29, మార్చి 2013, శుక్రవారం

పద్య రచన – 295 (నిత్య కళ్యాణము...)

కవిమిత్రులారా,
నేటి పద్యరచనకు అంశము...
“నిత్య కళ్యాణము - పచ్చ తోరణము”
ఈ అంశమును పంపిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదములు.

25 కామెంట్‌లు:

 1. సత్యమీ విషయమ్ము నిత్య కళ్యాణమ్ము
  ....పచ్చతోరణముగా పరగుచుండె
  పరమ పావనమైన భారతదేశమ్ము
  ....ప్రఖ్యాతమౌ రామ రాజ్యమందు
  సకలర్తువులు మహా సౌఖ్యప్రదములయి
  ....ప్రకృతి శోభలతోడ పరిఢవిల్లె
  ఆరోగ్యవంతులై యానందమూర్తులై
  ....జ్ఞానులై యుండిరి జనులు ధరణి
  మూడు పంటలు పండుచు పుష్కలముగ
  సంపదలు విరాజిల్లెను జనులకెల్ల
  రామ రాజ్యమున్ బోలి సలక్షణముగ
  పరగు గావుత నిత్యమ్ము భరత భూమి

  రిప్లయితొలగించండి
 2. సేకరణః సాహిత్యాభిమాని

  పల్లవి:
  నిత్య కళ్యాణము
  పచ్చ తోరణము
  సప్తగిరి ఉపరితలము

  అనుపల్లవి:
  అది కుందనమ్ము
  పదహారు వన్నెల బంగారము
  ప్రభలు విరజిమ్మేటి
  పరిణయ మందిరము

  చరణం:
  రయమున రండీ!రా రండీ!
  మీరెల్లరు గళములు విప్పండీ!
  కృతి,స్తుతి,తోరణములుగా కట్టండీ!
  అవి,ద్వార బాసికములై అమరేను

  చరణం:
  మన మనముల
  మననము నింపండీ!
  భక్తి సౌరభము వ్యాపించీ
  పుష్పకమై శోభిల్లు మది

  రిప్లయితొలగించండి

 3. నిత్య కళ్యాణమ్ము నిజముగా జరుగును
  పచ్చ తోరణమ్ము వాడదెపుడు
  భక్త జనుల కొరకు భగవంతుడే నిద్ర
  వీడు తిరుమల గన వేడుకగును.

  రిప్లయితొలగించండి

 4. నిత్య కళ్యాణ మగునని ప్రత్యం గిరకు
  పచ్చ తోర ణం బులు గట్టి రచ్చ మైన
  మామి డా కుల దోడన మగువ లచట
  కామి తార్ధము లీ యుము కనక దుర్గ !

  రిప్లయితొలగించండి
 5. పండిత నేమాని వారూ,
  రారాజ్య వైభవ వర్ణనతో మీ పద్యం ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
  *
  సాహిత్యాభిమాని గారూ,
  ధన్యవాదాలు. వాగ్గేయకారు లెవరో తెలిపితే ఇంకా బాగుంటుంది.
  *
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  మొదటి పాదంలో గణదోషం. "నిజముగా జరుగును నిత్యకళ్యాణమ్ము" అంటే సరి.

  రిప్లయితొలగించండి
 6. ఏటికేడు మరలి యేతెంచు ఋతువులఁ
  దోచును పచ్చటి తోరణమ్ము
  శ్రీనివాసునకును సిరులిచ్చు తల్లికి
  నిత్యమ్ము కళ్యాణ నియమముండు
  శివరాత్రి జరుగు శివునకు గౌరికి
  కళ్యాణములు బహు ఘనముగాను
  శ్రీరామునకు మరి సీతమ్మతల్లికి
  కళ్యాణమేటేట కాంచగలము

  నిత్య కళ్యాణమును పచ్చనిదగు తోర
  ణమ్ము భువిని గానగవచ్చు నాడు నేడు
  సానుకూల దృష్టి గలిగి సంతసింప
  వలయు;నెల్లవారి కొసగు పరమసుఖము.

  రిప్లయితొలగించండి
 7. లక్ష్మీదేవి గారూ,
  "సానుకూల దృష్టి గలిగి సంతసింపవలయు" నంటూ మీరు చెప్పిన పద్యం బాగుంది. అభినందనలు.
  టైపాటు వల్ల "శివరాత్రి జరుగు" అన్నచోట గణదోషం. అది "శివరాత్రికి జరుగు" అనుకుంటాను.

