నేటి కర్నాటక రాష్ట్రంలోని ధార్వాడ
ప్రాంతానికి చెందిన సోమదేవుడు క్రీ.శ. 930 – 970 మధ్య కాలంలో
సంస్కృతంలో వ్రాసిన వాక్యాలకు రాష్ట్రపతి బహుమతి గ్రహీత,
మహామహోపాధ్యాయ,
పద్మశ్రీ,
బ్రహ్మశ్రీ డా.
పుల్లెల శ్రీరామచంద్రుడు గారి ఆంధ్ర వ్యాఖ్యానం “
శంకరాభరణ”
బ్లాగు మిత్రులకు,
పఠితలకు,
ఈనాటి అంశము “వ్యసనములు”
నకు సరిపోవు నని
భావిస్తూ...
……….. మీ మిత్రుడు
తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ.
వ్యసన సముద్దేశః
1. వ్యసతి ప్రత్యావర్తయత్యేనం శ్రేయసః ఇతి వ్యసనమ్.
వీణ్ణి శ్రేయో మార్గం నుంచి వెనుకకు
మరలిస్తుంది కాబట్టి “వ్యసనం”. “వ్యసతి ఇతి వ్యసనమ్” అని విగ్రహ వాక్యం.
2. వ్యసనం ద్వివిధం సహజమాహార్యం చ.
సహజమూ, ఆహార్యమూ (తెచ్చి పెట్టుకున్నదీ) అని
వ్యసనం రెండు విధాలు.
3. సహజం వ్యసనం ధర్మ సంభూతాధుతాభ్యుదయహేతుభిః అధర్మ జనిత మహా ప్రత్యవాయ ప్రతిపాదనైః
యోగ పురుషైశ్చ ప్రశమయేత్.
ధర్మం వల్ల కలిగిన ఆశ్చర్యకరమైన
అభ్యుదయానికి (ఐహిక సుఖాభివృద్ధికి) కారణాలు, అధర్మం వల్ల గొప్ప ప్రత్యవాయం కలుగుతుంది
అని బోధించేవి అయిన మంచి ఉపాఖ్యానాల శ్రవణపఠనాదుల ద్వారా, యోగ పురుషుల ద్వారా కూడా సహజ వ్యసనాలు
శాంతింప
చేసుకోవాలి.
4. పరచిత్తానుకూల్యేన తదభిలషితేషు వ్యసనేషు ఉపాయేన విరక్తి జనన హేతవః యోగ పురుషాః.
ఇతరుల మనస్సులు నొచ్చకుండా మాటలాడుతూ
వాళ్ళకి ఇష్టమైన వ్యసనాల విషయంలో విరక్తి కలిగేటట్లు ఉపాయాలు చేసేవాళ్ళు
యోగపురుషులు.
5. శిష్టసంసర్గ దుర్జనాసంసర్గాభ్యాం పురాతన మహాపురుషచరితోత్థితాభిశ్చ కథాభిః
ఆహార్య వ్యసనం పతిబధ్నీ యాత్.
మంచివాళ్ళతో సంబంధం పెట్టుకోవడంచేత, దుర్జనులకి దూరంగా ఉండడంచేత, ప్రాచీనులైన (నల రామ యుధిష్టిరాది)
మహాపురుషుల చరిత్రలకి సంబంధించిన కథలు వింటూండడంచేత ఆహార్యవ్యసనాలు ప్రతిబంధించాలి. (కొత్త
వ్యసనాలు అలవడకుండా చూచుకోవాలి).
6. స్త్రియః అతిభజమానః భవత్యవశ్యం తృతీయాప్రకృతిః.
అతిగా స్త్రీ సంసర్గం చేసేవాడు తప్పక
నపుంసకుడు అవుతాడు.
7. సౌమ్యధాతుక్షయః సర్వధాతు క్షయం కరోతి.
సౌమ్యధాతు (శుక్ల) క్షయంవల్ల అన్ని
ధాతువులూ క్షీణిస్తాయి. శరీరంలో ఉండే రస (నీరు)- రక్త – మాంస – మేధస్ (కొవ్వు) – అస్తి – మజ్జా – శుక్రాలకి ధాతువులని పేరు.
8. పానశౌణ్డః చిత్తభ్రమాత్ మాతరమప్యభిలషతి.
అతిమద్యపానాసక్తుడు చిత్తభ్రమ వల్ల (ఒళ్ళు
తెలియని స్థితిలో) తల్లిని కూడ అభిలషిస్తాడు.
9. మృగయాసక్తిః స్తేనవ్యాలద్విషద్దాయాదానామ్ అమిషం పురుషం కరోతి.
వేటమీద ఆసక్తి పురుషుణ్ణి దొంగలకి, మదగజాలకి, శత్రువులకి, దాయాదులకి అమిషంగా (తినే ఆహారంగా) చేస్తుంది. (వాళ్ళ వల్ల
మరణిస్తాడు).
10. నాస్త్యకృత్యం ద్యూతాసక్తస్య, మాతర్యపి హి మృతాయాం దీవ్యత్యేవ హి కితవః
జూదగాడికి చేయకూడని పని అంటూ ఉండదు.
తల్లి చచ్చి పడి ఉన్నా కూడా జూదగాడూ జూదం ఆడుతూనే ఉంటాడు.
11. పిశునః సర్వేషామవిశ్వాసం జనయతి.
చాడీలు చెప్పేవాని మీద ఎవరికీ విశ్వాసం
ఉండదు.
12. దివాస్వాపః సుప్తవ్యాధివ్యాలానామ్ ఉత్థాపనదణ్డః, సకల కార్యాన్తరాయశ్చ.
పగటి నిద్ర, నిద్రిస్తూన్న రోగాలనే క్రూరసర్పాలను
మేల్కొల్పేకర్ర. అన్ని పనులకూ విఘ్నం.
13. న పరపరివాదాత్ పరం సర్వ విద్వేషణభేషజమస్తి.
అందరినీ శత్రువులుగా చేసికోవాలంటే
ఇతరులను చాటుగా దూషించడం వంటి మందు మరొకటి లేదు.
14. తౌర్యత్రికాసక్తిః కం నామ ప్రాణార్థమానైర్న వియోజయతి.
నృత్య – గీత – వాద్యాలమీద అత్యాసక్తి ఎవణ్ణి
ప్రాణాలనుండీ, ధనం
నుండీ,
గావ్రవం నుండి దూరం చెయ్యదు?
15. మృషోద్యా నావిధాయ కమప్యనర్థం న విరమతి.
అబద్ధాలాడడం ఏదో ఒక అనర్థం కలిగిస్తేకాని
ఊరుకోదు.
16. అతీవేర్ష్యాలుం పురుషం స్త్రియః పరిత్యజన్తి, ఘ్నన్తి వా.
ఎక్కువ ఈర్ష్య కలవాణ్ణి స్త్రీలు
విడిచివేస్తారు లేదా చంపివేస్తారు.
17. పరపరిగ్రహాభిగమః కన్యాదూషణం వా సాహసం దశముఖ దాణ్డక్యాది వినాశహేతుః ప్రసిద్ధమేవ.
పరభార్యా సంబధము అవివాహితకన్యాదూషణం అనే
సాహసమూ రావణుడు, దాండకి
మొదలైన వాళ్ళ వినాశానికి దారితీసినవి అనే విషయం ప్రసిద్ధమే.
18. యత్ర నాహమిత్యధ్యవసాయః తత్సాహసమ్.
ఏ పని చేస్తున్నప్పుడు నేను అనే నిశ్చయం
ఉండదో అది సాహసం. అనగా వళ్ళు తెలియని ఆవేశంలో చేసే పని సాహసం అని భావం అయి ఉంటుంది.
19. అర్థ దూషకః కుబేరో2పి
భవతి భిక్షాభాజనమ్.
అర్థ దూషకుడు సాక్షాత్తూ కుబేరుడే అయినా
బిచ్చం ఎత్తుకొనవలసి వస్తుంది.
20. అతి వ్యయః అపాత్రవ్యయశ్చ అర్థస్య దూషణమ్.
అతిగా వ్యయం చేయడం, అయోగ్యులైన వ్యక్తులకు ఇచ్చి వ్యయం చేయడం
“అర్థ దూషణము.”
21. హర్షామర్షాభ్యామ్ అకారణం తృణాఙ్కురమపి నోపహన్యాత్; కిం పునర్మనుష్యమ్.
హర్షంచేతనో, కోపంచేతనో నిష్కారణముగా గడ్డి మొలకనికూడా
చంపకూడదు; మనుష్యుని
మాట చెప్పాలా?
22. శ్రూయతే హి-నిష్కారణం భూతావమానినౌ వాతాపిరల్వలశ్చాసురౌ
అగస్త్యాత్యాసాదనాద్వినేశతురితి.
నిష్కారణముగా ప్రాణుల్ని బాధించిన వాతాపి, ఇల్వలుడు అనే అసురులు అగస్త్యుని విషయంలో
గూడా హద్దుమీరి ప్రవర్తించడం చేత నశించిరని వింటున్నాము గదా?
23. యథాదోషం కోటిరపి గృహీతా న దుఃఖాయతే; అన్యాయేన తృణశలాకాపి గృహీతా ప్రజాః ఖేదయతి
దోషాలు లేకుండగా (కష్ట పెట్టకుండగా) కోటి
తిసికొన్నా ఏవిధంగా దుఃఖం కలిగించదో అదే విధంగా అన్యాయంగా ఒక గడ్డి పరక
తీసికొన్నా ప్రజలకు దుఃఖం కలిగిస్తుంది. లేదా “యథాదోషం “ అనగా చేసిన అపరాధాన్ని అనుసరించి అని అర్థం.
24. తరుచ్చేదేన ఫలోపభోగః సకృదేవ.
చెట్టు తెగగొట్టి పళ్ళు తినడం ఒక్కమాటే జరుగుతుంది.
25. ప్రజా విభవో హి స్వామినః ద్వితీయం భాణ్డాగారమ్; అతః యుక్తితః తముపయుఞ్జీత.
ప్రజల ఐశ్వర్యం అనేది రాజుకి రెండవ
ధనాగారం. అందుచేత దానిని యుక్తితో ఉపయోగించుకోవాలి.
26. రాజపరిగృహీతం తృణమపి పరేణ గృహీతం చేత్ కాఞ్చనీ భవతిః జాయతే చ పూర్వ
సంచితస్య అర్థస్యాపహారః.
రాజు సొత్తు గడ్డి పరకే అయినా దాన్ని
ఇతరులు గ్రహిస్తే బంగారం అవుతుంది (రాజు సొత్తు తృణము అపహరించినా బంగారం అపహరించినంత
అపరాధంగా పరిగణింప బడుతుంది). దానితో అంతవరకూ ప్రోగుచేసికొన్న ధనం కూడా పోతుంది.
27. వాక్పారుష్యం శస్త్రపాతాదపి విశిష్యతే.
మాటలలో పరుషత్వం శస్త్ర ప్రహారం కంటే
కూడా తీక్ష్ణ మైనది.
28. జాతివయోవృత్తవిద్యావిభవానుచితం హి వచనం వాక్పారుష్యమ్.
(తన లేదా ఎదుటివాని) జాతికి, వయస్సుకు, నడవడికకి ( లేదా ఉద్యోగానికి), ఐశ్వర్యానికి తగని వచనం “వాక్పారుష్యమ్”.
29. స్త్రియమ్, అపత్యం, భృత్యం వా తథోక్త్యా వినయం గ్రాహయేత్ – యథా హృదయప్రవిష్టాత్ శల్యాదివ వచనతో న తే
దుర్మనాయన్తే.
స్త్రీకి గాని, సంతానానికి (పుత్రీ పుత్రాదులకు) గానీ, భృత్యుడికి గానీ వినయం ఎలా నేర్పాలంటే తను చెప్పిన మాటలు హృదయంలో ములుకుల వలె
ప్రవేశించి వాళ్ళకు కష్టం కలిగించకుండా ఉండేటట్లు నేర్పాలి.
30. వధః క్లేశః అర్థహరణం వా వ్యుత్క్రమేణ దణ్డ పారుష్యమ్.
న్యాయ విరుద్ధంగా చంపడంగాని, బాధ పెట్టడం గాని, ధనం అపహరించడం గాని “దండ పారుష్యం.”
సంస్కృత భాషా ప్రచారసమితి, హైదరాబాదు వారిచే ప్రచురింపబడిన
నీతి వాక్యామృతం ( సోమదేవుని నీతి సూత్రాలు) అనే గ్రంథం
నుండి సేకరణ.