21, మార్చి 2013, గురువారం

పద్య రచన – 287 (కవిత్వప్రయోజనము)

కవిమిత్రులారా,
నేటి పద్యరచనకు అంశము...
“కవిత్వ ప్రయోజనము”

20 కామెంట్‌లు:


 1. కవి తన ప్రయోజనమునకు రాయడు
  రవి తన ప్రయోజనమునకు కాయడు
  భువి మన ప్రయోజనమునకు తిరుగాడు
  కవిత్వం ప్రజా ప్రయోజనమై అలరాడు !


  చీర్స్
  జిలేబి.

  రిప్లయితొలగించండి
 2. ఛందమను పేర భాషకు నందమలది
  చెప్పవలసిన సూక్తుల జిలుగులద్ది
  కథల వర్ణనలనుఁ జేర్చి గరిమతోడ
  చెప్పునదియే కవిత్వమ్ము; చెప్పుమింక.

  రిప్లయితొలగించండి
 3. జిలేబి గారి భావానికి పద్యాన్ని ప్రయత్నించాను.

  చెవియొగ్గి వినుము చెప్పెద
  రవి కాయడు తనదు కొరకు రాత్రింబవలున్
  భువి తిరుగ దెపుడు తనకయి
  కవివ్రాయును వాటి వోలె కద పరులకునై.

  రిప్లయితొలగించండి
 4. నవరసాన్వితమును నవరసభరితమౌ
  ....సత్కవిత్వ ప్రయోజనము ఘనము
  శబ్దార్థ వైచిత్ర్య సహితమై సత్కృతుల్
  ....గను కవిత్వ ప్రయోజనము ఘనము
  స్వాంతముల్ కదలించి ప్రజలను నడిపించ
  ....గల కవిత్వ ప్రయోజనము ఘనము
  అస్త్రమ్ము, శస్త్రమ్ము, నన్యాయ విధ్వంసి
  ....యను కవిత్వ ప్రయోజనము ఘనము
  దమ్ము నిండుగా గల కవిత్వమ్ము ఘనము
  ఆశయమ్ము ముఖ్యమ్ము ధనార్జనమ్ము
  కాదు ముఖ్యమటంచు నిష్కల్మష మతి
  ప్రజల హితము గోరెడు కవిత్వమ్ము ఘనము

  రిప్లయితొలగించండి
 5. జిలేబీ గారూ,
  మంచి భావాన్ని అందించారు. అభినందనలు.
  మీ భావానికి గోలి వారి పద్యరూపాన్ని చూసారా?
  *
  లక్ష్మీదేవి గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  *
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  జిలేబీ గారి భావానికి మీరిచ్చిన పద్యరూపం చాలా బాగుంది. ధన్యవాదాలు.
  *
  పండిత నేమాని వారూ,
  ‘విశ్వశ్రేయః కావ్యమ్’ అన్న సూక్తిని బలపరుస్తూ కవిత్వ ప్రయోజనాన్ని ‘ఘనంగా’ వివరించిన మీ పద్యం ప్రబోధాత్మకంగా ఉంది. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 6. కవులున్జేతురు రచనలు
  నవ రసముల తోడ మిగుల నాణ్యత యొప్పన్
  అవియే గూర్చును శుభములు
  అవనికి గళ్యాణ మదియ హర్షము మఱియున్ .

  రిప్లయితొలగించండి
 7. నా పద్యము తొలి పాదములో:
  నవరసాన్వితమును నవ భావభరితమును అని ఉండేది - టైపు చెయ్యడములో పొరపాటు జరిగినది. ఆ విధముగా చదువుకొందాము. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 8. సుబ్బారావు గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  ‘శుభముల/నవనికి...’ అనండి.

  రిప్లయితొలగించండి
 9. అలసిన మనసుకు పాటై
  వలసిన కర్తవ్య బోధ భగవద్గీతై
  పలుకుచు మానవ జీవిత
  కొలువున నిండెను కవిత్వ కూజిత మదియే!

  రిప్లయితొలగించండి
 10. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 11. శ్రీనాథ కవులెల్ల సేద్యమ్ము చేసిరి
  ......ఆంధ్రభారతి భూమినందముగను
  పోతన్న పొందిన పుణ్యఫలముచే
  ......"ఆంధ్రభారతి" కిచ్చెనమృతఫలము
  గాయక కవులెల్ల గానమ్ము చేసిరి
  ...... భారతీ ప్రతిభను భక్తితోడ
  స్వాతంత్ర్య సమరాన సారధులగు వారి
  ...... సరసన నిలిచిన సమర ధీర.

  చిత్రగాయకులెందరొ చిత్ర గతిని
  గళమెత్తి పాడిరి ఘనముగాను
  రచన చేయించ వచ్చిన రాణి వీవు
  అందుకోవమ్మ నా అభివందనములు.

