16, సెప్టెంబర్ 2013, సోమవారం

సమస్యాపూరణం – 1176 (బలరాముఁడు లంకఁ జేర)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది .....
బలరాముఁడు లంకఁ జేర వారధిఁ గట్టెన్.

26 కామెంట్‌లు:

 1. అల రావణు హతమార్చగ
  కలకలమున కదలి రంత కపివరు లెల్లన్
  శిలతతి సేతువుపై బాహు
  బల ...రాముడు లంక జేర వారధి గట్టెన్

  రిప్లయితొలగించండి
 2. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !

  నిజ భుజ బల రాముఁడు గదా శ్రీరాముడు :

  01)
  ____________________________

  బలవంతులైన కోతులు
  జలజల పారెడు సముద్ర - జలముల నందున్
  శిలలను జార్చగ, నిజ భుజ
  బల రాముఁడు లంకఁ జేర - వారధిఁ గట్టెన్ !
  ____________________________

  రిప్లయితొలగించండి
 3. నల నీలాదులు కొండల
  జలనిధిపై వేయుచుండి చక్కగ బేర్చన్
  జలరాశిపైని రాజత్
  బలరాముడు లంక జేర వారధి గట్టెన్

  రిప్లయితొలగించండి
 4. తులలేని వర విరాజితు
  బలగర్వితుఁ బంక్తికంఠుఁ బరిమార్చంగన్
  దలఁచిన వానరయుత ధీ
  బల రాముఁడు లంకఁ జేర వారధిఁ గట్టెన్!

  రిప్లయితొలగించండి
 5. ధనుర్విద్యాబల రాముఁడు గదా శ్రీరాముడు :

  02)
  ____________________________

  తులలేని సుగుణ ధాముడు
  వెలకట్టగ లేని మేటి - వీరుం డవనిన్
  విలువైన ధనుర్విద్యా
  బల రాముఁడు లంకఁ జేర - వారధిఁ గట్టెన్ !
  ____________________________

  రిప్లయితొలగించండి
 6. కలువల కన్నుల కార్చకు
  విలపించుచు కంటినీరు వేగమె వచ్చున్
  లలనా!సీతా ! వినుమ స
  బల! రాముఁడు లంకఁ జేర వారధిఁ గట్టెన్

  రిప్లయితొలగించండి
 7. జలనిధి దాటగ, వానర
  బలశాలురు తోడుగాగ, భాసుర లీలన్
  ఖలులన్ ద్రుంచగ సద్గుణ
  బల రాముడు, లంక జేర వారధిగట్టెన్!!!

  రిప్లయితొలగించండి
 8. శ్రీ శంకరయ్య గురుదేవులకు, శ్రీ నేమాని గురుదేవులకు పాదాభివందనములతో .

  శ్రీ శంకరయ్య గురుదేవులకు ధన్యవాదములు.

  శ్రీ నేమాని గురుదేవులకు ధన్యవాదములు.

  మా యింటిలో నిన్న సాయంత్రము నుండి నెట్ పనిచేయుటలేదు, కావున గురుదేవుల సవరణ ఇప్పుడు జూచితిని. సవరణలకు పాదాభివందనములు.

  ఉత్సాహ గర్భిత మధ్యాక్కర రామునిపై వ్రాసితిని సమస్యాపూరణకుడా రామునిపై నున్నది.
  =======*===========
  రాము బలుకు విన్న వారు ప్రాభవమును పొందె గాదె ,
  రామ కథను బాడు జనుల రాత్రి పగలు రమ్య మౌను
  రాముని మది నిల్పి నడువ రాదు దరికి మృత్యు వైన
  రాముని మన సార బిలువ రాక్షస తతి దూర మౌను.

  రిప్లయితొలగించండి
 9. బలవంతులైన కపులను
  పలువురినెల్లకలుపుకుని పలుకగమేలై
  తలపడె నిజముగ వానర
  బల రాముడు లంకజేర వారధి గట్టెన్

  రిప్లయితొలగించండి
 10. అల కృష్ణున కన్నయె యీ
  బలరాముడు , లంక జేర వారధి గట్టెన్
  జలధిం బెను రాళ్ళు బఱచి
  బలములనే జూపు కొనుచు వానర సేనల్

  రిప్లయితొలగించండి
 11. శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు పాదాభివందనములతో .
  =============*=========
  అలయక సొలయక వానర
  బల శాలుల తోడ వైరి బల శాలుల పై
  సలుప రణము నమిత సుగుణ
  బల రాముఁడు లంకఁ జేర వారధిఁ గట్టెన్!

  రిప్లయితొలగించండి
 12. మాన్యులు శ్రీ శంకరయ్య గారికి
  నమస్సులతో,

  ఇలగొంగఁ బంక్తికంధరు
  బలిమినిఁ బరిమార్పఁ గడఁగి ప్రాణేశ్వరి న
  ర్మిలిఁ జేకొన నిల్లాలి, న
  బల రాముఁడు లంకఁ జేర వారధిఁ గట్టెన్.

  సప్రశ్రయంగా,
  ఏల్చూరి మురళీధరరావు

  రిప్లయితొలగించండి
 13. కులకాంతను రావణుడను
  మలినాత్ముడు చెరను బెట్ట మర్కట సైన్యం
  బులు, రాఘవుడు, రిపు భయద
  బలరాముడు, లంక జేర వారధి గట్టెన్

  రిప్లయితొలగించండి
 14. క. అలిగి విలుకాడుఁ భూమం
  డలపీడనదనుజవిషవిటపవనదావా
  నలభయదాకృతి యగు దో
  ర్బలరాముఁడు లంకఁ జేర వారధిఁ గట్టెన్.

  రిప్లయితొలగించండి
 15. బలశాలి రావణాసురు
  డిల లంకకు సాధ్వి సీత నెత్తుకు పోవన్
  జలధిన వేసెడు శిలలు ప్ర
  బల, రాముడు లంక జేర వారథి గట్టెన్.

  రిప్లయితొలగించండి
 16. కలహము గోరిన రావణు
  బలగాన్నిహతమొనరించ వానర సేనన్
  జలధిన శిలలనుజార్చి, సు
  బల రాముడు లంకజేర వారధి గట్టెన్

  తప్పులున్న సవరించ మనవి...

  రిప్లయితొలగించండి
 17. నా రెండవ పూరణము:

  ఖలు, విధి వరబల గర్వితు,
  నిలా తనయఁ జెఱను నిడిన నీచు, దశాస్యున్,
  బొలియింపఁగ, వానర యుత
  బల రాముఁడు లంకఁ జేర వారధిఁ గట్టెన్! (2)

  రిప్లయితొలగించండి
 18. తలలను పదియింటిని దా
  సుళువుగ ద్రుంచంగ కదలె; శోభాలీలన్
  జలనిధి పైనను నతులిత
  బల రాముఁడు లంకఁ జేర వారధిఁ గట్టెన్.

  రిప్లయితొలగించండి
 19. హలమును చేత ధరించెను
  బలరాముడు ; లంక జేర వారధి గట్టెన్
  జలజాక్షుడు శ్రీరాముడు
  అలవోకగ జలధి దాటి యసురుల జంపెన్

  రిప్లయితొలగించండి
 20. విలపించెడు సీతఁ గని య-
  నల పల్కెను, శోక మేల, నమ్ముము నా ప-
  ల్కుల, నీ కష్టము దీరు న-
  బల! రాముఁడు లంకఁ జేర వారధిఁ గట్టెన్.

  (అనల: విభీషణుని పెద్ద కూతురు)

  రిప్లయితొలగించండి
 21. రాజేశ్వరి అక్కయ్యా,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  మూడవ పాదంలో ‘బాహు’ అన్నప్పుడు గణదోషం. అక్కడ ‘దో/ర్బలరాముడు’ లేదా ‘భుజ/బలరాముడు’ అందాం.
  *
  వసంత కిశోర్ గారూ,
  మీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు.
  మొదటి పూరణలో ‘జలముల యందున్’ లేదా ‘జలములలోనన్’ అనండి.
  *
  పండిత నేమాని వారూ,
  ‘రాజత్ బలరాముని’ మీ పూరణము ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
  *
  గుండు మధుసూదన్ గారూ,
  ‘ధీబలుడు, వానర యుత బలుడైన రాముని’పై మీ రెండు పూరణలూ చాలా బాగున్నవి. అభినందనలు.
  *
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  సబలమైన భావంతో చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
  *
  మంద పీతాంబర్ గారూ,
  ‘సద్గుణబలం’తో అలరారుతున్నది మీ పూరణ. అభినందనలు.
  *
  వరప్రసాద్ గారూ,
  మీ ఉత్సాహ గర్భిత మధ్యాక్కర చాలా బాగుంది.
  ‘సుగుణ బలరాముని’పై మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  ఏల్చూరి మురళీధర రావు గారూ,
  అబల - రాముడు అన్న వైవిధ్యమైన విరుపుతో మీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.
  *
  ‘శీనా’ శ్రీనివాస్ గారూ,
  ‘భయద బలరాముడు’ అంటూ మీరు చేసిన పూరణ బాగుంది. అభినందనలు.
  *
  శ్యామల రావు గారూ,
  సుదీర్ఘ సమాసంతో మనోహరమైన పూరణ చెప్పారు. అభినందనలు.
  *
  బొడ్డు శంకరయ్య గారూ,
  ప్రబల శిలలతో మీ పూరణ వైవిధ్యంగా బాగుంది. అభినందనలు.
  *
  కుసుమ సుదర్శన్ గారూ,
  మంచి ప్రయత్నం. బాగుంది. అభినందనలు.
  ‘బలగాన్ని’ అనే వ్యావహారిక పదప్రయోగం తప్ప అంతా సలక్షణంగా ఉంది. రెండవ పాదాన్ని ‘బలగమ్మును హతము సేయ వానర సేనన్’ అనండి. అలాగే ‘జలధిని’ అంటే సరి!

  రిప్లయితొలగించండి
 22. లక్ష్మీదేవి గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  నాగరాజు రవీందర్ గారూ,
  విరుపుతో మంచి పూరణ చెప్పారు. అభినందనలు.
  ‘శ్రీరాముం/ డవలీలగ’ అనండి.
  *
  మిస్సన్న గారూ,
  ‘అబల!’ అని సంబోధిస్తూ చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 23. పూజ్యగురుదేవులు శంకరయ్య గారికి వందనములు

  ఖలుడౌ రావణు వాసము
  నలువైపుల జలధియున్న నగరము కాగా
  ఖలుని వధించంగా నతి
  బల రాముడు లంక జేర వారధి గట్టెన్

  రిప్లయితొలగించండి
 24. కలయా వైష్ణవ మాయా!
  బిలబిల కోతులు నుడతలు బింకము తోడన్
  కిలకిల కిచకిచ మనుచున్ -
  బలరాముఁడు! లంకఁ జేర వారధిఁ గట్టెన్!

  రిప్లయితొలగించండి


 25. పలుమార్లుచదివి నావే
  జిలేబి రామాయణమ్ము !చిలుకప లుకలే
  న? లవట్లాడితివి ? యెచట
  బలరాముఁడు లంకఁ జేర వారధిఁ గట్టెన్?

  జిలేబి

  రిప్లయితొలగించండి
 26. అల రాముని సేతు వచట
  విలపించి సునామియందు వీడగ నుసురున్
  వలవల యేడ్చుచు గబగబ
  బలరాముఁడు లంకఁ జేర వారధిఁ గట్టెన్ 😊

  రిప్లయితొలగించండి