20, నవంబర్ 2014, గురువారం

సమస్యా పూరణం - 1551 (పాదమ్ములు లేని తరులు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
పాదమ్ములు లేని తరులు పరుగిడఁ జొచ్చెన్.
(1901 లో విశాఖపట్టణంలో జరిగిన తిరుపతివేంకటకవుల అష్టావధానములోని సమస్య)

59 కామెంట్‌లు:

 1. ఏదరి జూచిన నుండవు
  పా దమ్ములు లేని తరులు ,పరుగిడ జొచ్చె
  న్నాదర బాదర నొకపులి
  తా దాపున వేటగాడు తరుముచు రాగన్

  రిప్లయితొలగించండి
 2. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరింప నున్నవి !

  సాగుతున్న రైలులోనుండి బయటకు చూస్తే - పరుగెత్తేవి పాదపమ్ములే గదా :

  01)
  ____________________________

  పోదామని తిరుపతికే
  సాధారణ బోగి యందు ♦ సాగుచు నుండ
  న్నాదూరమ్మున గనపడు
  పాదమ్ములు లేని తరులు ♦ పరుగిడఁ జొచ్చెన్ !
  ____________________________

  రిప్లయితొలగించండి
 3. సైనికులు, పోలీసులు ఏదైనా భవనమును చుట్టుముట్ట దలచినపుడు
  పొదల నడ్డం పెట్టుకొని ముందుకు సాగునపుడు కనుపించేదదే మరి :

  02)
  _____________________________

  సోదా చేయగ భటులే
  గోదా లోనికి దిగుటకు ♦ గుట్టుగ పొదలన్
  బోదురు గద దానిని గన
  పాదమ్ములు లేని తరులు ♦ పరుగిడఁ జొచ్చెన్ !
  _____________________________

  రిప్లయితొలగించండి
 4. "లార్డ్ ఆఫ్ ద రింగ్స్" సినిమాలో నే జూసిన వింత - చెట్లు పరుగెడు తుంటాయి :

  03)
  _____________________________

  ఏదో యొక సినిమాలే
  చూదామని వెళ్ళి నేను ♦ చూసిన వింతే
  పోదూ యందురు చెప్పిన
  "పాదమ్ములు లేని తరులు ♦ పరుగిడఁ జొచ్చెన్ "!
  _____________________________

  రిప్లయితొలగించండి
 5. నాలుగైదు అడుగుల ఎత్తున్న కొబ్బరి మొక్కలను నర్సరీ
  నుండి తోటలో పాతుటకు ట్రాక్టరులో తీసుకెళ్తున్నప్పుడు :

  04)
  _____________________________

  గోదావరి తీరములో
  పాదపములను తరలించు - పాటున్ జూడన్
  సాధారణ శకటములో
  పాదమ్ములు లేని తరులు ♦ పరుగిడఁ జొచ్చెన్ !
  _____________________________

  రిప్లయితొలగించండి
 6. వరి చేను నాటే వాళ్ళు వరి మొక్కల కట్టలను తలపై పెట్టుకొని
  ఒక మడిలో నుండి మరొక మడి లోనికి వెళ్ళడాన్ని గమనిస్తే :

  05)
  _____________________________

  మోదలుగా వరి మొక్కల
  నౌదల దాల్చిన యువతులు ♦ నయముగ పాఱన్
  కాదా మరి వింతయె గన
  పాదమ్ములు లేని తరులు ♦ పరుగిడఁ జొచ్చెన్ !
  _____________________________
  మోద = కట్ట
  ఔదల = తల
  పాఱు = పరుగెత్తు

  రిప్లయితొలగించండి
 7. హుద్‌హుద్ తుఫాను లో గాలి వేగం 209 కిలోమీటర్లు గంటకు
  ఆ వేగానికి పీకబడిన చెట్లూ, విరిగిన కొమ్మలూ చేసిన దదే గదా:

  06)
  _____________________________

  బాధా మయమౌ గాలే
  బోదెల, గొమ్మలను వేగ ♦ మోసుకు పోవ
  న్నదియును విధికృత చిత్రమె
  పాదమ్ములు లేని తరులు ♦ పరుగిడఁ జొచ్చెన్ !
  _____________________________

  రిప్లయితొలగించండి
 8. హనుమంతుడు లంకకు పోవటానికి ఎగిరినప్పుడు, గిరి కదలి, చెట్లపై నుండి మెరిసే సుగంధ పుష్పములన్ని రాలగ, బలమైన గాలికి, అతని వెనుకనే, చెట్లు కూడ ఎగిరి కొంత దూరము ప్రయాణించాయని, వాల్మీకి సుందరాకాండలో చదివినట్టు గుర్తు.

  పాదము దన్ని నెగురగ ధ
  రాధరము కదలి సుగంధ లసిత కుసుమముల్
  పాదపములవీడ పిదప
  పాదమ్ములు లేని తరులు పరుగిడఁ జొచ్చెన్ !

  రిప్లయితొలగించండి
 9. శ్రీకృష్ణ పాండవీయము చిత్రములో
  ఛాంగురే బంగారు రాజా పాట తరువాత
  భీముడూ హిడింబాసురుడూ చెట్లు పీకి విసురుకున్నప్పుడు :

  07)
  _____________________________

  క్రోధోద్ధురుడై భీముడు
  నా దారుణ రూపి యైన - నర భక్షకుడే
  పాదపములతో బోరిన
  పాదమ్ములు లేని తరులు ♦ పరుగిడఁ జొచ్చెన్ !
  _____________________________

  శంకరార్యా !

  "పాండవీయము " నకు

  సంధికార్యము మరియు అర్థము చెప్పండి

  రిప్లయితొలగించండి
 10. లంకలో రాక్షసులతో పోరిన హనుమకు - పాదపములే గద - ఆయుధములు :

  08)
  _____________________________

  శోధింపగ సీతమ్మను
  కైదువు గద పాదపమ్మె ♦ కలహించుటకై
  యోధులతో హనుమంతుడు
  పాదమ్ములు లేని తరులు ♦ పరుగిడఁ జొచ్చెన్ !
  _____________________________
  కైదువు = ఆయుధము

  రిప్లయితొలగించండి
 11. కఠినమైన సమస్య విన్న వెంటనే యొక యవధాని స్వగతం
  పాదపములు పరువెత్తడ మేమిట్రా - భగవంతుడా - కరుణించు :

  09)
  _____________________________

  బాధా మయమీ పూరణ
  "పాదమ్ములు లేని తరులు ♦ పరుగిడఁ జొచ్చె "
  న్నో దేవా కరుణింపుము
  సాధింపగ నీ సమస్య ♦ సరిపడు రీతిన్ !
  _____________________________

  రిప్లయితొలగించండి
 12. చివరకు - భగవంతుని కరుణ - అవధానికి స్ఫురణ :

  10)
  _____________________________

  పాదమ్ములు పరువెత్తగ
  నేదైనను జీవ జాతి ♦ కిమ్మహి వలయు
  న్నేదీ చూపు మదెచ్చట
  పాదమ్ములు లేని తరులు ♦ పరుగిడఁ జొచ్చెన్ !
  _____________________________

  రిప్లయితొలగించండి
 13. అదేదో సినిమాలో రాక్షసుడో యక్షుడో ఆవహించిన చెట్టు ఎగురుతుంటుంది
  కొంతమందికి ఉపకారం చేస్తేనే శాప విమోచనం !
  కాంతారావు ఆ చెట్టు సాయంతో ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్తుంటాడు :

  11)
  _____________________________

  పాదపమున నో యక్షుడు
  పాదుకొనెను శాప వశము ! - పాపము దీరన్
  వేదన దీర్చగ జనులకు
  పాదమ్ములు లేని తరులు ♦ పరుగిడఁ జొచ్చెన్ !
  _____________________________

  రిప్లయితొలగించండి
 14. కాదారి వేళ తరులవి
  రాదారిన సాగుచుండె రాక్ష స లీలన్ ,
  శ్రీ దర్శన చందనముల
  పాదమ్ము లు లేని తరులు పరిగిడ జొచ్చెన్
  కొరుప్రోలురాధా కృష్ణ రావు

  రిప్లయితొలగించండి
 15. కిశొర్జీ ! ఈ రోజు పరుగెత్తే పాదపములన్నింటినీ మీరే పట్టుకున్నారు..అభినందనలు..
  మాకు మాకొకటైనా దొరుకుతుందా...చూస్తా...

  రిప్లయితొలగించండి
 16. దుబాయి లో పాత పెట్టుటకు ఈత చెట్లును హెలికాప్టరు సాయంతో తీసికెళ్ళారు ఆ చిత్రాన్ని ఇక్కడ చూడ వచ్చు

  http://www.khaleejtimes.com/images/fly1711.jpg

  ఏ దారీ లేనప్పుడు
  పైదారే గతి ఎడారి ప్రాంతము నందున్
  కాదా చిత్రము చిత్రము
  పాదమ్ములు లేని తరులు పరుగిడఁ జొచ్చెన్

  రిప్లయితొలగించండి
 17. రాదారి మీద జోరుగ
  మోదమ్మున సాగుచున్న మోటరు కారున్
  లోదరి బుడుగిట్లనియెను
  పాదమ్ములు లేని తరులు పరుగిడఁ జొచ్చెన్.

  రిప్లయితొలగించండి
 18. ఈదురు గాలులు ధాటికి
  పాదమ్ములు లేని తరులు పరుగిడ జొచ్చెన్
  భూదేవియె శోకించెను
  రాదారుల పాదపములు రాలుటగనుచున్

  రిప్లయితొలగించండి
 19. ఓ దేవా! కరుణించుము
  సాధించగ నీ సమస్య సద్భావముతో
  నీదయయున్నను ధరలో
  పాదమ్ములు లేని తరులు పరుగిడజొచ్చెన్!!!

  రిప్లయితొలగించండి
 20. తిరుపతి వేంకట కవుల పూరణ....
  ఏదెస వానలు గురియన్,
  గోదావరి పొంగివచ్చె గుములుగ నందున్,
  వేదొరలి నీట దృఢతర
  పాదమ్ములు లేని తరులు పరుగిడఁ జొచ్చెన్.

  రిప్లయితొలగించండి
 21. ఖేదంబుల నెలవై ని
  ర్వేదంబుల సాక్షియై భవిత శూన్యంబై
  రాదే హుధుద్ వరదన్
  పాదపములు లేనిచెట్లు పరుగిడజొచ్చెన్

  రిప్లయితొలగించండి
 22. పోచిరాజు సుబ్బారావు గారూ,
  విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ****
  వసంత కిశోర్ గారూ,
  ఈరోజు మీరు విజృంభించి పూరణలు చే(స్తున్నా)శారు. మీ పదకొండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
  ఆరవపూరణలో ‘గాలే’ అన్నారు. గాలియె అనండి.
  ‘అనియర్’ ప్రత్యయం (సంబంధించినది అనే అర్థంలో) చేర్చినప్పుడు పాండవ, రాఘవ, బిల్హణ శబ్దాలు పాండవీయము, రాఘవీయము, బిల్హణీయము అవుతాయి.. పాండవీయము = పాండవులకు సంబంధించినది అని అర్థం.
  ****
  మాజేటి సుమలత గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ****
  బి.యస్.యస్. ప్రసాద్ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ****
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ****
  శైలజ గారూ,
  మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 23. సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 24. ఖేదములఁ బాప తరులకు
  న్నాదైవమ్మిడ కదలిక లానందముగన్
  భూదానవులకు చిక్కక
  పాదమ్ములు లేని తరులు పరుగిడఁ జొచ్చెన్

  రిప్లయితొలగించండి
 25. ఖేదములఁ బాప తరులకు
  న్నాదైవమ్మిడ కదలిక లానందముగన్
  భూదానవులకు చిక్కక
  పాదమ్ములు లేని తరులు పరుగిడఁ జొచ్చెన్

  రిప్లయితొలగించండి
 26. ఖేదములఁ బాప తరులకు
  న్నాదైవమ్మిడ కదలిక లానందముగన్
  భూదానవులకు చిక్కక
  పాదమ్ములు లేని తరులు పరుగిడఁ జొచ్చెన్

  రిప్లయితొలగించండి
 27. అన్నపరెడ్డి సత్యనారాయణ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  రెండవ పాదం ప్రారంభంలో ద్విత్వం (న్నా) అవసరం లేదు. దానివల్ల గణదోషం. టైపాటు కావచ్చు.

  రిప్లయితొలగించండి
 28. పూజ్యగురుదేవులు కంది శంకరయ్య గారికి నమస్సులు. మన్నించండి. పొరపాటున మా అబ్బాయి మైయిలు ద్వారా రెండు సార్లు పోష్టు అయ్యింది. తమరి సవరణకు ధన్యవాదములు.

  రిప్లయితొలగించండి
 29. వసంత కిషోరు గారు ఈరోజు విశ్వ రూపం ప్రదర్శించారు. "ధ" కు "ద" కు ప్రాస చెల్లుతుందా? దయ చేసి తెలియ జేయండి.చిన్న చిన్న అనులమానా లొస్తున్నాయి.

  రిప్లయితొలగించండి
 30. పూజ్యగురుదేవులు కంది శంకరయ్య గారికి వందనములు

  ఆదుష్ట తుఫానుకు బలి
  పాదమ్ములు లేని తరులు.పరుగిడ జొచ్చె
  న్నాదరి గుహలన్ దాగగ
  భేదమ్ములు మఱచి ప్రాణభీతిని మృగముల్

  రిప్లయితొలగించండి
 31. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  ‘స్వవర్గజప్రాస’ పేరుతో థ,ధలకు, ద,ధలకు ప్రాస వేయడం ఉంది. కాని సాధ్యమైనంతవరకు దానిని పాటించవద్దని నా సలహా.
  ****
  కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి

 32. కె ఈశ్వరప్పగారి పూరణ

  ఆదరణకు నోచని పా
  పా!దమ్ములు లే నితరులు పరుగిడ?జొచ్చెన్
  మోదమ్మొసగెడి బుద్ధి వి
  వాదము లేనట్టి చదువు వంతుగ నీలో

  రిప్లయితొలగించండి

 33. కె యెస్ గురుమూర్తి ఆచారి గారి పూరణ

  ఆధూమశకట మేగన్
  పాదమ్ములు లేని తరులు పరుగిడ జొచ్చెన్
  భూధరములు తిరుగాడెన్
  బోధపరచునీవిషయము భూభ్రమణ౦బున్

  రిప్లయితొలగించండి
 34. కె. ఈశ్వరప్ప గారూ,
  మీ పూరణ వైవిధ్యంగా ఉండి అలరించింది. అభినందనలు.
  ****
  కె.యస్. గురుమూర్తి ఆచారి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 35. గురువు గారికి వందనములు,తప్పులను సవరించ మనవి.
  గోదావరి ఉప్పొంగగ
  రాదారిన నీరు జొచ్చి రయమున బారన్
  ఆ దుడుకు నీటి ధాటికి
  పాదమ్ములు లేని తరులు పరుగిడ జొచ్చెన్.

  రిప్లయితొలగించండి
 36. కుసుమ సుదర్శన్ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 37. కేదారుని క్షేత్రమున ప
  యోదము లెల్ల గురిసి వరద లురకలు బెట్టన్
  ఆ దరిదాపున యుండెడి (కేదారునితో బాటుగ)
  పాదమ్ములు లేని తరులు పరుగిడ జొచ్చెన్!

  రిప్లయితొలగించండి
 38. బొడ్డు శంకరయ్య గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  రెండవపాదంలో గణదోషం. ‘ప|యోదములే గురిసి...’ అనండి. ‘దాపున నుండెడు’ అని ఉండాలి.

  రిప్లయితొలగించండి
 39. ధన్య వాదములు గురువు గారు, సవరణతో

  కేదారుని క్షేత్రమున ప
  యోదములే గురిసి వరద లురకలు బెట్టన్
  ఆ దరిదాపున యుండెడు
  పాదమ్ములు లేని తరులు పరుగిడ జొచ్చెన్

  రిప్లయితొలగించండి
 40. కవిమిత్రులకు నమస్కారములు!

  మోదముతోడుత నరులటఁ
  బాదపముల మొదలు నఱకి వాహనమం దా
  ఛేదిత తరులనిడి నడుపఁ
  బాదమ్ములు లేని తరులు పరుగిడఁ జొచ్చెన్!

  (పాదములు=వ్రేళ్ళు)

  రిప్లయితొలగించండి
 41. గుండు మధుసూదన్ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 42. నా రెండవ పూరణము:

  మోదిత మతులై నఱకిన
  పాదపములఁ బల్లమునకుఁ ♦ బడఁద్రోయంగన్
  రోదించుచు దొరలుచు నా
  పాదమ్ములు లేని తరులు ♦ పరుగిడఁ జొచ్చెన్!

  రిప్లయితొలగించండి
 43. కాదారి వేళ తరులవి
  రాదారిన సాగుచుండె రాక్ష స లీలన్ ,
  శ్రీ దర్శన చందనముల
  పాదమ్ము లు లేని తరులు పరిగిడ జొచ్చెన్
  కొరుప్రోలురాధా కృష్ణ రావు

  రిప్లయితొలగించండి
 44. గుండు మధుసూదన్ గారూ,
  మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
  ****
  కొరుప్రోలు రాధాకృష్ణ రావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 45. వాదమ్మున నిలువకున్న
  మోదమ్మది కాదువిద్య-మూలము నీటన్
  వే దేలియాడు చుండెడి
  పాదమ్ములు లేనితరులు పరుగిడ జొచ్చెన్

  పాదులు పూవులు చెట్లున్,
  తాదమ్మున నిలచు,పెద్దతరువులె కూలున్
  వే దూకెడి వాగులచే
  పాదమ్ములు లేని తరులు పరుగిడజొచ్చెన్

  వే దలలూచుచు గాలికి
  నాదమ్ముల నిడెడి చెట్లు నాశనమయ్యెన్
  హుదూద్ తుఫాను దెబ్బకు
  పాదమ్ములు లేని తరులు పరుగిడ జొచ్చెన్

  పాదాలను చేర,బదరి
  నా దారుణ యాత్రలోన నదులే పొంగన్
  కేదార తీరమందున
  పాదమ్ములు లేని తరులు పరుగిడ జొచ్చెన్

  వే దేలియాడు తూడది
  మీదను తేలుచు పరుగిడు మెల్లగ,వరదన్
  చీదర చేయుచు నీటిని
  పాదమ్ములు లేని తరులు పరుగిడ జొచ్చెన్

  రిప్లయితొలగించండి
 46. మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
  మీ పూరణలు బాగున్నవి. అభినందనలు.
  మూడవ పూరణలో ‘హుదూద్’ అన్నచోట గణదోషం. ‘హూదుద్’ అనండి.

  రిప్లయితొలగించండి
 47. యతి చలవన ప్రవరుం డ
  ప్రతి హతముగ చనుచునుండ పాదమ్ములు లే
  ని తరులు పరుగిడఁ జొచ్చెన్
  క్షితిమండలమంత యతనికింపుగ తోచెన్

  రిప్లయితొలగించండి
 48. నా మూఁడవ పూరణము:

  (సత్యభామా సమేతుఁడై శ్రీకృష్ణుఁడు నందవవనమందలి పారిజాతవృక్షమునుం గొని, గరుడునిపైనిడుకొని పైకెగురఁగా, గరుడుని ఱెక్కల గాడ్పుల తాఁకిడికి పెల్లగిలిన యితర దేవతరువులు కూడ నా గాలితోపాటు పైఁకిలేచి వెంటఁదవిలిన సందర్భము నిట ననుసంధానించుకొనునది)

  మోదము సతికిడ దివిఁ జని,
  పాదపముం గొనియు గరుడ ♦ వాహనము పయిన్
  బోఁదలఁచి యెగుర, గాలినిఁ
  బాదమ్ములు లేని తరులు ♦ పరుగిడఁ జొచ్చెన్!


  రిప్లయితొలగించండి
 49. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
  సమస్య పాదాన్ని స్థానభ్రంశం చేసి చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
  ****
  గుండు మధుసూదన్ గారూ,
  మీ మూడవ పూరణ ముచ్చటగా ఉండి అలరించింది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 50. పాదమ్ములు లేక జలము,
  పాదమ్ములు లేని పాము పరుగిడు, నిక నే
  పాదములు లేక గా,లెటు (గాలి+ఎటు)
  పాదమ్ములు లేని తరులు పరుగిడ జొచ్చెన్?

  రిప్లయితొలగించండి
 51. ఆదాయమొసఁగు భూములు!
  రాదారులు పట్ట నటుల లావాదేవీ
  లా! దిశను రాచవీడని
  పాదమ్ములు లేని తరులు పరుగిడఁ జొచ్చెన్!
  ( తరి = మాగాణి, తరులు = మాగాణులు )
  లేక ( తరువు = తొందర, తరులు = తొందరలు)

  రిప్లయితొలగించండి
 52. శాస్త్రీజీ ! ధన్యవాదములు !
  శంకరార్యా ! ధన్యవాదములు !

  రిప్లయితొలగించండి
 53. శ్రీగురుభ్యోనమ:

  పాదుపముల రక్షించుచు
  నాదుకొనన్నెవరు లేక యడవుల లోనన్
  ఛేదింపగ వృక్షంబుల
  పాదమ్ములు లేని తరులు పరుగిడ జొచ్చెన్

  రిప్లయితొలగించండి
 54. శ్రీపతి శాస్త్రి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  పాదపముల.. పాదుపముల అని టైప్ అయింది.

  రిప్లయితొలగించండి
 55. యాదవ ప్రసాదు లాలుని
  మోదమ్మగు పాలనమున పోచలు మరుగై
  గేదెలు స్త్యేనమ్మివగా
  పాదమ్ములు లేని తరులు పరుగిడఁ జొచ్చెన్

  రిప్లయితొలగించండి

 56. ఎన్ డీ టీ వి వార్త చదివేక

  ఆదరముగ చెట్లనటన్
  వేదారణ్యంబుగాను వేడ్కగ నిలుపన్
  బాధాతప్తులవంగన్
  పాదమ్ములు లేని తరులు పరుగిడఁ జొచ్చెన్!


  తెలంగాణా లో ట్రీ ట్రాన్స్ ప్లాంట్ !  https://www.ndtv.com/telangana-news/a-telangana-hospital-that-gives-dying-trees-a-second-life-1845101


  జిలేబి

  రిప్లయితొలగించండి
 57. చాదస్తముతో పరుగిడ
  గోదావరి యొడ్డు నున్న కొండొక గజమే
  పాదమ్ముల పీకి తరులు
  పాదమ్ములు లేని తరులు పరుగిడఁ జొచ్చెన్

  పాదము = 1. వేరు, 2. కాలు

  రిప్లయితొలగించండి