  రిప్లయితొలగించండి
 12. వ్యర్థములు గావు కవి పల్కు వాక్కు లెపుడు
  నిత్యనూతనముగ నుండి నిజము దెలుపు
  సమత సామాజిక ప్రయోజనములు గల్గు
  కవిత చదివిన హృదయము కాంచు పథము

  రిప్లయితొలగించండి
 13. సహదేవుడు గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  ‘జీవిత కొలువు’ అని సమాసం చేయరాదు కదా!
  "పలికి జనుల జీవితమను/కొలువున..." అందాం.
  *
  డా. ప్రభల రామలక్ష్మి గారూ,
  ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు నిన్నటి ‘ఆంధ్ర భారతి’కి, నేటి ‘కవిత్వప్రయోజనా’నికి అన్వయించే విధంగా చక్కని పద్యాన్ని వ్రాసారు. అభినందనలు.
  సీసం రెండవ పాదం పూర్వార్ధంలో “పుణ్య ఫలముచే” అన్నపుడు గణదోషం. “పుణ్య ఫలమ్ముచే” అన్నదానికి టైపాటు కావచ్చు.
  తేటగీతి రెండవపాదంలో గణదోషం. “గళము నెత్తి పాడిరిగదా ఘనముగాను” అందాం.

  రిప్లయితొలగించండి
 14. నాగరాజు రవీందర్ గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 15. శ్రీమతి ప్రభల రామలక్ష్మి గారి పద్యము చిన్న చిన్న సవరణలతో:

  శ్రీనాథ ముఖ కవుల్ సేద్యమ్ము చేసిరి
  ....ఆంధ్ర భారతి భూమి నందముగను
  పోతన్న పొందిన పుణ్య ఫలమ్ముచే
  ....ఆంధ్ర భారతి కిచ్చె నమృత ఫలము
  గాయక శేఖరుల్ గానమ్ము చేసిరి
  ....భారతి ప్రతిభను భక్తి తోడ
  స్వాతంత్ర్య సమరాన సారథులగు వారి
  ....సరసన నిలిచిరి సమరధీర!
  చిత్ర గాయకు లెందరో చిత్ర గతిని
  గానమొనరించి రెంతయు ఘనము గాను
  రచన చేయించ వచ్చిన రాణివీవు
  అందుకోవమ్మ నా అభివందనములు

  రిప్లయితొలగించండి
 16. శ్రీపండిత నేమాని గురువులకు నమస్సులతో
  చదివిన కొలదిగ చవిగొని సాగుచు
  ………. సాంతము మనముకు శాంతినిచ్చు
  మంచి పదంబుల మధుర భావంబుల
  ………. మానవ జాతికి మార్గమిచ్చు
  కార్మిక శ్రామిక కర్షక హర్షక
  ………. మగు గానవీధులన్ హాయినిచ్చు
  విశాల భావాల వీక్షించు కవివిహం
  ………. గములు వ్యక్తిత్వ వికాసమిచ్చు
  జనులయందొకనిగ కవి జన్మమంది
  ప్రజల బాధ తనదియన్న భావ మొప్ప
  కవియె కాంక్షింప శ్రేయస్సు కవిత జెప్పు
  స్వార్థ రహిత కావ్యమ్ము సకలజనుల.

  రిప్లయితొలగించండి
 17. తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారూ,
  మీ సీస పద్యం మంచి భావంతో అలరారుతూ అలరించింది. అభినందనలు.
  సీసం మొదటి పాదం ఉత్తరార్ధంలో ‘మనమునకు’ అనాలి కదా. దానిని “స్వాంతమునకు పూర్ణశాంతి నిచ్చు” అందామా?
  నాల్గవ పాదం పూర్వార్ధంలో ‘విశాల’ అన్నచోట గణదోషం. అక్కడ ‘విస్తార’ అంటే సరి!

  రిప్లయితొలగించండి
 18. శ్రీశంకరార్యులకు నమస్సులు మీసూచన ప్రకారం సవరించుచూ

  చదివిన కొలదిగ చవిగొని సాగుచు
  ………. స్వాంతమునకు పూర్ణ శాంతినిచ్చు
  మంచి పదంబుల మధుర భావంబుల
  ………. మానవ జాతికి మార్గమిచ్చు
  కార్మిక శ్రామిక కర్షక హర్షక
  ………. మగు గానవీధులన్ హాయినిచ్చు
  విస్తార భావాల వీక్షించు కవివిహం
  ………. గములు వ్యక్తిత్వ వికాసమిచ్చు
  జనులయందొకనిగ కవి జన్మమంది
  ప్రజల బాధ తనదియన్న భావ మొప్ప
  కవియె కాంక్షింప శ్రేయస్సు కవిత జెప్పు
  స్వార్థ రహిత కావ్యమ్ము సకలజనుల.

  రిప్లయితొలగించండి
 19. రవి గాంచని చో టైనను
  భువి ప్రాణుల మనుగడేది బ్రోవగ జగతిన్ !
  కవి కోకిల కూయని దే
  దివి నేలెడు దివౌ కసుల దీప్తిని దెలుపన్ !

  రిప్లయితొలగించండి
 20. రాజేశ్వరి అక్కయ్యా,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  చివరిపాదంలో గణదోషం.
  “దివి నేలు దివౌకసులకు...” అందాం.

  రిప్లయితొలగించండి