  రిప్లయితొలగించండి
 8. మాస్టరు గారూ ! ధన్యవాదములు. మీరు చూపిన సవరణ తో..

  నిజముగా జరుగును నిత్య కళ్యాణమ్ము
  పచ్చ తోరణమ్ము వాడదెపుడు
  భక్త జనుల కొరకు భగవంతుడే నిద్ర
  వీడు తిరుమల గన వేడుకగును.

  రిప్లయితొలగించండి

 9. ఇల 'మురమళ్ళ' ను పల్లెను
  వెలసిన వీరేశ్వరునకు వేడుకగా పెం
  డిలి జరుగును ప్రతి దినమును
  పలు పచ్చని తోరణములు పండుగ జేయున్.

  రిప్లయితొలగించండి
 10. సాహిత్యాభిమాని గారి గీతం మనోజ్ఞంగా ఉంది.

  రిప్లయితొలగించండి
 11. మిస్సన్న గారూ,
  బాగుంది మీ పద్యం. అభినందనలు.
  ఇంతకీ ఈ నిత్యకళ్యాణోత్సవాలు జరిగే ‘మురమళ్ళ’ ఎక్కడుంది?

  రిప్లయితొలగించండి
 12. శ్రీపండిత నేమాని గురువులకు నమస్సులతో
  కొబ్బరి తోటల క్రొంగొత్త శోభల
  ………. పచ్చని పైరుల పరిఢ విల్లు
  కోనసీమ పడచు కొంగుబంగారమై
  ………. మురమళ్ళ గ్రామాన ముచ్చటగను
  దక్షయజ్ఞంబు ను దహియించి జనులకై
  ………. వీరభద్రుండిట వెలసి నాడు
  భద్రకాళిక తోడ భవనాశమొనరింప
  ………. దివ్య మంగళ రూపు! దీనబంధు!
  దేశమందున లేదుయే దేవునకును
  వీరభద్రునికి జరుగు వైభవమ్ము
  పచ్చతోరణమ్ములమధ్య పరచుకొనుచు
  నిత్యకల్యాణ మంతట నిజముగాను.

  రిప్లయితొలగించండి
 13. నిత్య శోభలు విరజిమ్ము సత్య మనగ
  శంకరా భరణ గురువు శంఖ మూద
  కవులు పులకించి పూరించ కవన ములను
  పచ్చ తోరణ మెరుపుల పసిడి బ్లాగు !

  రిప్లయితొలగించండి
 14. భద్రకాళీ రుద్రులకు భక్తితోను
  పచ్చతోరణమ్ములు కట్టిబాగుగాను
  నిత్యకళ్యాణము జరుగునిండుగాను
  వచ్చిచూచుడు మిత్రులువరుసగాను.

  రిప్లయితొలగించండి

 15. తిరుమలేశుని వాసమ్ము దివ్యధామ
  మై పరగు నిత్యకళ్యాణమై వెలుంగు
  పచ్చతోరణములు చూడ ముచ్చటౌను ;
  ఇలను వెలసిన వైకుంఠమిదె యనంగ.

  రిప్లయితొలగించండి
 16. అమ్మా! శ్రీమతి రామలక్ష్మి గారు! శుభాశీస్సులు.
  మీ పద్యము మొదటి పాదములో గణభంగము అగుచున్నది. ఈ విధముగా మార్చండి:
  భక్తితో భద్రకాళికి భర్గునకును - అని.
  స్వస్తి.

  రిప్లయితొలగించండి
 17. శ్రీ తోపెల్ల శర్మ గారి ఆసక్తికి ప్రశంసలు. పద్యములో కొన్ని మార్పులు అవసరము. ఈ విధముగా కొన్ని మార్పులు చేసితిని:

  కొబ్బరి తోటల క్రొంగ్రొత్త శోభల
  ....పచ్చని పైరుల పరిఢవిల్లు
  కోనసీమ పడుచు కొంగు బంగారమౌ (కోనసీమయే ఒక సుందరి)
  ....మురమళ్ళ గ్రామాన భూరి బలుడు
  దక్ష యజ్ఞంబును దహియించి యిచ్చట
  ....వీరభద్ర విభుండు వెలసినాడు
  భద్రకాళి తోడ భవుని తనూజుండు
  ....భక్తవత్సలుడైన భద్రమూర్తి
  ఇతర వేల్పుల కెవ్వరికేని లేని
  వైభవమ్ముగ శ్రీ వీరభద్ర పతికి
  పచ్చ తోరణముల మధ్య పరచుకొనుచు
  అనుదినమ్ము కళ్యాణమ్ము లచట జరుగు

  రిప్లయితొలగించండి
 18. శ్రీనేమాని గురువులకు ప్రణామములు. ధన్యుడను. మొన్నమొన్ననే మురమళ్ళ లో భద్రాచలంలో జరిగినటుల అతిరుద్రం జరిగినది. స్వామివారికి నిత్యకల్యాణం చాల పురాతన కాలంనుండీ జరుగుచున్నది.

  రిప్లయితొలగించండి
 19. గురువుగారూ మీకు జవాబు దొరికింది కదా.

  తోపెల్ల శర్మ గారూ మురమళ్ళ వీరేశ్వరుని మురిపించేశారు. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 20. అన్నగారూ! అది నామొద్దుబుర్రకు శిల్పంలా చెక్కిన గురువుగారి ప్రతిభ అది. ధన్యవాదములు.

  రిప్లయితొలగించండి
 21. శ్రీనేమాని గురువులకు ప్రణామములు.
  మీరు చూపిన సవరణ తో..

  భక్తితో భద్రకాళికి భర్గునకును
  పచ్చతోరణమ్ములు కట్టిబాగుగాను
  నిత్యకళ్యాణము జరుగునిండుగాను
  వచ్చిచూచుడు మిత్రులువరుసగాను.

  ధన్యవాదములు.

  రిప్లయితొలగించండి
 22. సుబ్బారావు గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  మొదటి పాదంలో ‘ప్రత్యంగిరకు’ అన్నచో గణదోషం.
  *
  తోపెల్ల వారూ,
  మురమళ్ళ వీరభద్రుడి నిత్యకళ్యాణోత్సవాన్ని చాలా చక్కగా వర్ణిస్తూ మంచి పద్యం చెప్పారు. అభినందనలు.
  *
  రాజేశ్వరి అక్కయ్యా,
  బాగుంది పద్యం. అభినందనలు.
  ‘తోరణ మెరుపుల’ అనరాదు కదా. అక్కడ ‘తోరణంపు మెరుపు’ అందాం.
  *
  డా. ప్రభల రామలక్ష్మి గారూ,
  సవరణతో మీ పద్యం సర్వాంగ సుందరంగా భాసిస్తున్నది. అభినందనలు.
  *
  కమనీయం గారూ,
  భూలోక వైకుంఠం గురించిన మీ పద్యం బాగుంది. అభినందనలు.
  *
  మిస్సన్న గారూ,
  తోపెల్ల వారి పద్యంలోనూ నాకు జవాబు దొరకలేదు. ‘కోనసీమ’ అన్నారు. అది ఏ జిల్లాలో, ఏతాలూకాలో, ఎక్కడ దిగి ఎలా వెళ్ళాలో ఆ వివరాలు కావాలి.

  రిప్లయితొలగించండి
 23. శ్రీశంకరార్యులకు నమస్సులు. విలాస ప్రయత్నము.
  తూర్పు గోదావరీజిల్ల మార్పు లేదు
  రాణ్మహేంద్ర వరం*బున రైలు దిగుచు (రాజమండ్రి)
  బస్సున న(అ)మలపురముకు బయలు దేరి
  యిరువది కి.మీ.లు చేరగ నేగుదెంచు
  ముక్తిదాయిని మురమళ్ళ ముదముతోడ.

  రిప్లయితొలగించండి
 24. తోపెల్ల వారూ,
  ధన్యవాదాలు. ఈమధ్యకాలంలోనే ఆ క్షేత్రాన్ని దర్శించుకొనే ప్రయత్నం చేస్తాను. స్వస్తి!

  రిప్లయితొలగించండి
 25. గురువుగారూ మీరు తిన్నగా కాకినాడ మాయింటికి రండి దగ్గరఉండి దర్శనం చేయిస్తాను. మీకెప్పుడు వీలుకుదిరితే అప్పుడు.

  రిప్లయితొలగించండి