7, మార్చి 2013, గురువారం

సమస్యాపూరణం – 987 (ధనములు గలవాఁడె నలఁగు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
ధనములు లవాఁడె నలఁగు దారిద్ర్యమునన్.
ఈ సమస్యను సూచించిన కవిమిత్రునకు ధన్యవాదాలు.

27 కామెంట్‌లు:

  1. తన తాహతు నెంతయు మిం
    చిన సంతతి వ్యసనములును చిక్కులు ధరణిన్
    పెనవైచి కొనిన బహు బం
    ధనములు కలవాడె నలగు దారిద్ర్యమునన్

    రిప్లయితొలగించండి
  2. తనరెడు యోగాంచిత సా
    ధనములు కలవాడె కడు ముదమ్మున జెలగున్
    ఘన మాయామయ బహు బం
    ధనములు కలవాడె నలగు దారిద్ర్యమునన్

    రిప్లయితొలగించండి
  3. మనమున మలినము మెండుగ
    తన పర బేధమ్ము లేని దంభకు డనగా ! !
    కని నంత గోముఖ వ్యాఘ్రపు
    ధనములు గలవాడె నలఁ గు దారిద్ర్యము నన్ !

    రిప్లయితొలగించండి
  4. దినమొక సారైన సతీ
    తనయుల తోడుత భుజించు తరుణము లేకన్
    పని భారము శాసించెడు
    ధనములు గలవాడె నలఁగు దారిద్ర్యమునన్!

    రిప్లయితొలగించండి
  5. తను కష్టపడక ధరణీ
    జనులను మోసంబుజేయ సత్కృతి కాదే,
    విను, తస్కరణంబగు పర
    ధనములు గలవాఁడె నలఁగు దారిద్ర్యమునన్.

    ఇతరులవద్ద నుండీ తస్కరింపబడ్డ ధనము - చెడు జేయును

    రిప్లయితొలగించండి
  6. వినకను పెద్దల మాటలు
    పనులేవియు చేయబోక బద్ధక మతియై
    ఘన దుష్ట మిత్ర తతి బం
    ధనములు కలవాడె నలగు దారిద్ర్యమునన్

    రిప్లయితొలగించండి
  7. శ్రీ నేమాని వారి , శ్రీ గోలి హనుమ చ్చాస్త్రి
    గారి పద్యములు చాల బాగున్నది

    రిప్లయితొలగించండి
  8. పండిత నేమాని వారూ,
    సంసార, మాయా బంధనములతో మీ రెండు పూరణలూ అద్భుతంగా ఉన్నవి. అభినందనలు, ధన్యవాదాలు.
    *
    రాజేశ్వరి అక్కయ్య గారూ,
    మీ ప్రయత్నం ప్రశంసనీయం.
    మూడవ పాదంలో గణదోషం.
    కనగా గోముఖ భేలపు... అందాం. భేలము = వ్యాఘ్రము.
    *
    సహదేవుడు గారూ,
    పనుల భారాన్నీ ధనంగానే గ్రహించారా? బాగుంది మీ పూరణ. అభినందనలు.
    *
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    "సత్కృతి కాదే" అన్నదానిని "సత్కృతి యగునా" అంటే బాగుంటుందేమో?
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  9. వరప్రసాద్ గారూ,
    ధన్యవాదాలు.
    మరి మీ పూరణ ఏది?

    రిప్లయితొలగించండి
  10. అనయము మద్యము ద్రాగుచు
    కన నొల్లక శివుని నెపుడు కలలో నైనన్
    పనిగొని నిరతము సుర బం
    ధనములు గలవాడె నలగు దారిద్ర్య మునన్ .

    రిప్లయితొలగించండి
  11. శ్రీగురుభ్యోనమః
    గురువుగారికి ధన్యవాదములు.
    పని భారము శాసించగ అంటే బాగుంటుందంటారా? నా ఉద్దేశ్యము ధనములు గల వారు తీరిక లేకుండ కట్టుకున్న వారిని కన్నవారిని సరిగా చూచు కొనలేక పోవడమనే అర్థంతో వ్రాయడం జరిగిందండి.స్వస్తి.

    రిప్లయితొలగించండి
  12. సుబ్బరావు గారూ,
    మీ ప్రయత్నం ప్రశంసింపదగినదే. అభినందనలు.
    సుర బంధనములు అంటే దేవతలతో గల బంధనములు అనే అర్థం వస్తుంది.
    పనిగొని నిరత సురా బం
    ధనములు... అంటే సరి!
    *
    సహదేవుడు గారూ,
    ఊరికే చమత్కరించాను. మీ పూరణలో దోషం లేదు.

    రిప్లయితొలగించండి
  13. శ్రీ శంకరయ్య గురువుగారికి,శ్రీ నేమాని వారికి పాదాభివందనము జేయుచు,
    గురువుగారికి ధన్యవాదములు,గురువుగారు క్షమించాలి
    ఈ రోజు సమస్యను పూరించుటకు సమయము దొరకదుయని పూరణలను చదివి "సాధనములు" "బంధనములు" అన్న పదములను బంధించిన రీతికి ముగ్ధుడనైతిని.
    ========*===========
    ధనము గలిగి మదము బెరిగి
    గనులను,భూములనుదినిన గౌరవనీయుల్
    ఘనముగ నింటికి జేరని
    ధనములు గలవాడె నలగు దారిద్ర్యమునన్

    రిప్లయితొలగించండి
  14. శునకములు జేసి జనులను
    దనవారికి భూములెల్ల దౌర్జన్యమునన్
    దొనరగ నిచ్చిన తతి బం
    ధనములు గలవాడె నలగు దారిద్ర్యమునన్

    రిప్లయితొలగించండి
  15. గనులను కడు ముదమున దిని
    కనకపు సింహాసనమును గలిగిన ఘనుడై
    దొనరగ చీకటి కర బం
    ధనములు గలవాడె నలగు దారిద్ర్యమునన్

    రిప్లయితొలగించండి
  16. పై 2వ పద్యము మూడవ పాదము సవరణ

    దొనరగ నిచ్చెడి తతి బం
    ======*======
    వెనుకటి గణముల కై తా
    శునకము వలె దిని జనులకు సొక్కుచు నుండెన్,
    తనయుల స్థితి గతుల గనని
    ధనములు గలవాడె నలగు దారిద్ర్యమునన్ .
    (గణములు = భంధువులు )

    రిప్లయితొలగించండి
  17. ధన సంపాదన కరవై
    తన వారల పోషణమ్ము దాల్చుట బరువై
    తన పాలిట ఋణముల బం
    ధనములు గలవాడె నలగు దారిద్ర్య మునన్

    రిప్లయితొలగించండి
  18. శ్రీ కందుల వర ప్రసాదు గారికి శుభాశీస్సులు. ఈ మధ్య మీ రచనా శైలి మెరుగు పడినది. వివిధములైన ఆధునిక భావనులతో పూరణలను చేస్తున్నారు. సంతోషము. మా ప్రశంసలు.

    రిప్లయితొలగించండి
  19. జనగణము మెచ్చు సద్గుణ
    తనయులె తలిదండ్రులకును ధన సంపదలున్
    గను, చెడు సంతానపు బం
    ధనములు గలవాడె నలఁగు దారిద్ర్యమునన్!

    రిప్లయితొలగించండి
  20. వరప్రసాద్ గారూ,
    మీ మూడు పూరణలూ చాలా బాగున్నవి. అభినందనలు.
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    గండూరి లక్ష్మినారాయణ గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  21. ధనదు సమానమగు ధని
    ధనదుడు కాకుండనుండ ధన్యుండగునే?
    కనగ తెలియు నరిషద్బం
    ధనములు గలవాఁడె నలఁగు దారిద్ర్యమునన్.
    (ధనదుడు=కుబేరుడు, దాత)
    (ధని= ధనికుడు)

    రిప్లయితొలగించండి
  22. తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారూ,
    అరిషడ్బంధనముల మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  23. శ్రీ శంకరయ్య గురువుగారికి, శ్రీ నేమాని వారికి ధన్యవాదములు
    ఈ పద్యములందు నా కల్పన మేమియు లేదు, సర్వము శ్రీ శంకరయ్య గారిది మరియు శ్రీ పండిత నేమాని వారిది. దోషములున్న యడల అవి నావియే గనుక సవరించమని సవినయముగా ప్రార్థిస్తూ

    ========*===========
    వనమున సుఖమును బొందెడి
    ఘనుడే ధనవంతుడు,కడు కాఠిన్యమునన్
    మునిగెడి తాతల కాలపు
    ధనములు గలవాడె నలగు దారిద్ర్యమునన్

    రిప్లయితొలగించండి
  24. ఘనమగు బండిని కల్గిన
    వినియోగింపగను ధనము పెచ్చుగ వలయున్
    విను, చమురుకు! లోటగు యిం-
    ధనములు గలవాడె నలగు దారిద్ర్యమునన్.

    రిప్లయితొలగించండి
  25. వరప్రసాద్ గారూ,
    మీ తాజా పూరణ బాగుంది. అభినందనలు.
    *
    మిస్సన్న గారూ,
    మీ పూరణ వైవిధ్యంగా అలరిస్తున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  26. వనములు, పశువులు, సంతు, భ
    వనములు, లాలూకు వోలె వసతిగ నున్నన్
    మనమున సంతస మొసగని
    ధనములు గలవాఁడె నలఁగు దారిద్ర్యమునన్

    రిప్లయితొలగించండి
  27. మునుగుచు కర్చుల లోనన్
    ఘనమగు జీతమ్మొసగని కాలేజీనిన్
    వినుటకు రుచియింపని బో
    ధనములు గలవాఁడె నలఁగు దారిద్ర్యమునన్

    రిప్లయితొలగించండి