29, మార్చి 2014, శనివారం

పద్య రచన – 550

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

17 కామెంట్‌లు:

  1. వార్ధి యొడ్డున తెల్లని వన్నెగలిగి
    తిరుగు నీ జవనాశ్వంపు తీరుఁ జూడఁ
    దెలిసెఁ బో వినతాకద్రువలకు పందె
    మైన యుచ్చైశ్శ్రవంపు వయ్యార మంచు.

    రిప్లయితొలగించండి
  2. క్షీరాంబురాశి ద్రచ్చెడు వేళ ధవళప్ర
    ....భా బాసురమ్ముగా ప్రభవమొంది
    నట్టి యుచ్చైశ్రవం బను దివ్య తురగమ్ము
    ....స్వర్గాధినాథుని వాహనమ్ము
    వినతయు కద్రువయును వార్ధితీరాన
    ....నొకనాడు విహరించు చుండు నపుడు
    కనువిందు వారికి కలిగించు రీతిగా
    ....గనుపట్టి వారికి జనిన యంత
    దాని వైభవ మా సతుల్ తలచు చుండ
    మానసమున కద్రువకంత మత్సరంబు
    కలిగె నయ్యది విపరీత ఫలితములకు
    కారణంబయ్యె నక్కటా భారతమున

    రిప్లయితొలగించండి
  3. శ్రీ శంకరయ్య గారూ! శుభాశీస్సులు.
    మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  4. తెల్లని గుఱ్ఱము జూడుడు
    అల్లన నా వార్ధి దరిని నటునిటు దిరుగన్
    మెల్లగ గోచర మాయెను
    అల్లది దేవేంద్రు నశ్వమని యి పు డరయన్

    రిప్లయితొలగించండి
  5. తెల్లని తురగమునుగనగ
    చల్లగ వారాశిదరిన చక్కగ నుండెన్
    అల్లది కల్కికి జెందిన
    తెల్లని జవనాశ్వ మనుచు తెలిసెన్ యిపుడే!


    రిప్లయితొలగించండి
  6. పండిత నేమాని వారూ,
    ఉచ్చైశ్శ్రవాన్ని గురించి, వినతాకద్రులవ గురించి చక్కని పద్యాన్ని వ్రాశారు. అభినందనలు.
    నా పద్యం నచ్చినందుకు ధన్యవాదాలు.
    *
    సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    రెండు, నాల్గవ పాదాలను అచ్చులతో ప్రారంభించారు. నా సవరణ....
    తెల్లని గుఱ్ఱము జూడుం
    డల్లన నా వార్ధి తటిని నటునిటు దిరుగన్
    మెల్లగ దృగ్గోచర మయె
    నల్లది దేవేంద్రు నశ్వమని యి పు డరయన్.
    *
    శైలజ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ‘తెలిసెన్ + ఇప్పుడే’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘తెలిసె నిపు డహో’ అందాం.

    రిప్లయితొలగించండి
  7. సాగర తీరాన వడిగ
    సాగు తురగమును గనంగ, జలనిధి లోనన్
    రేగెడు తరంగ హోరులె
    మూగును తలలో నొకింత ముచ్చట గొల్పున్!

    రిప్లయితొలగించండి
  8. వినతి కద్రువలిద్దరు వేడ్క తోడ
    పాల సంద్రము దరి కేగి లీల గాను
    పాల నురుగును మించిన వన్నె గల్గు
    అశ్వమొక్కటి గాంచిరి యద్భుతముగ
    తెల్ల గుర్రము వాలము నల్ల నంచు
    చెప్పె కద్రువ సవతికి స్థిరముగా
    అశ్వవర్ణమంతయు తెల్లననియె వినతి
    కాదు నలుపని ధ్రుడముగా కద్రువనియె
    చరిచె పందెము కద్రువ సవతి తోడ
    అశ్వవర్ణము నలుపున్న నగుము నాకు
    దాసి, లేకున్న నేను నీ దాసి నగుదు
    పోయి చూతము రమ్మన్న, ప్రొద్దుపొయె
    నంచు పతిసేవకు సమయమంచు పల్కి
    రేపుచూతమని తెలిపి యాపె నపుడు
    కద్రు వప్పుడు పుత్రుల కడకు నేగి
    వినతి తోడను పందెమున్ విశదపరచి
    తెల్లనశ్వము తోకను నల్ల జేయ
    వేడు కొనియెను వారిని ప్రేమతోడ
    కూడదన్న సుతులపైన కోపమడర
    శాపమిచ్చెను వారల చావు గోరి
    అప్డు కర్కోటకుండు తా నమ్మ కొర్కె
    నల్ల జేసెను తురగపు తెల్ల తోక
    కాంచి దానిని వినతి తా, కద్రువకును
    దాసియై కాలమహిమన చేసె సేవ

    రిప్లయితొలగించండి
  9. చెప్పె కద్రువ సవతికి స్థిరముగాను

    రిప్లయితొలగించండి
  10. శ్రీ సహదేవుడు గారు: శుభాశీస్సులు.
    మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు.
    తరంగ హోరులె అని సమాసము చేయ రాదు. తరగల హోరులె అందాము.

    శ్రీ అన్నపురెడ్డి సత్యనారయణ రెడ్డి గారు: శుభాశీస్సులు.
    మీ గీత మాలిక బాగుగ నున్నది. కొన్ని టైపు పొరపాట్లు కలవు.
    వినత అనుటకు వినతి అన్నారు.
    దృఢముగా అనుటకు బదులుగా ద్రుడముగా అన్నారు.
    సవరించండి.

    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  11. సహదేవుడు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    నేమాని గురువుల సవరణను గమనించారు కదా!
    *
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ తేటగీతిక ఆనందాన్ని, తృప్తినీ కలిగించింది. చాలా బాగుంది. అభినందనలు.
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    బాగుంది మీ పద్యం. అభినందనలు.
    ‘ఉల్లము + ఉప్పొంగు’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘ఉల్లమ్ముప్పొంగు.." అంటే సరి!

    రిప్లయితొలగించండి
  12. గురువుగారల సవరణకు ధన్యవాదములు. సవరణతో పద్యం :
    సాగర తీరాన వడిగ
    సాగు తురగమును గనంగ, జలనిధి లోనన్
    రేగెడు తరగల హోరులె
    మూగును తలలో నొకింత ముచ్చట గొల్పున్!

    రిప్లయితొలగించండి
  13. తురగము తెల్లగ నున్నది
    చురుకుగనే పరుగులిడును చూడగ కడలిన్
    నురగయు తెల్లగ నున్నది
    తురగముతో పోటిబడగ త్రోసుకు వచ్చెన్.

    రిప్లయితొలగించండి
  14. పూజ్యగురుదేవులు పండిత నేమాని గారికి, కంది శంకరయ్య గారికి నమస్సులు. తమరిచ్చే సలహాలు, సవరణలు మాకెంతో ఉపయోగ పడుతున్నాయి. నేను ఉద్యోగము లో జేరిన క్రొత్తరొజులు గుర్తు కొస్తున్నాయి. ఆరోజుల్లో పనినేర్చు కోవటానికి ఎంతో కృషి చేశాము. ఇప్పుడు తెలుగు భాష నేర్చు కోవటానికి ప్రయత్నిస్తున్నాము. ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  15. వారధంచు తెల్లనశ్వమొకటినిల్చె
    పవన వేగిరమున పరుగుతీయ
    నలలతీరమందునరుదైన కనువిందు
    చూడముచ్చటగును చూపరులకు

    రిప్లయితొలగించండి


  16. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ ప్రయత్నం సాఫల్యం చెందును గాక! స్వస్తి!
    *
    పానుగంటి వారూ,
    బాగుంది మీ పద్యం. అభినందనలు.
    ‘వారధి + అంచు’ ఇక్కడ సంధి లేదు. ‘పవనవేగిర’మని సమాసం చేయరాదు. ఆ రెండు పాదాలకు నా సవరణ...
    ‘అబ్ధి యొడ్డున ధవళాశ్వ మొకటి నిల్చె
    పవనవేగమునను పరుగుతీయ..."

    రిప్లయితొలగించండి
  17. నల్లని కొండల పాఱెడు
    చల్లని నీటి కెరటముల సాగినదదిగో
    తెల్లని గుఱ్ఱము సౌరుల
    వెల్లడి చేయగ పదములు విరళంబయ్యెన్.

    రిప్లయితొలగించండి