14, మార్చి 2014, శుక్రవారం

దశావతార స్తుతి

దశావతార స్తుతి
రచన
నేమాని రామజోగి సన్యాసి రావు 


దనుజుండొక్కడు సోమకాఖ్యుడు బలాత్కారమ్ముగా వేదరా
శిని గొంపోవుచు నున్న వేళ గని యక్షీణప్రతాపంబుతో
చని మత్స్యాకృతి దాల్చి గూల్చి యసురున్ సర్వేశ! వేదాల చ
య్యన వాణీశున కిచ్చినట్టి ఝషరూపా! దేవదేవా నతుల్. 

కలశాంభోధిని ద్రచ్చువేళ గిరి మున్గన్ సాగరంబందు నా
జలధిన్ జేరితి కూర్మమూర్తి వగుచున్ శైలంబునున్ వీపుపై
నలరం జేయుచు సాయమిచ్చితివి దేవా! దీనరక్షాపరా!
బలదైత్యఘ్న ముఖార్చితా! కమఠరూపా! దేవదేవా నతుల్. 

ధరణిన్ జాపగ జుట్టి సాగరము మధ్యన్ ద్రోయగొంపోవు నా
సురవిద్వేషి హిరణ్యనేత్రు గని యస్తోక ప్రభాశాలివై
యురు దంష్ట్రాహతి వాని గూల్చి బళిరా! యుర్విన్ వెసన్ గాచితో
యరవిందేక్షణ! దివ్యగాత్ర! కిటిరూపా! దేవదేవా నతుల్.

హరిభక్తిన్ వెలుగొందు నందనుని ప్రహ్లాదున్ వధింపంగ నే
వెరవుంబారక నల్గు దానవు దురావేశంబునున్ ద్రోయుచున్
నరసింహాకృతి దాల్చి జీల్చితి రిపున్ భక్తావనా! మాధవా!
అరవిందాసన వందితా! నృహరిరూపా! దేవదేవా నతుల్

బలి దైత్యేంద్రుని జేరి వామనుడవై వాక్చాతురిన్ జూపి నీ
వల పాదత్రయ భూమినే యడిగి బ్రహ్మాండాంత సంవర్ధివై  
తొలగం జేయుచు దైత్యు భాగ్యమును సంతోషమ్మునున్ గూర్చితా
బలదైత్యారికి వేదవేద్య! వటురూపా! దేవదేవా నతుల్

ధరణిన్ క్షత్రియ పాలకుల్ చెలగగా దర్పంబుతో ధూర్తులై
పరశున్ బూనుచు నీవు భార్గవుడవై భాసిల్లు తేజంబుతో
ధరణీనాథుల గూల్చినాడవు కదా! ధాత్రీసురోత్తంసమా! 
హరసంస్తుత్య గుణాకరా! పరశురామా! దేవదేవా నతుల్.

అమరారాతి దశాననుండు బలదర్పాధిక్యుడై కామియై
రమణిన్ సీతను దొంగిలించి చన ధర్మత్రాణ దీక్షామతిన్
సమరక్షోణిని సంహరించితి రిపున్ క్షత్రేశ! కాకుత్స్థ! ధ   
ర్మమయాత్మా భువనాధినాథ! రఘురామా! దేవదేవా నతుల్.

తనరన్ జేసితి గోపవంశమును సద్భావంబుతో పాండునం
దనులన్ బ్రోచితి, బోధసేసితివి గీతాజ్ఞానమున్ ధాత్రి దు
ర్జనులన్ గూల్చితి ధర్మరక్షణపరా! సర్వేశ్వరా! భక్త చం
దన! కారుణ్యనిధాన! వృష్ణివర! కృష్ణా! దేవదేవా నతుల్

పురదైత్యత్రయమున్ వధింపగ ధరన్ బుద్ధావతారంబునన్
గురురూపంబున దానవాంగనలకున్ మోసంబునున్ జేసి చె
చ్చెర మానంబును దోచినాడవు హరీ! క్షీరాబ్ధికన్యాపతీ!
తరుణాదిత్య సమ ప్రభావిభవ! బుద్ధా! దేవదేవా నతుల్

కలికాలంబిది హెచ్చె నెల్లెడ ధనాకాంక్షల్ మదోన్మత్తులై
పలు మోసంబులు చేసి దుర్జనతతుల్ భాసిల్లగా దీనయై
నిలువంజాలదు ధర్మదేవత ధరన్ దీనవనా! ప్రోవుమా
బలతేజోనిధి ధర్మమున్ కలికిరూపా! దేవదేవా నతుల్.

12 కామెంట్‌లు:

  1. పూజ్య గురువులకు ప్రణామములు
    అవతార ప్రత్యేకతను వివరిస్తూ దశావతార స్తుతిని కన్నులకు గట్టి నటుల వివరించి నందులకు ధన్య వాదములు

    రిప్లయితొలగించండి
  2. అవతారము లెత్తును హరి
    యవనింగల యట్టి జనుల యాపద దీ ర్చ
    న్నవిరళ ముగ పదిగాగల
    యవతారము లెత్తుభువిని నార్యా ! వినుమా .

    రిప్లయితొలగించండి
  3. వందనములు గురు దేవుల
    సుందర మత్తేభ వృత్త సోయగములకున్!
    వందనము మధుర కవి యర
    విందములకు బలుకుచుంటి వినయమ్ముననన్!

    రిప్లయితొలగించండి
  4. గురువు గారు,
    మొన్నటి దశావతారపు పద్యములు వ్రాయునపుడు సంతృప్తి కలుగక మరలా ఈ రోజు వ్రాద్దామనుకొని రాగా ఈరోజు మరలా ఇచ్చియున్నారు. ఎంతో సంతోషము.

    మత్తేభముల పూజ బహుచక్కగా నున్నది.
    వేదములల్ల సోమకుడు వేగము గా గొని పోవుచుండ నీ
    వో, దయ ధర్మముల్ తెలిసి యొద్దిక పాలనఁ జేయువాడివై
    నీ దరిఁ జేరి రక్షణముఁ నీయగ వేడెడు వారి దిక్కువై
    ఖేదముఁ దీర్ప రక్కసుని గెల్చితి మత్స్యమవై రమాపతీ!

    సాగరమున్ మధించు తరి జారక యుండగ మంథరా గిరిన్
    దాగితి దానడుంగున సదా నినుఁ వేడిన వేడకున్న నే
    యోగముఁ జేతనో జనుల యోగము క్షేమము చూచువాడవై
    రాగల భక్తపోష! యటులయ్యితి కూర్మముగా రమాపతీ!

    భూమినిఁ జుట్టి చేతనిడి పోయిన నాడు హిరణ్య నేత్రునిన్
    కోమలమైన రూపు విడి క్రోధముతోడ వరాహరూపునన్
    భీమపు యుద్ధమందు నటు పృథ్విని గాచితి వానిఁ గూల్చుచున్
    ప్రేమను ధర్మకర్తవయి వేయితెఱంగుల నో రమాపతీ!

    యే పనిఁ జేయుచున్న నిను నేమఱకుండ జపించు బాలుపై
    కోపముఁ జూపు తండ్రినదె గోళ్ళనుఁ జీల్చగ నారసింహమౌ
    రూపము దాల్చి యప్పుడటు రోషముఁ జూపితి విర్రవీగు నా
    పాపినిఁ జంపి యా బుడుతఁ బాలనఁ జేసితివా రమాపతీ!

    సంపద లిచ్చు లక్ష్మి నిను శాశ్వత రీతులఁ గొల్చుచుండగా
    చంపక ద్రొక్కి యంప బలి సౌరుగా దానము నిచ్చువేళనే
    యింపుగ కొంతనేలనుచు హెచ్చు ప్రతాపముఁ జూపు దేవరా!
    సొంపుగ నింత యంత యయి సూర్యుని దాటితివో రమాపతీ!

    రాజుల దర్పమున్నడచ రాగల శౌర్యము, యుద్ధవిద్యలున్
    మోజుగ నేర్చి యా పరశు మోపునఁ దాల్చి వసుంధరా పతుల్
    తేజము వీడి వాడి పలు దిక్కుల దాగ పరాక్రమమ్ముతో
    రాజిలు యోధువై పరశు రామునివై యిలనో రమాపతీ!

    లేమనుఁ బట్టనెంచి యవలీల ధనుస్సునుఁ ద్రుంచి భాగ్యముల్
    భామకుఁ బంచి యిచ్చి కడు పాటులఁ గానలఁ గాంచి రావణున్
    కామముఁ ద్రుంచ సేతువును కట్టిన మా రఘురామచంద్రుడై
    భూమిది పుణ్యమా యనగ పొందికగా నడయాడు శ్రీపతీ!

    లేఁగటి యావులన్ పగలు రేలనుఁ ప్రేమగ సాకు పల్లెలో
    నాగలిఁ జేతఁబట్టి యల నందుని యింటను వెన్నముద్దలన్
    భాగముఁ బంచి యిచ్చి వసి వాడక తమ్మునిఁ గాచి తోడువై
    రాగల యన్నవైన బల రాముని రూపమువో రమాపతీ!

    రాతను మార్చి కుబ్జ మణి రమ్యతఁ బెంచిన ప్రేమరూపమై
    యాతన వెట్టు కంసుఁ బరిమార్చు యనుంగు సుతుండవీవుగా
    చేతుల నెత్తి మ్రొక్కు నెడ చీరల నిచ్చిన రక్షవైతి; శ్రీ
    గీతను బోధఁ జేసితిల కృష్ణుని రూపమునో రమాపతీ!

    ధర్మముఁ దప్పియిట్లు పలు దావుల నెల్లరు ఖేదమందుచున్
    కర్మముఁ దప్పదంచు కడు కష్టములన్ పడు నేటి రోజులన్
    మర్మమదేటికో? కినుక మానుము కల్కిగ రూపుదాల్చుమా!
    నిర్మలమానసమ్ముఁగల నీరజ నేత్ర! నమో రమాపతీ!


    రిప్లయితొలగించండి
  5. ఈనాటి దశావతారస్తుతులు బహుచక్కగా నున్నవి. శ్రీయుతులు పండిత నేమానివారికి, శ్రీమతి లక్ష్మీదేవిగారికి ప్రతేకాభివాదములు, అభినందనలు.

    రిప్లయితొలగించండి
  6. పండిత నేమాని వారూ,
    మీ దశావతారస్తుతి మనోహరంగా ఉంది. ధన్యవాదాలు.
    పరశురామావతార పద్యంలో ‘చెలగగా’ అన్నది టైపాటు వల్ల ‘చలగగా’ అయినట్టుంది.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    కందుల వరప్రసాద్ గారూ,
    హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
    ధన్యవాదాలు.
    *
    లక్ష్మీదేవి గారూ,
    మొన్న తిరుపతి ప్రయాణంలో ఉండి మీ పద్యాలను చదివి వ్యాఖ్యానించలేకపోయాను. ఆ అవకాశాన్ని ఈరోజు కలిగించారు. సంతోషం!
    మీ పద్యాలు చాలా బాగున్నవి. అభినందనలు.
    మొదటి పద్యంలో ‘వాడివై’ అన్నదాన్ని ‘వాడవై’ అనండి.
    రెండవ పద్యంలో అది ‘మందర’ పర్వతము. మందరము అకారాంత పుంలింగ శబ్దం. కనుక ‘మందరగిరి’ అని ఉండాలి. అక్కడ ‘మందరావినిన్’ అనండి. ‘అవి’ శబ్దానికి కొండ అనే పర్యాయపదం ఉంది.
    నాల్గవ పద్యం ప్రారంభంలో ‘యే’ అన్నారు. ‘ఏ’ అనండి.
    ఐదవ పద్యంలో ‘సౌరుగా’ అని టైపాటు. ‘సౌరుగ’ అనికదా ఉండవలసింది.
    ఆరవ పద్యంలో ‘యోధువై’ అన్నదాన్ని ‘యోధవై/ యోద్ధవై’ అనండి.

    రిప్లయితొలగించండి
  7. స్పందించిన మిత్రులందరకు శుభాశీస్సులు.
    శ్రీ కంది శంకరయ్య గారు: మీరు చెప్పినట్లు "చెలగగా" అనుటయే సాధువు. చలగగా అనుట టైపు పొరపాటు వలన జరిగినది.

    రిప్లయితొలగించండి
  8. గురువుగారు,
    అమూల్యమైన మీ సలహాలకు కృతజ్ఞురాలను. భాషా పరిజ్ఞానం పెంచుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.
    ప్రయత్నిస్తాను.
    ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  9. Most Respected Sir,May I know your mobile or Phone number,pls sir,my mail .Id gattupallimanisarma@gmail.com

    రిప్లయితొలగించండి
  10. మణిశర్మ గారూ,
    మీరు అడిగింది దశావతారస్తుతి కృతికర్తలు పండిత నేమాని వారి ఫోన్ నెంబరా? బ్లాగు నిర్వాహకుడనైన నా నెంబరా?

    రిప్లయితొలగించండి