17, మార్చి 2014, సోమవారం

పద్య రచన – 538

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

17 కామెంట్‌లు:

  1. తల్లులు చదివిన చాలును
    పిల్లల తొలిగురువు గాదె ప్రియముగ తానై
    యెల్లలు లేవట విద్యకు
    కొల్లలుగా నేర్వ వచ్చు కోమలి తలచన్

    రిప్లయితొలగించండి
  2. ప్రేమికు డెంతొ కష్టపడి ప్రీతిగ వ్రాసిన లేఖ చూచుచున్
    భామ పఠించుచుండె పలు ప్రశ్నలు డెందము నందు పుట్టగన్
    కోమల మైన భావనలు కొంచెము కొంచెము వృద్ధి చెందగా
    నా మది దోచినాడ విక నమ్ముమ నంచు లిఖించె లేఖలన్!

    రిప్లయితొలగించండి
  3. పెండ్లి రోజు నాడు పెనిమిటి రాకకై
    యెదురు జూచు చుండె ముదిత యొకతి
    ధవుని యుత్తరమును తనివిగా చదువుచూ
    కలలు గనుచు నుండె కమల నయన

    రిప్లయితొలగించండి
  4. ప్రేమ లేఖను గాబోలు ప్రియము తోడ
    చదువు చుండెను నొకయామె శ్రద్ధ తోడ
    మరులు గొల్పెడు ఛాయలు మదిని నిండ
    నిండు కొనియెను నామెకు నిజము గాను

    రిప్లయితొలగించండి
  5. డెబ్బై యెనభై దశకము
    లిబ్బడి ముబ్బడి నవలల కెన్నగ నిచటన్
    గొబ్బున వానిని చదువగ
    నబ్బో తరుణులకు తగని యాత్రము నాటన్.

    తరుణులు గృహ సతులైనను
    మరి కన్నియ లైన గాని మక్కువ తోడన్
    త్వరపడి చదువుచు నుండిరి
    యరసిన యే నవల నైన నన్ని గృహములన్.

    ఈ చిత్ర మెన్న నాటిది
    యో చిన్నది చదువుచుండ నొక నవలను, తా
    జుచెను తపాల మానిసి
    వైచిన పతి ప్రేమ లేఖ పదపడి చదివెన్.

    పతి లేఖ లోని యూసులు
    సతికి నవల లోని ప్రేమజంట తలపులన్
    మతి దోప జేయ మురిసెడి
    నతి నిశితముగాను కనుడి యాయమ ముఖమున్.

    ఏమనె నమ్మా నీ పతి
    భామ కొరకు పరితపించు భావము లేఖన్
    ప్రేమగ నింపెన యేమీ
    గోముగ నీ మోము జూడ గుట్టు తెలిసెలే.

    రిప్లయితొలగించండి
  6. నవ కవితా విధానముల నైపుణి మీరగ ప్రేమ భావ వై
    భవము సెలంగగా ప్రియుడు వ్రాసిన కమ్మఁ బఠించు వేళఁ గ
    న్గవ వికసించె ; మోము పయినన్ నును సిగ్గులు సేరి నూత్న గౌ
    రవమును గూర్చెఁ గాంతకు శరద్వికచాంబుజ కోరకమ్ములై !

    రిప్లయితొలగించండి
  7. ప్రియకాంత వృత్తము

    "కలికికి నర్థాంగికి ప్రియకాంతామణికిన్ నా
    తలపుల నిచ్చోట దెలుప దారిన్ కనుగొంటిన్"
    లలనకు కాంతుండనిపిన రమ్యంబగు లేఖల్
    పులకలు రేగంగ కనెను- పొంగెన్ మనమందున్.

    న య న య స గ ౧౧ వ అక్షరము యతి.

    రిప్లయితొలగించండి
  8. రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    బొడ్డు శంకరయ్య గారూ,
    మీ ఉత్పలమాలావృత్తం బాగుంది. అభినందనలు.
    ‘నమ్ముమనంచు’ను ‘నమ్ముమటంచు’ అనండి.
    *
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ‘చదువుచూ’ అన్నదాన్ని ‘చదువుచున్’ అనండి.
    *
    సుబ్బారావు గారూ,
    బాగుంది మీ పద్యం. అభినందనలు.
    *
    మిస్సన్న గారూ,
    నవలను ప్రక్కన పెట్టి ప్రేమలేఖను చదువుతున్న చిన్నదాని చిత్రాన్ని ‘సునిశితంగా’ పరిశీలించి వ్రాసిన ఈ అందమైన ఖండిక ఆనందాన్ని కలిగించింది. అభినందనలు.
    *
    డా. విష్ణునందన్ గారూ,
    బహుకాలానికి మామీద దయ కల్గింది. సంతోషం.
    ముగ్ధభావంతో మీ కవిత మనోహరంగా ఉంది. అభినందనలు, ధన్యవాదాలు.
    *
    లక్ష్మీదేవి గారూ,
    ముద్రాలంకారంలో మీరు వ్రాసిన పద్యం అందంగా ఉంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  9. క్షేమమిచ్చట నేను శ్రీమతీ! నీవెట్టు
    ..........లున్నావు? క్షేమమా యువిద నీకు?
    నిన్నె తలచుచునుండి నిరతంబు నేనిందు
    ..........నీరూపు మదిలోన నింపుకొంటి
    నిద్రలో మెలకువ న్నీసుందరాకార
    ..........మగుపించు చున్నదో యతివ నిజము,
    స్వామికార్యంబూని నీమంబుతో నింత
    ..........దూర మేతెంచితి చారుశీల!
    కార్యనిర్వహణాన కాంత! యొక్కింతైన
    ..........ఉత్సాహ మెదలోన నూనదాయె
    నీసాహచర్యంబు, నీచిద్విలాసంబు
    ..........ప్రేమపూర్ణంబైన పిలుపునకును
    దూరమై యున్నట్టి కారణంబున నాకు
    ..........క్షణ మొక్కయుగముగా గడచుచుండె
    కొద్దిరోజులలోనె కోరినట్టుల నేను
    ..........నీచెంత కేతెంతు నిర్మలాంగి!
    సుదతి! నారాక కోసమై చూచుచుండి
    ధైర్యమును వీడవలదంచు తనమగండు
    వ్రాసి పంపిన లేఖ నాపడతి చూచి
    యతుల మైనట్టి సంతస మందె నపుడు.





    రిప్లయితొలగించండి
  10. హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
    సీసమాలికగా పత్నికి పతి వ్రాసిన లేఖ ‘అతులమైనట్టి సంతస’ మందఁజేసింది. మనోజ్ఞమైన ఖండిక. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  11. కొడుకు చదివిన చదువుకు కోరి నట్టి
    కొలువు నందున నుద్యోగ పిలుపు రాగ
    పులకిత మనంబునను చేయి బుగ్గ జేర
    నమిత మైనపుత్రోత్సాహమంది తల్లి
    వివశయై చదివెను పూర్తి వివరములను

    రిప్లయితొలగించండి
  12. సహదేవుడు గారూ,
    పద్యం బాగుంది. అభినందనలు.
    కాని చిత్రంలో ఉన్న స్త్రీకి ఉద్యోగం చేసే కొడుకు ఉండే వయస్సు ఉన్నట్టు తోచదు!
    ‘ఉద్యోగపిలుపు’ దుష్టసమాసం. ‘కొలువునందున జేరగా పిలుపురాగ’ అందామా?

    రిప్లయితొలగించండి
  13. ఉత్తరమ్ము అందె ఊరికి రమ్మని
    భర్త రాక పాయె బదులు జెప్ప
    మగువ కలలుగనెను మనసుకలతజెంద
    బయలుదేరుటేల భర్తతోడ

    రిప్లయితొలగించండి
  14. పద్యకవులను బాగా ప్రోత్సహిస్తున్నారు.ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  15. గురువుగారీకి ధన్యవాదాలు. చిన్న వయసులో పెళ్లైప అమ్మాయికి 40 సం- లోపే ఉద్యోగం చేసే కొడుకులుండటం నేను చూశాను. అందం మీద స్పృహ పెరిగి వెంట్రుకులకు రంగువేయటం, సౌందర్య సాధనాలు విరివిగా దొరికే నేటి కాలంలో వయసును అంచనా వేయటం చాలా కష్టం అనే ఉద్దేశంతో అలా వ్రాశాను. మీ సవరణకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి