  21. కవిమిత్రులకు నమస్కృతులు.
    నిన్న మా ఇంట్లో పూజ అయ్యాక, మా షడ్డకుని వీధిలో మొదటిసారిగా గణేశ మండపాన్ని ఏర్పాటు చేసుకుంటే అటు వెళ్ళి రాత్రికి తిరిగి వచ్చాను. అందువల్ల నిన్న పూరణలను, పద్యాలను, వ్యాఖ్యలను చూసి స్పందించలేకపోయాను.
    పండిత నేమాని వారు దయతో సమీక్షించారు. వారికి కృతజ్ఞతలు.
    చక్కని పూరణలు వ్రాసిన కవిమిత్రులు.....
    తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మగారికి,
    వసంత కిశోర్ గారికి,
    రాజేశ్వరి అక్కయ్యకు,
    పండిత నేమాని వారికి,
    గుండు మధుసూదన్ గారికి,
    గన్నవరపు నరసింహ మూర్తి గారికి,
    సహదేవుడు గారికి,
    శైలజ గారికి,
    వరప్రసాద్ గారికి,
    మిస్సన్న గారికి,
    సుబ్బారావు గారికి,
    ఏల్చూరి మురళీధర రావు గారికి,
    మంద పీతాంబర్ గారికి,
    కెంబాయి తిమ్మాజీ రావు గారికి,
    గోలి హనుమచ్ఛాస్త్రి గారికి
    అభినందనలు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి