19, మార్చి 2014, బుధవారం

సమస్యాపూరణం - 1356 (రాముఁ డనఁగను సాక్షాత్తు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
రాముఁ డనఁగను సాక్షాత్తు రావణుండె.
ఈ సమస్యను పంపిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదాలు.

21 కామెంట్‌లు:

  1. పంక్తికంఠుండు రాక్షస వంశవిభుడు
    నఖిల లోకవిజేత లంకాధినేత
    శివసమర్చనా నిరతుండు దివిజగణవి
    రాముడనగను సాక్షాత్తురావణుండె

    రిప్లయితొలగించండి
  2. కోరె రావణు మరణమ్ము నరుని వలన
    హరిని శపియించె నరునిగ నార దుండు
    శైవ భక్తుడు రావణు శరణు యనగ
    రాము డనగను సాక్షాత్తు రావ ణుండె

    రిప్లయితొలగించండి

  3. రావణుడు అపహరించిన భీతహరిణేక్షిణి
    సీతాపతి సీతా అని సంశయిస్తే
    గజేంద్ర హస్తాభిహతేవ వల్లరి అయ్యే
    రాముడనగను సాక్షాత్తురావణుండె !!




    జిలేబి

    రిప్లయితొలగించండి
  4. రామఁ బట్టిన పాపము లంటినంత
    రాము శరమునఁ గూలిన రాక్షసుండు
    రామ శౌర్యమెఱుగని సురగణబలవి
    రాముఁ డనఁగను సాక్షాత్తు రావణుండె.

    రిప్లయితొలగించండి
  5. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  6. దశరధేశుని తనయుడు ధర్మ మూర్తి
    రాము డనగను, సాక్షాత్తు రావణుండె
    బిక్షు వేషము ధరియించి భిక్ష గోరి
    సీత నెత్తుకు పోయిన ఘాతకుండు

    రిప్లయితొలగించండి
  7. పెనగుటకు ముహూర్తమ్మును బెట్టుమనుచు
    రాముడనగను, సాక్షాత్తు రావణుండె
    నిర్ణయించెను సమయమున్ నియతి తోడ
    రావణుని మించు పండిత రాజు గలడె

    రిప్లయితొలగించండి
  8. రాక్షసుల నెల్ల దునుమాడె రణములోన
    నజితు డవతార వీరాగ్రు డసుర వైరి
    రాముడనగను, సాక్షాత్తురావణుండె
    పోరి మడసెను శ్రీరాము జేరె తుదకు

    రిప్లయితొలగించండి
  9. అతుల నిష్ఠాగరిష్ఠుడై యవిరళ తప
    మాచరించి కపర్దిని హరుని జూడ
    గోరె దైత్యుడు తదితర కోరికల వి
    రాముఁ డనఁగను సాక్షాత్తు రావణుండె

    రిప్లయితొలగించండి
  10. పోరునకు ముహూర్తముబెట్ట బుధ వరుడని
    రాముడనగను, సాక్షాత్తు రావణుండె
    పొందు పరచె ముహూర్తము బుద్ధి దలచి
    ప్రభువు చేతిలో జిక్కి పరమపదించ

    రిప్లయితొలగించండి
  11. మాయరూపమ్ము ధరియించి మహిసుపుత్రి
    కాపహరణమ్ము గావించి నట్టి దైత్యుఁ
    డతిభయంకరుఁ డతిదుష్టుఁ డాతఁడగ్గి
    రాముఁడనఁగను సాక్షాత్తు రావణుండె.

    అగ్గిరాముడు = చెడ్డ చేయుటలో సమర్ధుఁడు, (వి; నె)

    రిప్లయితొలగించండి
  12. దశరథుని ప్రథమ సుతుడే దాశరథియు
    రాముడనఁగను, సాక్షాత్తు రావణుండె
    లయకరుఁ సతము పూజించు లంక రేడు
    విద్య లన్నియు నేర్చిన విజ్ఞు డతడు

    రిప్లయితొలగించండి
  13. విశ్వరూపము జూపిన విష్ణు వేను
    రాము డనగను సాక్షాత్తు, రావణుండె
    కోటి లింగాల యర్చన కూర్మి తోడ
    చేసి చూపిన భక్తుడు వాసి గాను

    రిప్లయితొలగించండి
  14. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  15. సీతనుంచితి లంక నేభాతినైన
    సమ్మతించును నాపొందు నెమ్మదిననె
    కామమే తప్ప తదితర కాంక్షలకు వి
    రాముఁ డనఁగను సాక్షాత్తు రావణుండె

    రిప్లయితొలగించండి
  16. పూజ్యులు పండిత నేమానివారికి, మిత్రులు కంది శంకరయ్యగారికి, సాహితీ మిత్రులందరికి నమస్కారములతో...

    దానవేంద్రుఁడు కైకసీ సూనుఁడతఁడు
    జానకీహర్త వేదవిజ్ఞానయుతుఁడు
    సోమభక్తుఁడు మండోదరీమనోఽభి
    రాముఁడనఁగను సాక్షాత్తు రావణుండె!

    రిప్లయితొలగించండి
  17. పండిత నేమాని వారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పూరణలో మొదటి, రెండవ పాదాల్లో యతి తప్పింది. సమస్యకూడా సంతృప్తికరంగా పరిష్కరింపబడలేదు.
    *
    లక్ష్మీదేవి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    మీ పూరణ వైవిధ్యంగా ఉంది. అభినందనలు.
    కాకుంటే ఒక అభ్యంతరం... ఆభరణము అనే అర్థంలో ‘నగ’లో అరసున్నా ఉండదు.
    మీ రెండవ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    *
    శైలజ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    *
    గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    భాగవతుల కృష్ణారావు గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    *
    సహదేవుడు గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    *
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ‘లయకరు’ తరువాత అర్ధానుస్వారం అవసరం లేదు.
    *
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    గుండు మధుసూదన్ గారూ,
    చాలాకాలానికి మామీద దయ కలిగింది. సంతోషం!
    చక్కని పూరణతో మీ పునరాగమనం ఆనందాన్ని కలిగించింది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  18. నాగరాజు రవీందర్ గారూ,
    చాలాకాలంగా అరసున్నాల గురించి వ్యాకరణ పాఠం పెట్టాలనే అనుకుంటున్నాను. వీలు చిక్కడం లేదు. సాధ్యమైనంత తొందరలో పోస్ట్ చేస్తాను.

    రిప్లయితొలగించండి
  19. చూడనటన భూకైలాసు చోద్యమంద
    ఎంటియారును వేరుగా నెంచగలమె
    నటనమందున జీవించె నందమూరి
    రాముఁడనఁగను సాక్షాత్తు రావణుండె.

    రిప్లయితొలగించండి
  20. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    రాముడుగాను, రావణుడుగాను నటించి మెప్పించిన రామారావును ప్రస్తావించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి