24, మార్చి 2013, ఆదివారం

సమస్యాపూరణం – 1004 (వమ్మొనర్చినచో)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
వమ్మొనర్చినచో సుఫలమ్ము లొదవు.
ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదములు.

35 కామెంట్‌లు:

  1. భాసుర దీక్షా మతులై
    శ్రీసతి పూజల నొనర్చి ఛిద్రములౌ దు
    ర్వాసనల వమ్మొనర్చిన
    చో సుఫలమ్ము లొదవు కద సూరివరేణ్యా!

    రిప్లయితొలగించండి
  2. కట్టి మనసును శ్రీహరి కట్టె దుటను
    లోని వైరుల నుక్కు పాదాన ద్రొక్కి
    వాని దుష్కృతా సక్తుల వరుస బెట్టి
    వమ్మొనర్చినచో సుఫలమ్ము లొదవు

    రిప్లయితొలగించండి
  3. తిరుమ లేశు బ్రహ్మోత్సవదినము లందు
    దివ్య వాహనా ధీశుని తేరు లందు
    వైభవమ్ముగ సతులతో ప్రభల నుత్స
    వమ్మొనర్చినచో సఫలమ్ము లొదవు.

    రిప్లయితొలగించండి
  4. మంత్రమేదైన జూడగా మహిమ గలదె
    కాని దానికి ముందునోంకార మొకటి
    నాద రాజము జేరిచి నమ్ముచు ప్రణ
    వమ్మొనర్చినచో సుఫలమ్ము లొదవు

    రిప్లయితొలగించండి
  5. శ్రీ సహదేవుడు గారి ఉత్సవమ్ము వైభవముగా నున్నది. బళా! బళా!
    శుభాభినందనలు.
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  6. శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారి మంత్ర రాజమునకు తిరుగులేదు. మా ప్రశంసలు.స్వస్తి.

    రిప్లయితొలగించండి
  7. చేయుదురు బాసలను పలు నాయకులవి
    గాలిలో మేడలే యెన్నికలకు ముందు
    బళిర! నెరవేర్చి పూర్తిగా వాని వాస్త
    వమ్మొనర్చినచో సుఫలమ్ము లొదవు

    రిప్లయితొలగించండి

  8. శ్రీ నేమాని వారికి ధన్యవాదములు.
    వాస్తవముగా చెప్పినమీకు
    ఉత్సవము చూపించిన సహదేవుడు గారికి
    వైరులను ఉక్కు పాదాల ద్రొక్కిన మిస్సన్న గారికి అభినందనలు.
    (మిస్సన్నగారూ ఇంగ్లీషు వైరులు కాదు కదండీ...)

    రిప్లయితొలగించండి

  9. వెతలఁ గుందియు సదసద్వివేక మంది
    ప్రాణు లన్నింటిలోఁ బరబ్రహ్మ మరసి
    భావమున భక్తి పొంగార దేవతా స్త
    వమ్మెనర్చినచో సుఫలమ్ము లొదవు.

    రిప్లయితొలగించండి

  10. మాస్టరు గారూ ! భక్తి పొంగార దేవతా స్తవము జేశారు.. బాగుంది

    రిప్లయితొలగించండి
  11. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  12. మనసు లోపల మాత ను బదిల పఱచి
    ప్రార్ధ నాదు లు సేయగ బరిత పించి
    ఱేయి బగ లులు యాదేవి లీ ల లు స్త
    వ మ్మొన ర్చినచో సు ఫలమ్ము లొదవు .

    రిప్లయితొలగించండి
  13. ఉగ్రవాదము పెరుగుచు వ్యగ్రమగుచు
    నుండె జనజీవనము చచ్చుచుండి రట్లు
    భయము తొలగగ ప్రజలకు బాంబులన్ని
    వమ్మొనర్చినచో సుఫలమ్ము లొదవు

    రిప్లయితొలగించండి
  14. మన శంకరయ్య గారి ర
    చనమును గాంచితిమి నేడు కనుపండువుగా
    వినుతింతు వారి భావము
    ఘన వాక్చతురిమను సరస గమనమును బళా!

    రిప్లయితొలగించండి
  15. శ్రీ సుబ్బా రావు గారి పద్యము 3వ పాదము చివరలో లీలలు స్త అనునప్పుడు స్తకు ముందు లు గురువు కాలేదు. అందుచేత ఇలాగ మార్చుదాము: "లీలలను స్త"

    రిప్లయితొలగించండి
  16. రాక్షసత్వము పృథ్విని ప్రజ్వరిల్లి
    అల్లకల్లోల మగుచుండె నవని యంత
    అచ్యుత ! యవతారము దాల్చి యసురుల నభ
    వమ్మొనర్చినచో సుఫలమ్ము లొదవు

    రిప్లయితొలగించండి
  17. సహదేవుడి గారి ఉత్సవమ్ము , మిస్సన్న గారి దుష్కృతాసక్తుల వమ్ము బాగున్నవి. గురువు గార్ల పద్య వైభవమ్ము గురించి యిక చెప్ప నక్కఱ లేదు

    రిప్లయితొలగించండి
  18. అన్నమయ వ్రాసిన పదము లెన్నదగిన
    వి కనుక స్వరపరచి పాడి వెలువ రించి
    రెందరో మహితాత్ము; లీ రీతి వైభ
    వమ్మొనర్చినచో సుఫలమ్ము లొదవు

    రిప్లయితొలగించండి
  19. అంటుచుండె నాకాశము నధిక ధరలు
    బడుగు జనులకు బ్రతుకులు భారమాయె
    కాంక్షతో ప్రభుత వారల కష్టములను
    వమ్మొనర్చినచో సుఫలమ్ము లొదవు.

    రిప్లయితొలగించండి
  20. వరుసగా వమ్ము, ఉత్సవమ్ము, ప్రణవమ్ము, వాస్తవమ్ము, స్తవమ్ము, అభవమ్ము, వైభవమ్ము....
    ఇప్పుడు ప్రసవమ్ము.

    అడ్డము తిరిగి కడుపులో బిడ్డ డుండ
    కష్ట మగుచుండు తల్లికి కాన్పు నందు
    వైద్యు లట్టి సమయమున వచ్చుచు ప్రస
    వమ్మొనర్చినచో సుఫలమ్ము లొదవు

    రిప్లయితొలగించండి
  21. అందరి పూరణలు భక్తి భావంతో అలరించినవి.
    శ్రీ నేమని గురువర్యులకు, గోలి వారికి మరియు నాగరాజు రవీందర్ గారికి ధన్య వాధములతో...
    శంకరుల పేర బ్లాగును చక్కఁగూర్చు
    పుణ్య ఫలమేమొభక్తికి పుష్ట నొసగె
    మిత్య కవివర్యు లందరు మేటి గాను
    పూజ్య గురువుల మెప్పను పొందు నటుల.

    రిప్లయితొలగించండి
  22. భక్తి పొంగార మనమందు పరమశివుని
    దలుచుచున్నచో, భజనల దారి లోన
    పారవశ్యమందున పేరు పలుకు యెడ ర
    వమ్మొనర్చినచో సుఫలమ్ము లొదవు.

    రిప్లయితొలగించండి
  23. మోసము నిండిన జగతిని
    ధ్యాసతొ దైవమును కొలిచి ధ్యానించగ దు
    ర్వ్యసన మ్ముల వమ్మొనర్చిన
    చో సుఫలమ్ము లొదవు టన చోద్యము గాదే !

    రిప్లయితొలగించండి
  24. శ్రీపండిత నేమాని గురువులకు నమస్సులతో
    వర్షమొకచుక్క కురియక వసుధయందు
    వ్యవసాయి దుఃఖింపగ పండితుండు
    వాన కురియగ జెప్పెను వరుణునికి హ
    వమ్మొనర్చినచో సుఫలమ్ము లొదవు.

    రిప్లయితొలగించండి

  25. అన్నదముల వలె జాతు లన్ని కూడి
    విశ్వమానవ బ్రాతృత్వవేది నిలిచి
    పోరులే లేనిదిగఁ జేసి భువి నిపుడు ది
    వమ్మొనర్చినచో సుఫలమ్ము లొదవు.

    రిప్లయితొలగించండి
  26. నేమాని పండితార్యా! మీ విరుపు అద్భుతం.

    శ్రీ గోలివారికి ధన్యవాదములు. అయ్యా మీకు తెలియని వైరు లేవున్నాయి గనుక?

    శ్రీ రవీందర్ గారూ ధన్యవాదాలండీ.

    ఆహా! ఈ రోజు ఎన్ని వమ్మై నాయో గదా!

    రిప్లయితొలగించండి
  27. అందఱి పూరణలు చాలా బాగున్నాయి. గురువు గారి రెండు పూరణలు బ్రహ్మాండము. చాలా బాగున్నాయి.అందఱికీ అభినందనలు.

    రిప్లయితొలగించండి
  28. పండిత నేమాని వారూ,
    తేటగీతి పాదాన్ని కందంలో ఇమిడ్చి వాసనా వైముఖ్యాన్ని చక్కగా వివరిస్తూ పూరణ చెప్పారు.
    రెండవ పూరణలో మీరు చెప్పినది ‘వాస్తవమ్ము’! మంచి పూరణ. అభినందనలు.
    నా పూరణ మీకు ‘కనుపండువు’ చేసిందని ప్రశంసించి, ఆశీర్వదించినందుకు ధన్యవాదాలు.
    *
    మిస్సన్న గారూ,
    ‘దురాసక్తుల’ వమ్ము చేయమన్న మీ పూరణ బాగుంది. అభినందనలు.
    చమత్కారాలెన్ని చేసినా మీ పూరణల ఝలక్కుల ముందు ‘వమ్ము’ కాక తప్పవు కదా! ధన్యవాదాలు.
    *
    సహదేవుడు గారూ,
    మీ ‘రథోత్సవమ్ము’ చాలా బాగుంది. మంచి పూరణ. అభినందనలు.
    కవిమిత్రులను ప్రస్తావిస్తూ ప్రశంసించిన మీ పద్యం బాగుంది. ధన్యవాదాలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    ‘ప్రణవమ్ము’పై చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
    నా పూరణ నచ్చినందుకు ధన్యవాదాలు.
    *
    సుబ్బారావు గారూ,
    మీ దేవీలీలల స్తవపు పూరణ బాగుంది. అభినందనలు.
    నేమాని వారి సవరణను గమనించారు కదా!
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    కాలానుగుణమైన పూరణ మీది. చాలా బాగుంది.
    అసురులను నాశము చేయుమన్న మీ రెండవ పూరణ చక్కగా ఉంది.
    గాన వైభవమ్మును ప్రస్తావించిన మీ మూడవ పూరణ బాగుంది.
    ప్రసవమ్ముపై మీ నాల్గవ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
    నాల్గవ పూరణ మూడవ పాదాన్ని “వెజ్జు శస్త్రచికిత్స గావించియు ప్రస/వమ్మొనర్చినచో...” అంటే ఇంకా బాగుంటుంది.
    నేమాని వారి నా పద్య వైభవంతో పాటు నా పూరణను ప్రస్తావించి అభినందించినందుకు ధన్యవాదాలు.
    *
    గండూరి లక్ష్మినారాయణ గారూ,
    బడుగు జనుల కష్టాలను వమ్ము చేయమన్న మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    లక్ష్మీదేవి గారూ,
    మీ భజన ఘోష చాలా బాగుంది. అభినందనలు.
    ‘పలుకు నెడ’ అనండి.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ ‘కంద’ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    ‘తొ’ అని హ్రస్వంగా పయోగించరాదు. అక్కడ ‘ధ్యాసను’ అనండి.
    మూడవ పాదంలో గణదోషం. ‘దుర్వ్యసనముల’ అంటే సరిపోతుంది.
    *
    తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారూ,
    మీ ‘వరుణ హవమ్ము’ పూరణ బాగుంది. అభినందనలు.
    ‘వ్యవసాయి’ అన్నప్పుడు గణదోషం. ఆ పాదాన్ని ‘పంటకాపు దుఃఖింపగ పండితుండు’ అందాం.
    *
    గన్నవరపు నరసింహమూర్తి గారూ,
    ఒక్క దెబ్బకు రెండు పిట్టలన్నట్టు ‘గురువు గారి రెండు పూరణలు..’ అంటూ అటు నేమాని వారిని, ఇటు నన్నూ సంతోషపెట్టారు. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  29. మదిని మాత్సర్యమెక్కువ మసలుచుండు
    జీవునుంచును దేవుని జేరకుండ
    నీదినాదను భేదమ్ము నేటినుండి
    వమ్మోనర్చినచో సుఫలమ్ములొదవు.

    రిప్లయితొలగించండి